సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉప‌శ‌మ‌న ప్యాకేజీ మరియు కొత్త ఎంఎస్‌ఎంఈ నిర్వచనం పరిశ్రమకు భారీ ప్రోత్సాహాన్నిస్తుంది: శ్రీ గడ్కరీ

- ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ యొక్క రేటింగ్ మరియు సమర్థవంతమైన అమలును అన్వేషించాల‌ని శ్రీ నితిన్ గడ్కరీ పిలుపు

Posted On: 17 MAY 2020 5:46PM by PIB Hyderabad

సూక్ష్మ, చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మలు (ఎంఎస్‌ఎంఈ), కార్మిక, వ్యవసాయంతో పాటుగా
వివిధ భాగ‌స్వామ్యప‌క్షాల‌కు ఆయా రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల‌ ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీతో పాటుగా.. ఎంఎస్‌ఎంఈల కొత్త నిర్వచనంతో పరిశ్రమల‌కు భారీ ప్రోత్సాహాం ల‌భిస్తుంద‌ని ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ఎంఎస్ఎంఈ సంస్థల రేటింగ్‌ను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈల కోసం ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన ఫండ్స్ ఫండ్స్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి త‌గిన సూచనలు ఇవ్వాల‌ని కోరారు. “ఎంఎస్‌ఎంఈలపై కోవిడ్-19 ప్రభావం” మరియు “20 లక్షల కోట్ల ప్యాకేజీ తర్వాత భారత పరిశ్రమ యొక్క భవిష్యత్తు” అనే అంశాల‌పై మంత్రి ఆదివారం బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) మరియు ఎంఎం యాక్టివ్ సైన్స్-టెక్ కమ్యూనికేషన్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి శ్రీ గడ్కరీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. ఆగ్రో ఎంఎస్‌ఎంఈ, ఫిషింగ్ ఎంఎస్‌ఎంఈ రంగాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు.
గ‌ట్టి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాము..
కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వంతో సహా ఆయా రంగాల‌లోని భాగ‌స్వామ్యపు ప‌క్షాల వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ క్లిష్ట సమయాల్లో పరిశ్రమ సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. చైనా నుండి జపనీస్ కంపెనీలు పెట్టుబడులు తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లడానికి జపాన్ ప్రభుత్వం తన పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని అందించిందని గుర్తుచేసిన‌ ఆయన ఇది భారతదేశానికి మంచి అవకాశమని పేర్కొన్నారు. దీనిని అందిపుచ్చుకొనేందుకు కృషి చేయాల‌ని కోరారు. గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ.. గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ద్వారా వెళుతున్న న్యూఢిల్లీ- ముంబై గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. పారిశ్రామిక సమూహాలు, గ్రామీణ, గిరిజన మరియు తక్కువ అభివృద్ధి ప్రాంతాల గుండా వెళ్ళేటప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లాజిస్టిక్స్ పార్కులందు భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమకు ఇది ఒక స‌దావకాశమని ఆయన నొక్కి చెప్పారు.
ప‌ట్టణాల నుంచి ప‌రిశ్ర‌మ‌ల వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాలి..
మెట్రో / పెద్ద నగరాల నుండి పరిశ్రమల వికేంద్రీకరణపై పని చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఆయ‌న సూచించారు. ఎగుమతి మెరుగుదలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని మంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచ మార్కెట్లో పోటీగా మారడానికి విద్యుత్ ఖర్చు, లాజిస్టిక్స్ ఖర్చు మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి అవసరమైన పద్ధతులను అవలంబించాల‌ని ఆయ‌న సూచించారు. వెహికల్ స్క్రాప్ పేజ్ (వీఎస్‌పీ) పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చని ఉదహరించారు. అంతేకాకుండా, విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తితో భర్తీ చేయడానికి దిగుమతి ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గత మూడేండ్ల‌లో ఎగుమతి, దిగుమతి గురించి వివరాలను కవర్ చేయడానికి ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ రెండు బుక్‌లెట్లపై కృషి చేస్తోందని మంత్రి వివ‌రించారు. జ్ఞానాన్ని సంపదగా మార్చడానికి పరిశ్రమలు ఆవిష్కరణ, వ్యవస్థాపకత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధనా నైపుణ్యం మరియు అనుభవాలపై ఎక్కువగా దృష్టి సారించాల‌ని కూడా శ్రీ గడ్కరీ సూచించారు.
ఈ సమావేశంలో లేవ‌నెత్తిన ప్రశ్నలు మరియు సలహాలలో కొన్ని ఇలా ఉన్నాయి:
ప‌్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎలా అనుకూలంగా మార్చుకొని ఉప‌యోగించుకోగ‌ల‌మ‌నే దిశ‌గా మంత్రి చేసిన సూచ‌న‌తో ఎలా ల‌బ్ధి చేకూరుతుంది -సమాజంపై మ‌రింత‌గా ప్రభావం చూపడానికి బీఎన్‌ఐ ఏమి చేయగలదు - కోవిడ్‌-19 వేళ ఇబ్బందుల‌లో ఉన్న సంస్థలకు సందేశం ఏమిటి? సూక్ష్మ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ముద్రా రుణాల పరిమితిని రూ. 25 లక్షలకు పెంచడం - ఎంఎస్‌ఎంఈల కోసం ఇటీవల ప్రకటించిన మూడు లక్షల కోట్ల అనుషంగిక రహిత ఆటోమేటిక్ రుణాలకు సాధారణ మార్గదర్శకాలను జారీ చేయడం. స‌మావేశంలో ప్రతినిధుల ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పరిశ్రమ సానుకూల విధానంతో ముందుకు సాగాల‌న్నారు. కోవిడ్ ‌-19 సంక్షోభం ముగిసిన త‌రువాత ఏర్పడే అవకాశాలను అందిపుచ్చుకొనేలా ముందుకు సాగాల‌ని ఆయ‌న సూచించారు.

 


(Release ID: 1624771) Visitor Counter : 335