PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 01 SEP 2020 6:23PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 65,081 మందికి వ్యాధి నయం; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 28,39,882, కోలుకునే సగటు మరింత పెరిగి 77 శాతంగా నమోదు
  • గడచిన 24 గంటల్లో 69,921 కొత్త కేసులు, 819 మరణాల నమోదు.
  • దేశంలో ఇప్పటిదాకా నిర్వహించిన 4.33 కోట్ల పరీక్షల్లో కేవలం గత రెండువారాల్లోనే 1.22 కోట్ల నమూనాల పరీక్ష; గత 24 గంటల్లో 10 లక్షలకుపైగా నమోదు.
  • మొత్తం 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు జాతీయ సగటును మించి పరీక్షలు.
  • కోవిడ్‌ సంక్షోభంలో అత్యవసర వైద్య ఉత్పత్తుల సరఫరాద్వారా కీలకపాత్ర పోషించిన భారత్‌- ప్రపంచానికి విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగా రుజువు చేసుకుంది: శ్రీ పీయూష్‌ గోయల్‌.

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 65,081 కోలుకోగా 69,921 కొత్త కేసులతోపాటు

819 మరణాల నమోదు

భారతదేశంలో ఐదు రోజులుగా కోలుకుంటున్నవారి సంఖ్య నిత్యం 60,000కుపైగా నమోదవుతోంది. ఈ మేరకు 24 గంటల్లో 65,081 మందికి వ్యాధి నయంకాగా, దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19నుంచి కోలుకున్నవారి సంఖ్య 28,39,882కి పెరిగి కోలుకునేవారి జాతీయ సగటు 77 శాతంగా నమోదైంది. ఈ మేరకు ప్రస్తుత కేసులతో పోలిస్తే కోలుకునేవారి సంఖ్య 3.61 రెట్లు ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 7,85,996 మంది కాగా, కోలుకున్నవారి సంఖ్య అంతకన్నా 20.53 లక్షలదాకా అధికంగా ఉండటం విశేషం. జూలై తొలివారం నుంచి ఆగస్టు ఆఖరి వారంనాటికి కోలుకున్నవారి సంఖ్య 4 రెట్లు పెరిగింది. కాగా, గ24 గంటల్లో దేశంలో నమోదైన కొత్త కేసులలో 56 శాతం కేవలం ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర (11,852), ఆంధ్రప్రదేశ్ (10,004), కర్ణాటక (6,495), తమిళనాడు (5,956), ఉత్తరప్రదేశ్ (4,782)లకు చెందినవే కావడం గమనార్హం. మరోవైపు కోలుకున్నవారి సంఖ్యను పరిశీలిస్తే మహారాష్ట్రలో 11,158 మంది, ఆంధ్రప్రదేశ్లో 8,772 మంది, కర్ణాటకలో 7,238 మంది, తమిళనాడులో  6,008 మంది, ఉత్తర ప్రదేశ్లో 4,597 మంది వంతున ఉన్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన 819 మరణాలకుగాను ఈ ఐదు రాష్ట్రాల్లోనే 536... అంటే- 65.4 శాతం నమోదయ్యాయి. సంఖ్యరీత్యా మహారాష్ట్రలో 184 మంది, కర్ణాటకలో 113 మంది, తమిళనాడులో (91), ఆంధ్రప్రదేశ్లో (85) ఉత్తర ప్రదేశ్లో (63) మరణించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650378

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త-కోలుకున్న కేసులు, మరణాల వివరాలు

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650357

దేశంలో నిర్వహించిన 4.33 కోట్ల పరీక్షల్లో రెండువారాల్లోనే 1.22 కోట్ల పరీక్షలు; గత 24 గంటల్లో 10 లక్షలకుపైగా పరీక్షలు; 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు జాతీయ సగటుకన్నా అధికం

దేశంలో ఇవాళ మొత్తం రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య 4.3 కోట్లు దాటి (4,33,24,834) నమోదైంది. ఇందులో 1,22,66,514 పరీక్షలు గత రెండువారాల్లోనే నిర్వహించినవి కావడం విశేషం. వివిధ రాష్ట్రాలు పరీక్ష సదుపాయాలను నానాటికీ ప్రగతిశీలంగా పెంచుతున్నాయి. ఈ మేరకు రోజురోజుకూ పరీక్షల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తదితరాలున్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే తాజా పరీక్షల్లో 34 శాతం నిర్వహించబడ్డాయి. ఇక భారత్‌లో రోజుకు 10 లక్షల పరీక్షల సామర్థ్యాన్ని అధిగమించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,16,920 నమూనాలను పరీక్షించారు. తదనుగుణంగా ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు చురుగ్గా పెరుగుతూ 31,394కు చేరింది. ఇందులో ముఖ్యంగా 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటును మించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోవా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రోజువారీ పరీక్షలు గరిష్ఠంగా జరుగుతున్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650375

కోవిడ్ సంక్షోభంలో అత్యవసర వైద్య ఉత్పత్తుల సరఫరాద్వారా కీలకపాత్ర పోషించిన భారత్- ప్రపంచానికి విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగా రుజువు చేసుకుంది: శ్రీ పీయూష్ గోయల్

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సరఫరా గొలుసు పటిష్ఠంగా కొనసాగడంపై దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మధ్య మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ-  ప్రపంచాన్ని ఓ కుటుంబంగా చూసే సంప్రదాయంగల భారతదేశం కోవిడ్ సంక్షోభం వేళ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ మేరకు అత్యవసర వైద్య ఉత్పత్తుల సరఫరాను సమానస్థాయిలో నిర్వహించడం కోసం ఎగుమతి సంబంధిత చర్యలు తీసుకున్నదని తెలిపారు. “ఈ చర్యలన్నీ ప్రపంచానికి భారత్‌ ఆధారపడదగిన విశ్వసనీయ భాగస్వామిగా మా స్థానాన్ని రుజువు చేశాయి. ఆ మేరకు సరఫరా గొలుసు పటిష్ఠంగా కొనసాగేలా మేమీ కొత్త ప్రయత్నం ప్రారంభించినపుడు ఇదొక ముఖ్యమైన పరామితి అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఈ సామూహిక కృషిలో ఆస్ట్రేలియా, జపాన్ మాకు ముఖ్య భాగస్వాములని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం” అని శ్రీ గోయల్ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650473

గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌ద్వారా గ్రామస్థులకు జీవనోపాధి అవకాశాలతో సాధికారత - లబ్ధిదారుల విజయగాథలు

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి-జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు గరీబ్‌ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌ (GKRA)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఆరు రాష్ట్రాలు... బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల పరిధిలోని 116 జిల్లాల్లో ఉద్యమ తరహాలో ఉపాధి కల్పన చర్యలు చేపట్టింది. తదనుగుణంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా వలస కార్మికులకు, గ్రామీణులకు ఉపాధి-జీవనోపాధి అవకాశాలతో సాధికారత సమకూరింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650340

ఒకే దేశం-ఒకే కార్డు జాతీయ మార్పిడి పథకంలోకి లదాఖ్, లక్షద్వీప్‌ల చేరిక

“ఒకే దేశం – ఒకే కార్డు” ప్రణాళిక అమలు ప్రగతిని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు-ఆహార- ప్రజా పంపిణీశాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇటీవల సమీక్షించారు. ఈ నేపథ్యంలో దేశంలోని మరో 2 కేంద్రపాలిత ప్రాంతాలు లదాఖ్, లక్షద్వీప్ ఈ ప్రణాళికలో భాగం కావడానికి సాంకేతికంగా సిద్ధమైనట్లు తెలియడంతో వీటిని ప్రస్తుత 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సమూహంలోకి జాతీయ మార్పిడిద్వారా అనుసంధానించేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోగాత్మక జాతీయ మార్పిడి కార్యకలాపాలను విజయవంతంగా పూర్తిచేశాయి. దీంతో వీటి అనుసంధానం ద్వారా మొత్తం 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అనుసంధానం సవ్యంగా సాగిపోయింది. తదనుగుణంగా ఈ పథకంద్వారా 2020 సెప్టెంబర్‌ 1 నుంచి ఈ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల లబ్ధిదారులందరూ తమకు నచ్చిన, అందుబాటులోగల చౌకధరల దుకాణం నుంచి సరకులు పొందవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా 65 కోట్లమంది లబ్ధిదారులు ఒకే దేశం - ఒకే కార్డు వ్యవస్థ కిందకు వచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650379

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసుల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 167 పురపాలికలుసహా పట్టణ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 30దాకా రాత్రి 7నుంచి తెల్లవారు జామున 5 గంటలదాకా అన్ని నగరాల్లో కర్ఫ్యూ అమలవుతుంది. ఇక పురపాలికల పరిధిలో శని, ఆదివారాల్లో పూర్తి దిగ్బంధం విధిస్తారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, వైరస్ వ్యాప్తి నిరోధం దిశగా నిత్యం పలుమార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలని కోరారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 78 కొత్త కేసుల నమోదుతో ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో చికిత్స పొందే కేసుల సంఖ్య 1220కి పెరిగింది.
  • సోం: అసోంలో సోమవారం 3266 కొత్త కేసులు నమోదవగా 1531 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు 1,09,040, కాగా, డిశ్చార్జ్ 85458, యాక్టివ్ 23,273, మరణాలు 306గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 140 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం చురుకైన కేసులు 1894కు చేరగా, 91 మంది కోలుకున్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం కోలుకునేవారి సగటు 69 శాతంగా ఉంది.
  • మేఘాలయ: రాష్ట్రంలోకి ప్రజల ప్రవేశంపై నిషేధం తొలగించకపోవడంమీద కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మేఘాలయలో కోవిడ్‌ మహమ్మారినుంచి స్థానిక ప్రజలకు రక్షణ, క్షేమమే తమకు ప్రధానమని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ త్యాన్సాంగ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము కేంద్రంతో ఘర్షణ పడటంలేదని, వైరస్ వ్యాప్తి నిరోధం కోసమే నిబంధనలు అత్యవసరం అయ్యాయని ఆయన వివరించారు.
  • మిజోరం: రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1012 కాగా, వీటిలో 423 చురుకైన కేసులున్నాయి. కాగా, పశ్చిమ బెంగాల్‌లో సెప్టెంబర్‌ 7, 11, 12 తేదీల్లో విమానాశ్రయాలుసహా రాష్ట్రవ్యాప్త దిగ్బంధం పాటిస్తున్న నేపథ్యంలో మిజోరంలోని లెంగ్పుయి విమానాశ్రయాన్ని వాణిజ్య ప్రయాణిక విమానయాన సంస్థల కోసం సెప్టెంబర్‌ 7, 12 తేదీలకు బదులు 8, 9 తేదీలలో ఒకసారి సవరణ కింద తెరుస్తారు.
  • నాగాలాండ్: నాగాలాండ్ ప్రభుత్వం నేటినుంచి రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల మధ్య ప్రజల కదలికలపై ఆంక్షలను తొలగించింది. అయితే, రాష్ట్రంలోని నియంత్రణ మండళ్లలో సెప్టెంబర్ 30దాకా దిగ్బంధం  కొనసాగనుంది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న  3950 మందిలో భద్ర దళాల సిబ్బంది 1692 మంది, రాష్ట్రానికి తిరిగివచ్చినవారు 1260 మంది, వ్యాధిగ్రస్థుల పరిచయస్థులు 715 మంది, ముందువరుస పోరాట యోధులలో 283మంది వంతున ఉన్నారు.
  • సిక్కిం: రాష్ట్రంలో 18 కొత్త కేసులు నమోదవగా 1237 మంది డిశ్చార్జ్ అయ్యారు. సిక్కింలో ప్రస్తుతం 414 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ మరో ఏడుగురు మరణించడంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 301కి పెరిగింది. ఇక రాజధానిలో వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య కూడా పెరిగింది. కాగా, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇవాళ జెఈఈ పరీక్షను 13 కేంద్రాల్లో నిర్వహించారు. ఒడిసాలో నివసించే రాష్ట్రంలోని కొళ్లం ప్రాంతానికి చెందిన మలయాళీ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు కోవిడ్-19కు చికిత్స పొందుతూ మరణించారు. కేరళలో నిన్న 1,530 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 23,488మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,98,843 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో 363 కొత్త కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,766కు, మృతుల సంఖ్య 240కి పెరిగింది. ప్రస్తుతం 4851 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దిగ్బంధ విముక్తి-4వ దశ కింద పుదుచ్చేరిలో కొత్త మార్గదర్శకాలు జారీఅయ్యాయి. ఇక తమిళనాడులో నిర్బంధవైద్య పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు విదేశీ ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేయగా, లక్షణరహిత దేశీయ ప్రయాణికులకు ఏకాంత గృహవాసం నిర్దేశించింది. పార్కులు, మాల్స్, ప్రార్థ స్థలాలవద్ద థర్మల్ స్కానర్లు, మాస్కులు చేతిశుభ్రత ద్రవాల వాడకాన్ని తప్పనిసరి చేసింది.
  • కర్ణాటక: రాష్ట్ర శాసనసభ సమావేశానికి ముందుగా చట్టసభ సభ్యులందరూ కోవిడ్-నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే విధానసౌధ వద్ద రద్దీ నివారణ దిశగా, ఈసారి సమావేశాలకు ప్రజలను అనుమతించడంలేదని మాధ్యమ కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, కర్ణాటకలోని మైసూరులో కోవిడ్-19 వ్యాప్తి మొదలయ్యాక ఇప్పటిదాకా 470 మంది పోలీసు సిబ్బంది వ్యాధిబారిన పడ్డారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని 52 కేంద్రాల్లో ఇవాళ ఐఐటి-జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 82,748మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుపతి నగరపాలక సంస్థకోసం కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా దిగ్బంధం పరిమితులను సడలించింది. దీని ప్రకారం... అన్ని వ్యాపారాలు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలదాకా నడుస్తాయి. ఇక రాష్ట్రంలో శుభకార్యాలు, సభలు, రాజకీయ పార్టీల సమావేశాలను 100 మందికి లోపు హాజరీతో నిర్వహించుకోవడానికి పోలీసుల నుంచి అనుమతి పొందవచ్చునని పేర్కొంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2734 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 2325 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 347 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,27,697; క్రియాశీల కేసులు: 31,699; మరణాలు: 836; డిశ్చార్జి: 95,162గా ఉన్నాయి. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న జిల్లాల్లో - ముఖ్యంగా తూర్పువైపున కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు డచిన రెండు వారాల్లో కేసులు రెట్టింపు అయిన జాబితాలో: యాదాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, హబూబాబాద్‌, నల్గొండ జిల్లాలున్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో సోమవారం 1,935 కొత్త కేసులు మోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీకన్నా ఎక్కువగా కోవిడ్‌ ప్రభావితమైన నగరంగా పుణె నగరం జాబితాలోకెక్కింది. ప్రస్తుతం పుణెలో మొత్తం కేసుల సంఖ్య 1,75,105 కాగా, ఢిల్లీ 1.74 లక్షలు, ముంబై 1.45 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పుణెలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 52,172గా ఉంది. మహారాష్ట్రలో సోమవారం 11,852 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,92,541కి చేరింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయంతి రవి నేతృత్వంలో సీనియర్ ఆరోగ్యాధికారులు-వైద్యుల బృందం నగరానికి చేరుకుంది. కోవిడ్‌ రోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలలోగల సౌకర్యాలను ఈ సందర్భంగా నిపుణులు పరిశీలిస్తారు. అలాగే కరోనావైరస్ చికిత్స, టెలి-మెంటరింగ్‌ విధివిధానాలపై వైద్యులకు మార్గనిర్దేశం చేస్తారు. రాజ్‌కోట్‌లోని రోగులకు ప్రభుత్వం అదనపు వెంటిలేటర్లు, పడకలను అందుబాటులోకి తెచ్చింది. గత 24 గంటల్లో గుజరాత్‌లో 1,280 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో 15,631 క్రియాశీల కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 670 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా, 117 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 82,363 కేసులకుగాను  14,372 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటిదాకా 66,929 మంది కోలుకున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 1,062కు చేరింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో 32,159 కేసులు నమోదవగా, జూలై 31దాకా నమోదైన కేసులతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం గమనార్హం. ఈ మేరకు ఆగస్టు 31 సాయంత్రం నాటికి మొత్తం రోగుల సంఖ్య 63,965 కాగా, జూలై నాటికి ఇది 31,806గా ఉంది. రెండు రోజులుగా రాష్ట్రంలో వరుసగా 1,500కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రందాకా 24 గంటల వ్యవధిలో 1,532 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య ప్రస్తుతం 1,394 కాగా, ఒక్క ఆగస్టులోనే 527 లేదా 37.8 శాతంగా ఉన్నాయి.

FACT CHECK

 

***



(Release ID: 1650481) Visitor Counter : 211