మంత్రిమండలి

కోల్ కతా పోర్టు ట్రస్టు ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు గా పేరు మారుస్తూ కాబినెట్ నిర్ణయం

Posted On: 03 JUN 2020 5:13PM by PIB Hyderabad
కోల్ కతా పోర్టును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు గా పేరు మారుస్తూ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకుంది.

2020 ఫిబ్రవరి 25న జరిగిన కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీల సమావేశం ఒక తీర్మానం ఆమోదిస్తూ కోల్ కతా పోర్టు పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ  పోర్టుగా మార్చటానికి నిర్ణయించింది. న్యాయవాదిగా, విద్యావేత్తగా, ఆలోచనాపరునిగా, ప్రజానాయకునిగా అయన బహుముఖ ప్రజ్ఞను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ తీర్మానంలొ పేర్కొంది.

2020 జనవరి12న కోల్ కతా పోర్టు నూట యాభయ్యవ వార్షికోత్సవాల  ప్రారంభం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని కోల్ కతా పోర్టుకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ప్రముఖునిగా, జాతీయ సమగ్రతా పరిరక్షణలో ముందు వరుసలో ఉన్నవాడిగా, బెంగాల్ అభివృద్ధిని కలలుగన్నవాడిగా, పారిశ్రామికీకరణకు స్ఫూర్తిగా నిలవటమే కాకుండా ఒక దేశానికి ఒకే చట్టం కావాలని కోరుకున్న వ్యక్తిగా ఆయన అందరికీ చిరస్మరణీయుడు.

నేపథ్యం:

కొల్ కతా పోర్ట్ భారతదేశంలో  తొలి భారీ పోర్టు మాత్రమే కాకుండా నదిలో ఉన్న పోర్టు. పోర్టు మెరుగుదల కోసం కమిషనర్ల ఏర్పాటుతో 1870 అక్టోబర్17న ఏర్పాటైన ట్రస్టు పాలనలో దీని నిర్వహణ మొదలైంది. భారతీయ భారీ నౌకాశ్రయాల ట్రస్టుల చట్టం1908 లో మొదటి షెడ్యూల్ లో సీరియల్ నెంబర్ 1 కింద దీన్ని ప్రస్తావించారు. దీని నిర్వహణ 1963 నాటి మేజర్ పోర్ట్ ట్రస్ట్స్ యాక్ట్ కింద సాగుతోంది. కోల్ కతా పోర్ట్ ది  150 ఏళ్ళ చరిత్ర. ఇది భారత వర్తక, వాణిజ్య, ఆర్థికాభివృద్ధికి ముఖద్వారంగా, భారత స్వాతంత్ర్య సమరానికి, రెండు ప్రపంచ యుద్ధాలకు, తూర్పు భారతదేశంలో జరిగిన సాంస్కృతిక మార్పులకు కూడా సాక్షిగా  నిలిచింది. 

సాధారణంగా మేజర్ పోర్ట్స్ కు అవి నెలకొని ఉన్న నగరం పేరు పెట్టటం పరిపాటు. అయితే, గతంలో కొన్ని పోర్టులకు మాత్రం ప్రత్యేక సందర్భాలలో విశేష సేవలందించిన ప్రముఖుల పేర్లు పెట్టారు.  1989 లో ఇలాగే జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు. ట్యుటికోరిన్ పోర్ట్ ట్రస్టును 2011 లో వి. వో. చిదంబరనార్ పోర్ట్ ట్రస్టు గా మార్చారు. అదే విధంగా ఎన్నూర్ పోర్ట్ లిమిటెడ్ ను స్వాతంత్ర్య సమర యోధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ కె. కామరాజు పేరిట కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ గాను, 2017 లో కాండ్లా పోర్టును దీన్  దయాళ్ పోర్టు గాను మార్చిన సంగతి తెలిసిందే.దేశంలో అనేక విమానాశ్రయాలకు కూడా ప్రముఖ జాతీయ నాయకుల పేర్లు పెట్టిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.
 

***


(Release ID: 1629159) Visitor Counter : 308