ప్రధాన మంత్రి కార్యాలయం

"మన్-కీ-బాత్-2.0" 12వ సంచిక నుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి.

సామూహిక ప్రయత్నాల ద్వారా మన దేశంలో కరోనాకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోందని చెప్పిన - ప్రధానమంత్రి.


సేవ మరియు త్యాగం అనే భావన కేవలం మన ఆదర్శం మాత్రమే కాదనీ, ఇది మన జీవన విధానమని ప్రజలు నిరూపించారు : ప్రధానమంత్రి.


సమాజం, రోగనిరోధక శక్తి మరియు ఐక్యతకు యోగా మంచిది : ప్రధానమంత్రి


దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకు వెళ్లడం కోసం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన - ప్రధానమంత్రి.

Posted On: 31 MAY 2020 4:04PM by PIB Hyderabad

‘మన్-కీ-బాత్ 2.0’ 12వ సంచిక నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడుతూ,  సమిష్టి కృషి ద్వారా దేశంలో కరోనాకు వ్యతిరేకంగా యుద్ధం తీవ్రంగా జరుగుతోందని అన్నారు.  ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన విభాగం తెరవబడినప్పటికీ, కోవిడ్ మహమ్మారి మధ్యలో ప్రజలు మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

తగిన జాగ్రత్త చర్యలతో శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు, ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైలు సేవలు కూడా పునఃప్రారంభమయ్యాయని, ప్రధానమంత్రి తెలిపారు.  విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయనీ, పరిశ్రమ కూడా సాధారణ స్థితికి చేరుకుంటోందనీ కూడా ఆయన చెప్పారు.  ఈ పరిస్థితులూ ఎటువంటి అజాగ్రత్త ఉండకూడదని ప్రధానమంత్రి హెచ్చరించారు. "దో-గజ్-కీ-దూరీ" (రెండు గజాల దూరం) పాటించాలనీ, ఫేస్ మాస్క్‌లు ధరించాలనీ, సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు.  ఎన్నో కష్టాలను ఓర్చిన అనంతరం, పరిస్థితిని చక్కదిద్ధేందుకు దేశం ఎంతో తెలివిగా తీసుకున్న నిర్ణయాల ఫలితం వ్యర్థం కాకూడదని ఆయన నొక్కి చెప్పారు. 

మన ప్రజలు చూపిన సేవా స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  అదే  అతిపెద్ద బలమని అభివర్ణించారు.  "సేవా పరమో ధర్మః" అనేది మనందరికీ తెలిసిన సూక్తి  అనీ, సేవంటేనే ఆనందం, సేవంటేనే సంతృప్తి అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సేవల సిబ్బందికి తన ప్రగాఢ గౌరవాన్ని వ్యక్తం చేశారు.   దేశంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది మరియు మీడియా వ్యక్తుల సేవా స్ఫూర్తిని ప్రధానమంత్రి కొనియాడారు.  ఈ సంక్షోభ సమయంలో మహిళా స్వయం సహాయక బృందాలు చేసిన అద్భుత కృషిని కూడా ఆయన ప్రశంసించారు.

ఈ సంక్షోభ సమయంలో ఇతరులకు సహాయం చేయడానికి తమ వ్యక్తిగత పరిస్థితులు అనుకూలించక పోయినప్పటికీ, తమిళనాడుకు చెందిన కె.సి.మోహన్, అగర్తాలాకు చెందిన గౌతమ్ దాస్, పఠాన్‌కోట్‌కు చెందిన రాజు అనే ఒక దివ్యాంగుడైన వ్యక్తి వంటి సామాన్య పౌరులు చేసిన సేవలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు.  మహిళల స్వయం సహాయ బృందాల పట్టుదల గురించి అనేక కథలు దేశంలోని అనేక ప్రాంతాల నుండి తెరపైకి వస్తున్నాయని ఆయన చెప్పారు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తుల ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.  తన ట్రాక్టర్‌కు అనుసంధానించబడిన శానిటైజేషన్ మెషీన్‌ను రూపొందించిన నాసిక్‌ కు చెందిన రాజేంద్ర యాదవ్ చేసిన కృషిని ఆయన ఒక ఉదాహరణగా వివరించారు.  'దో-గజ్-కి-దూర్డో" నిబంధనకు కట్టుబడి ఉండటానికి చాలా మంది దుకాణదారులు తమ దుకాణాల్లో పెద్ద పైపు లైన్లను ఏర్పాటు చేసిన సంగతిని ఆయన తెలిపారు. 

మహమ్మారి కారణంగా ప్రజల బాధలు మరియు కష్టాల గురించి తన బాధను పంచుకున్న ప్రధానమంత్రి, కరోనా వైరస్ సమాజంలోని అన్ని వర్గాలను బాధించిందనీ,  అయితే,  నిరుపేద కూలీలు మరియు కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యారనీ పేర్కొన్నారు.   కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి విభాగం మరియు సంస్థ పూర్తి వేగంతో ఉపశమనం కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.  కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థల వరకు ప్రతి ఒక్కరూ 24 గంటలూ శ్రమపడుతున్న విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారనీ, అనుభూతి చెందుతున్నారనీ, ఆయన పేర్కొన్నారు.  రైళ్లు, బస్సుల్లో లక్షలాది మంది కార్మికులను సురక్షితంగా రవాణా చేయడం, వారికి మంచి నీరు,  ఆహారం సకాలంలో అందేవిధంగా సరఫరా చేయడం, ప్రతి జిల్లాలో వారికి క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేయడంలో నిర్విరామంగా నిమగ్నమైన ప్రజలను ఆయన ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో  కొత్త పరిష్కారాన్ని రూపొందించడం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.   ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.  కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు గ్రామ ఉపాధి, స్వయం ఉపాధి మరియు చిన్న తరహా పరిశ్రమలకు విస్తారమైన అవకాశాలు కల్పించాయని ఆయన అన్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం ఈ దశాబ్దంలో దేశాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో, ప్రతి చోట ప్రజలు యోగా మరియు ఆయుర్వేదం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారనీ, దానిని జీవన విధానంగా అవలంబిస్తున్నారనీ ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.  "సమాజం, రోగనిరోధక శక్తి మరియు ఐక్యత" కోసం యోగాను ఆయన సమర్థించారు.  ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, యోగా అన్నింటికన్నా ముఖ్యమైనదిగా మారిందని, ఎందుకంటే ఈ వైరస్ శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.  యోగాలో, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసే అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. యోగా వల్ల  ప్రయోజనకరమైన ప్రభావాలు చాలా కాలంగా కనిపిస్తాయి.

ఇంకా, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీ 'మై లైఫ్, మై యోగా' కోసం తమ వీడియోలను పంచుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ఈ పోటీలోనూ, రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలోనూ, ప్రజలందరూ పాల్గొనాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యర్థించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి దాటిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  'ఆయుష్మాన్ భారత్' లబ్ధిదారులతో పాటు కరోనా మహమ్మారి సమయంలో రోగులకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.

ఒకానొక సమయంలో మనం కరోనావైరస్ తో పాటు, అంఫన్ వంటి విపత్తులతో కూడా పోరాడవలసి వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.  సూపర్ తుఫాను అంఫన్ సమయంలో పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రజలు చూపిన ధైర్య, సాహసాలను ఆయన ప్రశంసించారు.  ఈ రాష్ట్రాల్లోని రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొన్న అగ్నిపరీక్ష మరియు వారి చిత్తశుద్ధి మరియు దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించిన విధానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

తుఫాను విపత్తుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు మిడుత దాడుల బారిన కూడా పడ్డాయని శ్రీ మోడీ అన్నారు.  ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఎలా నిర్విరామంగా పనిచేస్తున్నదీ ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తద్వారా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.  కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ లేదా పరిపాలన వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరూ రైతులకు సహాయం చేయడానికి మరియు ఈ సంక్షోభం కారణంగా పంట నష్టాన్ని తగ్గించడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

నీటిని ఆదా చేసే బాధ్యతను గుర్తించవలసిన అవసరం ప్రస్తుత తరానికి ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  అదేవిధంగా వర్షపు నీటిని ఆదా చేయవలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.  నీటి సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ప్రకృతి తో రోజువారీ సంబంధాన్ని పెంపొందించుకోవాలనే తీర్మానంతోనూ, కొన్ని మొక్కలు నాటడం ద్వారానూ, ఈ 'పర్యావరణ దినోత్సవం' సందర్భంగా ప్రకృతికి సేవ చేయాలని ఆయన దేశ ప్రజలను అభ్యర్థించారు.  లాక్ డౌన్ వల్ల జీవితాలు మందగించాయనీ, అయితే ఇది ప్రకృతిని సరిగ్గా చూసే అవకాశాన్ని కల్పించిందనీ, ఈ సమయంలో అడవి జంతువులు మరింతగా  బయటకు రావడం ప్రారంభించాయనీ, ఆయన వివరించారు. 

నిర్లక్ష్యంగా లేదా అవాస్తవంగా మారడం ఒక ఎంపిక కాదని ప్రధానమంత్రి  తన ప్రసంగాన్ని ముగించారు.  కరోనాపై పోరాటాన్ని ఇప్పటికీ సమానమైన తీవ్రతతో పరిగణించాలని ఆయన అన్నారు. 

 

***



(Release ID: 1628207) Visitor Counter : 321