PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 22 JUL 2020 6:21PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో అత్యధికంగా 28,472 మంది కోవిడ్‌-19 వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.
  • ఇప్పటిదాకా 7.5 లక్షల మందికిపైగా కోలుకోగా, జాతీయంగా కోలుకునేవారి సగటు 63 శాతం దాటింది.
  • దేశంలోని19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి సగటు 63.13 శాతంగా నమోదు.
  • కోలుకునేవారు 84.83 శాతంతో అగ్రస్థానంలో ఢిల్లీ; 84.31 శాతంతో రెండోస్థానంలో లదాఖ్‌
  • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,11,133.
  • సింగపూర్‌లోని టెమాసెక్‌ ఫౌండేషన్‌ నుంచి తొలివిడతగా అందిన 4,475 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; గత 24 గంటల్లో అత్యధికంగా 28,472 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయం; కోలుకున్నవారు 7.5 లక్షలకుపైగానే; 63 శాతం దాటిన కోలుకునే కేసులు; 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 63.13 శాతంకన్నా అధికంగా నమోదు

దేశ‌ంలో గత 24 గంటల్లో మునుపెన్నడూ లేనివిధంగా 28,472 మందికి కోవిడ్-19 వ్యాధి నయంకాగా, ఒక్కరోజులో ఇంతమంది కోలుకోవడం/ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లడం ఇదే ప్రథమం. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 7,53,049కి చేరింది. తద్వారా కోలుకునేవారి జాతీయ సగటు బలంగా మెరుగుపడుతూ 63.13 శాతానికి పెరిగింది. మరోవైపు ప్ర‌స్తుత కేసులు (4,11,133)-కోలుకున్న కేసుల మధ్య అంత‌రం 3,41,916కు  విస్తరించింది. దేశంలో కోలుకునేవారి సగటు స్థిరంగా పెరగటాన్ని ఈ అంతరం స్పష్టం చేస్తుండగా 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి శాతం జాతీయ సగటుకన్నా ఎక్కువగా నమోదైంది. ఆ మేరకు ఢిల్లీలో అత్యధికంగా 84.83 శాతం నమోదవగా, 84.31 శాతంతో లదాఖ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS)తోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని నైపుణ్య చికిత్స కేంద్రాల కృషి ఫలించింది. కేసుల వైద్య నిర్వహణసహా ఐసీయూలలో విషమస్థితిలోగల రోగులపట్ల కనబరచిన శ్రద్ధ ఫలితంగా దేశంలో మరణాల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. అంతేకాకుండా ఎయిమ్స్‌ నిర్వహిస్తున్న ‘ఈ-ఐసీయూ’ కార్యక్రమం ద్వారా కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకారం కూడా మరణాలను తగ్గించడంలో ఇతోధికంగా తోడ్పడింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640468

సింగపూర్‌లోని టెమాసెక్‌ నుంచి తొలివిడత కింద 4,475 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లను అందుకున్న శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఇవాళ సింగపూర్‌లోని టెమాసెక్‌ నుంచి తొలివిడత కింద 4,475 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లను అందుకున్నారు. ఈ సందర్భంగా టెమాసెక్‌ ఫౌండేషన్‌కు శ్రీ చౌబే కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భారతదేశానికి 20,000 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లను విరాళంగా అందజేస్తామని ఈ ఫౌండేషన్‌ ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన పరికరాలు 2020 ఆగస్టుకల్లా అందే అవకాశం ఉంది. ఓ మోస్తరు కోవిడ్‌-19 లక్షణాలున్నవారికి చికిత్సలో వినియోగం కోసం వీటిని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640490

కోవిడ్‌-19పై పోరులో తోడ్పాటుదిశగా యాక్టివ్‌ రెస్పిరేటర్‌ మాస్క్‌, నానో శానిటైజర్‌ను రూపొందించిన ‘ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌’

కోవిడ్-19 మహమ్మారి మాస్క్ వాడకాన్ని దైనందిన జీవితంలో అనివార్య భాగంగా మార్చేసింది. అయితే, వీటివల్ల రక్షణతోపాటు వినియోగంలో విపరీతమైన అసౌకర్యం కలుగుతోంది. ఇది వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆటంకం కలిగించడమేగాక శరీరం నుంచి విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువు (CO2)ను తిరిగి పీల్చాల్సిన కారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గేందుకు దారితీస్తోంది. ఎక్కువసేపు ధరించడం వల్ల మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా చాలకుండాపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఇతరత్రా సమస్యలు మాస్క్‌ ధారణను కష్టతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధారణ సౌకర్యంసహా పరిశుభ్ర శ్వాసకు వీలున్న కవాటం, సూక్ష్మపరమాణు వడపోత సదుపాయాలతో చురుకైన శ్వాసనిచ్చే మాస్కును కోల్‌కతాలోని ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌ (SNBNCBS) రూపొందించింది. దీంతోపాటు డిస్పెన్సింగ్‌ యాంటీ మైక్రోబియల్‌ లేయర్‌తో నానో శానిటైజర్‌ను కూడా ఈ సంస్థ రూపొందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640476

జలజీవన్ పథకం: రాష్ట్రాల్లో పోటాపోటీగా అమలు; 2020-21 లక్ష్యంలో ఇప్పటికే 10శాతం మించి సాధించిన 7 రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా 2019 ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక 2019-20 ఆర్థిక సంవత్సరం 7 నెలల కాలంలోనే సుమారు 85 లక్షల గ్రామీణ కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు ఇవ్వడం పూర్తయింది. మరోవైపు 2020-21కి సంబంధించి కోవిడ్‌-19 దిగ్బంధం నడుమ, దిగ్బంధ విముక్తి తొలిదశలో మరో 55 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటిదాకా ఏడు రాష్ట్రాలు... బీహార్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజోరంలలో స్వీయ లక్ష్యాల మేరకు ఈ ఏడాది ఇప్పటికే 10 శాతానికి  మించి పూర్తిచేశాయి. దీంతో దేశంలోని 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాలకుగాను ప్రస్తుతం 4.60 కోట్ల (24.30శాతం) కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వబడ్డాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640323

దేశంలో దిగ్బంధ విముక్తి అనంతరం జీవనం-జీవనోపాధి మ‌ధ్య సమతౌల్య‌ం సాధిద్దాం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ నిన్న “కోవిడ్‌-19 కాలంలో జీవనం” ఇతివృత్తంగా నిర్వహించిన వెబినార్‌లో పెట్రోలియం-సహజవాయువు-ఉక్కుశాఖల మంత్రి  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. కోవిడ్‌ మహమ్మారిపై పోరులో విజయం దిశగా కొన్ని నెలల నుంచీ అనేక విధివిధానాలు, పద్ధతులను దేశ ప్రజలు పాటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పటిదాకా పాటించిన మాస్కు ధారణ, సామాజిక దూరం, హస్త పరిశుభ్రత వంటి జాగ్రత్తలన్నిటినీ ఇకముందు కూడా అనుసరిస్తూ వ్యాధి వ్యాప్తిని పూర్తిగా నిరోధించడంలో సహకరించాలని సూచించారు. తదనుగుణంగా జీవనం-జీవనోపాధి మధ్య సమతౌల్యం సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఉక్కు శాఖ స‌హాయమంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులాస్థే మాట్లాడుతూ- మహమ్మారిపై పోరాటంలో ఉక్కు శాఖ‌ పరిధిలోని ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు పోషించిన పాత్ర‌, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీల గురించి వివరించారు. ముఖ్యంగా పట్టణప్రాంతాల ప్రజలు మరింత మెరుగైన ఆరోగ్యకర జీవనశైలిని అలవరచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640300

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • హర్యానా: రాష్ట్రంలోని కోర్టులు రిమాండ్‌కు పంపే కొత్త పురుష ఖైదీలకు సంబంధించి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నివేదిక వెల్లడయ్యేదాకా వారిని తాత్కాలిక జైళ్లలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ సెంట్రల్ జైలుసహా 3 జిల్లా జైళ్లను ప్రత్యేక కారాగారాలుగా ప్రకటించనుంది. ప్రాధాన్యం ప్రాతిపదికన ఖైదీలకు నిర్ధారణ పరీక్ష, నివేదికల వెల్లడి సాగేలా చూడాలని కూడా నిశ్చయించింది.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారి కాలంలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గవర్నర్ అన్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన హిమాచల్‌ పౌరులు వ్యవసాయ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారికి జిల్లా యంత్రాంగాలు సాయం చేయాలని సూచించారు. అలాగే రైతుల కోసం కేంద్రం ఇటీవల జారీచేసిన మూడు ఆర్డినెన్సుల గురించి విస్తృత ప్రచారంద్వారా వారికి సమాచారం అందించాలన్నారు.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి అలువా పురపాలికతోపాటు 7 పంచాయతీలలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ రోజు నలుగురి మరణంతో కోవిడ్-19 మృతుల సంఖ్య 48కి పెరిగింది. కొళ్లం, కోళికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. మరోవైపు నిర్ధారణ పరీక్షల నివేదికల్లో జాప్యం నివారణకు ప్రభుత్వం కార్యాచరణలో మార్పుచేర్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై కోలుకున్న రోగులను ఇళ్లకు పంపడం కోసం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షకు బదులు ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్ష ఫలితం వెల్లడైతే సరిపోతుంది. రాష్ట్రంలోని మూడు వైద్యకళాశాల ఆస్పత్రులలో గర్భిణులుసహా పదిమందికి కోవిడ్‌ సోకింది. దీంతో వారికి వైద్యసేవలందించే 30 మంది డాక్టర్లు పరిశీలనలో ఉన్నారు. తాజా పరిస్థితులపై చర్చకోసం ముఖ్యమంత్రి శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేరళలో నిన్న 720 కొత్త కేసులు నమోదవగా వీటిలో 528 పరిచయాలవల్ల సంక్రమించగా, 34 కేసులలో మూలాలు తెలియరాలేదు. ప్రస్తుతం 8,056 మంది చికిత్స పొందుతుండగా 1.54 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్‌ దిగ్బంధంవల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రైవేట్ ప్రయాణిక వాహనాల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (BOCI), ‘తమిళనాడు ఓమ్ని బస్ ఓనర్స్ అసోసియేషన్’ (TOBOA), ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, మంగళవారం కడలూరు జిల్లాలో 58 కొత్త కేసులు నమోదవగా వీరిలో 18మంది ఖైదీలున్నారు. రాజపాళయం ఎమ్మెల్యే ఎస్.తంగపాండియన్‌కు కోవిడ్‌ వ్యాధి సోకడంతో మదురైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలో 4965 కొత్త కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు: 1,80,643; యాక్టివ్‌ కేసులు: 51,344; మరణాలు: 2626; చెన్నైలో చురుకైన కేసులు: 14,952గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో రోగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం 4 లక్షల యాంటిజెన్ టెస్ట్ కిట్లతోపాటు 5 లక్షల నమూనా సేకరణ కిట్లను కొనుగోలు చేయాలని నిన్నటి సమావేశంలో ‘కర్ణాటక కోవిడ్ కార్యాచరణ కమిటీ’ నిర్ణయించింది. కాగా, ప్రైవేట్ ల్యాబ్‌లలో కోవిడ్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం పంపిన కేసులకు రూ.2,000, స్వయంగా వస్తే రూ.3,000 వంతున రేట్లు నిర్ణయించింది. ఇక పరీక్షల సంఖ్యను పెంచడం కోసం 16 ఆర్టీ-పీసీఆర్‌, 15 ఆటోమేటెడ్ ఆర్‌ఎన్‌ఏ సేకరణ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో రోజుకు 50,000 పరీక్షల నిర్వహణకు వీలు కలుగుతుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులలో పడకల లభ్యత వివరాలను ప్రదర్శించని 291 ప్రైవేట్ ఆసుపత్రులకు బిబిఎంపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న 3647 కొత్త కేసులు, 61 మరణాలు నమోదవగా వీటిలో బెంగళూరు నగరంలోనే 1714 కేసులున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 44,140గా ఉంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని వివిధ కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులలో పడకల లభ్యత వివరాలను ఆన్‌లైన్ సమాచార వ్యవస్థద్వారా అందించాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అధికారులకు సూచించారు. కాగా, మరో రెండు నెలలపాటు వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నందున రోగులకు వసతి దిశగా ఐసీయూలలో పడకల సంఖ్య పెంచాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. కరోనావైరస్ కేసులతోపాటు మరణాలు పెరిగిన నేపథ్యంలో విశాఖపట్నంలో వ్యాపారులు స్వయంగా దిగ్బంధం పాటిస్తున్నారు. రాష్ట్రంలో నిన్న 4944 కొత్త కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 58,668; క్రియాశీల కేసులు: 32,336; మరణాలు: 758గా ఉన్నాయి.
  • తెలంగాణ: హైదరాబాద్‌లోని కోవిడ్-19 రోగులకు నగదురహిత చికిత్సను నిరాకరిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులను బీమా నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDA) హెచ్చరించింది. తెలంగాణలో నిన్న 1430 కొత్త కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 47,705; యాక్టివ్‌ కేసులు: 10,891; మరణాలు: 429గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ సహాయమంత్రి అబ్దుస్ సత్తార్ కోవిడ్‌ వ్యాధి బారినపడ్డారు. దీంతో మంత్రిమండలిలో ఐదో మంత్రికి కరోనా వైరస్‌ సోకినట్లయింది. మరోవైపు ఎన్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఫౌజియా ఖాన్‌కూ వ్యాధి నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో  కేసుల సంఖ్య 3,27,031కి చేరినప్పటికీ మంగళవారం నాటికి యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,32,236గా ఉంది. ముంబైలో రోజువారీ 6,000 నుంచి 7,000 పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ 995 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో అత్యధికస్థాయిలో 1,026 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 50,000 దాటింది. ఇక మంగళవారం 34 మంది మరణించడంతో మృతుల సంఖ్య 2,201కి చేరింది. సూరత్‌లో అత్యధికంగా 298, అహ్మదాబాద్ 199, వడోదర 75, రాజ్‌కోట్ 58 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ ఉదయం 10:30 గంటలదాకా 226, మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 983 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 31,599కి పెరింది. ఇందులో ప్రస్తుతం 8,129 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా 22,889 మంది కోలుకోగా 581 మంది మరణించారు. కోవిడ్-19 సంక్షోభం నుంచి ప్రజలకు ఊరట దిశగా 35 లక్షల నిరుపేద కుటుంబాలకు రూ.1000 వంతున సాయం ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 785 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 24,095కు చేరింది. అయితే, మంగళవారం ఒకేరోజు 573 మంది కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,082గా ఉంది. ఇప్పటిదాకా మొత్తం 16,257 మంది వ్యాధినుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని రాయ్‌పూర్, సుర్గుజా, రాయ్‌గడ్‌, బలోడా బజార్ జిల్లాల్లో ఈ రోజునుంచి 7 రోజులపాటు దిగ్బంధం విధించబడింది, అలాగే ఈ అర్ధరాత్రి నుంచి దుర్గ్, కోర్బా, బిలాస్‌పూర్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ ఇదేవిధమైన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం 1,588 యాక్టివ్ కేసులున్నాయి.
  • గోవా: గోవాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధి లక్షణాలు కనిపించనివారికి ఏకాంత గృహవాసం అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం గోవాలో 1,552 యాక్టివ్‌ కేసులుండగా గత 24 గంటల్లో 174 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: ముందుస్తు రూపొందించిన సామగ్రితో నిర్మించిన పాపుంపేర్‌లోని మిడ్‌పు వద్ద ఏర్పాటుచేసిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రి ఈ నెల చివరినుంచి పనిచేస్తుందని అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగుదిశగా 186 ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల ఉన్నతీకరణకు రూ.75 కోట్లు ఖర్చుచేయాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది.
  • మణిపూర్: బిష్ణుపూర్‌లోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోగల కోవిడ్‌ రక్షణ కేంద్రాన్ని తక్షణం లౌకోయిపత్‌ వద్దగల పాత డీసీ కార్యాలయ ప్రాంగణంలోకి మార్చాలని ‘కోవిడ్ ఉపశమన రిలీఫ్ కమిటీ’ సభ్యులు, ‘మీరా పైబీ’ నాయకులు నిర్ణయించారు. ఇవాళ ఈ కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులందరూ విధులకు హాజరు కారాదని ఇంఫాల్‌లోగల రీజినల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) అధికారులు ఆదేశించారు.
  • మిజోరం; భద్రత దళాల సభ్యులలో కోవిడ్‌ వ్యాప్తి నివారణ దిశగా ఒక ప్రామాణిక విధాన ప్రక్రియను కఠినంగా పాటించాలని లుంగ్లీ జిల్లా పాలనయంత్రాంగంతోపాటు భద్రత దళాల ఉన్నతాధికారులు ఒక సమావేశంలో నిర్ణయించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాధిగ్రస్థులతో పరిచయాలున్నవారి జాడను సులభంగా పసిగట్టే దిశగా మోన్‌ జిల్లా పాలన యంత్రాంగం ఇవాళ ఒక నోటఫికేషన్‌ జారీచేసింది. ఈ మేరకు జనసమీకరణగల ఎలాంటి కార్యక్రమానికైనా హాజరయ్యే సందర్శకులు/అతిథులందరి వివరాలను అవసరమైతే ఒక రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.

*****



(Release ID: 1640508) Visitor Counter : 229