ప్రధాన మంత్రి కార్యాలయం

'మన్ కి బాత్' (13 వ ఎపిసోడ్)

Posted On: 28 JUN 2020 11:39AM by PIB Hyderabad

 

నా ప్రియమైన దేశప్రజలారా! అందరికీ నమస్కారం. 'మన్ కి బాత్' 2020 సంవత్సరంలో ఇప్పుడు సగం ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో చాలా అంశాల గురించి మాట్లాడుకున్నాం . మానవ జాతి ఎదురుకొంటున్న ఈ మహమ్మారి పై చాలా చర్చ జరుగుతోంది. ప్రజలందరూ ఈ ఏడాది ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఫోన్ లో మాట్లాడినా ఈ ఏడాది త్వరగా ఎందుకు గడవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాలలోనూ, స్నేహితులతో సంభాషణల్లోనూ ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు. ఈ సంవత్సరం మంచిది కాదని అనుకుంటున్నారు. 2020 త్వరగా గడవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మిత్రులారా! ఇలా ఎందుకు జరుగుతోందని కొన్ని సార్లు ఆలోచిస్తుంటాను. అలాంటి చర్చలకు కొన్ని కారణాలు ఉండవచ్చు. కరోనా వంటి సంక్షోభం వస్తుందని, ఈ పోరాటం చాలా కాలం పాటు కొనసాగుతుందని 6-7 నెలల క్రితం మనకు తెలియదు. ఈ సంక్షోభం అలాగే ఉంది. ఇంకా దేశంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం దేశ తూర్పు తీరంలో అమ్ఫాన్ తుఫాను, పశ్చిమ తీరంలో నిసార్గ్ తుఫాను వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మిడుతల దాడితో మన రైతు సోదరులు మరియు సోదరీమణులు బాధపడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న భూకంపాలు వచ్చాయి. వీటన్నిటి మధ్యలో కొన్ని పొరుగు దేశాలతో సవాళ్లను కూడా దేశం ఎదుర్కొంటోంది. ఇలాంటి విపత్తుల గురించి చాలా తక్కువ సందర్భాలలో వింటుంటాం, చూస్తుంటాం. ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రజలు ఆ సంఘటనలను ఈ సవాళ్ళతో అనుసంధానం చేసి చూస్తున్నారు.

మిత్రులారా! కష్టాలు వస్తాయి. ఇబ్బందులు వస్తాయి. కానీ, ఈ విపత్తుల కారణంగా 2020 సంవత్సరాన్ని చెడుగా పరిగణించాలా? గత 6 నెలల కారణంగా ఏడాది మొత్తం ఇలాగే ఉంటుందని అంచనా వేయడం సరైనదేనా? కాదు! నా ప్రియమైన దేశస్థులారా! - ఖచ్చితంగా కాదు. సంవత్సరంలో ఒక సవాలు వస్తుంది. లేదా యాభై సవాళ్లు వస్తాయి. కానీ ఆ సంఖ్య ఆధారంగా ఆ ఏడాదిని చెడ్డదని అనకూడదు. భారత చరిత్ర మొత్తం విపత్తులు, సవాళ్ళపై విజయమే. ఇది మరింతగా పెరుగుతోంది. వివిధ ఆక్రమణదారులు గతంలో భారతదేశంపై దాడి చేశారు. సంక్షోభంలో పడవేశారు. దేశ రూపురేఖలు నాశనం అవుతాయని, భారతదేశ సంస్కృతి అంతమవుతుందని భావించారు, కానీ, ఈ సంక్షోభాల కారణంగా భారత దేశం మరింత దృఢంగా మారింది.

మిత్రులారా! దేశంలో అనుకుంటూ ఉంటారు. సృష్టి శాశ్వతమైంది. సృష్టి నిరంతరాయంగా ఉంటుంది – అని.

ఒక పాటలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి.

ఇది నిరంతరం ప్రవహిస్తుంది

గంగా ధార ఏమంటుంది?

యుగాలుగా ప్రవహిస్తోంది

ఈ పుణ్య ప్రవాహం మనది

అదే పాటలో ఆ తర్వాతి పంక్తులు ఇలా ఉంటాయి ..

మీరు దీన్ని ఆపగలరా

నాశనం చేయాలనుకునేవారు అదృశ్యమవుతారు

కంకర రాయో, రాయో

ఏది అడ్డంకిగా వచ్చింది?

భారతదేశంలో కూడా ఒకవైపు భారీ సంక్షోభాలు వచ్చాయి. అదే సమయంలో ఆ అడ్డంకులను ఎదుర్కొంటూ పరిష్కారాలు కూడా ఏర్పడ్డాయి. అన్ని అడ్డంకులు దూరమయ్యాయి. నవీన సాహిత్యం సృష్టించబడింది. కొత్త పరిశోధనలు జరిగాయి. కొత్త సిద్ధాంతాలు సృష్టించబడ్డాయి. అంటే సంక్షోభ సమయంలో కూడా ప్రతి రంగంలోనూ నవీన ఆవిష్కారాలు జరిగాయి. మన సంస్కృతి అభివృద్ధి చెందుతూనే ఉంది. దేశం ముందుకు సాగుతూనే ఉంది. భారతదేశం ఎప్పుడూ సంక్షోభాన్ని విజయానికి మెట్లుగా మార్చింది. ఈ స్ఫూర్తితో ఈ సంక్షోభాల మధ్య మనం ముందుకు సాగాలి. మీరు కూడా ఈ ఆలోచనతో ముందుకు సాగండి. 130 కోట్ల మంది దేశస్థులు ముందుకు సాగుతారు. అప్పుడు ఈ సంవత్సరం దేశానికి కీర్తిని సాధించే ఏడాదని రుజువు అవుతుంది. ఇదే సంవత్సరంలో, దేశం కొత్త లక్ష్యాలను సాధిస్తుంది. కొత్తగా శిఖరాల వైపుకు ఎగురుతుంది. కొత్త ఎత్తులను తాకుతుంది. 130 కోట్ల మంది దేశస్థుల శక్తిపై, మీ పై, ఈ దేశ చారిత్రక పునాదులపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను.

నా ప్రియమైన దేశస్థులారా! సంక్షోభం ఏదైనప్పటికీ భారతదేశ సంస్కారం నిస్వార్థ భావంతో సేవ చేయడాన్ని ప్రేరేపిస్తుంది. కష్టకాలంలో భారతదేశం ప్రపంచానికి సహాయం చేసిన విధానం నేడు శాంతిని నెలకొల్పడంలోనూ ప్రగతి లోనూ భారతదేశం పాత్రను బలోపేతం చేసింది. భారతదేశం ప్రదర్శించే ప్రపంచ సౌభ్రాతృత్వ భావ స్ఫూర్తిని ఈ కాలంలో ప్రపంచం చవిచూసింది. దీంతోపాటు భారతదేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడటానికి భారతదేశం ప్రదర్శించే నిబద్ధతను, దేశానికి ఉన్న శక్తిని ప్రపంచం చూసింది. లడఖ్‌లోని భారత భూమిని ఆక్రమించాలని చూసేవారికి తగిన సమాధానం లభించింది. స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో భారతదేశానికి తెలుసు. కష్ట సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, తగిన సమాధానాలు ఇవ్వడం కూడా తెలుసు. తల్లి భారతి కీర్తి విషయంలో రాజీ పడబోమని మన వీర సైనికులు నిరూపించారు.

మిత్రులారా! లడఖ్‌లో అమరవీరులైన మన వీర సైనికుల శౌర్యానికి దేశం మొత్తం నివాళి అర్పిస్తోంది. దేశం మొత్తం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వారికి తల వంచి ప్రణామం చేస్తోంది. ఈ సహచరుల కుటుంబాల మాదిరిగానే, ప్రతి భారతీయుడు వారిని కోల్పోయిన బాధను అనుభవిస్తున్నాడు. వారి బలిదానంపై వారి కుటుంబాలు కూడా గర్విస్తున్నాయి. ఈ భావన, భారత దేశంపై వారికి ఉన్న అపారమైన అనురాగం, దేశభక్తి దేశానికి బలాలు. కుమారులు అమరులైన తల్లిదండ్రులు తమ ఇతర కుమారులను కూడా సైన్యంలోకి పంపించడం గురించి మాట్లాడుతున్నారని మీరు చూసి ఉంటారు. బీహార్ కు చెందిన అమరవీరుడు కుందన్ కుమార్ తండ్రి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతను మాట్లాడుతూ దేశాన్ని రక్షించడానికి తన మనవలను కూడా సైన్యంలోకి పంపిస్తానన్నారు. అదే ధైర్యం ప్రతి అమరవీరుడి కుటుంబంలోనూ ఉంది. నిజానికి, ఈ బంధువుల త్యాగం గౌరవనీయమైనది. మనం కూడా భారత మాతను రక్షించడానికి ప్రాణాలర్పించడానికైనా సిద్ధమని సంకల్పం చేసుకోవాలి. ఈ దిశలో కృషి చేయాలి. తద్వారా సరిహద్దులను రక్షణ కోసం దేశ బలాన్ని పెంచడానికి, దేశాన్ని మరింత సుస్థిరంగా చేయడానికి, దేశం స్వయం సమృద్ధిగా మారేందుకు మన కృషి సాగాలి. ఇదే మన అమరవీరులకు నిజమైన నివాళి అవుతుంది.

అస్సాంకు చెందిన రజనీ జీ నాకు లేఖ రాశారు. తూర్పు లడఖ్‌లో ఏమి జరిగిందో చూసిన తరువాత అతను స్థానిక వస్తువులనే కొంటానని ప్రాణాన్ని ప్రతిజ్ఞ చేశాడు. అంతే కాదు.. స్థానిక వస్తువులనే కొనాలని ప్రచారం కూడా చేస్తానన్నారు. ఇటువంటి సందేశాలు దేశంలోని ప్రతి మూల నుండి వస్తున్నాయి. చాలా మంది ప్రజలు ఈ దిశగా మారినట్లు నాకు లేఖలు రాస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులోని మదురైకి చెందిన మోహన్ రామమూర్తి రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు రాశారు.

మిత్రులారా! స్వాతంత్ర్యానికి పూర్వం రక్షణ రంగంలో మన దేశం చాలా దేశాల కంటే ముందుంది. మనకు ఇక్కడ చాలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ కాలంలో మనకంటే చాలా వెనుకబడి ఉన్న చాలా దేశాలు ఈ రోజు మనకంటే ముందున్నాయి. స్వాతంత్ర్యం తరువాత మన పాత అనుభవాలను సద్వినియోగం చేసుకుని రక్షణ రంగంలో పురోగమించలేకపోయాం. కానీ, నేడు రక్షణ రంగంలో, సాంకేతిక రంగంలో, భారతదేశం నిరంతరం ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. భారతదేశం స్వయం సమృద్ధి వైపు పయనిస్తోంది.

మిత్రులారా! ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమమూ పూర్తికాదు, విజయవంతం కాదు. అందువల్ల దేశం స్వయం సమృద్ధి చెందేందుకు పౌరులుగా మనందరి సంకల్పం, అంకితభావం, సహకారం చాలా అవసరం. మీరు స్థానిక వస్తువులను కొన్నా, వాటిని కొనాలని ప్రచారం చేసినా దేశాన్ని బలోపేతం చేయడంలో మీరు మీ వంతు పాత్ర పోషిస్తున్నారని అర్థం. ఇది కూడా ఒక విధంగా దేశానికి చేసిన సేవ. మీరు ఏ వృత్తిలో ఉన్నా- ప్రతిచోటా దేశ సేవ చేసేందుకు అవకాశం చాలా ఉంది. దేశ అవసరాన్ని గ్రహించి, ఏ పని చేసినా అది దేశ సేవే అవుతుంది. మీ సేవ కూడా ఒక విధంగా దేశాన్ని బలోపేతం చేస్తుంది. మన దేశం ఎంత బలంగా ఉంటే ప్రపంచంలో శాంతికి అవకాశాలు కూడా అంతే దృఢంగా ఉంటాయి.

విద్యా వివాదాయ ధనం మదాయ, శక్తి: పరేషాం పరిపీడనాత్ |

ఖలస్య సాధో: విపరీతం ఏతత్, జ్ఞానాయ దానాయ చ రక్షనాత్||

అంటే.. స్వభావరీత్యా చెడ్డవాడు వ్యక్తులతో వివాదం కోసం తన విద్యను, దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు ధనాన్ని, ఇతరులను బాధపెట్టేందుకు తన శక్తిని ఉపయోగిస్తాడు. కానీ సజ్జనుడు జ్ఞానం కోసం విద్యను, ఇతరులకు సహాయపడేందుకు ధనాన్ని, రక్షణ కోసం శక్తిని ఉపయోగిస్తాడు.

భారతదేశం ఎల్లప్పుడూ తన శక్తిని ఈ భావనతో ఉపయోగించుకుంటుంది. దేశ ఆత్మగౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడడమే భారతదేశ సంకల్పం. స్వయం సమృద్ది సాధించడమే భారతదేశ లక్ష్యం. భరోసా ఇవ్వడం, స్నేహాన్ని ప్రదర్శించడం భారతదేశ వారసత్వ సంపద. సౌభ్రాతృత్వమే భారతదేశ ఆత్మ. మనం ఈ ఆదర్శాలతో ముందంజ వేద్దాం .

నా ప్రియమైన దేశస్థులారా! కరోనా సంక్షోభ సమయంలో దేశం లాక్డౌన్ నుండి బయటపడింది. ఇప్పుడు మనం అన్‌లాక్ దశలో ఉన్నాం. అన్‌లాక్ చేసే ఈ సమయంలో, రెండు విషయాలపై దృష్టి పెట్టాలి. కరోనాను ఓడించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చాలి. మిత్రులారా, లాక్డౌన్ కంటే అన్‌లాక్ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అప్రమత్తతే మిమ్మల్ని కరోనా నుండి కాపాడుతుంది. మీరు ముసుగు ధరించకపోయినా,రెండు గజాల దూరాన్ని పాటించకపోయినా, లేదా అవసరమైన ఇతర జాగ్రత్తలు తీసుకోకపోయినా.. మీరు మీతో పాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలను మరియు వృద్ధులను. అందుకే, నేను దేశవాసులందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ అభ్యర్థనను మళ్లీ మళ్లీ చేస్తున్నాను .. మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దని, మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలని, ఇతరుల ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.

మిత్రులారా! అన్లాక్ చేస్తున్న ఈ కాలంలో దశాబ్దాలుగా మూతపడి ఉన్న అనేక రంగాలు కూడా తెరుచుకుంటున్నాయి. కొన్నేళ్లుగా మన మైనింగ్ రంగం లాక్‌డౌన్‌లో ఉంది. వాణిజ్య వేలంపాటను ఆమోదించే నిర్ణయం పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. కొద్ది రోజుల క్రితం అంతరిక్ష రంగంలో చారిత్రక సంస్కరణలు జరిగాయి. ఆ సంస్కరణల ద్వారా కొన్నేళ్లుగా లాక్డౌన్లో ఉన్న ఈ రంగానికి స్వాతంత్ర్యం లభించింది. ఇది స్వావలంబన భారతదేశ ప్రచారానికి ప్రేరణ ఇవ్వడమే కాక, దేశం సాంకేతిక పరిజ్ఞానంలో కూడా పురోగమిస్తుంది. వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే, ఈ రంగంలో చాలా అంశాలు దశాబ్దాలుగా లాక్డౌన్లో చిక్కుకున్నాయి. ఈ రంగాన్ని కూడా అన్ లాక్ చేయడం జరిగింది. ఇది రైతులకు తమ పంటను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛను ఇచ్చింది. మరోవైపు వారికి అధిక రుణాలు లభించేందుకు కూడా అవకాశం ఏర్పడింది. ఈ విధంగా వివిధ రంగాలలో సంక్షోభాల మధ్య చారిత్రక నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధికి కొత్త మార్గాలు తెరవడం జరిగింది.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రతి నెలా మనల్ని ఉద్వేగానికి గురిచేసే వార్తా కథనాలను చదువుతున్నాం. చూస్తున్నాం. భారతీయులు ఒకరికొకరు సహాయం చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నారనే విషయంతో పాటు సహాయంచేయడంలో నిమగ్నమై ఉన్న విషయాలను ఈ కథనాలు తెలియజేస్తాయి.

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అలాంటి ఉత్తేజకరమైన కథ నేను మీడియాలో చదివాను. అక్కడ సియాంగ్ జిల్లాలోని మిరేమ్ గ్రామం ఒక ప్రత్యేకమైన పని చేసింది. ఆ పని మొత్తం భారతదేశానికి ఒక ఉదాహరణగా మారింది. ఈ గ్రామానికి చెందిన చాలా మంది బయట నివసిస్తూ ఉద్యోగాలు చేస్తారు. కరోనా మహమ్మారి సమయంలో వారందరూ తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారని గ్రామస్తులకు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామానికి వెలుపల ముందుగానే quarantine కు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. వారందరూ కలిసి గ్రామానికి కొద్ది దూరంలో 14 తాత్కాలిక గుడిసెలను నిర్మించారు. గ్రామస్తులు తిరిగి వచ్చినప్పుడు ఈ గుడిసెల్లో కొన్ని రోజులు quarantine లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. మరుగుదొడ్లు, విద్యుత్తు, నీటితో సహా ఆ గుడిసెల్లో అన్ని రకాల రోజువారీ అవసరాలు ఏర్పాటు చేశారు. మిరేమ్ గ్రామ ప్రజల ఈ సమిష్టి కృషి, అవగాహన అందరి దృష్టిని ఆకర్షించింది.

మిత్రులారా! ఒక లోకోక్తి ఉంది. ..

స్వభావం న జహాతి ఏవ, సాధు: ఆపద్రతోపీ సన్ |

కర్పూర: పావక స్పుష్టక: సౌరభం లభతేతరాం ||

అంటే.. కర్పూరం అగ్నిలో కాలిపోతున్నప్పుడు కూడా దాని సువాసనను వదిలిపెట్టదు. అదేవిధంగా మంచి వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు కూడా తమ లక్షణాలను, స్వభావాన్ని వదులుకోరు. మన దేశ శ్రామిక శక్తి, కార్మికులు దీనికి సజీవ ఉదాహరణలు. ఈ రోజుల్లో మన వలస కార్మికుల కథలు దేశమంతా స్ఫూర్తినిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి గ్రామానికి తిరిగి వచ్చిన కార్మికులు కల్యాణి నది సహజ రూపాన్ని తిరిగి తెచ్చే పనిని ప్రారంభించారు. నది ప్రక్షాళన చెందడాన్ని చూసి చుట్టుపక్కల రైతులు, ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. గ్రామానికి వచ్చిన తరువాత quarantine కేంద్రాలలోనూ ఐసొ లేషన్ కేంద్రాలలోనూ నివసిస్తూ మన కార్మిక సహచరులు చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడానికి వారి నైపుణ్యాలను ఉపయోగించిన విధానం అద్భుతమైంది. కానీ, మిత్రులారా! ఇలాంటి లక్షలాది కథలు దేశంలోని లక్షలాది గ్రామాల్లో ఉన్నాయి. అవి ఇంకా మన వరకు చేరలేదు. మిత్రులారా! మీ గ్రామంలోనూ మీ చుట్టుపక్కల ఊళ్ళలోనూ ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగి ఉంటాయి. ఇలాంటి ఉత్తేజకరమైన సంఘటనలు మీ దృష్టికి వస్తే తప్పకుండా నాకు రాయండి. ఈ సంక్షోభ సమయంలో ఈ సానుకూల సంఘటనలు, ఈ కథలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి.

నా ప్రియమైన దేశవాసులారా! కరోనా వైరస్ ఖచ్చితంగా మన జీవన విధానాన్ని మార్చివేసింది. నేను లండన్ నుండి ప్రచురించిన ఫైనాన్షియల్ టైమ్స్ లో చాలా ఆసక్తికరమైన కథనాన్ని చదువుతున్నాను. కరోనా కాలంలో ఆసియా లోనే కాకుండా అమెరికాలో కూడా అల్లం, పసుపుతో సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగిందని ఆ కథనం పేర్కొంది. మొత్తం ప్రపంచం దృష్టి ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం పై ఉంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ వస్తువులు మన దేశానికి సంబంధించినవి. ప్రపంచ ప్రజలు సులభంగా అర్థం చేసుకునేటట్టు ఈ వస్తువుల ప్రత్యేకత గురించి సులభమైన సరళమైన భాషలో మనం చెప్పాలి. తద్వారా భూగోళాన్ని ఆరోగ్యకరమైన గ్రహం గా రూపు దిద్దడానికి మనవంతు తోడ్పాటు అందించాలి.

నా ప్రియమైన దేశస్థులారా! కరోనా వంటి సంక్షోభం రాకపోతే .. జీవితం అంటే ఏమిటి, జీవితం ఎందుకు, జీవితం ఎలా ఉంది.. అనే విషయాలు బహుశా మన దృష్టిలో ఉండేవి కావు. చాలా మంది ఈ కారణంగా మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మరోవైపు లాక్డౌన్ సమయంలో తాము చిన్న చిన్న ఆనందాలను కూడా ఎలా అనుభవించామో ప్రజలు నాతో పంచుకున్నారు. వారు జీవితాన్ని పునరావిష్కరించుకున్నారు. సాంప్రదాయికంగా ఆడే in-door games ఆడటం, మొత్తం కుటుంబంతో ఆనందించే అనుభవాలను చాలా మంది నాకు పంపారు.

మిత్రులారా! మన దేశానికి సాంప్రదాయ క్రీడల గొప్ప వారసత్వం ఉంది. ఇలా మీరు ఒక ఆట పేరు విని ఉండవచ్చు. ఆ ఆట పేరు పచ్చ సీ. ఈ ఆటను తమిళనాడులో "పల్లాంగులి", కర్ణాటకలో "అలి గులి మణే", ఆంధ్రప్రదేశ్ లో "వామన గుంటలు" గా ఆడతారు. ఇది ఒక రకమైన వ్యూహాత్మక ఆట. ఇందులో ఒక బోర్డు ఉపయోగిస్తారు. ఇందులో చాలా పొడవైన కమ్మీలు ఉంటాయి. దీనిలో ఆటగాళ్ళు గోళి లేదా విత్తనాన్ని పట్టుకోవాలి. ఈ ఆట దక్షిణ భారతదేశం నుండి ఆగ్నేయాసియా వరకు, తరువాత మొత్తం ప్రపంచానికి వ్యాపించిందని చెబుతారు.

మిత్రులారా! ఈ రోజు పిల్లలకు పాములు, నిచ్చెనల ఆట గురించి తెలుసు. కానీ, ఇది మోక్ష పాటం లేదా పరమపదం అని పిలువబడే భారతీయ సాంప్రదాయ ఆట అని మీకు తెలుసా. మరొక సాంప్రదాయ ఆట ఉంది. దానిపేరు గుట్టా. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ ఆట ఆడుతారు. సరళంగా, ఒకే పరిమాణంలో ఉన్న ఐదు చిన్న రాళ్లను తీస్తే చాలు మీరు గుట్టా ఆడటానికి సిద్ధంగా ఉన్నట్టు. ఒక రాయిని పైకి విసిరి , ఆ రాయి గాలిలో ఉన్నప్పుడు, మీరు మిగిలిన రాళ్లను ఎత్తాలి. సాధారణంగా ఇండోర్ ఆటలలో పెద్ద ఉపకరణాలు అవసరం లేదు. ఎవరో ఒకరు సుద్ద లేదా రాయిని తెస్తారు. దానితో భూమిపై కొన్ని గీతాలను గీస్తే చాలు ..  ఆపై ఆట మొదలవుతుంది. పాచికలు అవసరమయ్యే క్రీడలలో, గవ్వలో, చింతపండు గింజలో ఉన్నా ఆడుకోవచ్చు.  

మిత్రులారా! నాకు తెలుసు..  ఈ రోజు నేను దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో  మంది తమ బాల్యానికి తిరిగి వచ్చి ఉండాలి.  ఎంతోమంది వారి చిన్ననాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ రోజులను మీరు ఎందుకు మర్చిపోయారని నేను అడుగుతాను.  మీరు ఆ ఆటలను ఎందుకు మర్చిపోయారు? ఇళ్ళలో ఉండే తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, వృద్ధులకు  నా అభ్యర్థన ఏమిటంటే..  ఈ ఆటను కొత్త తరానికి మీరు బదిలీ చేయకపోతే ఎవరు చేస్తారు! ఆన్‌లైన్ అధ్యయనం విషయానికి వస్తే సమతుల్యత ను కాపాడేందుకు  ఆన్‌లైన్ క్రీడలను వదిలించుకోవడానికి కూడా మనం దీన్ని చేయాలి. ఇక్కడ ఒక కొత్త అవకాశం ఉంది.  మన  స్టార్టప్‌లకు, మన యువ తరానికి కూడా బలమైన అవకాశం ఉంది. సాంప్రదాయ ఇండోర్ గేమ్స్ ను నవీన, ఆకర్షణీయమైన రూపంలో మనం ప్రదర్శన చేద్దాం. వీటితో సంబంధం ఉన్న అనుసంధాన కర్తలు,  సరఫరా దారులు, స్టార్ట్-అప్‌లు బాగా ప్రాచుర్యం పొందుతాయి. మన భారతీయ క్రీడలు కూడా స్థానికమైనవని మనం గుర్తుంచుకోవాలి.  స్థానిక తను  ప్రచారం చేస్తామని మనం  ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాం.  నాకు స్నేహితులైన బాలలకు, ప్రతి ఇంట్లో ఉన్న బాలలకు  నేను ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తున్నాను. పిల్లలూ!  మీరు నా అభ్యర్థనను అంగీకరిస్తారా?

చూడండి..  నేను చెప్పేది చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.  ఒక పని చేయండి - మీకు కొంచెం సమయం ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులను అడిగి మొబైల్ తీసుకోండి.  మీ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు లేదా ఇంట్లో ఎవరైనా వృద్దులు ఉంటే వారిని ఇంటర్వ్యూ చేయండి. మీ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయండి. మీరు టీవీలో చూసినట్లుగానే, మీరు ఇంటర్వ్యూ చేయండి.  మీరు వారిని ఏ ప్రశ్నలు వేస్తారు? నేను మీకు సూచిస్తున్నాను.  మీరు వారిని ఈ ప్రశ్నలు అడగాలి.  చిన్నతనంలో వారి జీవన విధానం ఏమిటి? వారు ఏ క్రీడలు ఆడారు?  వారు నాటకాలు చూడటానికి వెళ్ళేవారా? ఎప్పుడైనా  సినిమాకి వెళ్ళేవారా? కొన్నిసార్లు సెలవుల్లో మామయ్య ఇంటికి వెళ్ళారా?  కొన్నిసార్లు పొలాలకు వెళ్ళేవారా? పండుగలను ఎలా జరుపుకునేవారు? ఇలాంటి ప్రశ్నలు  మీరు వారి ని అడగవచ్చు.  వారికి కూడా 40-50 సంవత్సరాలు, 60 సంవత్సరాల ముందు విషయాలు చెప్పడం, వారి పూర్వ జీవితాన్ని గుర్తుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.  భారతదేశం 40-50 సంవత్సరాల క్రితం ఎలా ఉంది?  మీరు ఎక్కడ నివసించేవారు,  ఆ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి..   ప్రజల జీవన విధానం  ఏమిటి – ఇలా అన్ని విషయాలు చాలా తేలికగా మీరు నేర్చుకుంటారుమీకు ఇది చాలా సరదాగా ఉంటుంది.  మీ  కుటుంబానికి కూడా  చాలా అమూల్యమైన నిధిగా ఆ  వీడియో ఆల్బమ్‌ మారుతుంది.

మిత్రులారా! ఇది నిజం – చారిత్రక సత్యానికి దగ్గరగా ఉండటానికి ఆత్మకథ లేదా జీవిత చరిత్ర చాలా ఉపయోగకరమైన మాధ్యమం. మీరు కూడా మీ పెద్దలతో మాట్లాడితే మీరు వారి కాలపు విషయాలు, వారి బాల్యం, వారి యవ్వనం గురించి అర్థం చేసుకోగలుగుతారు. పెద్దలు తమ బాల్యం గురించి, ఆ కాలం గురించి, తమ  ఇంటి పిల్లలకు చెప్పే అద్భుతమైన అవకాశం ఇది.

మిత్రులారా, దేశంలో అధిక భాగంలోకి  ఇప్పుడు రుతుపవనాలు చేరుకున్నాయి. ఈసారి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా వర్షం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు.  గొప్ప ఆశాభావం  వ్యక్తం చేస్తున్నారు. వర్షం బాగుంటే మన రైతుల పంటలు బాగుంటాయి.  పర్యావరణం కూడా పచ్చగా ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతి కూడా తనలో  తాను చైతన్యం నింపుకుంటుంది.  మానవులు సహజ వనరులను ఎంతగా దోచుకుంటారో, వర్షాల సమయంలో ప్రకృతి పరిహారం ఇస్తుంది, నింపుతుంది. కానీ, మనం కూడా భూమాతకు సహకరిస్తేనే ఈ రీఫిల్లింగ్ జరుగుతుంది.  మన బాధ్యతను నెరవేరుస్తుంది. మనం చేసే  ఒక చిన్న ప్రయత్నం ప్రకృతికి, పర్యావరణానికి చాలా సహాయపడుతుంది. మన దేశవాసులు చాలా మంది ఈ విషయంలో  చాలా కృషి చేస్తున్నారు.

కర్ణాటకలోని మాండవాలిలో 80-85 సంవత్సరాల వయస్సున్న కమేగౌడ అనే ఒక వృద్ధుడున్నాడు. కామెగౌడ జీ ఒక సాధారణ రైతు.  కానీ అతని వ్యక్తిత్వం చాలా అసాధారణమైనది. ఎవరూ ఆశ్చర్యపోయెంత  పని ఆయన చేశారు. 80-85 సంవత్సరాల వయస్సు గల కామెగౌడ జి తన జంతువులను మేపుతాడు.  కానీ అదే సమయంలో అతను తన ప్రాంతంలో కొత్త చెరువులను నిర్మించడానికి పూనుకున్నాడు.  వారు తమ ప్రాంతంలోని నీటి సమస్యను అధిగమించాలనుకుంటున్నారు.  అందువల్ల, నీటి సంరక్షణ పనిలో, వారు చిన్న చిన్న చెరువులను నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. 80-85 ఏళ్ల కామెగౌడ జీ  ఇప్పటివరకు 16 చెరువులను తవ్వినట్లు తెలిస్తే  అతని కృషి కి  మీరు ఆశ్చర్యపోతారు. వారు నిర్మించిన చెరువులు చాలా పెద్దవి కాకపోవచ్చు.  కానీ, వారి ప్రయత్నాలు చాలా పెద్దవి. నేడు, ఈ చెరువుల వల్ల ఆ  ప్రాంతం మొత్తం కొత్త జీవితాన్ని పొందింది.

మిత్రులారా, గుజరాత్‌లోని వడోదరలో కూడా ఇలాంటి ఒక ఉదాహరణ నుండి మనకు ప్రేరణ లభిస్తుంది.  ఇక్కడ జిల్లా పరిపాలన యంత్రాంగం,  స్థానిక ప్రజలు కలిసి ఒక ఆసక్తికరమైన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారం కారణంగా వడోదరలో వెయ్యి పాఠశాలల్లో వర్షపు నీటి నిల్వ  ప్రారంభమైంది. ఈ కారణంగా, ప్రతి సంవత్సరం, సగటున సుమారు 10 కోట్ల లీటర్ల నీరు వృధా కాకుండా రక్షింపబడుతుందని అంచనా.

మిత్రులారా! ఈ వర్షాకాలంలో  ప్రకృతిని కాపాడటానికి,  పర్యావరణాన్ని కాపాడటానికి, మనం కూడా ఇలాంటిదే ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలా చోట్ల గణేష్ చతుర్థి కోసం విగ్రహాల తయారీ సన్నాహాలు జరుగుతుండవచ్చు. ఈసారి మనం పర్యావరణ అనుకూలమైన గణేశ విగ్రహాలను తయారు చేసి, వాటిని పూజించడానికి ప్రయత్నించవచ్చు. నది, చెరువులలో మునిగిపోయిన తరువాత, నీటికి,  నీటిలో నివసించే జంతువులకు అపకారం కలిగించే అటువంటి విగ్రహాల ఆరాధనను మనం నివారించగలమా? మీరు దీన్ని చేస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను.   ఈ విషయాల మధ్య మనం మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి.  వర్షాకాలంలో అనేక వ్యాధులు కూడా సంభవిస్తాయి. కరోనా కాలంలో మనం వాటి నుండి కూడా బయటపడాలి. ఆయుర్వేద మందులు, కషాయాలను, వేడినీరు మొదలైన వాటిని ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండాలి.  

నా ప్రియమైన దేశస్థులారా! దేశాన్ని నడిపించిన మాజీ ప్రధానులలో ఒకరికి భారతదేశం ఈ రోజు జూన్ 28 న నివాళులర్పిస్తోంది. ఈ రోజు మన ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు జన్మ శతాబ్ది సంవత్సర ప్రారంభ దినం. పివి నరసింహారావు గురించి మనం మాట్లాడేటప్పుడు సహజంగానే రాజకీయ నాయకుడిగా ఆయన ఇమేజ్ మన ముందు కనబడుతుంది. కాని ఆయనకు బహు భాషావేత్త. అనేక  భారతీయ, విదేశీ భాషలలో ఆయన మాట్లాడేవారు. ఆయన  ఒక వైపు భారతీయ విలువలకు కట్టుబడ్డారు. మరోవైపు పాశ్చాత్య సాహిత్యం , విజ్ఞానశాస్త్రం గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. ఆయన  భారతదేశంలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరు. ఆయన చాలా ప్రఖ్యాతి పొందారు.  మిత్రులారా, నరసింహారావు జి యువకుడిగా ఉన్నప్పుడే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. హైదరాబాద్ లో నిజాం వందేమాతరం పాడటానికి అనుమతి నిరాకరించినప్పుడు ఆయన  కూడా నిజాం కు వ్యతిరేకంగా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన కు  17 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయస్సు నుండే నరసింహారావు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందున్నారు. ఆయన ఏ ఉద్యమాలన్నీ  వదిలిపెట్టలేదు. అన్నింట్లో చురుకుగా పాల్గొన్నారు.  నరసింహారావు జీ  చరిత్రను కూడా  బాగా అర్థం చేసుకున్నారు.  చాలా సాధారణ  నేపథ్యం నుండి ఆయన ఎదుగుదల, విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత , నేర్చుకునే ధోరణి, వీటన్నిటితో అతని నాయకత్వ సామర్థ్యం - ప్రతిదీ చిరస్మరణీయమైనది. నరసింహారావు జీ శత జయంతి  సంవత్సరంలో మీరందరూ ఆయన జీవితం,  ఆలోచనల గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నేను అభ్యర్థిస్తున్నాను. నేను వారికి మరోసారి నివాళులర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశ వాసులారా! ఈసారి మన్ కీ బాత్‌లో చాలా విషయాలను చర్చించుకున్నాం.  వచ్చేసారి మరికొన్ని కొత్త విషయాలను చర్చించుకుందాం.  మీరు మీ సందేశాలను, మీ వినూత్న ఆలోచనలను నాకు పంపండి. మనమందరం కలిసి ముందుకు వెళ్దాం. రాబోయే రోజులు మరింత సానుకూలంగా ఉంటాయి.  మొదట్లోనే నేను చెప్పాను-  ఈ సంవత్సరంలో- అంటే 2020లోనే-  మనం  మరింత మెరుగ్గా ముందుకెళదాం..  దేశం కూడా ఈ ఏడాది ఉన్నతస్థానాలకు  వెళ్తుంది. ఈ దశాబ్దంలో  భారతదేశానికి కొత్త దిశను 2020 చూపిస్తుందని నా నమ్మకం. ఈ విశ్వాసంతో మీరు కూడా ముందుకు సాగాలి, ఆరోగ్యంగా ఉండండి.  సానుకూలంగా ఉండండి.

ఈ శుభాకాంక్షలతో అనేకానేక ధన్యవాదాలతో మీకు అందరికీ నమస్కారం.

*****

 

 



(Release ID: 1635028) Visitor Counter : 416