మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ నేపథ్యంలో విద్యావ్యవస్థలో స్థితిస్థాపకత పెంపొందించే ప్రయత్నాలను జి-20 సభ్య దేశాలకు వివరించిన - కేంద్ర మానవనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'


ఉత్తమ పద్ధతులను పంచుకోడానికీ, సంక్షోభ సమయాల్లో బోధన మరియు అభ్యాసాలను ప్రోత్సహించడానికి అవసరమైన సహకారాన్ని అందించుకోడానికీ నిబద్ధతను వ్యక్తం చేసిన - జి-20 విద్యా మంత్రులు

Posted On: 27 JUN 2020 8:58PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు జి-20 సభ్య దేశాల  విద్యా మంత్రుల అసాధారణ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొన్నారు.  విద్యా రంగంపై కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రభావాలు, వివిధ దేశాలు ఈ పరిస్థితిలో ఎలా వ్యవహరించాయి మరియు ఈ క్లిష్ట సమయాల్లో విద్య ను పెంపొందించుకోడానికి  సభ్య దేశాలు ఏవిధంగా సహకరించుకోగలవో చర్చించడానికి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 

విద్యా రంగంలో ఈ మహమ్మారి వల్ల కలిగే విస్తృతమైన అంతరాయాలను పరస్పర సహకారంతో పరిష్కరించడానికి జి-20 దేశాల ఈ చారిత్రాత్మక మరియు సందర్భోచిత సమావేశాన్ని నిర్వహించడానికి చొరవ చూపినందుకు కేంద్ర మంత్రి చైర్‌పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

విద్యతో సహా అన్ని రంగాలపై కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం చేపట్టిన ప్రయత్నాల గురించి కేంద్ర మంత్రి సభ్యులందరికీ తెలియజేశారు.  భారత ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ ఇటీవల ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటే స్వయం సమృద్ధి భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని ఆయన అన్నారు.  దేశంలో విద్య, ఆరోగ్య రంగాలను పునరుజ్జీవింపచేయడానికి గణనీయమైన ఆర్థిక కేటాయింపులతో భారత జి.డి.పిలో 10 శాతం విలువతో  అపూర్వమైన ఆర్థిక ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించింది.

 

కోవిడ్-19 సంక్షోభ సమయంలో డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాల గురించిన సమాచారాన్ని శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా వివరించారు.   గత కొన్నేళ్లుగా అద్భుతమైన డిజిటల్ విద్యా విషయాలను అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు.  ఇవి దీక్షా, స్వయం, వర్చువల్ ల్యాబ్ ‌లు, ఈ-పి.జి. పాఠశాల మరియు నేషనల్ డిజిటల్ లైబ్రరీ మొదలైన వేదికలపై అందుబాటులో ఉన్నాయి.

 

డిజిటల్ విద్యపై తగిన అవగాహన లేని విద్యార్థులు చాలా మంది ఉన్న విషయాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.   ఈ సమస్యను పరిష్కరించడానికి, 34 డి.టి.హెచ్. ఛానెళ్ల సమూహమైన స్వయం ప్రభ - టీవీ ఛానెళ్ళు మరియు కమ్యూనిటీ రేడియోతో సహా రేడియోను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.  వీటి సహాయంతో మారు మూల ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా 24 గంటలు అందించడంలో విజయం సాధించామని చెప్పారు. 

 

అన్ని ఈ-వనరులను ఉమ్మడి వేదిక పైకి తీసుకురావడానికి, త్వరలో ప్రధానమంత్రి ఈ-విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, భారత మానవ వనరుల శాఖ మంత్రి వెల్లడించారు.  ఇందులో ఇవి ఉంటాయి:

 

ఒక దేశం ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్ :

 

ఒకే సమగ్ర శోధన ద్వారా సులభమైన నావిగేషన్‌తో ఒక దేశం ఒక డిజిటల్ కార్యక్రమం "వన్ నేషన్ వన్ డిజిటల్ ప్రోగ్రామ్" అనే భావనతో అన్ని విద్యా ఈ-వనరులు ఒకే వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది. 

 

ఒక తరగతి ఒక ఛానెల్ : 

 

నాణ్యమైన విద్యా సామగ్రిని అందించడానికి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి  ఒక్కొక్క ప్రత్యేక టీవీ ఛానెల్ ఉంటుంది.

ప్రధానమంత్రి ఈ-విద్యా కార్యక్రమం దాదాపు 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

 

విశ్వవిద్యాలయాలలో ఆన్‌లైన్ కార్యక్రమాలు :

 

దేశంలోని వంద అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు త్వరలో పూర్తి స్థాయి ఆన్‌ లైన్ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాయి.  సాంప్రదాయ, సార్వత్రిక, దూర విద్య విధానాలలో అనుమతించదగిన ఆన్ ‌లైన్ విద్యా విధానం భాగాన్ని 20 శాతం  నుండి 40 శాతం వరకు పెంచనున్నారు.  

 

స్వయం మూక్స్ కోర్సులు :

స్వయం మూక్స్ కోర్సులు విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలతో కలిపి రూపొందించనున్నారు. మరియు వీటిని ఉన్నత విద్యాసంస్థల పాఠ్యాంశాల్లో భాగంగా చేయమని ప్రోత్సహిస్తున్నారు.

 

ప్రాంతీయ భాషలు : 

ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఇ-లెర్నింగ్ వనరులను రూపొందిస్తున్నారు. 

 డి.ఏ.ఐ.ఎస్.వై. ( డైసీ ) :

విభిన్న సామర్థ్యం ఉన్న వారి కోసం అధ్యయన సామాగ్రిని డిజిటల్ గా అందుబాటులో ఉండే సమాచార వ్యవస్థ ( డైసీ ) ద్వారా మరియు సంకేత భాషలో అభివృద్ధి చేయబడుతోంది.

మనోదర్పణ్ :

మనోదర్పణ్ అనేది - విద్యార్ధులు, ఉపాధ్యాయులు మరియు కుటుంబాల మానసిక ఆరోగ్యం మరియు మానసిక క్షేమం కోసం,  మానసిక సామాజిక మద్దతు కోసం,  విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమం.  ఇందులో భాగంగా, కౌన్సెలింగ్ అందించడానికి జాతీయ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయబడింది.

 

జి -20 బృందంలోని వివిధ దేశాలకు సంబంధించి, వివిధ రకాల దూరవిద్య మరియు ఇ-లెర్నింగ్ పరిష్కారాలతో సహా సౌకర్యవంతమైన అభ్యాస వ్యూహాల అభివృద్ధి మరియు పురోగతిపై దృష్టి సారించి,  కొనసాగించడానికి, ఆయా దేశాలు చేస్తున్న కృషికి సహకరించడానికి, భారతదేశం నిబద్ధతతో ఉందని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పునరుద్ఘాటించారు.

 

జి-20 సభ్య దేశాల విద్యామంత్రుల అసాధారణ ఆన్ లైన్ సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చేసిన ప్రసంగ పాఠం కోసం ఇక్కడ "క్లిక్" చేయండి. 

 

 

*****



(Release ID: 1635051) Visitor Counter : 373