ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సింగపూర్ కు చెందిన తెమసెక్ ఫౌండేషన్ నుంచి, తొలి విడతగా 4,475 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పరికరాలను అందుకున్న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినికుమారర్ చౌబే
కోవిడ్ -19 పై పోరాటంలో కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలకు ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పరికరాలు ఎంతగానో సహయాపడనున్నాయి: అశ్విని కుమార్ చౌబే
Posted On:
22 JUL 2020 4:56PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి అశ్వినికుమారర్ చౌబే, సింగపూర్ కు చెందిన తెమసెక్ ఫౌండేషన్ నుంచి, తొలి విడతగా 4,475 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ (ఆక్సిజన్ అందించే) పరికరాలను అందుకున్నారు. ఈ ఫౌండేషన్ భారతదేశానికి 20 వేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మిగిలిన ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ పరికరాలు 2020 ఆగస్టులో అందనున్నాయి. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతారు. ఈ పరికరాలను అంతగా తీవ్రత లేని కోవిడ్ -19 కేసుల నిర్వహణలో ఉపయోగిస్తారు.
సింగపూర్‌కు చెందిన తెమసెక్ ఫౌండేషన్ అందించిన ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ పరికరాలు దేశంలో కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో చాలావరకు ఉపకరిస్తాయని చెప్పారు. ఇవి సరైన సమయంలో అందాయని ఆయన అన్నారు. ఈ పరికరాలను వీలైనంత త్వరగా దిగుమతి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి,ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసిన టాటా ట్రస్టుల సేవలనుకూడా ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.“ కోవిడ్ -19 పై పోరాటానికి విరాళాలు అందించిన దేశంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఙతలు. కొందరు రక్త దానం చేశారు. మరికొందరు ప్లాస్మా దానం చేశారు. కొందరు తమ చేయూతనందించారు అందరికీ కృతజ్ఙతలు” అని ఆయన అన్నారు.
“ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర సమన్వయ కృషితో ప్రభుత్వ సంపూర్ణ విధానంతో ఇండియా కోవిడ్ -19 పై పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రోత్సాహకర ఫలితాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఈ కృషిలో సాధ్యమైన అన్ని రకాల సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం ” అని అశ్వినికుమారర్ చౌబే అన్నారు.
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పరికరాల ఉపయోగం గురించి ప్రస్తావిస్తూ ఆయన, “ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ (ఆక్సిజన్ అందించే) పరికరాలు, వ్యాధి తీవ్రత అంతగా లేని కోవిడ్ -19 పేషెంట్లకు సహాయకారిగా ఉంటాయి. అంటే స్వల్పమొత్తంలో ఆక్సిజన్ అవసరమైన వారికి ఇది సరిపోతుంది . ఇది వాతావరణంలోని గాలిని వైద్యచికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ గా మారుస్తుంది. ఇది 90-95 శాతం గాఢత కలిగి ఉంటుంది.” అని ఆయన అన్నారు.
భారీ ఆక్సిజన్ సిలిండర్ల రవాణా, రీఫిల్లింగ్ అవసరం లేకుండా ఆక్సిజన్ ను ఈ యంత్రం అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల స్వల్ప మొత్తంలో ఆక్సిజన్ అవసరమైన రోగుల వార్డులలో వీటిని ఏర్పాటు చేయవచ్చునని ఆయన చెప్పారు.న ఈ యంత్రాలను కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చిన కోచ్ లలో వీటిని వాడవచ్చు. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలలో , ఆక్సిజన్ సిలిండర్లు నిరంతరాయంగా సరఫరాచేయడం కష్టమైన చోట ఇవి ఎంతో ఉ పయోగకరమని ఆయన చెప్పారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒ.ఎస్.డి శ్రీ రాజేష్ భూషణ్, ఇండియన్ రెడ్ క్రాస్ సెక్రటరీ జనరల్ శ్రీ ఆర్.కె.జైన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1640490)
Visitor Counter : 274