ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆకాంక్షిత జిల్లాలలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఈశాన్య రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను పెంచేందుకు 190 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎండిఒఎన్ఇఆర్)
Posted On:
21 JUN 2020 6:56PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) సహాయ మంత్రి (స్వతంత్ర),ప్రధానమంత్రి కార్యాలయ , సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్షశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆకాంక్షిత జిల్లాలలో ప్రత్యేకించి ఈశాన్యరాష్ట్రాలలో ఆరోగ్య సదుపాయాలు, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. . కోవిడ్ మహమ్మారి కారణంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ (డిఒఎన్ఇఆర్) 8 ఈశాన్య రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను వృద్ధి చేసేందుకు,ప్రత్యేకించి అంటు వ్యాధుల నియంత్రణకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 190 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 14 ఆకాంక్షిత జిల్లాల ఆరోగ్య కార్యదర్శులు, డిప్యూటి కమిషనర్లు, ఆరోగ్య అధికారులు హాజరైన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆకాంక్షిత జిల్లాల భావన 49 కీలక సూచికల ఆధారంగా రూపుదిద్దుకున్నదని, ఇందులొ ఆరొగ్య సంరక్షణ స్థాయి కీలకమైనదని ఆయన చెప్పారు. శాస్త్రీయంగా రూపొందించిన విధానం ద్వారా ప్రతి ఆకాంక్షిత జిల్లాలో ఈ కీలక సూచికలు మెరుగు పరిచేందుకు దృష్టిపెట్టాలని, ఆ రకంగా వీటి రేటింగ్‌ను పెంచుకుని , రాష్ట్రంలో మంచి పనితీరు కనబరచిన జిల్లాలు, దేశంలోనే మంచి పనితీరు కనబరిచిన జిల్లాలుగా ఎదగాలని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి నుంచి ఒక కీలక అంశం అనుభవంలోకి వచ్చిందని అంటూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భవిష్యత్‌లో అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి ముందస్తు సన్నద్ధత అవసరమని, అది ఆరోగ్య సంరక్షణకు కీలకమని అన్నారు.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ , ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలకు పంపేందుకు ఈశాన్య రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. కేంద్రప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ కింద గల ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (NEISDS) నుంచి 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇందుకు సమకూర్చనున్నారు. దీనికి అనుగుణంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయని ఎనిమిదవ రాష్ట్రమైన త్రిపుర నుంచి ఇంకా ప్రతిపాదనలు అందాల్సి ఉందని చెప్పారు.
లాక్‌డౌన్ కు ఎంతోకాలం ముందే, అంటే కరోనా మహమ్మారి వ్యాప్తికి సంబంధించి అత్యంత ప్రాధమిక దశలోనే ఈశాన్య రాష్ట్రాల మంత్రిత్వశాఖ (డిఒఎన్ఇఆర్), గ్యాప్ ఫండింగ్ కోసం తక్షణ సహాయం కింద 25 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (NEISDS) నిధి నుంచి 500 కోట్ల రూపాయలను వాడుకునే ఆప్షన్‌ను ఈ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
అస్సాంలోని గోల్‌పారా,దుబ్రి ఆకాంక్షిత జిల్లాలు ఆయుష్మాన్ భారత్ కవరేజ్‌లో వరుసగా నూరుశాతం, 85 శాతం సాధించినందుకు ఈ రెండు జిల్లాలను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. దీనికితోడు,గోల్‌పారా జిల్లా ఆరునెలల కాలంలో దాని రేటింగ్‌ను ఆలిండియా జాబితాలోని 150 ఆకాంక్షిత జిల్లాలలో 68వ స్థానం నుంచి 16 వ స్థానానికి పనితీరు మెరుగు పరుచుకుంది. అనుసంధానతకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నప్పటికీ, ఈశాన్య రాష్ట్రాలు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలొ మంచి పనితీరు కనబరచాయని జితేంద్ర సింగ్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితా కు సంబంధించి కొన్ని లోపాలు ,గోల్డన్ కార్డ్‌కు సంబంధించి న అంశాలు తన దృష్టికి వచ్చాయని చెబుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, దీనిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోనున్నట్టు చెప్పారు.
డిఒఎన్ఇఆర్ కార్యదర్శి, మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 8 రాష్ట్రాల సీనియర్ అధికారులు గత రెండునెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ నిర్వహణలో తమ అనుభవాల ఆధారంగా సమాచారాన్ని ఈ సమావేశంలో తెలియజేశారు.
(Release ID: 1633244)
Visitor Counter : 211