PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 31 MAY 2020 6:13PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 86, 983 కాగా... కోలుకున్నవారి శాతం 47.76గా ఉంది.
  • దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 89,995.
  • కోవిడ్‌-19పై పోరుకు దేశీయాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు; 2020 జూన్‌ నుంచి అమలు; నియంత్రణ జోన్ల బయట  దశలవారీగా తిరిగి కార్యకలాపాలు
  • ఆర్థిక వ్యవస్థలో ప్రధానాంగాల పునఃప్రారంభం నేపథ్యంలో మనం మరింత అప్రమత్తంగా, సావధానంగా ఉండాలి: ప్రధానమంత్రి
  • శ్రామిక్‌ రైళ్లపై సముచిత ప్రణాళిక-సమన్వయం కోసం రాష్ట్రాలకు రైల్వేశాఖ వినతి
  • ‘ప్రపంచ ఔషధ భాండాగారం’గా భారతదేశానికి గుర్తింపు: శ్రీ పీయూష్‌ గోయల్‌

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం 47.76కు పెరుగుదల

గడచిన 24గంటల్లో 4,614 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయంకాగా, దేశంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 86,693కు చేరింది. దీంతో కోలుకునేవారి శాతం 47.76కు పెరిగింది. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోగల యాక్టివ్‌ కేసుల సంఖ్య 89,995గా ఉంది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627974

కోవిడ్‌-19పై పోరాటానికి కొత్త మార్గదర్శకాలు జారీ; 2020 జూన్‌ 1 నుంచి అమలు

కోవిడ్‌-19పై పోరాటానికి కేంద్ర దేశీయాంగ వ్యవహారాల శాఖ (MHA) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నియంత్రణ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో దశలవారీగా కార్యకలాపాల పునఃప్రారంభానికి అనుమతించింది. ఈ మార్గదర్శకాలు 2020 జూన్‌ 1 నుంచి అమలు కానుండగా, ఇవి 2020 జూన్‌ 30వ తేదీవరకూ కొనసాగుతాయి. ఈ మేరకు ‘దిగ్బంధ విముక్తి-1’ దశలో ప్రధానంగా ఆర్థికాంశాలపై దృష్టి సారిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపుల అనంతరమే కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో నియంత్రణ జోన్ల పరిధిలో మాత్రం దిగ్బంధం నిబంధనలు కఠినంగా అమలవుతాయి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీచేసే మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు నియంత్రణ జోన్ల వివరాలను ప్రకటిస్తాయి. ఏదేమైనా నియంత్రణ జోన్లుగా ప్రకటించే ప్రాంతాల పరిధిలో నియంత్రణ అత్యంత కఠినంగా ఉండాలని, అత్యవసర కార్యకలాపాలు మినహా ఇతరాలను అనుమతించరాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ జోన్ల వెలుపల ఇప్పటిదాకా నిషేధించిన కార్యకలాపాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించనున్న ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (SOP)లకు లోబడి దశలవారీగా తిరిగి ప్రారంభించవచ్చునని తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628026

‘మన్‌ కీ బాత్‌ 2.0’లో భాగంగా 12వ విడత కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌ 2.0’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 12వ విడత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్‌-19పై దేశమంతా సమష్టిగా భీకర పోరాటం చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ప్ర‌ధానాంగాలు తిరిగి గాడిలో ప‌డ‌నున్న నేప‌థ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా, సావధానంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సేవ, త్యాగం అనేవి కేవలం మన ఆదర్శాలు మాత్రమేగాక... అవి మన జీవన విధానంలో భాగమని ప్రజలు నిరూపించారని కొనియాడారు. ఇక సమాజానికి, రోగనిరోధక శక్తికి, ఐక్యతకు యోగా అద్భుతమైనదని ప్రధానమంత్రి అన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేదిశగా ‘స్వయం సమృద్ధ భారతం’ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నీటి పొదుపుపై ప్రస్తుత తరం తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరాన్ని గుర్తించాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. వర్షపు నీటి పరిరక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తూ జల సంరక్షణకోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ ‘పర్యావరణ దినోత్సవం’ నాడు భూమాత రక్షణతోపాటు ప్రకృతితో నిత్య సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కొన్ని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628207

‘మన్‌ కీ బాత్‌ 2.0’లో భాగంగా 31.05.2020నాటి 12వ విడత కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్లానువాదం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1628091

స్వావలంబన భారతం దిశగా మోదీ 2.0 ఏడాది పాలన

గడచిన ఏడాది కాలంలో మోడీ 2.0 ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాల సమగ్ర సారాంశం; భారతదేశ చరిత్రలో నిర్ణయాత్మక శకం... నవభారత ఆవిర్భావానికి శ్రీకారం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628070

శ్రామిక్‌ రైళ్లపై సముచిత ప్రణాళిక-సమన్వయం కోసం రాష్ట్రాలకు రైల్వేశాఖ వినతి

శ్రామిక్‌ స్పెషల రైళ్లకు సంబంధించి సముచిత ప్రణాళిక-సమన్వయం అవసరమని భారత రైల్వేశాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఆ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రైలుమార్గంలో తరలించడం కోసం పటిష్ఠ ప్రణాళికతో గట్టి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. “శ్రామిక్‌ స్పెషల్‌” రైళ్ల కోసం రైళ్లను సమకూర్చేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా ప్రయాణికులను  స్టేషన్లకు తరలించని కారణంగా ముందుగా ప్రకటించిన అనేక రైళ్లను రద్దు చేసిన సందర్భాలున్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాలు వలసకార్మికులను పంపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి సొంత రాష్ట్రాల నుంచి అనుమతి లభించని పరిస్థితులూ ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628018

కోవిడ్‌ సంక్షోభంలో ఔషధ పరిశ్రమ విశేష కృషికి శ్రీ పీయూష్‌ గోయల్‌ ప్రశంస

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా దేశంలోని ఔషధ పరిశ్రమ దిగ్గజాలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కోవడ్‌ సంక్షోభం సందర్భంగా ఔషధ పరిశ్రమ అవిరళ కృషితో ప్రపంచ వేదికపై భారతదేశాన్ని సగర్వంగా నిలిపిందని శ్రీ గోయల్ కొనియాడారు. గడచిన రెండు నెలల్లో 120కిపైగా దేశాలకు భారత్‌ నుంచి అత్యవసర ఔషధాలు సరఫరా అయ్యాయని, ఇందులో 40 దేశాలకు పూర్తి ఉచితంగా మందులు అందినట్లు పేర్కొన్నారు. దీంతో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ భాండాగారం’గా గుర్తింపు లభించిందని చెప్పారు. భారత ప్రభుత్వ ఔదార్యాన్ని అంతర్జాతీయ సమాజం ప్రశంసిస్తున్నదని, ఫలితంగా దేశ పేరుప్రతిష్టలు ఇనుమడించాయని హర్షం వ్యక్తంచేశారు. కోవిడ్‌పై జాతి పోరాటంలో దేశానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మందులకు కొరత రాకుండా ఔషధ పరిశ్రమ రంగం అద్భుతంగా పనిచేసిందని మంత్రి విశేషంగా కొనియాడారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627655

ఆపరేషన్‌ ‘సముద్రసేతు’ రెండోదశను ప్రారంభించిన భారత నావికాదళం

విదేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశం తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ‘సముద్ర సేతు’ రెండోదశ 2020 జూన్‌ 1న ప్రారంభమవుతుంది. ఈ మేరకు భారత నావికాదళ నౌక ‘జలాశ్వ’ శ్రీలంక రాజధాని కొలంబో నుంచి 700 మంది సిబ్బందిని, తదుపరి విడతలో మాల్దీవ్స్‌ రాజధాని మాలెనుంచి మరో 700 మందిని కూడా తమిళనాడులోని ట్యుటికోరిన్‌ రేవుకు చేర్చనుంది. కాగా, భారత నావికాదళం మునుపటి దశకింద ఇప్పటికే మాలె నుంచి 1,488 మందిని కేరళలోని కోచ్చి రేవుకు తీసుకొచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628007

‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగం సందర్భంగా ‘మై లైఫ్‌ - మై యోగా’ వీడియో బ్లాగింగ్‌ పోటీపై ప్రధానమంత్రి ప్రకటన

మరిన్ని వివరాలకు... http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628209

"ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్" స్ఫూర్తి విస్త‌ర‌ణసహా ప్రాథమిక విధులపై యువతలో చైతన్యం ల‌క్ష్యంగా ‘ఎ రిమైండ‌ర్ ఆన్ ఫండ‌మెంట‌ల్ డ్యూటీస్‌’ పేరిట ల‌ఘు వీడియోను ఆవిష్క‌రించిన పంజాబ్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌య ‘ఇబీఎస్‌బీ’ క్ల‌బ్

ప్రాథమిక విధులపై యువతలో చైతన్యం ల‌క్ష్యంగా భటిండాలోని ‘పంజాబ్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం (CPUB) “ఎ రిమైండ‌ర్ ఆన్ ఫండ‌మెంట‌ల్ డ్యూటీస్‌” పేరిట ల‌ఘు వీడియోను ఆవిష్క‌రించింది. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక విధులను నిర్వర్తించేలా... కోవిడ్‌-19 నిరోధానికి జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా... “సంకల్పంతో కార్యసిద్ధివైపు” ఉద్యమంలో భాగస్వాములయ్యేలా ఉత్తేజితులను చేయడమే ఈ వీడియో రూపకల్పనలోని ప్రధానోద్దేశం. దేశంలోని 28రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న CPUBలోని EBSB క్లబ్‌కు చెందిన 28 మంది విద్యార్థి-కార్యకర్తలు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అలాగే రాజ్యంగం నిర్దేశిస్తున్న ప్రాథమిక విధులను తమతమ రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628187

మోదీ ప్రభుత్వం 2.0 ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా డీఏఆర్‌పీజీ విజయాలపై ఈ-కరదీపికను ఆవిష్కరించిన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఈ సందర్భంగా డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ- సుపరిపాలనపై ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా డీఏఆర్‌పీజీ తనవంతు కర్తవ్యం నిర్వర్తించిందని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన నిర్దేశించిన ‘సంస్కరణ-సమర్థత-పరివర్తన’ తారక మంత్రాన్ని తూచా తప్పకుండా అనుసరించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పలు మంత్రిత్వశాఖలు/విభాగాల్లో పనులకు భంగం కలగకుండా ‘ఈ-ఆఫీస్‌’ వినియోగంద్వారా ఇళ్లనుంచే పనిచేసేలా డీఏఆర్‌పీజీ అమలుచేసిన పటిష్ట సంస్కరణలే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే 0.87లక్షల కోవిడ్‌-19 సంబంధ ప్రజా సమస్యలను సకాలంలో... 1.45 రోజులకొకటి వంతున రికార్డు సగటుతో పరిష్కరించినట్లు గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1628070

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,940 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 65,168కి చేరింది. వీటిలో 34,881 యాక్టివ్‌ కేసులు. హాట్‌స్పాట్ ముంబైలో శనివారం 1,510 కేసులు నమోదయ్యాయి. ముంబైలోని కోవిడ్ రోగుల చికిత్స కోసం గౌరవ వేతనం ప్రాతిపదికన వైద్యులు, నర్సులను నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి నెలకు రూ.80,000 వంతున పారితోషికం చెల్లించాలని నిర్ణయించింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 412 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 16,356కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6119కిగాను 6057మంది ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. మరో 62మంది  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 మరణాలు 1,000 దాటగా గత 24 గంటల్లో 27 నమోదయ్యాయి. వీరిలో అహ్మదాబాద్‌లో 24మంది; గాంధీనగర్, బనస్కాంత, మెహ్సానా జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 246 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 7,891కి పెరిగింది. వీటిలో 3104 యాక్టివ్‌ కేసులు కాగా, కొత్త కేసులలో అత్యధికం (87) హాట్‌స్పాట్ ఇండోర్‌లో నమోదయ్యాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 76 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 8693కు చేరింది. కొత్త కేసులలో అధికశాతం జైపూర్‌లో నమోదవగా, ఝలావర్‌ రెండో స్థానంలో ఉంది. వలసదారుల రాకతో చాలా జిల్లాల్లో కరోనా కేసులు పెరిగాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. అయితే, సర్పంచులు, గ్రామ సేవకులుసహా గ్రామాధికారులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారని తెలిపారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఇవాళ 32 కొత్త కేసులు నమోదవగా వీటిలో 16 జష్పూర్ జిల్లాలో, 12 మహాసముంద్‌, 2 కోర్బా; రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య: 344
  • కేరళ: దిగ్బంధం పొడిగించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు నమోదు కొనసాగవచ్చు. ఇక  ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం సూచించిన దిగ్బంధం సడలింపులను అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి చెప్పారు. ఒకవేళ మతపరమైన ప్రార్థన స్థలాలను తెరవాలని కేంద్రం నిర్ణయిస్తే, భద్రత విధివిధానాలను పాటిస్తూ తాము కూడా అనుసరిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దిగ్బంధం అమలు ఇవాళ్టితో పూర్తయింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తి నిరోధం కోసం ప్రభుత్వం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణకు ముఖ్యమంత్రి పిలుపు నేపథ్యంలో స్థానిక, స్వచ్ఛంద సంస్థలు, నివాసితుల సంఘాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో నిన్న 58 కేసులు నమోదవగా యాక్టివ్‌ కేసులు: 624గా ఉన్నాయి. కేరళలో ప్రస్తుతం 5 కొత్త ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించడంతో వీటి సంఖ్య 106కి చేరింది.
  • తమిళనాడు: రాష్ట్రంలో రెండు నెలల తరువాత ప్రజారవాణా సోమవారం నుంచి ప్రారంభం కానుండగా- చెన్నై నగరం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలు మినహా మిగిలినచోట్ల బస్సులు నడుస్తాయి. కాగా, ఓటీటీ వేదికలపై సినిమాలను విడుదల చేయడంవల్ల తమిళ సినీ పరిశ్రమ నష్టపోతుందని రాష్ట్ర సమాచార-ప్రచారశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు రూ.50 వేలదాకా రుణం ఇచ్చేందుకు సహకార బ్యాంకులు ముందుకొచ్చాయి. కాగా నిన్న రాష్ట్రంలో 938 కొత్త కేసులు నమోదవగా, ఒకేరోజు అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో చెన్నై నుంచి 616 కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 21,184, యాక్టివ్: 9021, మరణాలు: 160, డిశ్చార్జ్: 12,000. చెన్నైలో యాక్టివ్ కేసులు 6539గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోని విద్యార్థులు జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులకు లాగిన్ కావాలి. కాగా, విద్యార్థులు యూనిఫాం ధరించి, తల్లిదండ్రులతోపాటు ఆన్‌లైన్‌ బోధన తరగతులకు లాగిన్‌ కావాలని పలు పాఠశాలలు కోరుతున్నాయి. రాయచూర్ జిల్లాలో భారీవర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ అయ్యాక రాష్ట్రంలో కొత్త విద్యా క్యాలెండర్‌ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రార్థన స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీచేసింది. కాగా, న్యూజిలాండ్‌లో చిక్కుకున్న రాష్ట్ర ఇంజనీర్లను స్వదేశం తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరింది. ఇక రాష్ట్రంలో నిన్న 141 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు సంఖ్య 2922కు చేరింది. వీటిలో యాక్టివ్‌: 1874, మరణాలు: 49, కోలుకున్నవి: 994గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పెన్షన్‌పొందే అర్హతగలవారు పేరు నమోదు చేసుకున్న ఐదు రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఆలయాల్లో దర్శనాలకు దేవాదాయ శాఖ నిబందనలు రూపొందించింది. ఇక 9370 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24 గంటల్లో 98 కొత్త కేసులు, రెండు మరణాలు నమోదవగా, 43మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 3042. యాక్టివ్: 845, కోలుకున్నవి: 2135, మరణాలు: 62. రాష్ట్రానికి తిరిగివచ్చిన వలసదారులలో 418 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, వీటిలో 221 యాక్టివ్‌ కేసులు. గత 24 గంటల్లో 8మంది డిశ్చార్జ్ కాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో కోవిడ్ కేసులు 111గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు ప్రైవేటు పాఠశాలలు 2020-21 విద్యా సంవత్సరం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. దీంతో పిల్లలకు వార్షిక ఫీజులు చెల్లించడమే కాకుండా ఆన్‌లైన్‌ తరగతులకు తగిన కొత్త పరికరాలు కొనుగోలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దిగ్బంధం మొదలయ్యాక హైదరాబాద్‌లో 9మంది శిశువులను గుర్తుతెలియని వ్యక్తులు అనాథల్లా వదిలేసి వెళ్లారు. కాగా, మే 30నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 2,499 కాగా నేటివరకూ 431మంది వలసదారులు, విదేశాలనుంచి వచ్చినవారికి వ్యాధి నిర్ధారణ అయింది.
  • పంజాబ్: కేంద్రం మార్గదర్శకాల మేరకు జూన్ 30 వరకు రాష్ట్రంలో మరో 4 వారాలపాటు దిగ్బంధం పొడిగిస్తున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ భద్రత విధివిధానాలను కచ్చితంగా పాటించేలా కొన్ని దిగ్బంధం పొడిగింపు కొన్ని షరతులతో అమలవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు రేషన్ కిట్లలో భాగంగా వాటి పంపిణీకి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రికి సూచించారు.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 మహమ్మారి నియంత్రణలో కీలకపాత్ర పోషించిన హర్యానా రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల అభివృద్ధి సంస్థ ఓ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరంభంలో చాలా తక్కువ మూలధన పెట్టుబడితో భూమి లీజుకు తీసుకున్న పెట్టుబడిదారులు కొన్ని నిబంధనలు, షరతులను నెరవేరిస్తే ఆ భూమిపై శాశ్వత హక్కులు ఇవ్వాలని తీర్మానించింది. ఆ మేరకు తమ సంస్థల్లో కార్మికులను కొనసాగించేందుకు వీలుగా వారికి కనీస వ్యయంతో నివాస సౌకర్యాలు కల్పించాలి. ఈ దిశగా ఎకరం లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో పారిశ్రామిక నివాస సంబంధిత ‘ఎఫ్‌ఏఆర్‌’లో 10 శాతం పెంచేవిధంగా నిబంధనను చేర్చింది. కాగా, సోనిపట్‌లోని కుండ్లిలోగల ఐఎమ్‌టి మనేసర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పారిశ్రామిక కార్మికుల కోసం నివాసాలు, వసతిగృహాలను హెచ్‌ఎస్‌ఐఐడిసి సిద్ధం చేసింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇటీవలి రెండో కోవిడ్‌-19 రోగితో ప్రాథమిక, తదుపరి సంబంధాలు కలిగిన మొత్తం 26 మందికి పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకలేదని తేలింది. కాగా, ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా పరీక్షల్లో వ్యాధి సోకినట్లు తేలిన నేపథ్యంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3కు చేరింది.
  • అసోం: రాష్ట్రంలో కోవిడ్‌-19కు చికిత్స పొందినవారిలో 22 మందికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించాక వ్యాధి నయమైనట్లు తేలడంతో ఇవాళ ఆస్పత్రుల నుంచి ఇళ్లకు పంపారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 185కు చేరగా, ప్రస్తుతం 1080 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • మణిపూర్: దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రత్యేక రైళ్లలో 19,000మంది మణిపూర్‌ వాసులు సొంతరాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా తొలుత జిరిబామ్ రైల్వేస్టేషన్‌లో దిగగా, అక్కడినుంచి బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపారు. పశ్చిమ ఇంఫాల్‌లోని లామ్‌డెంగ్‌లోగల వాంగ్తోయిరబా అంతర్జాతీయ ఆరాధన కేంద్రంవారు బస్సు డ్రైవర్లకు, వారి సహాయకులకు మాస్కులు, హస్త పరిశుభ్రత ద్రవాలు, చేతి తొడుగులు పంపిణీ చేశారు.
  • మిజోరాం: కర్ణాటక నుంచి ప్రత్యేక రైలులో మిజోరం వచ్చిన ప్రయాణికులందరి నమూనాలను పరీక్షించగా, ఎవరికీ కోవిడ్‌-19 వ్యాధి సోకలేదని తేలింది.
  • నాగాలాండ్: ‘స్లాట్ అవరోధం’ కారణంగా నాగాలాండ్ నుంచి దిమాపూర్‌కు దేశీయ విమానాలను రద్దుచేసిన నేపథ్యంలో రేపటినుంచి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలో సరి-బేసి నంబర్ల వాహన రాకపోకల విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ప్రకటించారు. ఈ మేరకు బేసి సంఖ్యలున్న వాహనాలు సోమ, బుధ, శుక్ర వారాల్లోనూ;  సరి సంఖ్యలున్న వాహనాలు మంగళ, గురు, శనివారాల్లోనూ రోడ్లపైకి రావాల్సి ఉంటుంది.
  • సిక్కిం: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగులను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రికి సిక్కిం హోం శాఖ లేఖ రాసింది.
  • త్రిపుర: రాష్ట్రంలో దిగ్బంధం సందర్భంగా బండిలాగే కార్మికుడు గౌతమ్‌దాస్‌ అందరికీ ఆదర్శంగా నిలిచాడని ముఖ్యమంత్రి కొనియాడారు. ఒకవైపు జీవనోపాధికి ఇబ్బంది ఏర్పడినా తాను పొదుపు చేసిన మొత్తాన్ని ప్రజల కోసం వెచ్చించి పెద్దమనసు చాటుకున్నాడని పేర్కొన్నారు. గౌతమ్‌దాస్‌ ఔదార్యాన్ని ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారని తెలిపారు.

 

******



(Release ID: 1628231) Visitor Counter : 262