PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 06 JUL 2020 6:18PM by PIB Hyderabad

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

 భారత ప్రభుత్వం

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: 1100 దాటిన కోవిడ్‌ ప్రయోగశాలల సంఖ్య; 4.24లక్షలు దాటిన కోలుకున్న‌వారి సంఖ్య; యాక్టివ్‌ కేసులకన్నా 1.7 లక్షలకుపైగా అధికం; కోలుకునేవారి జాతీయ సగటు 60.86 శాతం

దేశంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 మిలియన్లు (కోటి) మైలురాయిని దాటింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యం, చూపుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనం. ఆ మేరకు కేంద్రంతోపాటు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల ‘పరీక్ష-అన్వేషణ-చికిత్స’ వ్యూహంసహా పలు అనుగమన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తదనుగుణంగా గడచిన 24 గంటల్లో 3,46,459 పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 1,01,35,525కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ ప్రత్యేక రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య 1105కు చేరింది.

కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణలో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల స్థిరమైన కృషి, ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ఇప్పటివరకూ వ్యాధినుంచి కోలుకున్నవారి సంఖ్య 4,24,432కు పెరిగింది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 15,350 మందికి వ్యాధి నయమైంది. తద్వారా కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య కన్నా 1,71,145 మేర అధికంగా నమోదైంది. దీంతో కోలుకున్నవారి జాతీయ సగటు 60.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,53,287 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.  మరిన్ని వివరాలకు 

కోవిడ్‌ కేసుల నమోదు జాతీయ సగటు 6.73 శాతం కాగా, పలు రాష్ట్రాల్లో ఇంకా తక్కువ; కేంద్రం చొరవతో ఢిల్లీలో పెరిగిన పరీక్షల సంఖ్య; తగ్గిన కేసుల నమోదు

దేశంలో కోవిడ్-19 మహమ్మారి సమర్థ నియంత్రణ, నిర్వ‌హ‌ణ దిశ‌గా రాష్ట్రాల‌తో స‌మ‌న్వ‌య కృషితోపాటు ప‌రీక్ష‌ల సంఖ్య పెంపు, స‌కాలంలో ప‌రిచ‌యాల అన్వేష‌ణ, స‌త్వ‌ర వైద్యం త‌దిత‌రాల‌కు కేంద్ర ప్రభుత్వం విస్ప‌ష్ట ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో రాష్ట్రాలు త‌మ‌త‌మ ప‌రిధిలో రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ సామర్థ్యాలను గణనీయంగా పెంచాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా కొత్త కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్టింది. ఆ మేర‌కు ప్ర‌స్తుత జాతీయ స‌గ‌టు 6.73 శాతంగా న‌మోదైంది. ఇక కేంద్ర‌పాలిత ప్రాంతం ఢిల్లీలో అక్క‌డి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు తోడు రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల పెంపు దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిస్తాయి మ‌ద్ద‌తిచ్చింది. ఈ సంయుక్త చ‌ర్య‌లు, శ్ర‌ద్ధ ఫ‌లితంగా ఢిల్లీ న‌గ‌రంలో రోజువారీ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. త‌ద‌నుగుణంగా 2020 జూన్ 1 నుంచి 5వ తేదీమ‌ధ్య రోజువారీ స‌గ‌టు ప‌రీక్ష‌ల సంఖ్య 5,481 మాత్రమే కాగా, 2020 జూలై 1 నుంచి 5వ తేదీ మ‌ధ్య రోజుకు సగటున 18,766 నమూనాలను పరీక్షించే స్థాయికి దూసుకుపోయింది. ఈ విధంగా ఢిల్లీలో ప‌రీక్షల సంఖ్య  గణనీయంగా పెరిగినప్పటికీ, గత 3 వారాల్లో స‌గ‌టు కేసుల న‌మోదు గ‌ణ‌నీయ స్థాయిలో 30 శాతం నుంచి 10 శాతానికి దిగివ‌చ్చింది.  మరిన్ని వివరాలకు 

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా ఎరువులకు ఎలాంటి కొరత లేదు: శ్రీ గౌడ

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఖరీఫ పంటల సాగు మొదలైన నేపథ్యంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానందగౌడ చెప్పారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన మేరకు తగిన పరిమాణంలో ఎరువులను ముందుగానే సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈసారి రుతుపవనాల పరిస్థితి అంచనాలకు మించి ఆశాజనకంగా ఉండటంతో మే, జూన్‌ నెలల్లో ఖరీఫ్‌ సీజన్‌ డీబీటీ ఎరువుల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 

ఎంఎస్‌ఎంఈల అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమం కింద ప్రపంచబ్యాంకు-కేంద్ర ప్రభుత్వం మధ్య  750 మిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు

సూక్ష్మ‌-చిన్న‌-మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (MSME) రంగం కోసం అత్య‌వ‌స‌ర ప్ర‌తిస్పంద‌న కార్య‌క్ర‌మం కింద ప్రపంచ బ్యాంకు-కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఇవాళ 750 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు పూర్త‌య్యాయి. కోవిడ్-19 సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ రంగానికి ద్ర‌వ్య‌ల‌భ్య‌త పెంచేదిశ‌గా అవసరమైన సహాయం అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ మేర‌కు అర్హ‌త‌గ‌ల 1.5 మిలియ‌న్ల ఎంఎస్ఎంఈలు ప్ర‌స్తుత సంక్షుభిత ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డటంతోపాటు ల‌క్ష‌లాది ఉద్యోగాల‌కు ర‌క్ష‌ణ దిశగా తక్షణ ద్రవ్యలభ్యతసహా రుణావసరాలు తీర్చేందుకు  ప్ర‌పంచ బ్యాంకు త‌న “అత్య‌వ‌స‌ర ప్ర‌తిస్పంద‌న కార్య‌క్ర‌మం” కింద తోడ్పాటునందిస్తుంది. కాలక్రమేణా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ముందుకు న‌డిపేందుకు అవ‌స‌ర‌మైన‌ విస్తృత సంస్క‌ర‌ణల వైపు దీన్ని తొలి అడుగుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.  మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19 డ్యాష్‌బోర్డు 4వ నవీకృత సంచికను ప్రచురించిన ‘నట్మో’ (NATMO)

భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని శాస్త్ర-సాంకేతిక విభాగానికి ఉప -విభాగంగా పనిచేసే “నేష‌న‌ల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గ‌నైజేష‌న్‌” (NATMO) త‌న కోవిడ్‌-19 డ్యాష్‌బోర్డు 4వ న‌వీకృత‌ సంచిక‌ను 2020 జూన్ 20న అధికారిక పోర్ట‌ల్ ‌http://geoportal.natmo.gov.in/Covid19/లో ప్ర‌చురించింది. మరిన్ని వివరాలకు

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ

రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మూడంచెల దిగ్బంధం ఈ ఉదయం 6 గంటలనుంచి ప్రారంభమైన నేపథ్యంలో అన్నివైపులా నగర సరిహద్దులను బహుళ అంచెల భద్రతతో మూసేశారు. దీంతోపాటు 100 వార్డుల పరిధిలోగల చిన్న రహదారులను పోలీసులు దిగ్బంధం చేయడంలో నగరం మొత్తం భద్రతదళాల పరిధిలోకి వచ్చింది. పార్శిళ్లద్వారా ఆహారపొట్లాలను అందించడం కోసం త్వరలో 10 బడ్జెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతేకాకుండా ఇళ్లకు సరఫరా చేసే వ్యవస్థ కూడా ఉంటుంది. కాగా, ఎర్నాకుళం జిల్లాలో ప్రస్తుతానికి మూడంచెల దిగ్బంధం  విధించే పరిస్థితి లేదని మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ అన్నారు. అయితే, జిల్లాలో 6 కొత్త నియంత్రణ జోన్లను ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న 225 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 2,228 మంది చికిత్స పొందుతుండగా, మొత్తం 1,77,995 మంది పరిశీలనలో ఉన్నారు.

  • తమిళనాడు

పుదుచ్చేరిలో కరోనావైరస్ కేసులు 1,000 దాటిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ 62 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో లెక్కకురాని 236 మరణాల వ్యవహారాన్ని తేల్చడానికి ఏర్పాటైన కమిటీ తన సమగ్ర నివేదికను ఆరోగ్యశాఖకు సమర్పించింది. కాగా, పురపాలక సంస్థ రోగ నిర్ధారణ పరీక్షలను పెంచడంతో జూలై 4న 11,114 పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో్ చెన్నైలో కేసుల నమోదు సగటు 20 శాతం నుంచి 16.52 శాతానికి తగ్గినట్లు తేలింది. ఇక రాష్ట్రంలో నిన్న 4150 కొత్త కేసులు, 60 మరణాలు నమోదవగా 2186 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కేసులు: 1,11,151, యాక్టివ్ కేసులు: 46,860, మరణాలు: 1510, చెన్నైలో యాక్టివ్ కేసులు: 24,890గా ఉన్నాయి.

  • కర్ణాటక

రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్-19 రోగులకు ఏకాంత గృహవాస ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ మేరకు 7రోజుల ప్యాకేజీకి రూ.2,450 చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు నిరాకరిస్తే ప్రైవేటు ఆస్పత్రులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌ హెచ్చరించారు. ప్రభుత్వ సిఫారసుతో ప్రైవేటు ఆసుపత్రులలో చేరే రోగులకు ‘సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్’ కింద బీమా సదుపాయం కల్పించబడుతుంది. కాగా, కర్ణాటకలో ఆదివారం నమోదైన 1,925 కోవిడ్ కేసులకు సంబంధించి 69.8 శాతం (1,345 కేసులు) రోగులకు పరిచయాలు లేదా ప్రయాణ చరిత్ర లేకపోవడం గమనార్హం. ఇక రాష్ట్రంలో నిన్నటివరకు మొత్తం కేసులు: 23,474, వీటిలో యాక్టివ్‌ కేసులు: 13,251 మరణాలు: 372గా ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్ 

రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు-ఫలితాల నవీకరణ మధ్య అంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యశాఖ) కె.ఎస్.జవహర్ రెడ్డి గుర్తించారు. ఈ మేరకు అత్యవసరం, పరీక్షించాల్సిన రకాలనుబట్టి నమూనాలను వేర్వేరు సంకేత వర్ణాలతో గుర్తించాలని జిల్లా పాలన యంత్రాంగాలను ఆయన ఆదేశించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జూలై 13 నుంచి  పాఠశాలలు తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రాథమిక విద్యార్థులకు వారానికి ఒకసారి, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు వారానికి రెండుసార్లు తరగతులు నిర్వహించాలని నిర్దేశించింది. ఇక గత 24 గంటలలో 16,712 నమూనాలను పరీక్షించగా 1322 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 424మంది వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లగా, ఏడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 20,019, యాక్టివ్: 10,860, డిశ్చార్జ్: 8920, మరణాలు: 239గా ఉన్నాయి.

  • తెలంగాణ

హైదరాబాద్‌ నగరంలోని వివిధ కాలనీలు, మురికివాడలలో నాణ్యమైన చికిత్సను మరింతగా అందించడం కోసం బస్తీ దవాఖానాల సేవలను కొత్త ప్రాంతాలకు విస్తరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు 33 బస్తీ దవాఖానాలను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించనుంది. రాష్ట్రంలో నిన్నటివరకు నమోదైన కేసులు: 23902, యాక్టివ్: 10904, మరణాలు: 295, డిశ్చార్జి అయినవి: 12703గా ఉన్నాయి.

  • మహారాష్ట్ర

రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,555 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులనుంచి 1.11లక్షల మందికిపైగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 86,040గా ఉంది. ఇక మరో 151 మంది మరణంతో మృతుల సంఖ్య 8,822కు పెరిగింది. నగరంలో సార్వత్రిక పరీక్షల నిర్వహణకు ఐసీఎంఆర్ ఆమోదించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను బీఎంసీ కొనుగోలుచేసింది. అన్నిరకాల రోగలక్షణాలున్న కోవిడ్-19 అనుమానితులు సహా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ ఏ లక్షణాలూ లేనివారు, అధిక ముప్పుగల పరిచయస్తులకూ ఈ తరహా పరీక్షను సిఫారసు చేసింది.

  • గుజరాత్

రాష్ట్రంలో గత 24 గంటల్లో 725 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 36,123కు పెరిగింది. వీటిలో గరిష్ఠంగా 218 కేసులు సూరత్ నుంచి, 162 అహ్మదాబాద్‌ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో 486 మంది కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 25,900కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,278కు తగ్గింది.

  • రాజస్థాన్

రాష్ట్రంలో 632 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 20,164కు చేరింది. ప్రతాప్‌గఢ్‌ జిల్లానుంచి గరిష్ఠంగా 65 కొత్త కేసులు నమోదయ్యాయి. అటుపైన చెరో 57 కేసులతో జోధ్‌పూర్, బికనేర్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్‌లో కోలుకుంటున్నవారి శాతం 79 కాగా, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.

  • మధ్యప్రదేశ్

రాష్ట్రంలో ఆదివారం 326 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,930కి చేరింది. ఇక యాక్టివ్‌ కేసులు 2,911 కాగా, ఇప్పటివరకు 11,411 మంది కోలుకున్నారు. దీంతోపాటు 608 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన 326 కేసుల్లో 64 గ్వాలియర్ నుంచి, 61 భోపాల్ నుంచి, 36 మొరెనా నుంచి నమోదయ్యాయి. భారత్‌లోని పెద్ద రాష్ట్రాల్లో కోలుకునేవారి సంఖ్యరీత్యా మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.

  • ఛత్తీస్‌గఢ్‌ 

రాష్ట్రంలో 46 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 3,207కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం 615 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • గోవా

గోవాలో ఆదివారం 77 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,761కి పెరిగింది. వీరిలో 936 మంది కోలుకోగా, ప్రస్తుతం 818 మంది చికిత్స పొందుతున్నారు.

  • అరుణాచల్ ప్రదేశ్

రాష్ట్రంలో ఈ సాయంత్రం 5 గంటలనుంచి దిగ్బంధం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ రాజధాని ప్రాంత యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలస కార్మికులందరికీ కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ 26,808 నమూనాలను సేకరించగా, 12,925 ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.

  • అసోం

రాష్ట్రంలో తొలిసారిగా ఆరోగ్యశాఖ సామూహిక కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు 2020 జూలై 7 నుంచి గువహటి పురపాలికలోని పండూ ప్రాంతం పరిధిలోగల రెండో వార్డులో ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు.

  • మేఘాలయ

అసోం నుంచి తురా పట్టణానికి వచ్చినవారిలో మరోవ్యక్తికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక ఇప్పటిదాకా 43 మంది కోలుకోగా, ప్రస్తుతం 29 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • మణిపూర్

రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద- కోవిడ్‌-19 రోగుల మానసిక సమస్యలకు సంబంధించి ఫోన్‌ద్వారా సలహాలివ్వడం కోసం మనస్తత్వ నిపుణుల బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు 8787457035, 9402751364 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది.

  • మిజోరం

రాష్ట్రంలో మరో 5 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 191కి చేరింది. ఇప్పటిదాకా 133 మంది కోలుకోగా, ప్రస్తుతం 58 మంది చికిత్స పొందుతున్నారు.

  • నాగాలాండ్

రాష్ట్రంలో 32 కొత్త కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 622కు చేరింది. ఇప్పటిదాకా 231 మంది కోలుకోగా, ప్రస్తుతం 391మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

******

 



(Release ID: 1636892) Visitor Counter : 265