PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 28 JUN 2020 6:51PM by PIB Hyderabad

 

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం: ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య లక్షకు మించిన వ్యత్యాసం; ‌కోలుకునేవారి శాతం 58.56కు చేరిక‌

దేశంలో కోవిడ్‌-19 ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య వ్యత్యాసం వేగంగా పెరుగుతూ 1,00,000కు పైబడింది. ఈ మేరకు రెండింటి మ‌ధ్య తేడా ఇవాళ 1,06,661కు చేరింది. దీంతో ఇప్పటిదాకా వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 3,09,712కు పెరగడంతోపాటు కోలుకునేవారి శాతం 58.56కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 13,832 మందికి వ్యాధి నయంకాగా ప్రస్తుతం 2,03,051 మంది కోవిడ్ బాధితులకు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు భారత్‌లో కోవిడ్‌ ప్రత్యేక ప్రయోగశాలల సంఖ్య 1036కు చేరగా- 749 ప్రభుత్వ రంగంలో, 287  ప్రైవేట్‌ రంగంలో ఉన్నాయి. వీటిలో రోజూ 2,00,000కుపైగా పరీక్షలు నిర్వహిస్తుండగా గత 24 గంటల్లో ఈ సంఖ్య 2,31,095కు పెరిగింది. దీంతో నేటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 82,27,802కు చేరింది.

మరిన్ని వివరాలకు

‘మన్‌ కీ బాత్‌’ 19వ సంచికలో భాగంగా 28.06.2020నాటి ప్రధానమంత్రి ప్రసంగం

“నా ప్రియమైన దేశ ప్రజలారా! మ‌న‌కు స‌వాళ్లు విసిరే విప‌త్తు తీవ్రత ఎంత‌టిదైన‌ప్ప‌టికీ, భార‌త సంస్కృతి, జీవ‌న విధానం నిస్వార్థ సేవ దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ‌కష్టకాలంలో భారతదేశం ప్రపంచానికి చేయూత‌నిచ్చిన విధానం నేడు శాంతి స్థాప‌న‌లో, ప్రగతి సాధ‌న‌లోనూ భారత్ పాత్రను బలోపేతం చేసింది. ఇదే స‌మ‌యంలో భారతదేశం ప్రదర్శించే ప్రపంచ సౌభ్రాత్ర భావన‌ స్ఫూర్తిని ప్రపంచం ప్ర‌త్య‌క్షంగా చ‌విచూడ‌గ‌లిగింది. అలాగే దేశ సార్వభౌమాధికారం, సరిహద్దుల ప‌రిర‌క్ష‌ణ‌లో భారత్ నిబద్ధతను, దేశానికిగ‌ల‌ శక్తిని ప్రపంచం చూసింది. ఆ మేరకు లదాఖ్‌లో భారత భూభాగాన్ని దురాక్రమించ త‌ల‌పెట్టినవారికి తగురీతిలో జ‌వాబు ల‌భించింది. స్నేహ‌స్ఫూర్తిని ఎలా కాపాడుకోవాలో భారతదేశానికి తెలుసు... ఎలాంటి ప్ర‌తికూల‌త‌నైనా వెనుదిరగ‌‌కుండా ఎదుర్కొన‌డం, దీటైన సమాధానాలివ్వడం కూడా మ‌న‌కు తెలుసు. తల్లి భారతి కీర్తిప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం క‌లిగించ‌జూసే శ‌క్తుల‌తో రాజీప‌డ‌బోమ‌ని మన వీర సైనికులు నిరూపించారు.”

మరిన్ని వివరాలకు

నిరోధం, రక్షణ దిశగా సాగాలి... భయాందోళనలు తగదు: ప్రజలకు ఉప రాష్ట్రపతి ఉద్బోధ

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా జీవితాలు-జీవనోపాధుల పరిరక్షణకు సంయుక్తంగా కృషిచేయాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ ‘ఫేస్‌బుక్‌’ సందేశంద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తదనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలతో, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించాలని ఉప రాష్ట్రపతి కోరారు. ప్రస్తుత అనూహ్య ఆరోగ్య సంక్షోభం పరిష్కారం కోసం సమష్టిగా కృషిచేయాలని సూచించారు. ఈ దిశగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, శాస్త్రవిజ్ఞానంపై నమ్మికతో కూడిన మన శక్తిసామర్థ్యాలు దోహదం చేస్తాయని చెప్పారు. కోవిడ్‌-19 సవాలుకు పరిష్కారం ముందుజాగ్రత్తలు తీసుకోవడంలోనే ఉందని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ మేరకు ఫేస్‌ మాస్కుల వినియోగం, సురక్షిత భౌతికదూరం పాటించడం, నిత్య హస్త పరిశుభ్రత తదితరాలే మనందర్నీ సురక్షితంగా ఉంచే అత్యంత సరళ సాధనాలని పునరుద్ఘాటించారు.

మరిన్ని వివరాలకు

ఢిల్లీలో 10,000 పడకల ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ సంరక్షణ కేంద్రం’ నిర్మాణ ప్రగతిపై నిన్న దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న 10,000 పడకల ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ సంరక్షణ కేంద్రం’ నిర్మాణ ప్రగతిని దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా నిన్న సమీక్షించారు. “ఈ 10,000 పడకల కేంద్రం ఢిల్లీ ప్రజలకు ఎంతో ఊరట కల్పించగలదు” అని ఈ సందర్భంగా శ్రీ అమిత్‌ షా అన్నారు. అలాగే “ప్రస్తుత పరీక్షా సమయంలో ఈ కోవిడ్‌ సంరక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను స్వీకరించడంలో ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) సిబ్బంది చూపుతున్న ధైర్యసాహసాలను నేను అభినందిస్తున్నాను” అని దేశీయాంగ శాఖ మంత్రి చెప్పారు. దేశానికి, ఢిల్లీ ప్రజలకు సేవలందించడంలో వారి నిబద్ధత అసమానమైనదని కొనియాడారు.

మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశ విద్యా వ్యవస్థను స్థిరంగా నిలపడంలో భారత్‌ కృషిని నొక్కిచెప్పిన హెచ్‌ఆర్‌డి మంత్రి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డి) మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ జి20 దేశాల విద్యాశాఖ మంత్రుల వాస్తవిక సాదృశ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థపై కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం, వివిధ దేశాలు ఈ పరిస్థితిని చక్కదిద్దిన విధానం, ప్రస్తుత కష్టకాలంలో విద్యావ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో సంయుక్త సహకారానికిగల అవకాశాలు తదితరాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ దేశంలోని అన్ని రంగాలతోపాటు విద్యా వ్యవస్థను స్థిరంగా నిలపడంలో భారత్‌ కృషి గురించి జి20 సభ్యదేశాలకు కేంద్ర మంత్రి విశదీకరించారు. అలాగే మహమ్మారి సంక్షోభం నడుమ డిజిటల్‌ విద్యాభ్యాసం దిశగా హెచ్ఆర్‌డి మంత్రిత్వశాఖ చేసిన కృషికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాల విద్యాశాఖ మంత్రులతో పంచుకున్నారు. గడచిన కొన్నేళ్లుగా భారత్‌ అద్భుతమైన డిజిటల్‌ విద్యా సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం “దీక్ష, స్వయం, వాస్తవిక సాదృశ ప్రయోగశాలలు, ఈ-పీజీ పాఠశాల, నేషనల్‌ డిజిటల్‌ లైట్రరీ” వంటి వేదికలద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు 

జీఈఎం వేదిక‌పై భారత గిరిజనుల ఉత్పత్తులతోపాటు ట్రైఫెడ్ కొత్త వెబ్‌సైట్‌ను దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా ప్రారంభించిన శ్రీ అర్జున్ ముండా

కోవిడ్ -19 మహమ్మారివ‌ల్ల‌ దేశంలో నెల‌కొన్న అసాధార‌ణ పరిస్థితులు సమాజంలోని అన్నివర్గాలనూ ప్రభావితం చేశాయి. ప్ర‌స్తుత క‌ష్ట‌కాలంలో పేదలు, అట్టడుగు వర్గాల... ముఖ్యంగా గిరిజనుల జీవనోపాధిపై తీవ్ర ప్ర‌తికూల‌త ప్ర‌భావం ప‌డింది. ఇంత‌టి విప‌త్క‌ర సమయంలో గిరిజన హ‌స్త‌క‌ళాకారులపై భారం త‌గ్గించే దిశ‌గా  గిరిజనుల జీవనోపాధి ప్ర‌గ‌తిని కొనసాగించడానికి, వెనుకబడిన ఆర్థిక కార్యకలాపాలను తిరిగి శక్తిమంతం చేసేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక స‌త్వ‌ర కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ట్రైఫెడ్ డిజిట‌ల్ వేదిక‌ల‌ను దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ- గిరిజనుల‌ జీవితాలను, జీవ‌నోపాధి మార్గాల‌ను ఉత్తేజితం చేయ‌డానికి అటవీ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్ప‌త్తుల‌స‌హిత గిరిజనుల వాణిజ్యాన్ని  "ట్రైఫెడ్ యోధుల‌" బృందం స‌రికొత్త శిఖ‌రాల‌కు చేర్చ‌గ‌ల‌ద‌న్నారు. వ్యాపార కార్యకలాపాలు, వ‌స్తువుల కొనుగోలు, స‌మాచార ప్రదానంస‌హా వివిధ అవసరాల కోసం అధిక‌శాతం ప్రజలు ఇటీవ‌ల ఆన్‌లైన్ మార్గం అనుస‌రిస్తున్నార‌ని ఆయ‌న‌ గుర్తుచేశారు. ఈ త‌రుణంలో గ్రామీణాధారిత గిరిజన ఉత్పత్తిదారులను గుర్తించి, ప్రపంచ ప్ర‌మాణాలుగల అత్యాధునిక ఈ-వేదికలద్వారా జాతీయ‌-అంత‌ర్జాతీయ విప‌ణులతో అనుసంధానం చేసేందుకు ప్ర‌భుత్వం డిజిటలీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం ఓ గొప్ప ప‌రిణామమ‌న్నారు.

మరిన్ని వివరాలకు 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ

రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కోవిడ్-19 తీవ్రత అత్యధికంగా ఉన్నందున ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కట్టుబడి నడచుకోవాలని కేరళ పర్యాటకశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సూచించారు. మరోవైపు మళప్పురంలోని ఎడప్పల్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందితోపాటు ఐదుగురు ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. శనివారం వరకు ఈ సిబ్బంది విధుల్లో ఉన్నందున వ్యాధి సామాజిక వ్యాప్తిపై ఆందోళన నేపథ్యంలో 4 పంచాయతీలను నియంత్రణ జోన్లుగా ప్రకటించారు. గురువాయూర్‌లోని కేఎస్‌ఆర్టీసీ డిపోలో ఒక కండక్టరుకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో అధికారులు డిపోను మూసివేశారు. రాష్ట్రం వెలుపల మరో నలుగురు కేరళీయులు వైరస్‌కు బలయ్యారు. వీరిలో గల్ఫ్ ప్రాంతంలో ముగ్గురు, ముంబైలో ఒకరు ఉన్నారు. కాగా, నిన్న కేరళలో ఒకేరోజు అత్యధికంగా 195 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 180 మంది రాష్ట్రానికి తిరిగివచ్చినవారే. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో 1,939మంది చికిత్స పొందుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 1,67,978మంది నిర్బంధ వైద్యకేంద్రాల్లో ఉన్నారు.

  • తమిళనాడు

పుదుచ్చేరిలో రిటైర్డ్‌ పోలీసు ఉద్యోగి కోవిడ్-19కు బలయ్యారు. మరోవైపు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 29 తాజా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 252 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 385గా ఉంది. ఇక తమిళనాడులో కోవిడ్-19 మరణాల సంఖ్య 1,000 దాటింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,335 కాగా, వీరిలో 44,094 మంది కోలుకున్నారు.

  • కర్ణాటక

రాష్ట్రంలో 10,000 పడకలతో నిర్మిస్తున్న కోవిడ్‌ సంరక్షణ సదుపాయాల పనులు సోమవారం సాయంత్రానికి పూర్తికాగలవని వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తెలిపారు. ఇక కోవిడ్-19 చికిత్స కోసం 50శాతం పడకలను కేటాయించాలని ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కేసులు పెరగడంతో జూలై 5నుంచి ఆదివారాల్లో సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న 918 కొత్త కేసులు నమోదవగా, ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో రోగులు నిర్ధారణ కావడం గమనార్హం. ప్రస్తుతం మొత్తం కేసులు: 11923, యాక్టివ్‌ కేసులు: 4441, మరణాలు: 191, డిశ్చార్జి అయినవారు: 7287 మంది.

  • ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని పుత్తూరులోగల ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి నివాసంలో విధులు నిర్వర్తించే ఇద్దరు భద్రత సిబ్బందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని పీజీ వైద్య, దంతవైద్య విద్యార్థులకు ఆగస్టు మొదటి వారంనుంచి థియరీ పరీక్షలు మొదలవుతాయని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 రోగుల సంఖ్య 13,000 దాటింది. గడచిన 24 గంటల్లో 25,778 నమూనాలను పరీక్షించిన తర్వాత 813 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 401 మంది డిశ్చార్జికాగా, 12మరణాలు సంభవించాయి. కొత్త కేసులలో 50 అంతర్రాష్ట్ర వాసులకు సంబంధించినవి కాగా, 8 విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించినవి. ప్రస్తుతం మొత్తం కేసులు: 13,098, యాక్టివ్: 7021, డిశ్చార్జ్: 5908, మరణాలు: 169గా ఉన్నాయి.

  • తెలంగాణ

రాష్ట్రంలోని ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్‌ రోగ నిర్ధారణ పరీక్షల సందర్భంగా వ్యత్యాసాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు పరీక్షల సంబంధిత మార్గదర్శకాలు పాటించని, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలు నమోదైన ప్రయోగశాలలకు నోటీసులు జారీచేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 13,436, యాక్టివ్ కేసులు: 8,265, మరణాలు: 243కాగా, కోలుకున్నవారి సంఖ్య:4928.

  • మహారాష్ట్ర

రాష్ట్రంలో 5,318 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,59,133కు చేరింది. ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 67,600 కాగా,  మరణాలు 7,273గా నమోదయ్యాయి.  మహారాష్ట్రలో ఇప్పటిదాకా 8.97 లక్షల నమూనాలను పరీక్షించారు. కాగా, మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో వ్యాయామశాలలు, క్షౌరశాలలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

  • గుజరాత్

రాష్ట్రంలో 615 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 30,733కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,316 కాగా, 1,790 మరణాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌ నగరంలోని ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆస్పత్రికి పురపాలక సంస్థ రూ.77 లక్షల జరిమానా విధించింది. కోవిడ్‌-19తో తీవ్రంగా బాధపడుతున్న ఒక రోగికి జూన్ 18న వెంటిలేటర్‌తో కూడిన పడక కేటాయింపులో దాదాపు 45 నిమిషాలు ఆలస్యం చేయడంతో సదరు రోగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఆస్పత్రికి పురపాలక సంస్థ భారీ జరిమానా విధించింది.

  • రాజస్థాన్

రాష్ట్రంలో 175 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 17,119కి చేరగా, వీటిలో 3,297 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, రాజస్థాన్‌లో కోలుకునేవారు దేశంలోనే అత్యధికంగా 78 శాతానికి చేరారు. ఇక కొత్త కేసులలో అత్యధికంగా బికనేర్‌లో 44 నమోదవగా జైపూర్ 26), ఝన్‌ఝన్‌ జిల్లా 23 కేసుల వంతున తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • మధ్యప్రదేశ్

రాష్ట్రంలో 203 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 12,965కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,444కాగా, ఇప్పటివరకు 550 మంది మరణించారు.

  • ఛత్తీస్‌గఢ్‌

రాష్ట్రంలో 44 కొత్త కేసులలో మొత్తం కేసుల సంఖ్య 3,006కు పెరిగింది. ఇందులో 696 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • గోవా

గోవాలో ఇవాళ 89 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,128కి చేరగా, వీటిలో 706 యాక్టివ్‌ కేసులున్నాయి.

  • అసోం

దేశీయాంగ శాఖ మంత్రి అమిత్ షా ఇవాళ అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మతో సంభాషించారు. బ్రహ్మపుత్ర నదిలో భారీ ప్రవాహం, గువహటి సమీపాన కొండచరియలు విరిగిపడిన సంఘటనలపై ఈ సందర్భంగా వారితో సమీక్షించారు. అవసరమైన రాష్ట్రానికి సాధ్యమైనంత మేర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • మణిపూర్

రాష్ట్రంలోని తమెంగ్లాంగ్ జిల్లా ఆసుపత్రిలో ట్రూనాట్ పరీక్ష యంత్రం ఏర్పాటు చేయబడింది. మణిపూర్‌ మొత్తంమీద ఈ జిల్లా అత్యధికంగా కోవిడ్‌-19తో ప్రభావితమైంది. రాష్ట్రంలోని వివిధ నిర్బంధవైద్య కేంద్రాల్లో ఉన్నవారి మధ్య వ్యాధి సంక్రమణ నివారణ దిశగా నిర్వహించిన సమీక్ష సమావేశానికి మణిపూర్ సాంఘిక సంక్షేమ-సహకారశాఖ మంత్రి నెమ్చా కిప్జెన్‌ అధ్యక్షత వహించారు.

  • మిజోరం

మిజోరంలోని అసోం రైఫిల్స్ దళం సామాజిక దూరం నిబంధన పాటించే దిశగా గొడుగులను వాడాలనే కొత్త ఆలోచనను అమలులోకి తేవడంతో కోవిడ్‌-19 నియంత్రణలో ఇదొక సమర్థ చర్య కాగలదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడినవారికి, దివ్యాంగులతోపాటు ఎన్‌గోపా, మింబుంగ్, కావ్‌బెం, న్యూ వైఖవ్‌ట్లాంగ్ నహ్లాన్ గ్రామాల్లోని వృద్ధపౌరులకు గొడుగులు పంపిణీ చేసింది.

  • నాగాలాండ్ 

రాష్ట్రంలో 25 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 412కు చేరగా, వీటలో 248 యాక్టివ్‌ కేసులున్నాయి. నాగాలాండ్‌లో ఇప్పటిదాకదా కోలుకున్న వారి సంఖ్య 164కు చేరింది.

 

*****

 

 


(Release ID: 1635060) Visitor Counter : 329