సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు

తదుపరి జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం ఉత్తమ పర్యాటక ప్రదేశాలను ప్రతిపాదించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

జాతీయ పురస్కారాలు కాన్ఫరెన్స్ రూమ్‌కే పరిమితం కాకుండా ప్రజలకు చేరతాయి: అశ్వనీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 1:09PM by PIB Hyderabad

జాతీయ కార్యక్రమాలను సంప్రదాయ వేదికలకు పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆలోచన స్ఫూర్తితో జాతీయ చలనచిత్ర పురస్కారాలను దేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళుతున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు తెలియజేశారు

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉత్తమ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళతాం’’ అని శ్రీ అశ్వనీ వైష్ణవ్ మీడియాతో అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఉన్న ఏక్తానగర్ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఆయన చెప్పారు. భారత రాష్ట్రపతి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఇలాంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే.. ఆ ప్రాంతం గురించి తెలుసుకొనే, అనుభూతి చెందే అవకాశం మరింత మందికి లభిస్తుందని చెప్పారు.

జాతీయ చలనచిత్ర పురస్కారాలను కాన్ఫరెన్స్ రూమ్‌కే పరిమితం చేయకుండా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పర్యాటకం ద్వారా ప్రోత్సహించి, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు

జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఆతిథ్యమిచ్చేందుకు తమ పరిధిలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ప్రతిపాదనలను పంపాలని అన్ని రాష్ట్రాలను శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఆహ్వానించారు. ఉత్తమ సౌకర్యాలతో పాటు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఆ ప్రతిపాదనల్లో ఉండాలని ఆయన సూచించారుఎంపికైన ప్రతిపాదనను పంపిన రాష్ట్రం... తాను సూచించిన పర్యాటక ప్రాంతంలోనే తదుపరి జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఆతిథ్యమిస్తుంది.

గతంలో జీ 20 సదస్సును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో నిర్వహించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినిమా, పర్యాటక రంగాలను ఎలా అనుసంధానించవచ్చో అన్వేషించే విస్తృత ఆలోచనా ప్రక్రియలో భాగంగా జాతీయ చలనచిత్ర అవార్డులను దేశవ్యాప్తంగా తీసుకెళతామని ఆయన తెలియజేశారు.

సినిమా, పర్యాటక రంగాలను ఒక చోట చేర్చడం వల్ల పర్యాటక ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ అన్నారు. అలాగే జాతీయ చలన చిత్ర పురస్కారాలు కాన్ఫరెన్స్ రూమ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భౌగోళిక ప్రాంతాలకు చేరుకొనే వీలు కలుగుతుందని శ్రీ అశ్వనీ వైష్ణవ్ అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2313446) సందర్శకుల సూచీ సంఖ్య : : 9