రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్ర‌స్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేదు: శ్రీ గౌడ


డిమాండ్ ప్రకారం తగినంతగా యూరియా సరఫరా చేస్తామ‌ని మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

శ్రీ సదానంద గౌడను క‌లిసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్

Posted On: 06 JUL 2020 4:24PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఖరీఫ్ సీజన్‌లో దేశ వ్యాప్తంగా ఎరువుల కొరత లేదని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తాము తగిన పరిమాణంలో ఎరువుల‌ను ముందుగానే అందుబాటులో ఉంచడం జ‌రిగింద‌ని గౌడ‌ తెలిపారు.

 

ఈ రోజు న్యూఢిల్లీలో శ్రీ గౌడతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గౌడ మాట్లాడుతూ డిమాండ్ మేర‌కు మధ్యప్రదేశ్‌కు త‌గినంత‌గా యూరియా అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. త‌మ రాష్ట్రంలో ఇప్పటివరకు యూరియా కొరత లేనప్పటికీ.. ప్ర‌స్తుత రుతుపవనపు కాలంలో అధికంగా వ‌ర్ష‌పాతం ఉండటం వ‌ల్ల‌ యూరియా వినియోగం పెరిగిందని, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నారు వేయ‌డం 47 శాతం పెరిగింద‌ని శ్రీ చౌహాన్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత‌ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి అధిక కేటాయింపులు జ‌ర‌పాల‌ని కోరారు. అంచ‌నాల మేర‌కు జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో అధిక మొత్తంలో యూరియా అవ‌స‌రం కానుందని ఈ మేర‌కు త‌మ రాష్ట్రానికి త‌గిన కేటాయింపులు జ‌ర‌పాల‌ని

ఆయ‌న కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనికి స్పందించిన మంత్రి రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్‌కు తగినంత‌గా యూరియా సరఫరా చేస్తామని శ్రీ గౌడ హామీ ఇచ్చారు. జూన్ వరకు, రాష్ట్రానికి దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల అదనపు యూరియా లభించింది. జూలై సరఫరా ప్రణాళికకు అద‌నంగా జూలై 3వ తేదీన‌ 19000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించబ‌డింది. కేంద్ర ఎరువుల శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్‌ను తీర్చడానికి యూరియాను తగినంత సరఫరా చేసేందుకు గాను కట్టుబడి ఉంది.

అవసరమైన సమయంలో సరసమైన ధరలకు తగినంత‌ పరిమాణంలో రైతుల‌కు ఎరువులు అందించే విష‌య‌మై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని మంత్రి శ్రీ సదానంద గౌడ తెలిపారు. దేశవ్యాప్తంగా గణనీయమైన వర్షపాతం నమోదైనందున ఈ ఖరీఫ్ సీజన్ మే, జూన్ నెలల్లో ఎరువుల డీబీటీ అమ్మకాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదు అయింది. మధ్యప్రదేశ్‌లో ఎరువుల డీబీటీ అమ్మకాలు మే, జూన్ నెలల్లో వరుసగా 176 శాతం మరియు 167 శాతం మేర‌ పెరిగాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో యూరియా లభ్యత మెరుగ్గానే ఉంది. జూలై 4వ తేదీ నాటికి రాష్ట్రంలో 4.63 లక్షల మెట్రిక్ టన్నుల ముగింపు స్టాక్ ఉంది. ఎరువుల శాఖ పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలిస్తోంది. పెరిగిన ఎరువుల అదనపు డిమాండ్ మేర‌కు.. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ పెరిగిన దేశీయ ఉత్పత్తి మరియు దిగుమతులతో ఈ డిమాండ్‌ తీర్చబడ‌నుంది.

 

****



(Release ID: 1636864) Visitor Counter : 253