అంతరిక్ష విభాగం
“గగన్ యాన్” పై కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉండదు: జితేంద్రసింగ్
Posted On:
29 JUN 2020 5:44PM by PIB Hyderabad
“గగన్ యాన్” పేరిట చేపట్టే మానవహ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభంపై కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉండబోదని, “గగన్ యాన్” కు సన్నాహాలు సరైన మార్గంలో కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల కేంద్ర సహాయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష విభాగాల సహాయమంత్రిగా ఉంటున్న జితేంద్ర సింగ్ ఈశాన్య ప్రాంతం అభివృద్ధి వ్యవహారాలను స్వతంత్ర హోదాలో పర్యవేక్షిస్తున్నారు.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అంతరిక్ష శాఖ గత ఏడాది కాలంలో సాధించిన ముఖ్యమైన విజయాలను, భవిష్యత్తులో నిర్వహించ తలపెట్టిన ప్రయోగాలను గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో ఇవ్వతలపెట్టిన శిక్షణను, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆపివేయాల్సి వచ్చినప్పటికీ, గడువులోగా ప్రయోగం ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ఇస్రో చైర్మన్, వైజ్ఞానిక బృందం అభిప్రాయపడుతున్నట్టు మంత్రి చెప్పారు. వ్యోమగాముల శిక్షణ ఇపుడు తిరిగి ప్రారంభమైందని ముందుగా నిర్ణయించుకున్న గడువులోపలే ప్రయోగం మొదలవుతుందని ఆయన అన్నారు. 2022లో 75 భారతీయ స్వాంత్య్ర వార్షికోత్సవాలకు ముందే ఈ ప్రయోగం ప్రారంభమవుతుందని మంత్రి జితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇస్రో కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మంత్రి వివరిస్తూ ఇందుకు సంబంధించి“భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా ప్రోత్సాహక, సాధికార కేంద్రం (IN-SPACe)” పేరిట ఒక నియంత్రణా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు సంస్థలకు సమంజసమైన పాత్రను కల్పించేందుకు, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంస్థ దోహదపడుతుందని మంత్రి చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల సామర్థ్యాన్ని, వనరులను పెంచడంతోపాటుగా, ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ప్రతిభావంతులైన అంతరిక్ష శాస్త్రవేత్తలు, నిపుణులు దేశంనుంచి వలసపోకుండా నివారించవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మెరుగైన అవకాశాలకోసం వారు ఇతర దేశాలకు వెళ్లడాన్ని అరికట్టవచ్చని అన్నారు. చంద్రమండలానికి, చంద్రయాన్-3 పేరిట చేపట్టిన యాత్ర, వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోందని మంత్రి చెప్పారు.
****
(Release ID: 1635216)
Visitor Counter : 307