రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని వరద బాధిత ప్రజలకు రెడ్ క్రాస్ సహాయక సరఫరాను జండా ఊపి ప్రారంభించిన - భారత రాష్ట్రపతి.

Posted On: 24 JUL 2020 12:39PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ఈ రోజు (జూలై 24, 2020) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ సమక్షంలో రాష్ట్రపతి భవన్ నుండి తొమ్మిది ట్రక్కుల రెడ్ క్రాస్ సహాయ సామాగ్రిని జండా ఊపి ప్రారంభించారు.  ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.‌సి.ఎస్) కు భారత రాష్ట్రపతి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 

అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని వరద బాధిత ప్రజలకు ఈ సహాయ సామాగ్రిని ఢిల్లీ నుండి సంబంధిత రాష్ట్రాలకు రైలు ద్వారా చేరవేస్తారు. వాటిని ఆయా రాష్ట్రాల రెడ్ క్రాస్ శాఖలు అందుకుంటాయి.

సహాయక సామగ్రిలో టార్పాలిన్లు, గుడారాలు, చీరలు, ధోవతులు, నూలు కంబళ్ళు, వంట పాత్రలు, దోమతెరలు, దుప్పట్లు, బకెట్లు, రెండు నీటిని శుద్ధి చేసే యూనిట్లు మొదలైనవి ఉన్నాయి.  వీటికి అదనంగా, కోవిడ్-19 రక్షణ వస్తువులైన సర్జికల్ మాస్కులు, పి.పి.ఈ. కిట్లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డులు వంటివి కూడా రాష్ట్రపతి జండా ఊపి ప్రారంభించిన సహాయ సామాగ్రిలో ఉన్నాయి.  ఈ రాష్ట్రాల్లోని ఐ.ఆర్.‌సి.ఎస్. వైద్య సేవలతో సంబంధం ఉన్న ఆరోగ్య కార్యకర్తలతో పాటు వరద సహాయ, పునరావాస కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న ఐ.ఆర్.‌సి.ఎస్. కార్యకర్తల రక్షణ కోసం ఈ సామాగ్రిని పంపించడం జరిగింది. 

ఐ.ఆర్.‌సి.ఎస్. ఇప్పటికే అందించిన సామగ్రికి అదనంగా మరియు కొనసాగింపుగా, ఆయా రాష్ట్రాల రెడ్‌ క్రాస్ శాఖలద్వారా బాధిత ప్రజలకు పంపిణీ చేయడం కోసం ఇప్పడు ఈ సహాయ సామాగ్రిని సరఫరా చేయడం జరుగుతోంది. 

ఈ సందర్భంగా, ఐ.ఆర్.సి.ఎస్. ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్.కె.జైన్ మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాలలో వరదల కారణంగా, కోవిడ్-19 కారణంగా బాధపడుతున్న ప్రజలకు సేవ చేయడానికి ఐ.ఆర్.సి.ఎస్. చేపట్టిన వివిధ కార్యక్రమాలు, చేస్తున్న కృషి గురించి రాష్ట్రపతి కి వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి సచివాలయం అధికారులు మరియు ఐ.ఆర్.సి.ఎస్. అధికారులు  పాల్గొన్నారు.

*****



(Release ID: 1640923) Visitor Counter : 271