PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
• దేశంలో కోవిడ్‌-19 తాజా నిర్ధారిత కేసుల సంఖ్య 5,194 కాగా, 149 మరణాలు నమోదయ్యాయి.
• ప్రతి పౌరుడి ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు వివిధ పార్టీల నాయకులతో ఆయన సంభాషించారు.
• రాష్ట్రాలన్నీ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని దేశీయాంగ శాఖ లేఖ రాసింది.
• రూ.5 లక్షల వరకూ ఆదాయపు పన్నుసహా జీఎస్టీ-కస్టమ్‌ శాఖలలో వాపసు ఇవ్వాల్సిన మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
• చిన్నస్థాయి అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నోడల్‌ ఏజెన్సీలను ఆదేశించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది.

Posted On: 08 APR 2020 6:51PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై తాజా సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 5,194 కాగా- 149 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 402 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కాగా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో దిగ్బంధాన్ని ఏకరీతిలో అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా కోవిడ్‌-19 సమర్థ నిరోధం కోసం పౌరులు సామాజిక దూరం పద్ధతిని కచ్చితంగా పాటించాలని సూచించింది.

మరిన్ని వివరాలకు 

వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రధానమంత్రి సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ రాజకీయ పార్టీల సభాపక్ష నాయకులతో ఇవాళ చర్చలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడి ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఆయన  స్పష్టం చేశారు. మానవాళి చరిత్రలో ప్రస్తుత పరిస్థితి ఒక కొత్త శకంలాంటిదని పేర్కొన్నారు. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు సమష్టిగా మార్గాన్వేషణ చేయాలని చెప్పారు. ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో కేంద్రంతో చేయికలిపి రాష్ట్రాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ యుద్ధంలో అన్ని రాజకీయవర్గాలు కలసికట్టుగా ఒకే జట్టుగా నిర్మాణాత్మక, సానుకూల మార్గంలో పయనించడాన్ని దేశం గమనిస్తున్నదని ప్రధాని చెప్పారు. కాగా, విధాన చర్యలు, దిగ్బంధంసహా ఇక అనుసరించాల్సిన మార్గంపై సమావేశంలో పాల్గొన్న నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

మరిన్ని వివరాలకు  

రాష్ట్రాలన్నీ నిత్యావసర వస్తువుల చట్టం-1955కు అనుగుణంగా ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని దేశీయాంగ శాఖ లేఖ

దేశంలో నిత్యావసరాల సౌలభ్యత దిశగా దేశీయాంగ శాఖ చొరవ చూపింది. ఇందులో భాగంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇందుకోసం నిత్యావసర వస్తువుల చట్టం-1955ను అనుసరించాలని సూచించారు. తదనుగుణంగా సరకు నిల్వలపై పరిమితి విధింపు, ధరల అదుపు, ఉత్పత్తి పెంపు, డీలర్ల ఖాతాల తనిఖీ తదితర చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

మరిన్ని వివరాలకు  

రూ.5 లక్షలవరకూ వాపసు చేయాల్సిన మొత్తాలను వెంటనే విడుదల చేయనున్న ఆదాయపు పన్నుశాఖ; జీఎస్టీ, కస్టమ్స్‌ విభాగాల్లోనూ త్వరలో వాపసు మొత్తాల విడుదల; దీంతో ఎంఎస్‌ఎంఈలుసహా లక్షవరకూ వ్యాపార సంస్థలకు ప్రయోజనం

ఆదాయపు పన్ను వాపసు మొత్తంలో రూ.18,000 కోట్ల మేర తక్షణం విడుదల; 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ధి

మరిన్ని వివరాలకు  

కోవిడ్‌-19 సవాలును ఎదుర్కొనేందుకు 2,500 మంది డాక్టర్లు, 35,000 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించినున్న రైల్వేశాఖ

కరోనా వైరస్‌ మహమ్మారి నిరోధం దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ కృషికి రైల్వేశాఖ పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా రైల్వే ఆస్పత్రులు కూడా కోవిడ్‌-19 సంబంధిత అవసరాలను తీరుస్తున్నాయి. తదనుగుణంగా ఆస్పత్రులలో పడకల కేటాయింపు, డాక్టర్లు-పారామెడికల్‌ సిబ్బంది అదనపు నియామకం, రైళ్ల బోగీలను తాత్కాలిక ఏకాంత చికిత్స గదులుగా మార్చడం, వైద్య పరికరాలు సమకూర్చడం, వెంటలేటర్లుసహా వ్యక్తిగత రక్షణ సామగ్రి సొంతంగా తయారీవంటి అనేక రూపాల్లో సహకారం అందిస్తోంది.

మరిన్ని వివరాలకు 

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై పోరు దిశగా మద్దతు కొనసాగిస్తున్న ఐఏఎఫ్‌

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) విమానాలు గడచిన కొన్ని రోజులుగా కూడలి కేంద్రాల నుంచి అత్యవసర వైద్య పరికరాలు, ఇతర వస్తువులను మణిపూర్‌, నాగాలాండ్‌, గాంగ్‌టక్‌లతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లకు రవాణా చేశాయి. అంతేకాకుండా ఒడిసాలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పన కోసం 06 ఏప్రిల్‌ 2020న చెన్నై నుంచి ఐసీఎంఆర్‌కు చెందిన సిబ్బందితోపాటు 3,500 కిలోల వైద్య పరికరాలను భారీ విమానం ఎఎన్‌-32ద్వారా భువనేశ్వర్‌కు తరలించింది.

మరిన్ని వివరాలకు  

లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలద్వారా 2020 ఏప్రిల్‌ 7న 39 టన్నుల వైద్య సరఫరాలు

లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 2020 ఏప్రిల్‌ 7వ తేదీన దేశవ్యాప్తంగా 39.3 టన్నుల వైద్య సరఫరాలను రవాణా చేశాయి. దీంతో కోవిడ్‌-19 దిగ్బంధం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 240 టన్నుల సరఫరాలను ఈ విమానాలు అందించాయి. ఈ మేరకు నేటివరకూ 161 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 1,41,080 కిలోమీటర్లు ప్రయాణించాయి.

మరిన్ని వివరాలకు 

దిగ్బంధంతో జనపనార మిల్లుల మూసివేతవల్ల ఏర్పడిన ఆహారధాన్యాల ప్యాకింగ్‌ సంక్షోభం నివారణకు హెచ్‌డిపిఇ/పిపి బ్యాగ్‌ల పరిమితిని 1.8లక్షల బేళ్లనుంచి 2.62 లక్షలకు పెంచిన జౌళి మంత్రిత్వ శాఖ

జాతీయ దిగ్బంధంతో జనపనార మిల్లుల మూసివేతవల్ల తలెత్తిన ఆహారధాన్యాల ప్యాకింగ్‌ సంక్షోభం నివారణకు కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు  మార్చి 26న హెచ్‌డిపిఇ/పిపి బ్యాగ్‌ల తయారీని 1.80 లక్షల బేళ్లకు పరిమితం చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సడలిస్తూ ఏప్రిల్‌ 6న మరో 0.82 లక్షల బ్యాగ్‌లకు అనుమతి ఇవ్వడంద్వారా ఉత్పత్తిని 2.62 లక్షల బేళ్లకు పెంచింది. ముఖ్యంగా గోధుమ పంట ప్యాకింగ్‌ కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయం చూసేందుకు ఈ నిబంధనను సడలించింది.

మరిన్ని వివరాలకు 

చిన్న స్థాయి అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నోడల్‌ ఏజెన్సీలను ఆదేశించాలని కోరుతూ 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ శ్రీ అర్జున్‌ ముండా లేఖ

చిన్నస్థాయి అటవీ ఉత్పత్తులను సకాలంలో కనీస అటవీ మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నోడల్‌ ఏజెన్సీలను ఆదేశించాలని కోరుతూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వివిధ  రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, నాగాలాండ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు లేఖలు వెళ్లాయి.

మరిన్ని వివరాలకు

కోవిడ్‌-19 దిగ్బంధం నడుమ ఆహారధాన్యాల సరఫరాలో ఎఫ్‌సీఐ చొరవ;

మార్చి 24 నుంచి 15 రోజుల్లో 721 గూడ్సురైళ్లతో 20.19 లక్షల టన్నుల రవాణా

కోవిడ్‌-19 దిగ్బంధం నడుమ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఆహారధాన్యాల సరఫరాలో భారత ఆహార సంస్థ (FCI) చొరవ చూపింది. ఈ మేరకు 24.03.2020 నుంచి 06.04.2020 వరకు 14 రోజుల వ్యవధిలో 658 గూడ్సు రైళ్లద్వారా 18.42 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రాష్ట్రాలకు చేరవేసింది. దిగ్బంధానికి ముందు రోజుకు సగటున 0.8 లక్షల టన్నులు రవాణా అవుతుండగా, గడచిన 15 రోజుల్లో 1.44 లక్షల టన్నుల వంతున చేరవేసింది.

మరిన్ని వివరాలకు 

దిగ్బంధ సమయంలో వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడే చర్యలపై అధికారులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

వ్యవసాయ కార్యకలాపాల నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలని, అలాగే పంట ఉత్పత్తులు, ఇతర అనుబంధ ఉత్పత్తుల రవాణాకు విఘాతం కలగరాదని శ్రీ ఎన్‌.ఎస్‌.తోమర్‌ ఆదేశించారు.

మరిన్ని వివరాలకు

ఢిల్లీలోని నిరుపేద కుటుంబాలకు కేంద్రీయ భాండార్‌ తయారుచేసిన 2,200 నిత్యావసర కిట్లను పంపిణీ చేసిన డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌-19 నేపథ్యంలో ఢిల్లీలోని నిరుపేద కుటుంబాలకు 2,200 నిత్యావసరాల కిట్లను డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అందజేశారు. ఒక్కొక్క కిట్‌లోనూ 9 రకాల వస్తువులుండగా ప్రతి కుటుంబానికీ కొంతకాలంపాటు అవి ఉపయోగపడతాయి.

మరిన్ని వివరాలకు 

కోవిడ్‌-19 రోగుల పరీక్షకోసం వ్యాధివ్యాప్తి నిరోధక గదిని ఆవిష్కరించిన SCTIMST శాస్త్రవేత్తలు

రోగుల నుంచి డాక్టర్లకు వైరస్‌ సోకకుండా ఈ సంస్థ శాస్త్రవేత్తలు టెలిఫోన్‌ బూత్‌ తరహాలో వ్యాధి వ్యాప్తి నిరోధక గదిని రూపొందించారు. ఇందులో ఒక సాధారణ లైటు, 254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం (వేవ్‌లెంగ్త్‌)గల 15వాట్ల అతినీల లోహిత కిరణాల (UV) బల్బ్‌, టేబుల్‌ ఫ్యాన్‌, ర్యాక్‌ ఉంటాయి.

మరిన్ని వివరాలకు 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

ఈశాన్య భారతం

 • అరుణాచల్‌ ప్రదేశ్‌లో దిగ్బంధ పర్యవేక్షణలోగల కోవిడ్‌-19 పీడితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కోవిడ్‌కేర్‌’ పేరిట యాప్‌ను ప్రారంభించింది.
 • అసోంలో కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిములంతా ఇంటినుంచే ‘షబ్‌-ఎ-బారాత్‌’ పాటించాలని అనేక ఇస్లామిక్‌ సంస్థలు పిలుపునిచ్చాయి.
 • మణిపూర్‌లో కోవిడ్‌-19 నియంత్రణ కోసం దిగ్బంధాన్ని పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
 • మేఘాలయలో జైళ్లలోని ఖైదీల కోసం ఏకాంత చికిత్స గదులను ఏర్పాటు చేశారు.
 • మిజోరంలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసుల కోసం కోలాసిబ్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తలు రక్షణ మాస్కులను తయారుచేసి ఇస్తున్నారు.
 • నాగాలాండ్‌లో ఏప్రిల్‌ 12న ఈస్టర్‌ వేడుకలు నిర్వహించుకోరాదని చర్చిల నిర్వాహకులు నిర్ణయించారు.
 • సిక్కింలోని పాఠశాలలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వంవద్ద నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

పశ్చిమ భారతం

 • గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 5న కోవిడ్-19 నిర్ధారణ అయిన 14నెలల బాలుడు బహుళ అవయవ వైఫల్యంతో మరణించాడు. దీంతో దేశంలో కరోనా బలిగొన్న అతిపిన్న వయస్కుడయ్యాడు. ఈ బాలుడు ఒక వలస కార్మిక దంపతుల కుమారుడు. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 179 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది.
 • మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళ్టినుంచి అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) అమలులోకి తెచ్చింది. కోవిడ్‌-19 జనజీవితాలను స్తంభింపజేసిన నేపథ్యంలో ప్రజలకు అత్యవసరమైన సేవలను కనీస స్థాయిలో అందించడంలో ఈ చట్టం ప్రభుత్వానికి తోడ్పడుతుంది.
 • రాజస్థాన్‌లో తాజాగా 40 కరోనావైరస్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య-కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 328కి చేరగా, జైపూర్‌లో అత్యధికంగా 54 మంది వ్యాధిపీడితులు నమోదయ్యారు.
 • మహారాష్ట్రలో కోవిడ్‌-19పై యుద్ధంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆర్మీలోని వైద్య విభాగంలో పనిచేసి రిటైరైన డాక్టర్లు, నర్సులు, వార్డు సిబ్బందికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించే దిశగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

దక్షిణ భారతం

 • కేరళ: రాష్ట్రంలో దిగ్బంధాన్ని ప్రభుత్వం స్వల్పంగా సడలించింది. ఈ మేరకు గురువారం, ఆదివారాల్లో  వాహన వర్క్‌షాపులను తెరిచేందుకు ఆదేశాలిచ్చింది. మరోవైపు కాసరగోడ్‌ పురపాలిక పరిధిలో 273 పోస్టుల సృష్టికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
 • తమిళనాడు: వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కులు, యాంటీవైరల్‌, యాంటీ మలేరియల్‌ ఔషధాలు, ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ కిట్లు, పీపీఈలు వగైరా తయారుచేసే ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలు ప్రకటించింది.
 • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో ఇవాళ 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 329కి చేరింది. రాష్ట్రంలో కోవిడ్‌-19 తీవ్రతగలవిగా 63 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది.
 • తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడి దిశగా రాష్ట్ర ప్రభుత్వం 100 ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో మరిన్ని ఆంక్షలు విధించనుంది. కాగా, గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో 1,500 పడకలతో కొత్త కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం కానుంది.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 181కి చేరగా మృతుల సంఖ్య 4గా నమోదైంది. మరో 28 మంది కోలుకున్నారు.


(Release ID: 1612375) Visitor Counter : 64