PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 SEP 2020 6:32PM by PIB Hyderabad

(కోవిడ్‌-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లుస‌హా

పీఐబీ త‌నిఖీచేసి నివేదించిన వాస్త‌వాంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారతదేశంలో మునుపెన్నడూ లేనిరీతిలో గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య దాదాపు 75,000
  • దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య దాదాపు 34 లక్షలకుపైగా నమోదు.
  • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలోగల కేసుల సంఖ్య 8,97,394.
  • కోవిడ్-19 పరీక్షల్లో కొత్త శిఖరాలకు భారత్, గత 24 గంటల్లో 11.5 లక్షలకుపైగా పరీక్షల నిర్వహణ.
  • దేశంలో కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వం రంగంలో 1040, ప్రైవేటు రంగంలో 638 వంతున అందుబాటులో మొత్తం 1,678 ప్రయోగశాలలు.
  • పరిశుభ్రత పాటించాలని వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి పిలుపు; కోవిడ్19 వ్యాప్తి నిరోధం దిశగా అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచన; తద్వారా వారి వ్యాపారం వృద్ధి చెందుతుందని సూచన.

కోవిడ్-19 పరీక్షల్లో కొత్త శిఖరాలకు భారత్, గత 24 గంటల్లో 11.5 లక్షలకుపైగా పరీక్షల నిర్వహణ

కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 75,000 మంది కోలుకున్న నేపథ్యంలో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్యరీత్యా కూడా భారత్ నిత్యం కొత్త రికార్డు నెలకొల్పుతూ వెళ్తోంది. ఈ మేరకు గత 24 గంటల్లో 11.5 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. తదనుగుణంగా 11,54,549 నమూనాలను పరీక్షించింది. జాతీయంగా రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీంతో నేటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 5.18 కోట్లు (5,18,04,677) దాటింది. సకాలంలో దేశవ్యాప్త రోగ నిర్ధారణ సౌకర్యాల పెంపు ఫలితంగా కోలుకునేవారి సంఖ్య పెరుగుతూ మరణాల సగటు అత్యల్ప (1.69శాతం) స్థాయికి పరిమితమైంది. అలాగే ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు చురుగ్గా పెరుగుతూ 37,539కి చేరడంసహా స్థిరంగా కొనసాగుతోంది. దేశంలో 2020 జనవరి నాటికి పుణెలోని ఒకేఒక ప్రయోగశాల స్థాయినుంచి ఇవాళ ప్రభుత్వ రంగంలో 1040, ప్రైవేటు రంగంలో 638 వంతున మొత్తం 1,678 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652783

దేశంలో కోలుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుదల; 24 గంట్లలో సుమారు 75 వేలమందికి వ్యాధి నయం; మొత్తం కోలుకున్నవారు దాదాపు 34 లక్షలు

కోవిడ్ నుంచి కోలుకునేవారి సంఖ్య రీత్యా భారత్ గత 24 గంటల్లో కొత్త శిఖరాలకు చేరింది. ఈ మేరకు 74,894 మందికి వ్యాధి నయంకాగా కొత్త రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య కూడా 33,98,844కు పెరిగి కోలుకునేవారి సగటు 77.77 శాతానికి దూసుకెళ్లింది. ఇక వారంవారీగా కోలుకునేవారి సంఖ్య 2020 జూలై 3వ వారంలో 1,53,118 కాగా, 2020 సెప్టెంబరు తొలి వారం నాటికి 4,84,068కి పెరిగింది. ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,706 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 20,000 నమోదవగా ఆంధ్రప్రదేశ్ 10,000 కేసులుసహా 60 శాతం కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 8,97,394గా ఉంది. ఇందులోనూ మహారాష్ట్ర 2,40,000 కేసులతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్ చెరో 96,000 కేసుల వంతున తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత కేసులలోనూ 61 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులలోనివే కావడం గమనార్హం. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో నమోదైన 1,115 మరణాల్లో మహారాష్ట్ర 380, కర్ణాటకలో 146, తమిళనాడులో 87 వంతున్న ఉన్నాయి.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652595

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ ప్రాంతీయ సదస్సులో దృశ్య శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్న డాక్టర్ హర్షవర్ధన్

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా 73వ ప్రాంతీయ సదస్సులో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా ఈ రెండు రోజుల కార్యక్రమం తొలిసారి వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగిస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ మార్గదర్శకత్వంలో భారత ప్రజల జీవితాలతోపాటు జీవనోపాధిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘శక్తివంచన లేకుండా కృషి చేసింద’’ని వివరించారు.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652791

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వీధి వ్యాపారులతో ‘స్వనిధి గోష్ఠి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘స్వనిధి గోష్ఠి’ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ వీధి వ్యాపారులతో సంభాషించారు. కోవిడ్19 దుష్ప్రభావం నుంచి పేద వీధి వ్యాపారులను ఆదుకునే దిశగా వారి జీవనోపాధి కార్యకలాపాలు కొనసాగే వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2020 జూన్ 1న ‘పీఎం స్వనిధి’ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద మధ్యప్రదేశ్ నుంచి 4.5 లక్షల మంది వ్యాపారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1.4 లక్షల మందికి రూ.140 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి వారితో చర్చా గోష్ఠి ద్వారా ముచ్చటించారు. దుర్లభ పరిస్థితుల నుంచి వేగంగా కోలుకోవడంలో వారు చూపిన ఆత్మవిశ్వాసాన్ని, దీక్షను, పట్టుదలను, కఠోర శ్రమను ఆయన ప్రశంసించారు. ఈ మహమ్మారి కారణంగా తొలుత ప్రభావితులైన వారు పేదలేనని, తద్వారా వారి ఉపాధితోపాటు ఆహార భద్రతకు, పొదుపులకు దెబ్బ తగిలిందని గుర్తుచేశారు. కష్ట సమయంలో పేద వలస కార్మికులంతా వారి స్వస్థలాలకు తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా, ప్రభుత్వ తోడ్పాటుతో కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా పరిశుభ్రతసహా కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ఉద్దేశించిన జాగ్రత్తలను పాటించాలని ప్రధానమంత్రి వారికి పిలుపునిచ్చారు. తద్వారా వారి వ్యాపారాలు మెరుగుపడతాయని సూచించారు.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652791

మధ్యప్రదేశ్ వీధి వ్యాపారులతో చర్చాగోష్ఠి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు:  https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652598

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను సెప్టెంబరు 10న ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 10వ తేదీన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY)ను ప్రారంభించనున్నారు. దీంతోపాటు రైతులకు నేరుగా సమగ్ర పశు సంవర్ధక విపణిసహా సమాచార సౌకర్యాలు అందుబాటులోకి తెస్తూ ‘ఈ-గోపాల’ యాప్ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా బీహార్ రాష్ట్రంలో మత్స్య, పశు సంవర్ధక రంగంలో పలు వినూత్న చర్యలకూ ప్రధాని శ్రీకారం చుడతారు.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652788

కోవిడ్-19పై పోరులో భాగంగా సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ చేపట్టిన శాస్త్ర-సాంకేతిక కార్యకలాపాలపై ‘జిజ్ఞాస’ పేరిట వెబినార్

కోవిడ్-19పై పోరులో భాగంగా సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ చేపట్టిన శాస్త్ర-సాంకేతిక కార్యకలాపాలపై ‘జిజ్ఞాస’ పేరిట నిన్న వెబినార్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్ విద్యాశాఖ పరిధిలోని ‘సమగ్ర శిక్ష‘ విభాగం సహకారంతో దుర్గాపూర్లోగల సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ  శాఖ ఈ వెబినార్ను ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652553

ఖాదీ సంస్థ ‘ఈ-మార్కెట్’ పోర్టల్కు విశేష ప్రాచుర్యం; ‘స్థానికం కోసం స్వగళం’పై భారతీయులలో పొంగులెత్తిన ఉత్సాహం

ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ (KVIC) ఆన్లైన్ మార్కెటింగ్లో పాదం మోపింది. ఈ వినూత్న ప్రయత్నానికి దేశవ్యాప్తంగా తక్షణ విశేష ఆదరణ కనిపించింది. దీంతో దేశం నలుమూలలాగల చేతివృత్తులవారు తమ ఉత్పత్తులను సుదూర ప్రాంతాల్లో విక్రయించుకునే వీలు కలిగింది. ఇందుకోసం www.kviconline.gov.in/khadimask/ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కేవీఐసీ వారికి వెసులుబాటు కల్పించింది. తొలుత జూలై 7వ తేదీన మాస్కుల విక్రయంతో ఈ ఆన్లైన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఇప్పుడిది పూర్తిస్థాయి ఈ-మార్కెట్ వేదికగా అవతరించి నేడు 180 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా రోజువారీగా కనీసం 10 కొత్త ఉత్పత్తులను కేవీఐసీ ఈ పోర్టల్ కింద జోడిస్తోంది. మొత్తంమీద ఈ ఏడాది అక్టోబరు 2నాటికి ఉత్పత్తుల సంఖ్యను 1,000కి పెంచాలని కేవీఐసీ లక్షంగా నిర్దేశించుకుంది. మరోవైపు గడచిన రెండు నెలల కాలంలో కేవీఐసీ దాదాపు 4,000 మంది ఖాతాదారులకు తన సేవలు అందించింది.

మరిన్ని వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652636

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కరోనా కేసులను సకాలంలో గుర్తించడంద్వారా వ్యాధి వ్యాప్తి నిరోధం దిశగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ నిర్వహణకుగాను ప్రైవేట్ ఆస్పత్రులు/క్లినిక్‌లు/ప్రయోగశాలలను అనుమతించనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 19 జిల్లాల ఆరోగ్యాధికారుల ద్వారా ఆయా ఆరోగ్య కేంద్రాల జాబితాను తొలుత రూపొందించాల్సి ఉంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో మూడు నెలల తర్వాత తొలిసారిగా కరోనావైరస్ కేసుల సంఖ్య జాతీయ స్థాయిని మించి పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఇది 2.14 శాతం కాగా, మహారాష్ట్రలో రోజువారీ పెరుగుదల (7 రోజుల సంచిత) 2.21 శాతానికి పెరిగింది. ఫలితంగా 10,000-12,000 స్థాయినుంచి  ఇప్పుడు 20,000 కేసుల స్థాయికి పెరుగుదల కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో చురుకైన కేసుల సంఖ్య 2,43,809గా ఉంది.
  • గుజరాత్: రాష్ట్రంలోని వడోదర పురపాలక సంస్థ నడుపుతున్న ఎస్‌ఎస్‌జి ఆస్పత్రిలో మంగళవారం రాత్రి వేళకు 272 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఏకాంత చికిత్స పొందుతున్న రోగులుగల భవనం తొలి అంతస్తులోని ఐసీయూ వార్డులలో ఒకదానిలో మంటలు రేగాయి. అక్కడి వెంటిలేటర్లలో ఒకదానినుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని, వార్డులోని మొత్తం 39 మంది రోగులను సురక్షితంగా తరలించామని అధికారులు తెలిపారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో నిర్వహించే అధికారిక సమావేశాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లోట్ వైద్యుల సలహా మేరకు ఒక నెలపాటు రద్దు చేశారు. ఈ కాలంలో పాలన వ్యవహారాలు సాగడం కోసం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా మాత్రమే సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి నివాసంతోపాటు కార్యాలయంలో పనిచేసే 40 మందికిపైగా ఉద్యోగులకు కోవిడ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగులలో ముఖ్యమంత్రి భద్రత విధుల కోసం నియమితులైన పోలీసులతోపాటు రాజస్థాన్ సాయుధ పోలీసు జవాన్లు కూడా ఉన్నారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ప్రజలందరికీ కోవిడ్-19 పరీక్షను ఉచితంగా నిర్వహిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. అలాగే రాష్ట్రంలో జ్వరం క్లినిక్కుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించారు. ఇక అదనంగా 3,700 ఆక్సిజన్ పడకలు సమకూర్చాలని తీర్మానించింది. ఇవన్నీ సిద్ధమైతే మొత్తం 11,700 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంటాయని సమాచారం.
  • ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో 2,545 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 50,114కు చేరింది. మరోవైపు మహమ్మారికి బలైనవారి సంఖ్య 407కు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 26,915 క్రియాశీల కేసులుండగా వీటిలో సుమారు 40 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 221 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదైంది. దీంతో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 9కి చేరగా, ప్రస్తుతం 1,670 క్రియాశీల కేసులున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో కోలుకునేవారి సగటు 69.42 శాతంగా ఉంది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 2579 కొత్త కేసులు నమోదవగా, 2166 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు 1,30,823, చురుకైన కేసులు 29,203 కాగా, ఇప్పటిదాకా 101239 మంది కోలుకున్నారు.
  • మణిపూర్: రాష్ట్రంలో 96 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో 76 శాతం కోలుకునే సగటుతో 126 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1679 క్రియాశీల కేసులున్నాయి.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 69 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1192కు పెరిగాయి. ప్రస్తుతం 447 క్రియాశీల కేసులుండగా, ఇప్పటిదాకా 745 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని దిమాపూర్లో వస్తురవాణా, ప్రయాణిక వాహనాల కోసం జిల్లా కలెక్టర్ భద్రత మార్గదర్శకాలను జారీచేశారు. కాగా, రాష్ట్రంలో కేసుల వివరాలు: మొత్తం కేసులు 4245 కాగా, వీరిలో సాయుధ దళ సిబ్బంది 1823మంది, తిరిగి వచ్చినవారు 1312 మంది, ముందువరుస పోరాట యోధులు 309 మంది, రోగుల పరిచయస్థులు 801 మంది వంతున ఉన్నారు.
  • కేరళ: రాష్ట్రంలోని మళప్పురం, కాసర్గోడ్, తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో కోవిడ్-19 పరీక్షల సంఖ్యను పెంచాలని కేరళ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కాగా- కన్నూర్, తిరువనంతపురం, కోజికోడ్లలో కోవిడ్-19 మరణాల శాతం ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ నివేదిక పేర్కొంది. ఇక రాష్ట్రంలో కేసులు రెట్టింపయ్యే వ్యవధి 27.9 రోజులకు పెరిగింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలోని ఒక అనాథాశ్రమంలో 108 మందికి రోగ నిర్ధారణ అయింది. కేరళలో కోవిడ్ కేసులు నిన్న రెండోసారి 3000 స్థాయిని దాటి, 3,026గా నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 23,217కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.98 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య 372గా ఉంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో ప్రజలనుంచి అందిన పలు విజ్ఞప్తుల మేరకు చెన్నై మెట్రో రైళ్లను గురువారం నుంచి రాత్రి 9 గంటలదాకా నడపనున్నారు. కాగా, చెన్నై నగర పరిధికి సంబంధించి అలందూర్‌లోని నాలుగు జోన్లు కొత్త హాట్‌స్పాట్‌లుగా మారాయి. తమిళనాడులో నిన్న 5684 కొత్త కేసులు నమోదవగా, 6599 మంది కోలుకున్నారు. మరో 87 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు: 4,74,940; క్రియాశీల కేసులు: 50,213; మరణాలు: 8012; డిశ్చార్జి: 4,16,715; చెన్నైలో యాక్టివ్ కేసులు: 11,029గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి తీవ్రతను తగ్గించే 22 ఉత్పత్తులను ఎలక్ట్రానిక్స్-ఐటీశాఖ మంత్రి,  ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్థ నారాయణ ఇవాళ ఆవిష్కరించారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరయ్యేవారికి కోవిడ్ పరీక్ష తప్పనిసరి అని స్పీకర్ విశ్వష హెగ్డే కగేరి అన్నారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ చికిత్స ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్మా దానం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కోలుకున్న రోగుల వివరాలతో సమాచార నిధి నిర్వహించబడుతోంది. మరోవైపు ప్లాస్మా దానంచేసేవారికి రూ.5,000 పారితోషికం ఇవ్వడంద్వారా ఇతరులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,000 మంది ప్లాస్మా దాతలు నమోదవగా, వారి సమ్మతి పొందే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో నిత్యం 65,000 నుంచి 70,000 కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆహారం, బస, మందులు, పరీక్షలుసహా అన్ని కోవిడ్ సంబంధిత ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రోజుకు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తోంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2479 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కాగా, 2485 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కొత్త  కేసులలో 322 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,47,642; క్రియాశీల కేసులు: 31,654; మరణాలు: 916; డిశ్చార్జి: 1,15,072గా ఉన్నాయి. కాగా, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు ఓపీడీతోపాటు ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ విధులను నిరవధికంగా బహిష్కరించారు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులలో మానిటర్లు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లు నెరవేరేదాకా తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని కార్పొరేట్ రంగంలో కోవిడ్ చికిత్సపై నియంత్రణకు కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి అడ్డంకుల దృష్ట్యా రాష్ట్రంలోని కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక సర్వసభ్య సమావేశాల నిర్వహణకు మరో మూడు నెలల వ్యవధి ఇస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ మంగళవారం ప్రకటించారు.

***


(Release ID: 1652849) Visitor Counter : 211