PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
24 JUL 2020 6:32PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- గత 24 గంటల్లో 34,602మంది కోలుకోగా ఒకేరోజు వ్యాధి నయమైనవారి సంఖ్యరీత్యా కొత్త రికార్డు.
- దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలకుపైగా నమోదు.
- కోవిడ్-19 మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.38 శాతానికి పతనం.
- దేశంలో 1,290 ప్రయోగశాలల్లో రోగ నిర్ధారణ; నేటిదాకా 1.5 కోట్లకుపైగా నమూనాల పరీక్ష.
- అందుబాటు ధర ఔషధాలపై అంతర్జాతీయ ఆటంకాల తొలగింపునకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపు.
- మహమ్మారి వేళ భారతీయుల్లో రోగనిరోధకత దిశగా తోడ్పడంది దృఢత్వంపై వారికిగల అవగాహనే: శ్రీ కిరణ్ రిజిజు.


వరుసగా మూడోరోజు రికార్డు స్థాయిలో 34,602 మందికి కోవిడ్ వ్యాధి నయం; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలకుపైగా నమోదు; మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.38 శాతానికి పతనం
దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య నిరాటంకంగా పెరుగుతోంది. ఈ మేరకు ఇవాళ వరుసగా మూడోరోజు... 24 గంటల్లో అత్యధికంగా 34,602 మందికి వ్యాధినయం కాగా, మరో కొ్త రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలుదాటి 8,17,208కు చేరడంతో కోలుకునేవారి జాతీయ సగటు ఒక్కసారిగా 63.45 శాతానికి పెరిగి కొత్త ఎత్తులు అందుకుంది. కోలుకుంటున్నవారి సంఖ్య నిరంతరం పెరుగుతున్న కారణంగా ఇక చికిత్సలోగల (4,40,135)కేసులు-కోలుకున్న కేసులమధ్య అంతరం 3,77,073కు పెరిగింది. కోవిడ్-19 బారినుంచి బయటపడుతున్నవారి సంఖ్య స్థిరంగా పెరుగుతున్నందువల్ల మరణాల సగటు గణనీయంగా తగ్గుతూ ప్రస్తుతం 2.38 శాతానికి పతనమైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641010
ప్రయోగశాలల మౌలిక సౌకర్యం పెరుగుదలలో వేగంతో ‘పరీక్ష-అన్వేషణ-చికిత్స’ వ్యూహానికి బలం; ఇప్పటిదాకా 1.5 కోట్లకుపైగా కోవిడ్-19 నమూనాల పరీక్ష
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3,52,801 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 1.5 కోట్లకుపైగా (1,54,28,170)
నమోదైంది. త్రిముఖ వ్యూహం నేపథ్యంలో భారత్‌లో నేడు ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షిస్తున్న (TPM) నమూనాల సంఖ్య 11,179.83కు పెరిగింది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 897, ప్రైవేటు రంగంలో 393 వంతున దేశంలో ప్రయోగశాలల సంఖ్య (మొత్తం 1,290) ప్రగతిశీలంగా పెరుగుతోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640964
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) ఆరోగ్య మంత్రుల సమావేశంలో భారత కోవిడ్ నియంత్రణ వ్యూహంపై ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ‘షాంఘై సహకార సంస్థ (SCO) డిజిటల్ మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో కోవిడ్-19 నియంత్రణ దిశగా తీసుకున్న చర్యల గురించి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం దశలవారీగా, క్రమబద్ధంగా చర్యలు తీసుకుందని, ప్రయాణ సంబంధ సూచనల జారీ, సరిహద్దులలో నిఘా, సామాజిక ఆధారిత నిఘా, కేసుల పెరుగుదలకు అనుగుణంగా ప్రయోగశాలలు-ఆస్పత్రుల సామర్థ్యం పెంపు, వ్యాధి వ్యాప్తి ముప్పు తదితరాలపై సాంకేతికపరంగా మార్గదర్శకాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640964
అందుబాటు ధర ఔషధాల లభ్యతపై అంతర్జాతీయ ఆటంకాల తొలగింపునకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
అంతర్జాతీయ వాణిజ్యంలో అన్ని దేశాలూ పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలని, విశ్వసనీయతను పెంచుకుంటూ ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వాములుగా తమ కీలకపాత్రను కోల్పోకుండా జాగ్రత్త వహించాలని భారత వాణిజ్య-పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. నిన్న వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించిన బ్రిక్స్ వాణిజ్య మంత్రుల 10వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహమ్మారి నుంచి కోలుకునే ప్రక్రియలో వాణిజ్య రంగం తన పాత్రను సమర్థంగా పోషించే దిశగా భాగస్వామ్య దేశాలన్నీ విశ్వసనీయంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత సంక్షోభం ప్రపంచ దుర్బలత్వాన్ని తేటతెల్లం చేయడంద్వారా పరస్పరం మద్దతు అవకాశాల అన్వేషణ పరిస్థితులవైపు నెట్టిందని గుర్తుచేశారు. మేధో సంపద హక్కుల పరిరక్షణ పేరిట ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిర్దేశించిన అసంబద్ధ నిబంధనలవల్ల అందుబాటు ధరతో ఔషధాల లభ్యతను దుర్లభం చేస్తున్న ఆటంకాలను తొలగించాలని మంత్రి పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి చికిత్సకు అవసరమైన కీలక ఔషధాలు, వైద్య పరికరాలు లభ్యతకు మేధోసంపద హక్కుల పరిరక్షణ నిబంధనలు అడ్డుపడరాదని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640867
కొన్ని దేశాల నుంచి బహిరంగ కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
భారతదేశంతో భూభాగ సరిహద్దులున్న దేశాల నుంచి బహిరంగ కొనుగోళ్లపై ఆంక్షలు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం సాధారణ ద్రవ్య నిబంధనలు-2017ను సవరిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. దేశ రక్షణ, జాతీయ భద్రతసహా ప్రత్యక్షంగా/పరోక్షంగా సంబంధిత విషయాలలో జాగరూకత దృష్ట్యా ఈ చర్య తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. భారత్‌తో భూ సరిహద్దుగల దేశాలనుంచి కొనుగోలుదారులు సముచిత భారత ప్రాధికార సంస్థవద్ద నమోదై ఉంటే మాత్రమే వస్తుసేవల (కన్సల్టెన్సీ-నాన్ కన్సల్టెన్సీ సేవలుసహా) కొనుగోళ్లు చేయడానికి లేదా వివిధ పనులు (కీలక ప్రాజెక్టులుసహా) చేపట్టడానికి అర్హులు. దీనికి సంబంధించి పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఏర్పాటుచేసిన రిజిస్ట్రేషన్ కమిటీయే సముచిత ప్రాధికార సంస్థగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా విదేశాంగ, దేశాయాంగ మంత్రిత్వ శాఖలనుంచి రాజకీయ-భద్రతానుమతి కూడా తప్పనిసరి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640778
‘సుదృఢ భారతం’పై కామన్‌వెల్త్ సెక్రటరీ జనరల్ ప్రశంస; మహమ్మారివేళ భారతీయుల రోగనిరోధకతకు ఈ అవగాహనే తోడ్పడింది: శ్రీ కిరణ్ రిజిజు
కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కామన్‌వెల్త్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారి అనంతర కాలంలో క్రీడాపొటీల పునరుద్ధరణపై భారత్ దృక్పథాన్ని కామన్‌వెల్త్ దేశాలతో పంచుకోవడం, సమష్టి క్రీడా విధాన రూపకల్పన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రిజిజు భారతదేశంలో కోవిడ్-19 నియంత్రణ దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలను వివరిస్తూ... ‘సుదృఢ భారతం’ ఉద్యమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఉద్యమం ఫలితంగా భారతీయులలో కలిగిన అవగాహన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల రోగనిరోధకత పెంపునకు ఎంతగానో తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు నిపుణులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యాయామం తదితరాలపై సూచనలివ్వగా అన్ని వయసుల వారూ వీటిని విజయవంతంగా ఉపయోగించుకున్నారని తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640935
“భారత్‌లోనే ఉండండి-భారత్‌లోనే చదవండి” ఇతివృత్తంగా మేధోమథన సదస్సు నిర్వహించిన కేంద్ర హెచ్ఆర్‌డి మంత్రి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఇవాళ న్యూఢిల్లీలో “భారత్‌లో ఉంటూ-భారత్‌లోనే చదువు” ఇతివృత్తంగా తమ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తిగల/సాంకేతిక విద్యా సంస్థల అధిపతులతోపాటు సీనియర్ అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- కోవిడ్ మహమ్మారి పరిస్థితులవల్ల విదేశాల్లో విద్యాభ్యాసం చేయదలచిన చాలామంది విద్యార్థులు స్వదేశంలోనే ఉండి-ఇక్కడే చదువుకోవాలని నిర్ణయించుకున్నట్లు గుర్తుచేశారు. అలాగే ప్రస్తుతం విదేశాల్లో ఉండి, చదువు పూర్తిచేయడం కోసం స్వదేశానికి తిరిగి వస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారందరి చదువుల అవసరాలు తీర్చేవిధంగా హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ అన్నివిధాలా కృషిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూజీసీ చైర్మన్ నేతృత్వాన ఓ కమిటీ కూడా ఏర్పాటు కానుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640975
జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చేపట్టిన నవ్య ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 నమూనా టీకా ‘హెచ్‌జీసీవో19’ అభివృద్ధికి ప్రారంభ నిధి సమకూర్చిన బయోటెక్నాలజీ శాఖ
భారతదేశంలో ‘మొట్టమొదటి’ ఎంఆర్ఎన్ఎ (mRNA) ఆధారిత టీకా తయారీ వేదికకు బయోటెక్నాలజీ శాఖ పరిధిలోని బిఐఆర్‌ఏసీ (DBT-BIRAC) వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చేపట్టిన నవ్య ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 నమూనా టీకా ‘హెచ్‌జీసీవో19’ (HGCO19) అభివృద్ధికి ప్రారంభ నిధి సమకూర్చింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640927
సీఎస్‌ఐఆర్ ఆవిష్కరించిన ‘ఫావిపిరవిర్’ చౌక తయారీ ప్రక్రియతో త్వరలో అందుబాటులోకి రానున్న పునర్నిర్మిత ఔషధం
పేటెంట్ హక్కులు ముగిసిన వైరస్ నిర్మూలన ఔషధం ‘ఫావిపిరవిర్’ (జపాన్ కంపెనీ ‘ఫుజి’ ఈ మందు వాస్తవ పరిశోధక రూపకర్త) కోవిడ్-19 రోగులకు.. ప్రత్యేకించి స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారి చికిత్స సంబంధిత ప్రయోగాత్మక పరీక్షలలో సమర్థ పనితీరు కనబరచింది. ఈ నేపథ్యంలో సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ స్థానికంగా లభించే ఔషధ ముడిపదార్థాలతో ఈ మందును చౌకగా రూపొందించే ప్రక్రియను ఆవిష్కరించింది. ప్రస్తుతం దీన్ని మన దేశంలోని ప్రముఖ
ఔషధ తయారీ సంస్థ ‘సిప్లా లిమిటెడ్’కు బదలాయించింది. తదనుగుణంగా ఈ ఔషధ ఉత్పత్తిని పెంచిన సిప్లా సంస్థ దీన్ని చికిత్సకు అందుబాటులో ఉంచడం కోసం డీసీజీఐ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640816
భారత-ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గౌరవనీయ లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గాంజ్‌తో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. రెండు దేశాలమధ్య వ్యూహాత్మక రక్షణ సహకారం ప్రగతిపై ఈ సందర్భంగా వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో రక్షణరంగ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికిగల అవకాశాలపై వారు చర్చించారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భాగంగా రెండు దేశాలూ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల ప్రగతిపైనా వారు సంతృప్తి వెలిబుచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640972
అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితులకు భారత రెడ్‌క్రాస్ సొసైటీ సహాయ సామగ్రి రవాణాకు జెండా ఊపిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమక్షంలో రాష్ట్రపతి భవన్ నుంచి 9 ట్రక్కుల రెడ్‌క్రాస్ సొసైటీ సహాయ సామాగ్రిని జండా ఊపి పంపించారు. వరద బాధితులకు పంపిణీ కోసం భారత రెడ్‌క్రాస్ సొసైటీ (IRCA)కి అధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ఈ వాహనాలను సాగనంపారు. ఈ సహాయ సామగ్రిలో టార్పాలిన్లు, గుడారాలు, చీరలు, ధోవతులు, నూలు కంబళ్లు, వంటపాత్రలు, దోమతెరలు, దుప్పట్లు, బకెట్లు, రెండు నీటిశుద్ధి యూనిట్లు తదితరాలున్నాయి. వీటితోపాటు కోవిడ్-19 సంబంధిత సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, ముఖ కవచాలు వంటి రక్షణ పరికరాలు కూడా ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640923
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో కోవిడ్ సంక్రమణ నివారణ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా పత్రికా-ప్రసార మాధ్యమాలకు నగరపాలన యంత్రాంగాధిపతి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ప్రభుత్వం జారీచేసే ప్రకటనలు, సందేశాలు మాత్రమే సరిపోవని ఆయన పేర్కొన్నారు. ఈ త్రిముఖ నగరంలో మాస్కు ధారణ, సామాజిక దూరం పాటించడంపై ప్రజలలో అవగాహన కల్పనకు సానుకూల-చురుకైన పాత్ర పోషించాలన్నారు.
- పంజాబ్: ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఏకాంత గృహవాసం నిర్దేశాలను ఉల్లంఘించే కోవిడ్-19 రోగులు రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 951 మంది ఏకాంత గృహవాస వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, వాణిజ్య ఆహార ప్రదేశాల యజమానులకూ రూ.5000 జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు, రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా విధించిన ఆంక్షలను ధిక్కరించేవారికి ఇదొక హెచ్చరిక కానుంది.
- హర్యానా: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, ముఖ కవచాలు, చేతి తొడుగులు తదితరాలను సురక్షితంగా పారవేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక కార్యక్రమం ప్రారంభించింది.
- కేరళ: రాష్ట్రంలో ఇవాళ మూడు మరణాలు నమోదవడంతో మొత్త మృతుల సంఖ్య 53కు చేరింది. కాగా, కోళికోడ్‌లోని చెకియాడ్ పంచాయతీలో కోవిడ్ సామాజిక వ్యాప్తి అంచున ఉందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ డాక్టర్ వివాహం సందర్భంగా ఆయనసహా పెళ్లికి హాజరైన 23 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కోట్టయం వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ వైద్యులు వ్యాధిగ్రస్తులతో పరిచయంవల్ల కోవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో మరోసారి దిగ్బంధం విధింపునకు తాము వ్యతిరేకమని అఖిలపక్ష సమావేశానికి ముందే సీపీఎం ప్రకటించింది. అవసరమైతే, స్థానిక స్థాయిలో కఠినచర్యలు తీసుకోవచ్చునని సూచించింది. కేరళలో నిన్న అత్యధికంగా 1078 కేసులు నమోదవగా వీటిలో 798 పరిచయాలద్వారా సోకాయి. మరో 65 కేసులకు మూలాలు తెలియలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,458మంది చికిత్స పొందుతుండగా 1,58,117మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలోని రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందిసహా భద్రత, అగ్నిమాపక సేవా సిబ్బంది కూడా కరోనావైరస్ బారినపడ్డారు. మరోవైపు కోవిడ్ వ్యాధి నివారణకు తాము రూపొందించిన ‘కరోనిల్’ ఆయుర్వేద ఔషధం విక్రయాలపై తాత్కాలిక నిలిపివేతను రద్దుచేయాలని కోరుతూ పతంజలి సంస్థ మద్రాస్ హైకోర్టులో అభ్యర్థన దాఖలు చేసింది. కాగా, వ్యాపార చిహ్నం ఉల్లంఘన కింద చెన్నైలోని పారిశ్రామిక పరికరాల శుభ్రత సంస్థ పతంజలిపై పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కేసులు పెరగడంతో చెన్నైకి డిప్యుటేషన్‌పై పంపిన ప్రభుత్వ వైద్యులు తిరిగి వారి సాధారణ పని ప్రదేశాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో నిన్న 6472 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,92,964కు పెరిగాయి; అలాగే మరో 88 మరణాలతో మృతుల సంఖ్య 3,232కు చేరింది. చెన్నైలో కేసుల సంఖ్య ప్రస్తుతం 90,000 స్థాయిని దాటింది.
- కర్ణాటక: మొట్టమొదటి స్వదేశీ నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ ‘స్వస్థాయు’పై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరమైన పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కోవిడ్ దిగ్బంధంవల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన ఎస్సీ-ఎస్టీలకు స్వయంఉపాధికోసం ప్రభుత్వం త్వరలో ఆర్థిక సహాయం అందించనుంది. కోవిడ్ పడకల లభ్యతపై ఆన్‌లైన్ పోర్టల్‌లో తాజా సమాచారం ఉంచాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో నిన్న 5030 కొత్త కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో బెంగళూరు నగరంలో 2207 నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసులు80,863కు చేరాయి; వీటిలో యాక్టివ్ కేసులు: 49,931; మరణాలు: 1616గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందున జూలై 26 నుంచి జిల్లాలో దిగ్బంధం విధిస్తారన్న సోషల్ మీడియా ప్రచారాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఖండించారు. ఇదంతా కేవలం వదంతి మాత్రమేనని, సదరు వార్తలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. కాగా, నెల్లూరు జిల్లాలో ఇవాళ్టినుంచి దిగ్బంధం విధించబడింది. అయితే, ప్రజల సౌకర్యార్థం వాణిజ్య దుకాణాలు మధ్యాహ్నం 1:00 గంటవరకు తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తిరుపతిలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇవాళ రుయా ఆసుపత్రివద్ద రోగ నిర్ధారణ పరీక్ష కోసం బారులుతీరారు. రాష్ట్రంలో నిన్న 7998 కొత్త కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 72,711; యాక్టివ్ కేసులు: 34,272; మరణాలు: 884గా ఉన్నాయి.
- తెలంగాణ: హైదరాబాద్‌లో కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, రోగ నిర్ధారణ ప్రయోగశాలలు అక్రమాలకు పాల్పడితే వాటిని మూసివేసేందుకు వెనుకాడబోమని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలో నిన్న 1567 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1661 మంది కోలుకున్నారు. ఇక కొత్త కేసులలో 662 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసులు: 50,826; యాక్టివ్ కేసులు: 11,052; మరణాలు: 447; డిశ్చార్జి కేసులు: 39,327గా ఉన్నాయి.
- మహారాష్ట్ర: సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన స్పర్శరహిత టికెట్ తనిఖీ వ్యవస్థ వంటి వినూత్న ఆవిష్కరణను కోవిడ్ నివారణలో వినియోగించడంపై ముంబై నగరపాలక సంస్థ యోచిస్తోంది. కాగా, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద టికెట్ తనిఖీ సిబ్బంది కోసం సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ‘చెకిన్-మాస్టర్’ పేరిట యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని సాయంతో ప్రయాణికుల టికెట్లను సురక్షిత దూరం నుంచి తనిఖీ చేయవచ్చు. త్వరలో అమలు చేయబోయే తదుపరి దశలో ఆటోమేటిక్ క్యూఆర్-కోడ్ ఆధారిత టికెట్ తనిఖీ వ్యవస్థను ప్రవేశ/నిష్క్రమణ ద్వారాలవద్ద ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇప్పటిదాకా ముంబైలో నమోదైన మొత్తం 1.05 లక్షల కేసులలో ప్రస్తుతం 22,800 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రం మొత్తంమీద యాక్టివ్ కేసులు:1.40 లక్షలుగా ఉంది.
- గుజరాత్: రాష్ట్రంలో గురువారం 1,078 కేసుల నమోదుతో మొత్తం కేసులు 52,477కు చేరాయి. గుజరాత్‌లో ఒకేరోజు అత్యధికంగా కేసుల రికార్డు మరోసారి నమోదైంది. కాగా, 12,348 యాక్టివ్ కేసులతో దేశంలో చురుకైన కేసుల విషయంలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో గురువారం 28 మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 2,257కు పెరిగింది.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయంవరకు 375 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 33,595కు, మృతుల సంఖ్య 598కి చేరాయి. ఇవాళ అల్వార్ జిల్లాలో ఒకేరోజు 224 కేసులు నమోదయ్యాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కరోనా సంక్రమణ ఫలితంగా ఈ ఏడాది రక్షాబంధన్, ఈద్-ఉల్-జుహా పండుగలను బహిరంగంగా నిర్వహించబోరు. కాగా, భోపాల్ పురపాలిక పరిధిలో 10 రోజులపాటు రాత్రి 8.00 నుంచి పూర్తి దిగ్బంధం విధించబడుతుంది. అయితే- మందులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాల సరఫరా కొనసాగుతుంది. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 632 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 25,474కు చేరాయి. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య 7,355గా ఉంది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో గురువారం 371 కొత్త కేసులతో మొత్తం కేసులు 6,370కి చేరాయి. కొత్త కేసులలో ఒక్క రాయ్‌పూర్‌లో మాత్రమే 205 నమోదయ్యాయి, కబీర్‌థామ్ 34, రాజ్‌నందగావ్ 23 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ రాజధాని ప్రాంతంలో 20 కోవిడ్ ప్రతిస్పందన బృందాలు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2672 మందికి పరీక్ష చేశాయి. వీరిలో 30 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, వారందరికీ చికిత్స ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 42 మంది కోలుకోగా, ప్రస్తుతం 654 మంది చికిత్స పొందుతున్నారు.
- మణిపూర్: రాష్ట్రంలో దిగ్బంధం కొనసాగుతున్న దృష్ట్యా ఇది ముగిసేదాకా అన్ని 'అప్పీల్', 'ఫిర్యాదు'ల కేసులపై విచారణను వాయిదా వేస్తున్నట్లు మణిపూర్ సమాచార కమిషన్ ప్రకటించింది.
- మిజోరం: రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కోవిడ్ నిర్బంధవైద్య కేంద్రాల కోసం మిజోరం ముఖ్యమంత్రి శ్రీ జొరమ్‌తంగా రూ. 3.85 కోట్లు మంజూరు చేశారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 63 కొత్త కేసులు నమోదవగా వీటిలో దిమాపూర్ 41, కోహిమాలో 21, పెరెన్‌లో ఒకటి వంతున ఉన్నాయి. నాగాలాండ్‌లో మొత్తం 1,237 కేసులకుగాను ఇప్పటిదాకా 530 మంది కోలుకోగా 707 మంది చికిత్స పొందుతున్నారు.
FACTCHECK


****
(Release ID: 1641110)
Visitor Counter : 241