యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

హాకీ జట్లకు కొనసాగుతున్న శిక్షణ; త్వరలోనే పూర్తి వేగం అందుకుంటామని కెప్టెన్లు, కోచ్‌ విశ్వాసం

Posted On: 06 OCT 2020 6:35PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన హాకీ జట్ల సాధన పునఃప్రారంభమైంది. భారత హాకీ పురుషుల, మహిళల జట్లకు బెంగళూరులోని 'నేతాజీ సుభాష్‌ సదరన్‌ సెంటర్‌'లో శిక్షణను ప్రారంభించారు. తమలోని పూర్వపు ఉత్తమ ప్రతిభను త్వరలోనే మళ్లీ అందుకుంటామన్న జట్టు సభ్యులు, శిక్షణ కేంద్రంలోని భద్రత ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

    గతంలో శిక్షణ కేంద్రానికి వచ్చిన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సహా ఆరుగురు సభ్యులు కరోనా పాజిటివ్‌గా తేలారు. వారికి సాయ్‌ కేంద్రంలో వైద్య చికిత్సలు అందించి, తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న ఆటగాళ్లు తిరిగి శిక్షణ కోసం వచ్చారు. "నేను శిక్షణ కోసం వచ్చినప్పుడు పాజిటివ్‌ అని తెలిసింది. తిరిగి ఆటకు సన్నద్ధమయ్యే ఏర్పాట్లను మేం మెల్లగా మొదలుపెట్టాం. కోచ్‌ ప్రణాళిక ప్రకారం క్రమంగా పూర్తిస్థాయిలో ఆటకు సిద్ధమవుతున్నాం. తిరిగి శిక్షణ శిబిరంలో చేరినందుకు సంతోషంగా ఉంది" అని మన్‌ప్రీత్‌ చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా సాయ్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

    సామాజిక దూరం పాటిస్తూ, చిన్న బృందాలుగా ఆటగాళ్లను విడగొట్టి, వ్యక్తిగత ప్రాథమికాంశాలను పెంచే నైపుణ్య ఆధారిత శిక్షణ ఇస్తున్నట్లు పురుషుల జట్టు ముఖ్య కోచ్‌ గ్రాహం రీడ్‌ చెప్పారు. "వివిధ అంశాల్లో సాయ్‌ ప్రామాణిక కార్యాచరణ విధానాలను పాటిస్తున్నాం. శిక్షణ స్థాయిని క్రమంగా పెంచుతాం. కొవిడ్‌కు ముందు ఆటగాళ్లలో ఉన్న అత్యుత్తమ స్థాయిని మళ్లీ అందుకునేలా శిక్షణ ఉంటుంది. శిబిరం ముగిసేలోగా దానిని సాధించాలి. గాయాలబారిన పడకుండా, అత్యుత్తమ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూపొందించిన నెమ్మదైన ప్రక్రియ ఇది" అని చెప్పారు.

    సాయ్‌ కేంద్రంలో చేపట్టిన భద్రత చర్యల పట్ల ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. "చాలాకాలం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవడం ఆనందంగా ఉంది. కొవిడ్‌కు ముందున్న తరహాలో శిక్షణ పొందేలా మా శరీరాలను క్రమంగా సిద్ధం చేస్తున్నాం. దాంతోపాటు, భద్రత ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నాం. కొన్ని నెలల్లోనే పూర్వపు స్థితిని, లయను అందుకుంటామని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం ప్రొటోకాల్స్‌ పాటించి ఆరోగ్యంగా ఉండటం, ప్రొటోకాల్‌ పరిధిలోనే శిక్షణ తీసుకోవడం ముఖ్యం" అని హాకీ మహిళల జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ చెప్పారు.

    భారత హాకీ పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.

***



(Release ID: 1662193) Visitor Counter : 138