PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
17 MAY 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 కేసులు 90,927; కోలుకున్నవారు 34.109 మంది (37.5 శాతం); మరణాలు 2,872.
- దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 4,897.
- కోవిడ్-19పై పోరులో భౌతిక దూరం, ప్రవర్తన నియమాలే సమర్థ సామాజిక టీకాలు: డాక్టర్ హర్షవర్ధన్.
- స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద ఏడు రంగాల్లో సంస్కరణలు-సామర్థ్యం పెంపు దిశగా తుది విడత చర్యలను ప్రకటించిన ఆర్థికశాఖ మంత్రి.
- రాష్ట్రాల మధ్య వలస కార్మికుల నిరంతర కదలిక కోసం ఆన్‌లైన్ తక్షణ స్పందనవేదికకు ఎన్‌డీఎంఏ రూపకల్పన.
- స్వయం సమృద్ధ భారతం పథకం కింద వలసకార్మికుల ఉచిత ఆహారధాన్యాల పంపిణీ ప్రారంభం.
- రైలుమార్గాలున్న అన్ని జిల్లాలకూ శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సన్నద్ధత.
కోవిడ్-19పై పోరులో భౌతికదూరం, ప్రవర్తన నియమాలే సమర్థ ‘సామాజిక టీకాలు’: దేశంలో కోలుకునేవారి శాతం మెరుగుపడి 37.5గా నమోదైంది.. ఇక 22లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించాం: డాక్టర్ హర్షవర్ధన్
దేశంలో ఇవాళ మూడోవిడత దిగ్బంధం ముగిసిన నేపథ్యంలో “గడచిన 14 రోజులలో కేసులు రెట్టింపయ్యే వ్యవధి 11.5 కాగా, గడచిన 3 రోజులలో మరింత మెరుగుపడి 13.6కు పెరిగింది” అని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. అలాగే మరణాల శాతం 3.1కి పతనం కావడంతోపాటు కోలుకునేవారి శాతం బాగా మెరుగుపడి 37.5కు చేరిందన్నారు. అంతేకాకుండా (నిన్నటివరకూగల సమాచారం మేరకు) ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులలో 3.1 శాతం ఐసీయూలలో ఉండగా, వెంటిలేటర్లపై 0.45 శాతం, ఆక్సిజన్ తోడ్పాటుతో 2.7 శాతంగా ఉన్నారని తెలిపారు. ఇక దేశంలో 2020 మే 17 నాటికి మొత్తం కేసుల సంఖ్య 90,927కుగాను 34,109 మందికి వ్యాధి నయం కాగా, 2,872 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య 4,987గా ఉంది.
తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు హస్త పరిశుభ్రత లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల వాడకం; బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకపోవడం; పని ప్రదేశాలను, తరచూ తాకే టేబుళ్లవంటి ఉపరితలాలను క్రిమిరహితం చేయడం; ఇతరుల భద్రత దిశగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ఉపయోగం, శ్వాస సంబంధ సూత్రావళి అనుసరణవంటివి తప్పనిసరి సరికొత్త అలవాట్లుగా మారడంద్వారా దేశం మళ్లీ సాధారణ స్థితిలోకి వస్తున్నదని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. మన చేతిలోగల సమర్థ సామాజిక టీకా భౌతికదూరం పాటించడమేనని, అందువల్ల ఇతరులతో మాట్లాడే సమయంలో “రెండు గజాల దూరం” ఉండటం, వీడియో మాధ్యమంద్వారా తప్ప సామాజిక కార్యక్రమాలకు సామూహిక హాజరువంటివి మానుకోవాలన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624798
స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం కింద ఏడు రంగాల్లో ప్రభుత్వ సంస్కరణలు-సామర్థ్యం పెంపు దిశగా చర్యలను ప్రకటించిన ఆర్థికశాఖ మంత్రి
ప్రభుత్వ సంస్కరణలు, సామర్థ్య వికాసానికి సంబంధించి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ ఐదో, తుదివిడత ప్రకటన చేశారు. ఈ మేరకు ఉపాధి కల్పన, వ్యాపారాలకు మద్దతు, వాణిజ్య సౌలభ్యం, విద్య-ఆరోగ్య రంగాలుసహా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏడు చర్యలను వివరించారు. ఇందులో- ఉపాధి పెంపు నిమిత్తం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.40,000 కోట్లు కేటాయింపు; భవిష్యత్ మహమ్మారుల నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు ప్రజారోగ్యం, ఇతర ఆరోగ్యరంగ సంస్కరణలకు పెట్టుబడుల పెంపు; కోవిడ్ అనంతరం టెక్నాలజీ చోదిత సమానత్వంతో కూడిన విద్య; ఐబీసీ సంబంధిత చర్యలద్వారా వాణిజ్య సౌలభ్యం మరింత పెంపు; కంపెనీ చట్టం పాటించనివారిపై చర్యల ఉపసంహరణ; కార్పొరేట్లకు వాణిజ్య సౌలభ్యం; నవ్య, స్వయం సమృద్ధ భారతం కోసం ప్రభుత్వరంగ పరిశ్రమల విధానం; అలాగే 2020-21కి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల రుణ సమీకరణ పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంపు, రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలకు ప్రోత్సాహం తదితరాలున్నాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624798
కోవిడ్-19పై పోరులో ఆర్థికవ్యవస్థకు మద్దతుగా స్వయంసమృద్ధ భారతం కార్యక్రమం కింద 5వ విడత చర్యలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటన
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624657
కేంద్ర ఆర్థికమంత్రి నేటి ప్రకటనలతో మౌలిక వసతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం; కోట్లాది పేదలు, వలసకార్మికులకు ఉపాధిలభ్యత: దేశీయాంగ శాఖ మంత్రి
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆమెతోపాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. “మోదీ ప్రభుత్వం ఇవాళ చేసిన ప్రకటనలు స్వయం సమృద్ధ భారతం సంకల్ప సాధనలో ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్య, విద్యా, వ్యాపార రంగాల్లో కోట్లాది పేదలకు ఉపాధి కల్పించడంసహా దేశాభివృద్ధికి ఈ చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయి” అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1624730
దేశ వృద్ధికి నవ్య పరిధులు ప్రకటించిన ఆర్థికశాఖ మంత్రి; స్వయం సమృద్ధ భారతం దిశగా ఎనిమిది రంగాలలో సమూల సంస్కరణలు
స్వయం సమృద్ధ భారతం సాధన కృషిలో భాగంగా పెట్టుబడుల సత్వర సమీకరణ కోసం దిగువ పేర్కొన్న విధాన సంస్కణలను ఆర్థికశాఖ మంత్రి శనివారం ప్రకటించారు. సాధికార కార్యదర్శుల బృందం ద్వారా పెట్టుబడులకు సత్వర అనుమతులు; పెట్టుబడులకు అనువైన పథకాలకు రూపకల్పన, పెట్టుబడిదారులు- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ప్రతి మంత్రిత్వ శాఖలో పథక రూపకల్పన విభాగం ఏర్పాటు; కొత్త పెట్టుబడుల కోసం పోటీ పడేలా పెట్టుబడి ఆకర్షక సామర్థ్యంపై రాష్ట్రాలకు ర్యాంకుల కేటాయింపు; సౌర ఫలకాల తయారీ, అత్యాధునిక సెల్ బ్యాటరీ నిల్వ వంటి సరికొత్త విజేతలుగా నిలిచే రంగాలకు ఉత్తేజం దిశగా ప్రోత్సాహక పథకాలకు శ్రీకారం; అలాగే బొగ్గు, ఖనిజాలు, రక్షణరంగ ఉత్పత్తి, పౌర విమానయానం, విద్యుత్, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్షం, అణు ఇంధనం వంటి ఎనిమిది రంగాలలో సమూల సంస్కరణలను కూడా ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించిన సమూల సంస్కరణలను కొనియాడిన దేశీయాంగ శాఖ మంత్రి
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వివిధ రంగాల్లో సమూల సంస్కరణల దిశగా ప్రకటించిన చర్యలను దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. ఈ మేరకు “ఇవాళ చారిత్రక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం లభించడమేగాక స్వయం సమృద్ధ భారతంవైపు మన కృషికి ఎంతగానో తోడ్పడటం ఖాయం” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రకటిత “సంస్కరణ, సామర్థ్యం, పరివర్తనాత్మకత” అనే తారకమంత్రమే ఆరేళ్లుగా భారతదేశ అసాధారణ ప్రగతికి మూలమని ఆయన చెప్పారు.
స్వయం సమృద్ధ భారతం పథకం కింద వలస కార్మికులకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ ప్రారంభం
స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద వలస కార్మికులకు 2 నెలలపాటు ఆహారధాన్యాలు ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ ఆహారభద్రత చట్టం (NFSA)తోపాటు రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ పథకం కార్డుల పరిధిలో లేని 8 కోట్లమందికి 2020 మే, జూన్ నెలలకుగాను తలా 5కిలోల వంతున పంపిణీ చేయనుంది. ఈ పథకం అమలుకు అంచనా వేసిన రూ.3,500 కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. తదనుగుణంగా అఖిలభారత ఆహారధాన్యాల కేటాయింపు పథకం కింద 8 లక్షల టన్నులు పంపిణీ చేస్తుంది. ఈ మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటికే దీనికి శ్రీకారం చుట్టింది.
వివిధ రంగాలకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీసహా ఎంఎస్‌ఎంఈలకు కొత్త నిర్వచనంతో పారిశ్రామిక రంగానికి భారీ ఉత్తేజం: శ్రీ గడ్కరీ
ఎంఎస్‌ఎంఈసహా కార్మిక, వ్యవసాయ వగైరా వివిధ రంగాలు/భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకంతోపాటు ఎంఎస్‌ఎంఈలకు కొత్త నిర్వచనంతో పారిశ్రామిక రంగానికి తప్పక నూతనోత్తేజం లభిస్తుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రేటింగ్ దిశగా మార్గాన్వేషణ చేయాలని, ఈ రంగాలకు ప్రకటించిన ప్యాకేజీలో భాగమైన ‘నిధులకు నిధి’ పథకాన్ని అమలు చేయడంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాలమధ్య వలసకార్మిక కదలికలకు వీలుగా ‘జాతీయ వలసకార్మిక సమాచార వ్యవస్థ’ (NMIS) పేరిట కేంద్రీయ ఆన్‌లైన్ భాండాగారానికి ఎన్‌ఎండీఏ రూపకల్పన
వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు రాష్ట్రాల మధ్య ఆటంకాలు లేకుండా ప్రయాణించేందుకేగాక, వారి సమాచార సమీకరణకు వీలుగా ‘జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ’ (NDMA) “జాతీయ వలసకార్మిక సమాచార వ్యవస్థ” పేరిట ఆన్‌లైన్ తక్షణ స్పందన వేదిక (డ్యాష్‌బోర్డ్)ను రూపొందించింది. ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ద్వారా వలస కార్మికుల కేంద్రీయ సమాచార భాండాగారం నిర్వహించబడుతుంది. దీనిద్వారా అంతర్రాష్ట్ర సమాచార ఆదానప్రదానం/సమన్వయం వేగంగా సాగి, వారు తమ సొంత రాష్ట్రాలకు త్వరగా చేరుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా వారిమధ్య సంబంధాల జాడను పసిగట్టే వీలున్నందున కోవిడ్-19 ప్రతిస్పందన చర్యలకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
వలస కార్మికుల సత్వర, సురక్షిత ప్రయాణం కోసం రైలుమార్గాలున్న అన్ని జిల్లాలకూ శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సన్నద్ధత
దేశంలో రైలుమార్గాలుగల అన్ని జిల్లాలకూ ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, వారి గమ్యస్థానాల వివరాలతో జాబితాలు రూపొందించాలని రైల్వే మంత్రిత్వశాఖ ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. తదనుగుణంగా సంబంధిత రాష్ట్రాల నోడల్ అధికారులద్వారా రైల్వేశాఖకు దరఖాస్తులు పంపాలని సూచించింది. కాగా, రైల్వేశాఖకు నిత్యం 300 శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడపగల సామర్థ్యం ఉన్నప్పటికీ రాష్ట్రాలు అందులో సగం మాత్రమే వాడుకుంటున్నాయి.
‘ఆపరేషన్ సముద్ర సేతు’ రెండో దశ- మాల్దీవ్స్ నుంచి 588 మంది భారతీయులతో స్వదేశం తిరిగొచ్చిన ఐఎన్‌ఎస్ జలాశ్వ
‘ఆపరేషన్ సముద్ర సేతు’ రెండో దశలో భాగంగా భారత నావికాదళ నౌక ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’ ఈ ఉదయం కేరళలోని కోచ్చి రేవు ప్రాంగణంలోని ‘సాముద్రిక క్రూజ్ టెర్మినల్’కు చేరుకుంది. ఈ మేరకు మాల్దీవ్స్ రాజధాని మాలే నుంచి 588 మంది భారతీయులను స్వదేశం చేర్చింది. వీరిలో 70 మంది మహిళలు (ఆరుగురు గర్భిణులు), 21 మంది పిల్లలు
‘కోవిడ్’ తదుపరి చర్యలపై 8 ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చర్చ
ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులతో ఈ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం ఒక గంటపాటు సాగింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల వలస కార్మికులు తదితరుల కదలికలకు సంబంధించిన ప్రస్తుత నేపథ్య పరిస్థితుపై వారు మంత్రికి సమాచారం ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రభావంసహా రానున్న రోజుల్లో ఇవ్వబోయే సడలింపులపై అంచనాల గురించి వివరించారు.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి మే, జూన్ నెలలకుగాను పీఎంజీకేవై కింద కేటాయించిన 200 టన్నుల పప్పులు ఇప్పటికే రెండు గోడౌన్లకు చేరాయి. కాగా, రాష్ట్రంలో రేషన్ కార్డు లేనివారికి త్వరలో నాఫెడ్ ద్వారా అదనపు ఆహార ధాన్యాల పంపిణీ
- అసోం: ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినవారిలో జోర్హాట్ జిల్లా వార్డు నం.3కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 96, యాక్టివ్: 51, కోలుకున్నవి: 41, మరణాలు 2గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్ర ప్రభుత్వం దిగ్బంధాన్ని ఈ నెల 31వరకూ పొడిగించింది. అయితే, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కోవిడ్ పరీక్షలన్నీ పూర్తయ్యేదాకా రోడ్డు మార్గాన రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఎవరికీ తాజా అనుమతులు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
- మేఘాలయ: గుజరాత్‌లో చదువుతున్న/పనిచేస్తున్న మేఘాలయవాసులైన 163 మంది ఇవాళ గువహటి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
- మిజోరం: తమిళనాడు, పుదుచ్చేరిలలో చిక్కుకున్న మిజోరంలోని సెర్చిప్ జిల్లావాసులు 36 మంది ఇవాళ రాష్ట్రానికి చేరుకోగా, వీరిని ఏకలవ్య ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఏర్పాటు చేసిన నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రానికి తరలించారు.
- నాగాలాండ్: మణిపూర్‌లో చిక్కుకున్న 134 మంది నాగాలాండ్ పౌరులు ఆరు బస్సుల్లో సొంత రాష్ట్రానికి చేరారు. కాగా, విద్యా సంస్థలను నిర్బంధ వైద్య పర్యవేక్షణ కేంద్రాలుగా వినియోగించడంపై కొందరు ప్రజలతోపాటు కళాశాలలు వ్యతిరేకిస్తున్నాయి.
- సిక్కిం: దిగ్బంధంవల్ల ఆన్‌లైన్ తరగతులను కోల్పోయిన మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం పాఠ్యాంశాలు లోడ్ చేసిన ల్యాప్‌టాప్‌లను పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ భీమ్ తటల్ తెలిపారు.
- చండీగఢ్: దిగ్బంధం కారణంగా కొందరు వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులు నగరంలో చిక్కుకుపోయారు. వీరందరూ సజావుగా, సౌకర్యవంతంగా స్వస్థలాలకు వెళ్లడం కోసం చండీగడ్ పాలన యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
- జమ్ముకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ నుంచి నిన్న (16.05.2020) మొత్తం 166 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 7 ప్రత్యేక బస్సుల్లో లేహ్ ప్రాంతానికి పంపారు. కాగా, ఇంతకుముందు 13.05.2020న మొత్తం 242 మందిని లద్దాఖ్ పంపారు.
- పంజాబ్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా రోజువారీ కొత్త కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే 31 వరకు దిగ్బంధంతోపాటు కఠినమైన కర్ఫ్యూను అమలు చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారు, అదే సమయంలో పరిమిత ప్రజా రవాణాను పునఃప్రారంభిస్తామని, నియంత్రణ జోన్లలో గరిష్ట సడలింపులు ఉండవచ్చునని ఆయన సూచించారు. కాగా, కేంద్ర ప్రకటించబోయే నాలుగో విడత మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో మే 18 నుంచి నియంత్రణేతర జోన్లలో సడలింపుల వివరాలను సోమవారం ప్రకటిస్తారు. కాగా, 10 లక్షల మాస్కులు తయారుచేసి ఇచ్చిన రాష్ట్రంలోని ఐటీఐల బాలికలను ముఖ్యమంత్రి అభినందించారు.
- హర్యానా: చిన్న దుకాణదారులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ రంగం, మండీల్లో మౌలిక వసతుల కల్పనసహా ‘అన్నివర్గాల’ సంక్షేమానికీ ప్రాధాన్యమిస్తూ అనేక సంక్షేమ పథకాలను రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగం చేసినందుకుగాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హర్యానా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ మహమ్మారి సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీవల్ల రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే 'మేక్ ఇన్ ఇండియా’పై అనే ప్రధానమంత్రి దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేగాక ఎంఎస్‌ఎంఈల స్వావలంబనకు భరోసా ఇస్తూ ఎగుమతి అవకాశాలను కూడా పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
- హిమాచల్ ప్రదేశ్: కోవిడ్-19పై తమతమ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పనలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీ సర్పంచులు ప్రభుత్వానికి అన్నవిధాలా సహకరించాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరిగివచ్చిన వారు గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యతను మరువరాదని సూచించారు. ఇళ్లలో అనుమానిత రోగులను వేరుగా ఉంచడంపైనా శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే పరిస్థితిని చక్కదిద్దడానికి సమష్టి కృషి అవసరమన్నారు.
- కేరళ: రాష్ట్రాల రుణ సమీకరణ పరిమితిని పెంచుతూ కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అయితే, దీనికి సంబంధించి విధించిన ఆంక్షలను వెనక్కు తీసుకోవాలని లేదా వాటిపై రాష్ట్రాలతో చర్చించాలన్నారు. రుణ సమీకరణ పరిమితి పెరగడంవల్ల కలిగే ప్రయోజనం కేవలం రాష్ట్ర ఆదాయ నష్టంలో సగాన్ని మాత్రమే భర్తీ చేయగలదన్నారు. కాబట్టి రాష్ట్ర ఆదాయంలో 5 శాతాన్ని కేంద్ర బడ్జెట్ నుంచి రుణంగా పొందడానికి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక జీఎస్టీ బకాయిలను పూర్తిగా రద్దుచేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు ముందుగానే కార్మికులకు చేరేలా చూడాలని కోరారు. కాగా, మాల్దీవ్స్‌లో చిక్కుకున్న 580 మందికిపైగా భారతీయులు "ఆపరేషన్ సముద్ర సేతు" కింద ఇవాళ కోచ్చి రేవుకు చేరుకున్నారు. వీరిలో 568 మంది కేరళవాసులు కాగా, గల్ఫ్ దేశాలనుంచి రెండు విమానాలు ఇవాళ ఆలస్యంగా రాష్ట్రానికి రానున్నాయి. ఇక నిన్న రాష్ట్రంలో మరో 11 కోవిడ్ -19 కేసులు నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 87కు చేరింది.
- తమిళనాడు: రాష్ట్రంలో మే 31 వరకు దిగ్బంధం పొడిగించబడింది. కాగా, 25 జిల్లాల్లో ప్రజా రవాణా తిరిగి ప్రారంభం కానుంది; అయితే, చెన్నైసహా మరో 12 జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతాయి. నాగపట్టణంలో ఇవాళ ఇద్దరు చెన్నై రేషన్ దుకాణాల ఉద్యోగులకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన కేసులు: 10,585, యాక్టివ్: 6970, మరణాలు: 74, డిశ్చార్జ్: 3538. చెన్నైలో యాక్టివ్ కేసులు 5939గా ఉన్నాయి.
- కర్ణాటక: స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద ఇవాళ ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలతో రాష్ట్రానికి మేలు కలుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఖనిజ రంగాలలో విధాన మార్పులతో రాష్ట్ర ఖనిజ విధానానికి బలం చేకూరుస్తాయని, మైనింగ్ కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా సాగుతాయని ఆయన చెప్పారు. కాగా, ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 54 కొత్త కేసులు నమోదయ్యాయి; వీటిలో మాండ్యా 22, కల్బుర్గి 10, హసన్ 6, ధార్వాడ్ 4, యాదగిరి 3, దక్షిణ కన్నడ, షిమోగాలలో రెండేసి, కోలార్ 3, ఉడిపి, విజయపురాలలో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,146కి చేరుకోగా యాక్టివ్: 611, కోలుకున్నవి: 497, మరణాలు: 37గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: పొరుగు రాష్ట్రాల వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలస కార్మికుల తరలింపునకు ఆదేశాలు జారీచేస్తూ, వారిపై లాఠీచార్జి వంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులకు సూచించింది. కాగా, ఉద్యోగులకు జీతాల్లో కోతకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును సస్పెండ్ చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో మార్చినెలనుంచి పూర్తి జీతాల చెల్లింపుపై ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో అభ్యర్థన దాఖలైంది. రాష్ట్రంలో ఇవాళ 25 కొత్త కేసులు రాగా, ఒక మరణం సంభవించింది. గడచిన 24 గంటల్లో 103 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం కేసులు: 2230గా ఉన్నాయి. వీటిలో యాక్టివ్: 747, రికవరీ: 1433, మరణాలు: 50. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వారిలో 127 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య రీత్యా కర్నూలు (611), గుంటూరు (417), కృష్ణా (367) అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: వందే భారత్ మిషన్‌లో భాగంగా షికాగో (అమెరికా) నుంచి 168 మంది భారతీయులతో వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు హైదరాబాద్‌లో దిగింది. రాష్ట్రంలో ఈ వారం మొత్తంమీద కోవిడ్-19 పీడితుల సంఖ్య 1,509కి పెరిగింది. కాగా, ఇటీవల రాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కార్మికులలో 52 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
PIB FACTCHECK




*******
(Release ID: 1624802)
|