PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 22 JUN 2020 6:33PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • జనసాంద్రత అధికమే అయినా, ప్రతి లక్ష జనాభాపరంగా కేసులు అత్యంత స్వల్పంగాగల దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక
 • కోవిడ్‌-19 నుంచి గత 24 గంటల్లో 9,440 మంది కోలుకోగా- వ్యాధి నయమైనవారి సంఖ్య 2,37,195కు చేరిన నేపథ్యంలో కోలుకున్నవారి శాతం 55.17కు పెరిగింది.
 • దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,74,387 కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
 • ఢిల్లీలో కోవిడ్‌-19 నియంత్రణ వ్యూహంపై డాక్టర్‌ వి.కె.పాల్‌ నివేదిక సమర్పించిన నేపథ్యంలో దేశీయాంగ శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం

 

పత్రికా సమాచార సంస్థ

సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాపరంగా కేసులు అత్యంత స్వల్పంగాగల దేశాల్లో భారత్‌ ఒకటి కాగా, కోలుకున్న-ప్రస్తుత కేసుల మధ్య విస్తృతమవుతున్న అంతరం

భారత్‌లో జనసాంద్రత అధికమే అయినా, ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాపరంగా కేసులు అత్యంత స్వల్పంగాగల దేశాల్లో ఒకటని 2020 జూన్‌ 21నాటి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాయీ నివేదిక-153’ స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో ప్రతి లక్ష జనాభాకు కేసుల సంఖ్య సగటున 30.04 కాగా, అంతర్జాతీయ సగటు మూడు రెట్లకన్నా అధికంగా 114.67గా ఉంది.

తదనుగుణంగా అమెరికాలో ప్రతి లక్షమందికి 671.24 కేసులు నమోదు కాగా- జర్మనీ, స్పెయిన్‌, బ్రెజిల్‌ దేశాల్లో వరుసగా 583.88; 526.22; 489.42గా ఉన్నాయి. ఆ మేరకు కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంయుక్తంగా అనుసరిస్తున్న క్రమబద్ధ, దార్శనిక, సమర్థ విధానాలకు ఈ అత్యల్ప కేసుల సంఖ్య అద్దం పడుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JVC1.jpg

ఈ క్రమంలో గడచిన 24 గంటల్లో 9,440 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,37,195కి చేరడంతో కోలుకునేవారి శాతం 55.77కు చేరింది. ప్రస్తుతం 1,74,387 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న- చికిత్స పొందుతున్న వారి సంఖ్యల మధ్య అంతరం విస్తృతం కావడాన్ని రేఖాచిత్రంలో చూడవచ్చు. ఈ మేరకు కోలుకున్న కేసుల సంఖ్య నేడు ప్రస్తుత రోగుల సంఖ్యను  అధిగమించి 62,808కి చేరింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633337

ఢిల్లీలో కోవిడ్‌-19 నియంత్రణ వ్యూహంపై డాక్టర్‌ వి.కె.పాల్‌ నివేదిక సమర్పించిన నేపథ్యంలో దేశీయాంగ శాఖ మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

ఢిల్లీలో కోవిడ్‌-19 నియంత్రణ వ్యూహంపై నివేదిక సమర్పణ నిమిత్తం దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ఆదేశాల మేరకు 14.06.2020న డాక్టర్‌ వినోద్‌ పాల్‌ చైర్మన్‌గా ఓ కమిటీ ఏర్పాటైంది. అనంతరం నిన్న దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా అధ్యక్షత వహించిన సమావేశంలో కమిటీ తన నివేదికను అందజేసింది. ఈ నివేదిక సూచించిన ప్రకారం నియంత్రణ వ్యూహంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి: ప్రస్తుత నియంత్రణ జోన్ల హద్దుల సవరణతోపాటు వాటి పరిధిలో కార్యకలాపాలపై కఠిన పర్యవేక్షణ, అదుపు; ఆరోగ్య సేతు, ఇతిహాస్‌ యాప్‌ల తోడ్పాటుతో నిర్ధారిత రోగులందరికీగల సంపర్క జాడ అన్వేషణ-నిర్బంధ వైద్య కేంద్రాలకు తరలింపు,  నియంత్రణ జోన్ల వెలుపల ఉన్నప్పటికీ ప్రతి కుటుంబం వివరాల నమోదు-పర్యవేక్షణ... తద్వారా ఢిల్లీకి సంబంధించి సమగ్ర సమాచార సమీకరణకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు కోవిడ్‌-19 నిర్ధారిత రోగులను ఆస్పత్రులు, కోవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో లేదా ఏకాంత గృహవాసంలో ఉంచే వీలుంటుంది. కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలు సముచితంగా పనిచేయడంతోపాటు ఇందుకోసం స్వచ్ఛంద/ప్రభుత్వేతర సేవా సంస్థల సహాయం తీసుకునేలా చూడాలని కూడా నివేదిక సూచించింది. కాగా, ఢిల్లీలో 27.06.2020 నుంచి 10.07.2020 దాకా ‘రక్తరసి’ (సీరోలాజికల్‌) సర్వే నిర్వహించి 20,000 మంది నమూనాలను పరీక్షించనున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633369

దేశంలోనే అతిపెద్ద మొట్టమొదటి వాస్తవిక దృశ్యమాధ్యమ ఆరోగ్య రక్షణ-పరిశుభ్రత ఎక్స్‌ పో-2020ని ప్రారంభించిన శ్రీ మాండవీయ

ఇది దేశంలోనే అతిపెద్ద, మొట్టమొదటి వాస్తవిక దృశ్యమాధ్యమ ప్రదర్శనకు సరికొత్త నాంది. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- స్వావలంబిత భారత కోసం ఒక పర్యావరణ వ్యవస్థ నిర్మాణం సాగుతున్నదని చెప్పారు. ఇది ఔషధ రంగంతోపాటు ఆరోగ్య రక్షణ-పరిశుభ్రత రంగాల్లో దేశీయ ఉత్పాదన పెంపునకు ఊతమిస్తుందన్నారు. కోవిడ్‌-19 మహమ్మారిపై తిరుగులేని మన పోరాటంలో ఆరోగ్యం, పరిశుభ్రత-పారిశుధ్యం, వైద్యపరమైన జౌళి-పరికరాలు, ఆయుష్‌, శ్రేయో రంగానికీ మరింత ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ దిశగా గౌరవనీయులైన ప్రధానమంత్రి 2014 నుంచి చేపట్టిన అనేక వినూత్న చర్యలను ఆయన గుర్తుచేశారు. “ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించే ‘ఆయుష్మాన్‌ భారత్‌’, ‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌’, ‘సువిధ శానిటరీ’ నాప్‌కిన్‌ వగైరాలు అందులో భాగంగా ఉన్నాయని వివరించారు. అలాగే దేశంలో ప్రతి ఒక్కరికీ సరస ధరలో మందులు అందించే జనౌషధి దుకాణాలను కూడా మంత్రి ప్రస్తావించారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతతో ఈ వినూత్న చర్యలన్నీ సుసాధ్యం కావడాన్ని మాండవీయ ఈ సందర్భంగా  వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633451

ఆహార తయారీ రంగంలో అందివస్తున్న కొత్త అవకాశాలు: హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌

భారత ప్రభుత్వ అధీనంలోని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక-సౌలభ్య కల్పన సంస్థ ‘ఇన్వెస్ట్‌ ఇండియా’ ఏర్పాటు చేసిన ‘విశిష్ట పెట్టుబడుల వేదిక’ కార్యక్రమంలో ఆహార తయారీ విభాగాన్ని కేంద్ర ఎఫ్‌పీఐ మంత్రి శ్రీమతి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ప్రారంభించారు. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ ఈ రంగం ప్రత్యేక తరహా సవాళ్లను ఎదుర్కొన్నదని, అయినప్పటికీ దిగ్బంధం విజయవంతంగా అమలు కావడంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్నదని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న కొన్ని సవాళ్లలో అంతర్జాతీయ వాణిజ్యంతోపాటు దేశీయ గిరాకీ మందగమనానికి సంబంధించినవే ముఖ్యమైనవని పేర్కొన్నారు. అయితే, ఈ సవాళ్లే ఇటువంటి విశిష్ట వేదికలద్వారా కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తున్నాయని శ్రీమతి బాదల్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 180 మంది పెట్టుబడిదారులను, 6 రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఏకకాలంలో ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633409

గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 1.39 కోట్ల మంది చందాదారులను చేర్చుకున్న ఈపీఎఫ్‌వో

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిరంతరం తన చందాదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. ఈపీఎఫ్‌వో 2017 సెప్టెంబరులో వేతనదారుల జాబితా సంకలనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన తాత్కాలిక జాబితా గణాంకాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం 2018-19 నాటి 61.12 లక్షల చందాదారుల సంఖ్య నికరంగా జతకలిసిన సంఖ్యతో కలిపి 2019-20లో 78.58 లక్షలకు పెరిగి, 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక 2019-20లో వయసులవారీ విశ్లేషణ ప్రకారం 26-28; 29-35 మధ్య వయస్కులతోపాటు 35 దాటినవారి సభ్యత్వ నమోదు కూడా మునుపటి ఏడాదితో పోలిస్తే 50 శాతానికిపైగా పెరిగింది. ఆన్‌లైన్‌ పద్ధతిన సేవా ప్రదానంలో నాణ్యత మెరుగుపడటమే దేశంలోని కార్మికశక్తిని ఈపీఎఫ్‌వో సేవలవైపు ఆకర్షించింది. అంతేకాకుండా సంచిత భవిష్య నిధిని ‘అక్కరకు అందని సొమ్ము’గా పరిగణించే భావన కనుమరుగైంది. ఇక ప్రస్తుత కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ ముందస్తు ఉపసంహరణ అభ్యర్థనలను కేవలం మూడు రోజుల్లో పరిష్కరించిన నేపథ్యంలో సంచిత భవిష్య నిధిని నేడు సకాలంలో అవసరాలను తీర్చే ద్రవ్య లభ్యతగల ఆస్తిగా ఉద్యోగులు పరిగణిస్తున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633402

‘ప్రగతికాముక’ జిల్లాల్లో ఆరోగ్యరక్షణ సదుపాయాలపై డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ సమీక్ష

కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ నిన్న ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టితో ‘ప్రగతికాముక’ జిల్లాల్లో కోవిడ్‌ పరిస్థితితోపాటు ఆరోగ్య రక్షణ సదుపాయాలపై సమీక్షించారు. కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 8 ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ సదుపాయాల పెంపు... ప్రత్యేకించి అంటువ్యాధుల నిరోధంకోసం మౌలిక వసతుల అభివృద్ధికి రూ.190 కోట్లు మంజూరు చేయాలని ఈశాన్య భారత అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఈశాన్య భారత రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతోపాటు 14 ప్రగతికాముక జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్న వాస్తవిక దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతికాముక జిల్లాల వ్యూహానికి ప్రాతిపదికగాగల ముఖ్యమైన సూచీలలో ఆరోగ్య సంరక్షణ స్థాయి ప్రాధాన్యం గలిగినదని ఈ సందర్భంగా డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. ఈశాన్యభారత ప్రత్యేక మౌలిక వసతుల అభివృద్ధి పథకంకింద రూ.500 కోట్ల విలువైన ప్రజారోగ్య సంబంధిత పథకాలకు ప్రతిపాదనలు పంపే వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633244

ఆపరేషన్‌ సముద్ర సేతు – మాల్దీవ్స్‌  నుంచి భారతీయులతో తిరిగి రానున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక

విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వ‌దేశం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ‘వందే భారత్’ కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త నావికాద‌ళం ‘ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు’ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మాల్దీవ్స్‌లోని భార‌త పౌరులను తీసుకురావ‌డం కోసం ఐఎన్ఎస్‌ 'ఐరావత్‌’ నౌక నిన్న మాలే రేవుకు చేరుకుంది. అనంతరం ఇవాళ 198 మంది భారతీయులను ఎక్కించుకుని తమిళనాడులోని ట్యుటికోరిన్‌ రేవుకు పయనమైంది. కాగా, ఆపరేషన్‌ సముద్ర సేతు కింద భారత నావికాదళ నౌక మాలే రేవుకు వెళ్లడం ఇది ఐదోసారి. ఇప్పటిదాకా ఒక్క మాల్దీవ్స్‌ నుంచే 2,386 మంది భారతీయులను భారత నావికాదళం స్వదేశం చేర్చింది. తాజాగా తీసుకురానున్నవారిలో 195 మంది తమిళనాడు వాసులు కాగా, మిగిలిన ముగ్గురూ పుదుచ్చేరికి చెందినవారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633284

 

 

 

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్‌ రోగులను చేర్చుకోవడం, చికిత్స చేయడం కోసం వసూలు చేయాల్సిన ఫీజుల గరిష్ఠ పరిమితిని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కట్టుబడని ఆస్పత్రులను మూసివేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రైవేటు ఆస్పత్రులు అడ్డూఅదుపూ లేకుండా విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఇటువంటి చర్యలు 'ప్రజా వ్యతిరేకం-దేశ వ్యతిరేకం' అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలు మితిమీరిన లాభార్జనాపేక్షతో ప్రజల జీవితాలను పణంగా పెట్టడం సిగ్గుచేటని, అందుకు అనుమతించబోమని హెచ్చరించారు.
 • హర్యానా: రాష్ట్రంలో 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీస్థాయిలో నిర్వహిస్తున్నదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నిన్న 6వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలోనేగాక జిల్లా స్థాయిలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమష్టిగా యోగాభ్యాసం చేసేవారని పేర్కొన్నారు. ఆ విధంగా ఇతరులు కూడా తమ జీవితంలో యోగాను భాగం చేసుకునేలా స్ఫూర్తినిచ్చారని వివరించారు. అయితే, ఈ సంవత్సరం కోవిడ్‌-19 కారణంగా సామూహిక కార్యక్రమాల నిర్వహణ వీలుకానందున ఇళ్లలోనే యోగా సాధన చేయాలని ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ మహమ్మారిని ఓడించగల ఏకైక ప్రభావవంతమైన మార్గం ఇదేనని చెప్పారు. యోగా మానసిక ప్రశాంతత కలిగించడంతోపాటు జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని, రోగనిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతుందని తెలిపారు. అందువల్ల యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రజలకు ఉద్బోధించారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 3,870 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,32,075కు చేరింది. మరోవైపు 1,591 మంది రోగులు కోలుకోవడంతో వ్యాధి నయమైనవారి సంఖ్య 65,744కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 60,147గా ఉంది. ఈ నేపథ్యంలో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌-బీఎంసీ తాజాగా “మిషన్‌ జీరో ర్యాపిడ్‌ యాక్షన్‌ ప్లాన్‌”ను అంధేరిలోని షాజీ రాజే భోసలే క్రీడా ప్రాంగణంలో ప్రారంభించింది. ఇందులో భాగంగా 50 సంచార వాహనాలు ములుంద్‌, భాండుప్‌, అంధేరి. మలాడ్‌, బొరివాలి, దహిసర్‌, కందివిలి ప్రాంతాల్లో 2-3వారాల పాటు రోగులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తాయి.
 •  గుజరాత్‌: రాష్ట్రంలో ఆదివారం 580 కొత్త కేసుల నిర్ధారణతోపాటు 25 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,317కు; మరణాలు 1,664కు పెరిగింది. ఇక 655 మందికి వ్యాధి నయం కావడంతో కోలుకున్నవారి సంఖ్య 19,357గా ఉంది.
 • రాజస్థాన్‌: రాష్ట్రంలో ఇవాళ 67 కేసుల నమోదుతో మొత్తం కేసులు 14,997కు చేరాయి. మరోవైపు ఇప్పటిదాకా 11,661 మంది కోలుకోగా 349 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో కేవలం 2,987 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు.
 • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో 179 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 11,903కు చేరింది. మధ్యప్రదేశ్‌లో ఆదివారందాకా 9,015 మంది కోలుకోగా, 515 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,373కాగా, ఇండోర్‌ నగరంలో మొత్తం కేసులు 4,329; రాజధాని భోపాల్‌లో 2,504 వంతున ఉన్నాయి.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఆదివారం 139 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 2,273కు చేరాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 841గా ఉంది.
 • గోవా: గోవాలో ఇవాళ తొలి కోవిడ్‌ మరణం నమోదైంది. ఈ మేరకు ఉత్తర గోవాలో 85 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 64 తాజా కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 818కి చేరింది.
 • కేరళ: రాష్ట్రంలో కోవిడ్‌-19 ఇంకా సామాజిక వ్యాప్తి స్థాయికి చేరలేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ చెప్పారు. ఇక విదేశాలనుంచి కేరళకు వచ్చే విమానాల్లో ఆరోగ్యంగా ఉన్న ప్రయాణికులకు హాని కలగకుండా చూసేందుకే వ్యాధి లక్షణాలున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పంచాయతీల స్థాయిలో వ్యవస్థాగత నిర్బంధవైద్య కేంద్రాలను ప్రారంభిస్తామని సహకారశాఖ మంత్రి కె.సురేంద్రన్‌ చెప్పారు. ప్రైవేటు (చార్టర్డ్‌) విమానంలో అక్రమంగా బంగారం తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను కరిపూర్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఓమన్‌లో మరో కేరళీయుడు కోవిడ్‌కు బలయ్యారు. ఇక రాష్ట్రంలో వ్యాధిగ్రస్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలో నిన్న 133 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,490గా ఉంది.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తక్కువ సంఖ్యలో నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో కోవిడ్‌-19 నిర్ధారిత వ్యక్తుల సంఖ్య 17కు తగ్గినప్పటికీ మొత్తం కేసుల సంఖ్య 383కు పెరిగింది. తమిళనాడులో ఆదివారం రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఎన్నడూలేని రీతిలో 2,532గా నమోదైంది. వీటిలో ఒక్క చెన్నైలోనే 1,493 కేసులున్నాయి. మరోవైపు 1,438 మంది కోలుకోగా- 53 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 59,377కుగాను 25,863 యాక్టివ్‌ కేసులుండగా వీటిలో చెన్నైకి చెందినవి 1,783 ఉన్నాయి. ఇప్పటివరకూ 757 మంది మరణించగా, 32,574మంది కోలుకున్నారు. నేటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య: 8,61,211.
 • కర్ణాటక: రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే ప్రాంత సముదాయాల్లో దిగ్బంధాన్ని కఠినంగా అమలు చేయాలని ఇవాళ ముఖ్యమంత్రి నిర్వహించిన అత్యవసర సమావేశం నిర్ణయించింది. ముఖ్యంగా కె.ఆర్.మార్కెట్ దాని పరిసరాల్లోని సిద్దాపుర, వి.వి.పురం, కలసిపాళ్య తదితర ప్రాంతాల్లో నిర్బంధ వైద్య పర్యవేక్షణను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసు నమోదు చేయాలని తీర్మానించింది. అలాగే అన్ని వార్డులలో జ్వర చికిత్స కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. పోలీసు అధికారులలో కరోనా కేసులు పెరగడంతోపాటు బెంగళూరులో ముగ్గురు ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన సిబ్బందిని విధుల నుంచి మినహాయించాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో నిన్న 453 కొత్త కేసులు నమోదవగా, 225మంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. మరో ఐదు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 9150కాగా, వీటిలో యాక్టివ్‌ కేసులు: 3391, మరణాలు: 137, డిశ్చార్జి అయినవి: 5618గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నిన్న 439 కొత్త కేసులు, 5 మరణాల నమోదుతోపాటు 151 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 7,059, యాక్టివ్: 3599, కోలుకున్నవి: 3,354, మరణాలు: 106గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 7,802 కొత్త కేసులు నమోదు కాగా, వీటిలో అధికశాతం... హైదరాబాద్‌కు సంబంధించినవే కావడం గమనార్హం; ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3861 కాగా, కోలుకున్నవారు 3731 మంది. ఈ ఏడాది మార్చి 22న దిగ్బంధం ప్రకటించడానికి ముందు 22 కేసులు నమోదయ్యాయి. అయితే, మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య తొలిదశ దేశవ్యాప్త దిగ్బంధ సమయంలో 622; ఆ తర్వాత దిగ్బంధం రెండోదశలో మార్చి 24 నుంచి మే 3వ తేదీదాకా 438 కేసులు నమోదయ్యాయి. అటుపైన మే 4-17 మధ్య మూడోదశ దిగ్బంధ సమయంలో 439; నాలుగోదశ దిగ్బంధ సమయం మే 18-31 మధ్య కూడా ఇదే ధోరణి కొనసాగి 1,147 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత దిగ్బంధ విముక్తి తొలిదశలో తెలంగాణవ్యాప్తంగా 5,104 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి జిల్లాలో రోజుకు 50 యాదృచ్ఛిక పరీక్షల నిర్వహణకు ఆదేశించింది.
 • మేఘాలయ: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రెండు నెలలకుపైగా మూతపడిన లెదూ మార్కెట్‌ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతోపాటు రెస్టారెంట్లు, కేఫ్‌లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా తెరిచారు.
 • మణిపూర్: రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 101 కోవిడ్‌-19 కేసులు నిర్ధారణ కావడంతో మణిపూర్‌లో అత్యంత ప్రభావిత జిల్లాగా రికార్డులకెక్కింది. ఇక కాంగ్‌పోక్పి 95, చురాచంద్‌పూర్ 94 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దిగ్బంధం తొలిదశ మొదలైనప్పటినుంచి మణిపూర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో 2.76 లక్షల మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు.
 • మిజోరం: రాష్ట్రంలో భూకంపం నేపథ్యంలో మిజోరం ప్రజలకు పూర్తి సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశీయాంగ శాఖ మంత్రి అమిత్ షా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ ముఖ్యమంత్రి జోరం తంగాతో ఫోన్‌ద్వారా సంభాషించారు. 
 • నాగాలాండ్: రాష్ట్ర రాజధాని కోహిమాలో వాహనాల అనవసర రాకపోకల నివారణ దిశగా  సరి-బేసి వాహన నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, నిర్దిష్ట నిత్య-అత్యవసర కార్యకాలాపల కోసం ప్రయాణించే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

*******(Release ID: 1633466) Visitor Counter : 19