హోం మంత్రిత్వ శాఖ

దిల్లీలో పది వేల పడకల 'సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రం' ఏర్పాటుపై సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


పది వేల పడకల 'సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రం' ఏర్పాటు దిల్లీ ప్రజలకు పెద్ద ఊరట: అమిత్‌ షా

ప్రధాని శ్రీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సాధ్యమైనంత సాయం చేయటానికి నిబద్ధతతో ఉంది: అమిత్‌ షా

కొవిడ్‌ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన ఐటీబీపీ సిబ్బందిని హోంమంత్రి అభినందించారు. దేశానికి, దిల్లీ ప్రజలకు సేవ చేయాలన్న వారి నిబద్ధత అసమానమని మెచ్చుకున్నారు

Posted On: 28 JUN 2020 11:55AM by PIB Hyderabad

దిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌లో పది వేల పడకల 'సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రం' ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. పది వేల పడకల ఏర్పాటు దిల్లీ ప్రజలకు అతి పెద్ద ఊరటగా అమిత్‌ షా అభివర్ణించారు.

 "కష్టకాలంలో కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన, ధైర్యవంతులైన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) సిబ్బందిని అభినందిస్తున్నా. దేశానికి, దిల్లీ ప్రజలకు సేవ చేయాలన్న వారి నిబద్ధత అసమానం" అని అమిత్‌ షా మెచ్చుకున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సాధ్యమైనంత సాయం చేయటానికి నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 

ఇంత పెద్ద కొవిడ్‌ కేంద్రం ఏర్పాటుకు సాయం చేసిన రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌, సహకరించిన ప్రతి ఒక్కరికి హోంమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, దిల్లీ ప్రభుత్వ సీనియర్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

 

 

*******

 


(Release ID: 1634995)