గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రుణ దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేయడానికి పిఎం ఎస్.వి.ఎ నిధి, ఎస్.బి.ఐ పోర్టల్ మధ్య ఎపిఐ అనుసంధానత ప్రారంభం
పిఎం ఎస్‌విఎ నిధి, ఎస్‌బిఐ ఇ ముద్రా పోర్టల్ మధ్య సమాచారం నిరంతరాయంగా అందిపుచ్చుకునేందుకు వీలుగా అనుసంధానత
ఇప్పటివరకు పిఎం.ఎస్‌విఎ నిధి పథకం కింద 20.50 లక్షల రుణ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. 7.85 లక్షలకు పైగా రుణాలు మంజూరయ్యాయి.
Posted On:
07 OCT 2020 11:08AM by PIB Hyderabad
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పిఎం ఎస్.వి.ఎ నిధి) పథకంలో భాగంగా , కేంద్ర గృహ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా పిఎం ఎస్‌విఎ నిధి పోర్టల్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ) పోర్టల్ కు మధ్య అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఎపిఐ)ను ప్రారంభించారు. ఈ అనుసంధానత వల్ల రెండు పోర్టళ్ల మధ్య, అంటే పిఎం ఎస్‌విఎ నిధిపోర్టల్, ఎస్‌బిఐ ఈ ముద్రా పోర్టల్‌ల మధ్య భద్రమైన అనుసంధానత ఉంటుంది. ఇది రుణ మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ పథకం కింద వర్కింగ్ కాపిటల్‌కు రుణం కోరే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇలాంటి అనుసంధానతనే ఇతర బ్యాంకులకు కూడా వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. ఇందుకు సంబంధించిన సంప్రదింపుల సమావేశం త్వరలోనే జరగనుంది.
ఈ మంత్రిత్వశాఖ పిఎం ఎస్‌విఎ నిధి పథకాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేస్తున్నది. కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా తమ జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడిన వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు చేసుకునేందుకు చౌకగా వర్కింగ్ కేపిటల్ అందించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కింద 50 లక్షల మంది వీధివ్యాపారులకు ప్రయోజనం కల్పించాలన్నది ఈ పథకం లక్ష్యం. 2020 మార్చి 24 వ తేదీకి ముందు వీధి వ్యాపారులుగా పట్టణ ప్రాంతాలలో ఉన్న వారు , పట్టణప్రాంతాలకు చుట్టుపక్కల,గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికోసం దీనిని రూపొందించారు. ఈ పథకం కింద వీధివ్యాపారులు 10,000 రూపాయల వరకు వర్కింగ్ కాపిటల్ సదుపాయాన్ని పొందవచ్చు. దీనిని ఏడాదిలో నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి.
సకాలంలో, సత్వర రుణ చెల్లింపులు చేసిన వారికి సంవత్సరానికి ఏడుశాతం వడ్డీ సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాలలో ప్రత్యక్షనగదు బదిలీ పథకం కింద మూడునెలలకు ఒకసారి జమచేస్తారు. ముందుగా రుణ చెల్లింపు చేసిన వారికి పెనాల్టీ ఉండదు. ఈ పథకం సంవత్సరానికి రూ 1200 వరకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాన్ని డిజిటల్ లావాదేవీలకు వర్తింపచేస్తుంది. వెండర్లు సకాలంలో, సత్వరం రుణాన్ని తిరిగి చెల్లించినట్టయితే వారు మరింత ఎక్కువ రుణ పరిమితికి అర్హులై తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి వీలు కలుగుతుంది.
2020 అక్టోబర్ 6 వ తేదీ నాటికి సుమారు 20.50 లక్షల రుణ దరఖాస్తులు పిఎం ఎస్‌విఎ నిధి పథకం కింద అందుకున్నారు.
వీటిలో 7.85 లక్షల రుణాలు మంజూరయ్యాయి. 2.40 లక్షలకు పైగా రుణాలు పంపిణీ చేశారు.
***
(Release ID: 1662412)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam