PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
29 JUN 2020 6:53PM by PIB Hyderabad
పత్రికా సమాచార సంస్థ
సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం: కోలుకునేవారి శాతం మెరుగై 58.67కు చేరిక; కోలుకున్న-యాక్టివ్ కేసుల తేడా 1,11,602కు పెరుగుదల
దేశంలో కోవిడ్-19తో చికిత్స పొందుతున్న వారికన్నా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 1,11,602 మేర అధికంగా నమోదైంది. కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతుండగా గడచిన 24 గంటల్లో 12,010 మంది కోలుకున్నారు.దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 3,21,722కు చేరడంతో కోలుకునేవారి శాతం 58.67కు పెరిగింది. ప్రస్తుతం 2,10,120 మంది కోవిడ్ బాధితులు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు భారత్‌లో కోవిడ్ ప్రత్యేక ప్రయోగశాలల సంఖ్య 1047కు చేరగా- 760 ప్రభుత్వ రంగంలో, 287 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అంటే 24 గంటల వ్యవధిలోనే 11 అదనంగా చేరగా, అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో నిన్న 1,70,560 పరీక్షలు నిర్వహించగా- నేటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య మరింత పెరిగి 83,98,362కు చేరింది. మరిన్ని వివరాలకు
కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ప్రధానమంత్రి వెంట నడుస్తోంది: దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వ్యాఖ్య
“దేశంలో కోవిడ్ పరిస్థితులను చక్కదిద్దడంలో మోదీ ప్రభుత్వం ఎంతో సముచితంగా వ్యవహరిస్తోంది. ఆ మేరకు ఢిల్లీలో పరిస్థితి నియంత్రణలోనే ఉంది” అని ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. “ఢిల్లీలో సామాజిక సంక్రమణ వంటిదేమీ లేదు... దీనిపై ఆందోళన అనవసరం” అని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. కోవిడ్ పరిస్థితులపై అవసరమైన చర్యలు తీసుకునే బాధ్యత ఢిల్లీ ప్రభుత్వానిదే అయినా, సంబంధిత కృషిని సమన్వయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాజధానిలో కోవిడ్ బాధితుల సంఖ్య జూలై చివరికల్లా 5.5 లక్షలకు పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేయడంతో తాము చొరవ తీసుకున్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్యను బహుళంగా పెంచినందువల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపించినా, గుర్తించిన రోగులను ఏకాంత చికిత్స తరలించడంవల్ల కోలుకునేవారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. అలాగే జూన్ 14నాటికి 9,937 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 30,000 పడకలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలోగల అన్ని నియంత్రణ మండళ్లలో ఇంటింటి సర్వే జూన్ 30కల్లా పూర్తికాగలదని, అంతేకాకుండా ‘రక్త-రసి’ (సీరోలాజికల్) సర్వే కూడా చేపట్టామన్నారు. మరిన్ని వివరాలకు
భారత ఆహార సంస్థ (FCI)వద్ద తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు; జూన్‌దాకా 388.34 లక్షల టన్నుల గోధుమ, 745.66 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
భారత ఆహార సంస్థ (FCI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... 28.06.2020 నాటికి 266.29 లక్షల టన్నుల బియ్యం, 550.31 లక్షల టన్నుల గోధుమలు- మొత్తం 816.60 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు అందుబాటులో (కొనుగోలు పూర్తయినా ఇంకా గిడ్డంగులకు చేరని గోధుమలు, ధాన్యం మినహా) ఉన్నాయి. కాగా, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, ఇతర సంక్షేమ పథకాల కింద పంపిణీ కోసం నెలకు సుమారు 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ఈ నేపథ్యంలో దిగ్బంధం మొదలైనప్పటినుంచి నేటిదాకా దాదాపు 138.43 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను 4,944 గూడ్సు రైళ్లద్వారా ఎఫ్‌సీఐ రవాణా చేసింది. రైలు మార్గంలోనే కాకుండా రహదారి, జల మార్గాలద్వారా 277.73 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి. మరో 21,724 టన్నుల ఆహార ధాన్యాలు 14 నౌకల ద్వారా రవాణా అయ్యాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు 13.47 లక్షల టన్నులు రవాణా చేయబడ్డాయి. మరిన్ని వివరాలకు
పీఎం-ఎఫ్ఎంఈ పథకం కింద రూ.35వేల కోట్ల పెట్టుబడులు... 9 లక్షల నిపుణ-అర్థనిపుణ కార్మికులకు ఉపాధి సృష్టి: హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
‘స్వయం సమృద్ధ భారతం’ కార్యక్రమంలో భాగంగా “ప్రధానమంత్రి చిన్న ఆహారతయారీ సంస్థల క్రమబద్ధీకరణ” (PM-FME) పథకాన్ని కేంద్ర ఆహారతయారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నిన్న ప్రారంభించారు. ఈ పథకంద్వారా రూ.35,000 కోట్ల పెట్టుబడులతోపాటు 9 లక్షల మంది నిపుణ-అర్థనిపుణ కార్మికశక్తికి ఉపాధి సృష్టి జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అంతేగాక 8 లక్షల ఆహార తయారీ యూనిట్లకు సమాచారం, శిక్షణ, మెరుగైన అవకాశాలు, క్రమబద్ధీకరణ తదితర ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆమె విడుదల చేశారు. అసంఘటిత ఆహారతయారీ రంగంలోని 25 లక్షల యూనిట్లు ఈ రంగంలో 74 శాతం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. వీటిలో 66 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండగా, 80 శాతం కుటుంబ యాజమాన్యంలో నడుస్తూ గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంద్వారా పట్టణాలకు వలసలను నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిలో అత్యధికశాతం చిన్న పరిశ్రమల విభాగం కిందకు వస్తాయని తెలిపారు. మరిన్ని వివరాలకు
భారత తొలి మానవ అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’పై కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉండదు: డాక్టర్ జితేంద్ర సింగ్
భారత తొలి మానవ అంతరిక్ష యాత్రకు ఉద్దేశించిన “గగన్‌యాన్’ కార్యక్రమంపై కోవిడ్ మహమ్మారి ప్రభావమేమీ ఉండదని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు సరైన దిశగా సాగిపోతున్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ స్పష్టం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష విభాగం గడచిన ఏడాది కాలంలో సాధించిన విజయాలు, ముఖ్యమైన భవిష్యత్ ప్రణాళికలను విలేకరులకు వివరించిన సందర్భంగా ఈ మేరకు చెప్పారు. కోవిడ్-19 మహమ్మారివల్ల రష్యాలో నలుగురు భారతీయ వ్యోమగాముల శిక్షణ నిలిపివేయాల్సి వచ్చినప్పటికీ శిక్షణ కార్యక్రమం, ప్రయోగ సమయం మధ్య ‘తగినంత గడువు’ ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గగన్‌యాన్ కార్యక్రమానికి ఆటంకాలు ఉండబోవని ఇస్రో చైర్మన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు
మిషన్ సాగర్: కొచ్చి రేవుకు చేరిన ‘ఐఎన్‌ఎస్ కేసరి’
‘మిషన్ సాగర్’లో భాగంగా దక్షిణ హిందూ మహాసముద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భారత నావికాదళ నౌక ‘కేసరి’ 55 రోజుల తర్వాత నిన్న కేరళలోని కొచ్చి రేవుకు చేరింది. ప్రత్యేక ‘కోవిడ్ సహాయ కార్యక్రమం’ కింద అప్పగించిన బాధ్యతల మేరకు ఈ నౌక వివిధ దేశాల్లోని ప్రజల సహయార్థం 580 టన్నుల ఆహార, అత్యవసర మందులను ఆయా రేవులలోని అధికారులకు అందజేసింది. ఈ మేరకు మాలె (మాల్దీవ్స్), పోర్ట్ లూయీ (మారిషస్), అంత్సిరినానా (మడగాస్కర్), మొరోని (కొమురోస్ ద్వీపాలు), పోర్ట్ విక్టోరియా (సీషెల్స్) రేవులకు వెళ్లివచ్చింది. అంతేకాకుండా ఈ నౌకలో వెళ్లిన 14 మంది వైద్యసహాయ బృందం మారిషస్, కొమొరోస్ దీవులలో 20 రోజుల వంతున బసచేసి, కోవిడ్ పరిస్థితుల నిర్వహణకు దీర్ఘకాలిక వ్యూహం రూపకల్పనలో అభిప్రాయాలను పంచుకోవడంద్వారా అక్కడి ప్రభుత్వాలకు సహాయపడింది. మరిన్ని వివరాలకు
‘దేఖో అప్నా దేశ్’ పరంపరలో భాగంగా “కోవిడ్ సమయంలో సురక్షిత-బాధ్యతాయుత పర్యాటకం పునఃప్రారంభం: ఆరోగ్య సంరక్షణపై దృష్టి” ఇతివృత్తంగా 39వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
‘దేఖో అప్నా దేశ్’ పరంపర కొనసాగింపులో భాగంగా “కోవిడ్ సమయంలో సురక్షిత-బాధ్యతాయుత పర్యాటకం పునఃప్రారంభం” ఇతివృత్తంగా 2020 జూన్ 27న కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తాజా కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా, ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ కార్యక్రమం కింద భారత సుసంపన్న వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటడమే ‘దేఖో అప్నా దేశ్’ లక్ష్యం. మరిన్ని వివరాలకు
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
కరోనా వైరస్‌పై పంజాబ్ ప్రభుత్వం ఒక క్రమబద్ధ, ప్రణాళికాబద్ధ మార్గంలో పోరాడుతోందని, ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే దిశగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రాధాన్యం ఇచ్చామని రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి చెప్పారు. మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, పరిస్థితి తీవ్రతను గమనించాక దేశంలో కర్ఫ్యూ విధించిన తొలి రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనావైరస్ నియంత్రణలో ఆశా కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఐఎల్‌ఐ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడం ద్వారా యాక్టివ్ కేసుల అన్వేషణలో వారు ప్రశంసనీయంగా పనిచేశారని ఆయన అన్నారు. మార్చి నుంచి జూన్‌దాకా ప్రతి ఆశా కార్యకర్తకు ప్రభుత్వం నెలకు రూ.1000వంతున అదనపు ప్రోత్సాహకాన్ని అందించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జూలై, ఆగస్టు నెలలకుగాను నెలకు రూ.2000 వంతున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఆదివారం 5,493 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,64,626కు చేరింది. మరోవైపు 2,330 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 86,575కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 70,607కాగా, ఆదివారం నాటికి మరణాల సంఖ్య (4.51 శాతం) 7429గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 9,23,502. కాగా, ముంబై నగరవాసులు తమ ఇళ్లకు 2 కిలోమీటర్ల పరిధికి మాత్రమే తమ కార్యకలాపాలను పరిమితం చేయాలని ముంబై పోలీసులు హెచ్చరించారు. సరైన కారణం లేకుండా నివాసాలనుంచి 2 కిలోమీటర్లకు మించి తిరిగితే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 చికిత్సకు ఇవాళ ప్లాస్మా థెరపీ నిర్వహణను భారీ స్థాయిలో ప్రారంభించింది. ఏప్రిల్‌లో ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా పరీక్షించడం ద్వారా దేశంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అటుపైన మరిన్ని ప్రయోగాల నిర్వహణకు అనుమతి కోరినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 624 కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,397కు చేరగా, 22,808 మంది కోలుకున్నారు. మరోవైపు మరణాల సంఖ్య 1,809కి చేరింది. గుజరాత్‌లో వరుసగా రెండో రోజు కొత్త కేసుల సంఖ్య 600 దాటింది. వీటిలో అహ్మదాబాద్‌లో 170, సూరత్‌లో 141 నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,780 యాక్టివ్ కేసులలో 71 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గుజరాత్ ఇప్పటివరకు దాదాపు 3.63 లక్షల పరీక్షలు నిర్వహించింది.
రాష్ట్రంలో ఇవాళ 121 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 17,392కు చేరాయి. వీటిలో యాక్టివ్ కేసులు 3,372 కాగా, కోలుకున్నవారి సంఖ్య 13,618గా ఉంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాలు 402. పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 8 లక్షలుగా ఉంది.
రాష్ట్రంలో ఆదివారం 7795 నమూనాలను పరీక్షించగా, 221 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 13,186కు పెరిగాయి. తాజా నివేదిక ప్రకారం... ఇప్పటిదాకా 10,084 మంది కోలుకోగా 557 మరణాలు నమోదయ్యాయి, రాష్ట్రంలో ప్రస్తుతం 13,186 యాక్టివ్ కేసులుండగా, కొత్త కేసులలో అధికశాతం ఇండోర్, భోపాల్, గ్వాలియర్, మొరెనా ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఇండోర్‌లో మొత్తం 4615 కేసులు, 222 మరణాలు నమోదయ్యాయి. ఇక 2740 కేసులు, 94 మరణాలతో భోపాల్ ఆ తర్వాతి స్థానంలో ఉంది.
రాష్ట్రంలో ఆదివారం 84 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2694కు చేరాయి. వీటిలో 619 యాక్టివ్ కేసులు కాగా, 118 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2062కు పెరిగింది.
గోవాలో ఆదివారం 70 కొత్త కేసులు నమోదవగా మొత్తం రోగుల సంఖ్య 1,198కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసులు 717కాగా, ఆదివారం 58 మందికి వ్యాధి నయం కావడంతో కోలుకున్నవారి సంఖ్య 478కి పెరిగింది. ఇప్పటిదాకా 3 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.
రాష్ట్రంలో మూలం తెలియని కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళప్పురం జిల్లాలోని పొన్నాని తాలూకాలో ఈ సాయంత్రం నుంచి జూలై 6 వరకు ప్రభుత్వం మూడింతల దిగ్బంధం విధించింది. కాగా, అధికారుల సమాచారం ప్రకారం... జిల్లాలోని ఎడప్పళ్ ప్రాంతంలో కోవిడ్ నిర్ధారణ అయిన ఇద్దరు డాక్టర్ల సంప్రదింపుల జాబితాలో నవజాత శిశువులుసహా 20,000 మందికిపైగా వ్యక్తులు ఉన్నారు. వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని నాలుగు పంచాయతీలను ఇప్పటికే నియంత్రణ జోన్లుగా ప్రకటించారు. మరోవైపు 1,500 మందికి యాదృచ్ఛిక పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రావెన్కూర్ దేవస్వం బోర్డు పరిధిలోని ఆలయాలకు భక్తుల రాకపై ఆంక్షలు జూన్ 30 తర్వాతా కొనసాగుతాయి. ఇక గల్ఫ్ ప్రాంతంలో కోవిడ్-19తో మరో ఇద్దరు కేరళీయులు మరణించడంతో మృతుల సంఖ్య 287కు చేరింది. రాష్ట్రంలో నిన్న 118 కేసులు నమోదవగా వివిధ జిల్లాల్లో 2,015 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో దిగ్బంధం పొడిగించడం కాకుండా కేసుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు విధించాలని కోవిడ్‌పై తమిళనాడు ఆరోగ్య నిపుణుల కమిటీ ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా సిఫారసు చేసింది. కాగా, ఇరాన్ నుంచి భారత నావికాదళ నౌక ‘జలాశ్వ’ భారతీయులను స్వదేశం తీసుకొచ్చినప్పటికీ, తగినంత స్థలం లేకపోవడంతో ఇంకా 63 మంది అక్కడే ఉండిపోయారు. వీరిలో 44 మంది తమిళనాడు జాలర్లు కూడా ఉన్నారు. వెల్లూరులో ముగ్గురు న్యాయాధికారులు, ఇద్దరు పోలీసులకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 3940 కొత్త కేసులు నమోదవగా 1443 మంది కోలుకున్నారు; అలాగే 54 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 82,275, యాక్టివ్ కేసులు: 35,656, మరణాలు: 1079కాగా, చెన్నైలో యాక్టివ్ కేసులు: 19877గా ఉన్నాయి.
రాష్ట్రంలో నిర్బంధ వైద్య పరిశీలనలోగల అనేకమంది నిబంధనలను ఉల్లంఘిస్తుండటాన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు వారి కదలికలపై నిఘాకోసం యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కాగా, 1600 పడకల సామర్థ్యంతో మరో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లను బీబీఎంపీ ప్రకటించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యనందించడం కోసం ప్రభుత్వం కొత్త తాత్కాలిక మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్రంలో కోవిడ్-19 సంబంధిత వ్యయంపై శేతపత్రం ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో నిన్న 1267 కొత్త కేసులు, 220 డిశ్చార్జిలతోపాటు 16 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 13190, యాక్టివ్ కేసులు: 5472, మరణాలు: 207, డిశ్చార్జిలు: 7507గా ఉన్నాయి.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఇలకు మద్దతుగా రెండోవిడత ఆర్థిక ప్రోత్సాహకిం కింద ముఖ్యమంత్రి రూ. 512 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి జూన్వరకు స్థిర విద్యుత్ ఛార్జీలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 108, 104 అంబులెన్స్ వాహనాలద్వారా అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వైద్య సేవలు అందించే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు 1,060 వాహనాలతో ఈ సదుపాయం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,216 నమూనాలను పరీక్షించగా 793 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 302 మంది డిశ్చార్జి కాగా, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 81 అంతర్రాష్ట్ర వాసులకు చెందినవి కాగా, 6 విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం మొత్తం కేసులు: 13,891, యాక్టివ్ కేసులు: 7479, డిశ్చార్జెస్: 6232, మరణాలు: 180గా ఉన్నాయి.
ఢిల్లీ, ముంబైల తరహాలోనే హైదరాబాద్ కూడా కాస్మోపాలిటన్ నగరం కాబట్టి ఇక్కడ కేసులు అదేస్థాయిలో పెరుగుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే కొన్ని ప్రదేశాలలో దిగ్బంధం విధిస్తామని ప్రకటించారు. కాగా, కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఆ ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 14419, యాక్టివ్ కేసులు: 9000 మరణాలు: 247, డిశ్చార్జి అయినవారు: 5172 మంది.
రాష్ట్రంలోని తూర్పు సియాంగ్‌లోగల సైనిక పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బాలికా కేడెట్లకు త్వరలోనే ప్రవేశం కల్పిస్తామని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంద్వారా వెల్లడించారు.
గువహటి నగరంలోని 31 కోవిడ్ సంరక్షణ కేంద్రాలు, 12 ఆస్పత్రులలో కోవిడ్ అనుమానితుల నమూనాల సేకరణకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించిందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్యమంద్వారా వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) భాగస్వామ్యంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ కార్యాలయంద్వారా ఇంఫాల్‌లోని మణిపూర్ ప్రెస్ క్లబ్‌లో మీడియా ప్రతినిధులకు ఇవాళ ఫేస్‌మాస్కులు పంపిణీ చేశారు.
పొరుగనగల అసోంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నగరం గువహటి సరిహద్దులోగల మేఘాలయలోని బిర్నిహాట్, జోరాబాట్‌సహా ఖనారావరకు దిగ్బంధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు అంతర్రాష్ట్ర రవాణాపై ప్రస్తుత ఆంక్షలు కొనసాగుతాయి. తదనుగుణంగా డిప్యూటీ కమిషనర్ అవసరమైన ఉత్తర్వులు జారీచేస్తారు.
రాష్ట్రంలో మరో ఆరుగురు కోలుకోవడంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 61కి చేరగా, ప్రస్తుతం 90 యాక్టివ్ కేసులున్నాయి.
నాగాలాండ్‌లో మరో నలుగురు రోగులు కోలుకోగా, వీరిలో ముగ్గురు 3 దిమాపూర్, ఒకరు కోహిమాకు చెందినవారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 168కి చేరగా, ప్రస్తుతం 266 యాక్టివ్ కేసులున్నాయి.
******
(Release ID: 1635236)
Visitor Counter : 287
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam