ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
Posted On:
16 DEC 2024 3:26PM by PIB Hyderabad
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.
2. భారత్-శ్రీలంక ద్వైపాక్షిక భాగస్వామ్యం ఈ రెండు దేశాల మధ్య వేళ్ళూనుకొన్న సాంస్కృతికపరమైన, నాగరికతపరమైన బంధాలు, భౌగోళిక సామీప్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల పునాదులపై ఆధారపడి ఉందని నేతలు ఇద్దరూ పునరుద్ఘాటించారు.
3. శ్రీలంకలో 2022లో అంతకు ముందెన్నడూ చూసి ఎరుగనంతటి ఆర్థిక సంక్షోభం తలెత్తిన సందర్భంలోనూ, ఆ తరువాత కూడా తమ దేశ ప్రజల వెన్నంటి భారత్ దృఢంగా నిలిచినందుకు అధ్యక్షుడు శ్రీ దిసనాయక తన అభినందనలు తెలిపారు. శ్రీలంక ప్రజలు ఒక సమృద్ధ భవిష్యత్తు, గొప్ప అవకాశాలు, స్థిరమైన ఆర్థికవృద్ధిలను కోరుకొంటూ ఉండగా, వాటిని నెరవేర్చుతానంటూ తాను చేసిన వాగ్దానాన్ని ఆయన గుర్తుకు తెస్తూ ఈ లక్ష్యాల సాధనలో భారతదేశం నిరంతర మద్దతు కోసం ఎదురుచూస్తున్నానన్నారు. భారత్ అనుసరిస్తున్న ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ (‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం విధానంలోనూ, ‘సాగర్’ (‘SAGAR’) దార్శనికతలోనూ శ్రీలంకకు ఒక ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టిన విషయాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ ఈ విషయంలో భారత్ వైపు నుంచి పూర్తి సమర్ధనను అందిస్తామంటూ హామీనిచ్చారు.
4. ద్వైపాక్షిక సంబంధాలు కొన్నేళ్ళలో విస్తృతమయ్యాయనీ, శ్రీలంక సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో ఇవి ముఖ్య పాత్రను పోషించాయనీ నేతలిద్దరూ అంగీకరించారు. మరింతగా సహకరించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయని వారు గుర్తిస్తూ, ఇరు దేశాల ప్రజల శ్రేయం కోసం పరస్పర లాభదాయకం కాగలిగే సమగ్ర భాగస్వామ్యాన్ని అనుసరిస్తూ, ఉభయ దేశాల సంబంధాలను ముందుకు తీసుకుపోవడానికి కట్టుబడి ఉందామన్న దృఢ నిశ్చయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ ఆదాన ప్రదానాలు
5. గత పదేళ్ళలో రాజకీయ సంభాషణలు తరచు చోటుచేసుకొంటూ, ద్వైపాక్షిక సంబంధాల్ని బలపరచుకోవడంలో వాటి వంతు పాత్రను పోషించడాన్ని ఇద్దరు నేతలూ ఆమోదిస్తూ రాజకీయ భాగస్వామ్యాన్ని నాయకత్వ స్థాయిలోనూ, మంత్రుల స్థాయిలోనూ మరింతగా వృద్ధి చేసుకోవడానికి అంగీకరించారు.
6. ప్రజాస్వామిక విలువలను ప్రోత్సహించుకోవడానికి సంస్థాగతంగా ఉత్తమ పద్ధతులను అనుసరించడంలో ఒక దేశం ప్రావీణ్యాన్ని ఇంకొక దేశంతో పంచుకోవడానికి పార్లమెంటరీ స్థాయి ఆదాన ప్రదానాలు క్రమం తప్పక చోటు చేసుకొంటూ ఉండేందుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని కూడా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
అభివృద్ధి ప్రధాన సహకారం
7. సామాజికంగా, ఆర్థికంగా శ్రీలంక సాధించిన వృద్ధిలో భారతదేశం అందించిన అభివృద్ధి ప్రధాన సహాయం ఒక ప్రముఖ పాత్రను పోషించి సానుకూల ప్రభావాన్ని ప్రసరింప చేసిందని నేతలిద్దరూ అంగీకరించారు. ప్రస్తుతం రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టుల అమలులో భారత్ తన మద్దతును కొనసాగిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ దిసనాయక ప్రశంసలను వ్యక్తం చేశారు. ‘లైన్స్ ఆఫ్ క్రెడిట్’ (పరపతి సదుపాయాల) రూపేణా తొలుత ఆర్థిక సహాయాన్ని తమ దేశం పొందినప్పటికీ, గ్రాంటు రూపేణా సాయాన్ని అందించాలని భారతదేశం నిర్ణయించి శ్రీలంక రుణ భారాన్ని తగ్గించినందుకు కూడా ఆయన తన ఆమోదాన్ని తెలియజేశారు.
8. ఫలితాలను ప్రజలకు అందించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో కలిసి పనిచేద్దామన్న తమ వాగ్దానాన్ని నేతలిద్దరూ పునరుద్ఘాటిస్తూ ఈ కింద పేర్కొన్న అంశాలపై అంగీకారాన్ని తెలియజేశారు:
i. శ్రీలంకలో ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టులో మూడో దశ, నాలుగో దశలను, 3 ఐలాండ్స్ హైబ్రీడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును, హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అనుకున్న కాలానికే పూర్తి చేయడానికి కలిసి పనిచేయడం.
ii. శ్రీలంక తూర్పు ప్రావిన్సులో భారత సంతతికి చెందిన తమిళుల కోసం చేపట్టిన ప్రాజెక్టులను, ధార్మిక ప్రదేశాలలో సౌర విద్యుతీకరణ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సంపూర్ణ మద్దతును అందించడం.
iii. శ్రీలంక ప్రభుత్వ ప్రాధాన్యాలకు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కొత్త కొత్త ప్రాజెక్టులనూ, సహకారం అవసరమయ్యే రంగాలనూ గుర్తించడం.
శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు
9. శ్రీలంకకు సామర్థ్యాల పెంపుదల కార్యక్రమాల్లో మద్దతును ఇవ్వడంలో వివిధ రంగాలలో శిక్షణావసరాలను లెక్కలోకి తీసుకొని వాటిని నెరవేర్చడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రను గుర్తిస్తూ ఈ కింద పేర్కొన్న అంశాల్లో నేతలు..:
i. శ్రీలంకలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 1500 మంది ప్రభుత్వోద్యోగులకు నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) మాధ్యమం ద్వారా భారతదేశంలో శిక్షణను ఇవ్వడానికి అంగీకరించారు.
ii. శ్రీలంక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పౌర, రక్షణ, న్యాయ తదితర రంగాలలో శ్రీలంకకు చెందిన అధికారులకు ఇప్పటికన్నా ఎక్కువ శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.
రుణ పునర్‌వ్యవస్థీకరణ
10. అత్యవసర ప్రాతిపదికన ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్య రూపేణా కూడా మద్దతును ఇస్తూ, ఇవే కాకుండా ఇంకా బహుళవిధ సహాయాన్ని అందించడం ద్వారా శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో నిలకడతనాన్ని తీసుకురావడంలో భారత్ అందించిన సమర్థనకుగాను ప్రధాని శ్రీ మోదీకి... శ్రీలంక అధ్యక్షుడు శ్రీ దిసనాయక ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక రుణ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాల విధానంలో ఖరారు చేయడంలో అఫిషియల్ క్రెడిటర్స్ కమిటీ (ఓసీసీ) కి సహాధ్యక్షత వహించడం సహా ఈ ప్రక్రియలో భారత్ కీలక సాయాన్ని అందించిందని ఆయన ఒప్పుకొన్నారు. ‘లైన్స్ ఆఫ్ క్రెడిట్’ పద్ధతిన ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు శ్రీలంక చెల్లించవలసిన బకాయిలను తీర్చడానికి 20.66 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం అందించి, తద్వారా ఒక కీలకమైన కాలంలో రుణ భారాన్ని చెప్పుకోదగినంతగా తగ్గించినందుకు కూడా ఆయన ధన్యవాదాలను తెలియజేశారు. శ్రీలంకతో భారతదేశానికి సన్నిహిత సంబంధాలేగాక ప్రత్యేక సంబంధాలూ ఉన్నాయన్న సంగతిని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ఆ దేశానికి అవసరమైన అన్ని సమయాల్లోనూ ఆ దేశ ప్రజలకు ఆర్థికంగా గడ్డు స్థితి నుంచి బయటపడడానికీ, వారు అభివృద్ధి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో తమ దేశం నిరంతరంగా అండగా నిలబడుతుందని ప్రధాని పునరుద్ఘాటించారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ అంశంపై ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం జరుపుతున్న చర్చలకు తుదిరూపాన్ని ఇవ్వాలంటూ అధికారులను నేతలు ఆదేశించారు.
11. వివిధ రంగాల్లో రుణ ప్రధాన నమూనాల స్థితి నుంచి పెట్టుబడి ప్రధాన భాగస్వామ్యాలను నెలకొల్పుకొనే స్థితికి వ్యూహాత్మకంగా మరలినట్లయితే, అది శ్రీలంక ఆర్థిక పునరుత్తేజానికి, అభివృద్ధికి, సమృద్ధికి మరింత శ్రేయోదాయక మార్గాన్ని అందించగలుగుతుందంటూ నేతలిరువురూ వారి సమ్మతిని తెలియజేశారు.
సంధాన సామర్థ్యాన్ని సమకూర్చడం
12. కనెక్టివిటీని (సంధానాన్ని) ఇప్పటికన్నా పెంచుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని నేతలు స్పష్టంచేస్తూ, రెండు దేశాల మధ్య పరస్పర పూరకాలుగా ఉన్న అంశాల్ని గుర్తించి వాటిని ఇరు దేశాల ఆర్థికాభివృద్ధి సాధనకు వినియోగించుకోవచ్చని అంగీకరించారు. ఈ విషయంలో:
i. నాగపట్టినం - కనకేశన్‌తురై మార్గంలో ప్రయాణికుల ఫెర్రీ సర్వీసును పునరుద్ధరించడం సంతోషదాయకమని వారు అభిప్రాయపడ్డారు. రామేశ్వరానికి - తలైమన్నార్‌కు మధ్య ఫెర్రీ సర్వీసును వీలైనంత త్వరలో పునఃప్రారంభించేందుకు అధికారులు కలిసి కసర్తతు చేయాలని కూడా వారు తమ అంగీకారాన్ని తెలిపారు.
ii. శ్రీలంకలో కనకేశన్‌తురై పునర్నిర్మాణ పనులపై కలసి పనిచేయడానికి ఉన్న అవకాశాల్ని అన్వేషించాలనీ, ఈ పనిని పూర్తిచేయడానికి భారత ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేయాలనీ సంకల్పించారు.
ఇంధన వనరుల అభివృద్ధి
13. ప్రజల కనీస అవసరాల్ని తీర్చడానికీ, వారికి ఇంధన భద్రతకు పూచీ పడడానికీ నమ్మకమైన, చౌకైన ఇంధన వనరులను ఎప్పటికప్పుడు సమకూర్చాలని నేతలిద్దరు స్పష్టం చేశారు. ఇంధన రంగంలో సహకారాన్ని బలపరచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని వారు ఉద్ఘాటించారు. భారతదేశానికీ, శ్రీలంకకూ మధ్య ప్రస్తుతం అమలవుతున్న ఇంధన ప్రధాన సహకార ప్రాజెక్టులను అనుకున్న కాలానికే పూర్తి చేసేటట్లు తగిన చర్యలను తీసుకోవాలని వారు భావించారు. ఈ విషయంలో నేతలు ఈ కింద ప్రస్తావించిన అంశాల్లో వారి అంగీకారాన్ని తెలియజేశారు:
i. సంపూర్‌లో చేపట్టిన సౌర విద్యుత్తు పథకాన్ని అమలుచేసే దిశలో చర్యలు తీసుకోవడం, శ్రీలంక అవసరాలకు తగినట్లు ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింతగా పెంచడం.
ii. ఈ కింద పేర్కొన్న ప్రకారం చర్చల రూపేణా వివిధ దశల్లో ఉన్న అనేక ప్రతిపాదనలను ఇక మీదట సమగ్రంగా పరిశీలిస్తూ ఉండడం:
(ఎ) భారతదేశం నుంచి శ్రీలంకకు ఎల్ఎన్‌జీ సరఫరా.
(బి) భారతదేశానికి శ్రీలంకకు మధ్య అధిక సామర్థ్యంతో కూడిన విద్యుత్తు గ్రిడ్ అనుసంధాన సదుపాయాన్ని ఏర్పాటుచేయడం.
(సి) తక్కువ ఖర్చులో విశ్వసనీయ స్థాయిలో ఇంధన వనరులను శ్రీలంకకు అందించడానికి భారత్ నుంచి ఒక బహువిధ ఉత్పాదనల చేరవేతకు ఉద్దేశించిన గొట్టపు మార్గం ప్రాజెక్టును అమలు చేయడానికి భారత్, శ్రీలంక, యూఏఈలు పరస్పరం సహకరించుకోవడం.
(డి) పాక్ జలసంధి ప్రాంతంలో సముద్ర తీరానికి దూరంగా (ఆఫ్‌షోర్) పవన విద్యుత్తు ఉత్పాదనకు కలిసి ప్రయత్నాలు చేయడం, దీంతోపాటే అక్కడి వృక్ష జంతుజాలం సహా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం.
14. ట్రింకోమలీ ట్యాంక్ ఫారాలను ఇప్పటికే కలసి అభివృద్ధి చేస్తున్న విషయాన్ని వారు అంగీకరిస్తూ, ట్రింకోమలీని ప్రాంతీయ ఇంధన పారిశ్రామిక కూడలి అభివృద్ధికి కూడా మద్దతును అందించాలని అంగీకరించడం.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని డిజిటలీకరణ
15. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని డిజిటలీకరణ రంగంలో భారత్ విజయవంతమైన ఫలితాలను సాధించిందని అధ్యక్షుడు శ్రీ దిసనాయక అంగీకరిస్తూ, శ్రీలంకలో ఇదే తరహా వ్యవస్థలను భారతదేశ సహాయంతో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి తన ప్రభుత్వం ఆసక్తితో ఉందని తెలియజేశారు. ప్రజా కేంద్రిత డిజిటలీకరణ.. పాలనను మెరుగుపరచడంలో, సేవల అందజేత రూపురేఖల్లో మార్పులను తీసుకురావడంలో, పారదర్శకతను ప్రవేశపెట్టడంలో, సామాజిక సంక్షేమానికి తోడ్పాటును ఇవ్వడంలో.. తోడ్పడింది. ఈ విషయంలో, శ్రీలంక చేసే ప్రయత్నాలకు పూర్తిగా మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఈ కింద ప్రస్తావించిన అంశాలపై అంగీకారాన్ని వ్యక్తం చేశారు:
i. శ్రీలంక యూనీక్ డిజిటల్ ఐడెంటిటీ (ఎస్ఎల్‌యూడీఐ) ప్రాజెక్టు త్వరితగతిన అమలు అయ్యేటట్టు చూడడం, తద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవల అందజేత వ్యవస్థను మెరుగుపరచే దిశలో శ్రీలంక చేస్తున్న ప్రయత్నాలకు సాయపడడం.
ii. భారతదేశం నుంచి అందే సాయంతో శ్రీలంకలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి ఉన్న అవకాశాలపై సహకరించుకోవడం.
iii. భారతదేశంలో ఇప్పటికే పక్కగా అమరిన వ్యవస్థలు అందించిన ఫలితాలను ఆధారం చేసుకొని శ్రీలంకలో ఒక డీపీఐ స్టాక్‌ను అమలుపరచడానికి ఏమేరకు అవకాశం ఉందో పరిశీలించడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేయడం.. దీనిలో శ్రీలంకలో డిజిలాకర్ (DigiLocker) వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఇప్పటికే నిర్వహిస్తున్న సాంకేతిక చర్చలను మరింత ముందుకు తీసుకుపోవాలనే అంశం.. కూడా ఒక భాగంగా ఉంది.
iv. ఉభయ దేశాలకు ప్రయోజనం కలిగేటట్లుగా యూపీఐ ఆధారిత డిజిటల్ మాధ్యమ చెల్లింపుల వినియోగ పద్ధతి పరిధిని విస్తరిస్తూ డిజిటల్ ఆర్థిక లావాదేవీల్ని ప్రోత్సహించడం. దీనిలో భాగంగా ఇరు దేశాల్లో చెల్లింపుల వ్యవస్థకు సంబంధించిన నియంత్రణ పూర్వక మార్గదర్శకాలను పాటించడం.
v. భారతదేశంలో ఆధార్ (Aadhaar) కార్యక్రమం, జీఇఎమ్ (GeM) పోర్టల్, ‘పీఎమ్ గతి శక్తి’ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్, కస్టమ్స్, ఇతర పన్నుల వసూళ్ళకు సంబంధించిన డిజిటల్ ప్రక్రియలు సాధిస్తున్న ఫలితాల నుంచి పాఠాలను స్వీకరించడానికి నిపుణుల బృందాలను ఒక దేశానికి మరొకటి పంపించుకోవడాన్ని కొనసాగించడం. ఇదే తరహా వ్యవస్థలను శ్రీలంకలో స్థాపించి, అవి అందించే లాభాలను స్వీకరించాలన్న ఉద్దేశమూ దీని వెనుక ఉంది.
విద్య, టెక్నాలజీ
16. శ్రీలంకలో నవకల్పన (ఇనోవేషన్), టెక్నాలజీ - ఈ రెండిటినీ ప్రోత్సహించడానికి మానవ వనరుల అభివృద్ధికి అండదండలను అందించడానికి ఇద్దరు నేతలు ఈ కింది అంశాలపై అంగీకారాన్ని తెలియజేశారు:
i. వ్యవసాయం, చేపలు, రొయ్యల పెంపకం, డిజిటల్ ఎకానమీ, ఆరోగ్య సంరక్షణలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడ్డ ఇతర రంగాల్లో పరిశోధన-అభివృద్ధి అంశాలలో ఇప్పుడు కొనసాగుతున్న సహకార పరిధిని విస్తరించడం.
ii. రెండు దేశాల్లో విద్యబోధన సంస్థల మధ్య సహకారానికి ఉన్న మార్గాలను అన్వేషించడం.
iii. ‘స్టార్ట్-అప్ ఇండియా’కూ, శ్రీలంక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఐసీటీఏ)కీ మధ్య, అలాగే శ్రీలంకలో స్టార్ట్-అప్‌స్‌కు సలహాలను ఇవ్వడం.. ఈ అంశాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం.
వ్యాపారం, పెట్టుబడిపరమైన సహకారం
17. ఇండియా - శ్రీలంక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం (ఐఎస్ఎఫ్‌టీఏ) రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపారపరమైన భాగస్వామ్యాన్ని పెంచిందని నేతలిద్దరూ ప్రశంసించారు. అయితే, వ్యాపార సంబంధాలను విస్తరించుకొనేందుకు ఇప్పటికీ ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని వారు అంగీకరించారు. భారతదేశంలో అవకాశాలతోపాటు ఆర్థిక వృద్ధి వేగాన్ని నేతలు గమనించడంతోపాటు మార్కెట్ అంతకంతకూ పెరుగుతూ భారత్‌లో వ్యాపారం చేయడానికీ, పెట్టుబడి పెట్టడానికీ శ్రీలంకకు అవకాశాలు ఉన్నాయని నేతలిద్దరూ గ్రహించి ఈ కింది అంశాల్లో చొరవ తీసుకోవడం ద్వారా వ్యాపార భాగస్వామ్యాన్ని ఇప్పటికన్నా మరింత పెంచుకొనేందుకు ఇదే సరైన సమయమని అంగీకరించారు:
i. ఎకనామిక్, టెక్నలాజికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్‌పై చర్చలను కొనసాగించడం.
ii. ఉభయ దేశాల మధ్య ఐఎన్ఆర్-ఎల్‌కెఆర్ వ్యాపార ఒప్పందాలను ప్రోత్సహించడం.
iii. శ్రీలంకకు ఎగమతి అవకాశాలు వృద్ధి చెందేలా కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం.
18. ప్రతిపాదిత ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాన్ని వీలైనంత త్వరలో ఖరారు చేయడానికి ఉద్దేశించిన చర్చలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అంగీకరించారు.
వ్యవసాయం, పశు పోషణ
19. శ్రీలంకలో ఆ దేశ స్వయంసమృద్ధి, పోషణ భద్రత.. ఈ రెండిటినీ ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పాడి రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రస్తుతం కొనసాగిస్తున్న సహకారపూర్వక కార్యక్రమాలను ఇద్దరు నేతలు ప్రశంసించారు.
20. వ్యవసాయరంగ ఆధునికీకరణకు అధ్యక్షుడు శ్రీ దిసనాయక ప్రాధాన్యాన్నిస్తూ వస్తుండడాన్ని నేతలిద్దరూ గమనించి, శ్రీలంక వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేయాలని అంగీకరించారు.
వ్యూహాత్మక, రక్షణ రంగ సహకారం
21. భారతదేశానికి, శ్రీలంకకు ఉమ్మడి భద్రత ప్రయోజనాలున్నాయన్న విషయాన్ని నేతలిద్దరూ గుర్తించారు. పరస్పర విశ్వాసాన్ని, పారదర్శకతను ఆధారం చేసుకొని క్రమం తప్పక సంభాషణలు జరుపుతూ ఉండే ప్రక్రియను అనుసరించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని వారు అంగీకరించారు. సహజ భాగస్వామ్య దేశాలు అయినందువల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ రెండు దేశాలూ ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ళను నేతలు గుర్తెరిగి, సంప్రదాయక, సంప్రదాయేతర ముప్పులను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, ఒక స్వేచ్ఛాయుత, బాహాట, సురక్షిత, భద్రతాయుత హిందూ మహాసముద్ర ప్రాంతం ఆవిష్కరణకు కట్టుబడి పనిచేయాలని కూడా వారు సమ్మతించారు. శ్రీలంకకు భారత్ అత్యంత సన్నిహిత నౌకా వాణిజ్య సంబంధాలున్న పొరుగు దేశం అయినందువల్ల, భారత్ భద్రతతోపాటు ప్రాంతీయ స్థిరత్వానికి హానిని కలిగించే ఎలాంటి కార్యకలాపాలకూ శ్రీలంక భూభాగాన్ని అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసిన వైఖరిని అధ్యక్షుడు శ్రీ దిసనాయక పునరుద్ఘాటించారు.
22. శిక్షణ, ఆదాన- ప్రదాన కార్యక్రమాలు, నౌకా యాత్రలు, ద్వైపాక్షిక విన్యాసాలు, రక్షణ సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో అందిస్తున్న సహాయ రూపాలలో ప్రస్తుతం ఇచ్చి పుచ్చుకొంటున్న రక్షణ రంగ సహకారంపై ఇద్దరు నేతలూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నౌకా వాణిజ్య సంబంధాలను, భద్రత ప్రధాన సహకారాన్ని పెంపొందింపరేసుకోవడానికి అంగీకరించారు.
23. నౌకా వాణిజ్య నిఘాకు ఒక డార్నియర్ విమానాన్ని సమకూర్చడంతోపాటు శ్రీలంక తన నౌకా వాణిజ్యరంగ అవగాహనను పెంపొందించుకోవడంలో, కీలక ‘మ్యారిటైమ్ రెస్క్యూ అండ్ కోఆర్డినేషన్ సెంటర్’ను ఏర్పాటు చేయడంలో, ఇంకా ఇతరత్రా కీలక సహాయాల్ని అందించడంలో భారత్ దన్నుగా నిలిచినందుకు అధ్యక్షుడు శ్రీ దిసనాయక ధన్యవాదాలు తెలిపారు. మానవతాపూర్వక సహాయం, విపత్తు సహాయక చర్యల రంగంలో శ్రీలంకకు విపత్కర సమయాల్లో ‘మొట్టమొదట స్పందిస్తున్న దేశం’గా భారత్ నిలుస్తున్నందుకు కూడా ఆయన ప్రశంసలను కురిపించారు. ముఖ్యంగా ఇటీవల పెద్దఎత్తున మత్తుపదార్థాలను అక్రమంగా చేరవేస్తుండగా అనుమానితులతో సహా నౌకలను స్వాధీనపరచుకోవడంలో భారత్-శ్రీలంక నౌకాదళాల సమన్వయపూర్వక ప్రయత్నాలు విజయవంతంగా ముగియడాన్ని అధ్యక్షుడు శ్రీ దిసనాయక ప్రస్తావించి, భారతీయ నౌకాదళానికి తన కృతజ్ఞతలను తెలిపారు.
24. శ్రీలంక రక్షణ రంగ అవసరాలను, నౌకా వాణిజ్య ప్రధాన భద్రత అవసరాలను సమర్థంగా నెరవేర్చుకోవడంలో, అంతేకాకుండా శ్రీలంకకు నౌకా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించుకోవడానికి తగిన శక్తియుక్తులను పెంపొందించుకోవడంలో ఆ దేశంతో అత్యంత సన్నిహిత పద్ధతుల్లో సహకారాన్ని కొనసాగిస్తానంటూ భారత్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
25. ఉగ్రవాదం, మత్తుపదార్థాల దొంగ రవాణా, మనీలాండరింగ్‌ల వంటి వివిధ ముప్పులను నేతలిద్దరూ గమనించి, ఈ ముప్పులను దీటుగా ఎదుర్కోవడానికి శిక్షణ, సామర్థ్యాల్ని పెంపొందించుకొనే కార్యక్రమాలను అమలుచేయడం, రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం కోసం ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలను మరింత పటిష్టం చేసుకోవడానికి సైతం అంగీకారాన్ని తెలియజేసుకొన్నారు. ఈ సందర్భంగా వారు ఈ కింద ప్రస్తావించిన అంశాలపై తమ సమ్మతి తెలిపారు:
i. రక్షణ సహకారం అంశంలో ఒక ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌కు తుది రూపాన్ని ఇచ్చేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించడం,
ii. జలవనరుల అధ్యయన శాస్త్ర పరమైన సహకారాన్ని పెంపొందించుకోవడం.
iii. శ్రీలంక రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన సహాయాన్ని అందజేయడం,
iv. సంయుక్త అభ్యాసాలు చేపట్టడం, నౌకా వాణిజ్య రంగంలో నిఘాను పెంచడం, రక్షణ రంగ అధికారుల మధ్య సంభాషణలతోపాటు ఇరు దేశాలలో వారి పర్యటనల రూపంలో పరస్పర సహకారం స్థాయిని పెంచడం.
v. శిక్షణ, సంయుక్త అభ్యాసాలు, ఉత్తమ పద్ధతులను గురించి తెలియజేసుకోవడంవంటి మార్గాలు సహా, విపత్తువేళల్లో వాటిల్లే నష్టాన్ని తగ్గించడం, సహాయక పునరావాస కార్యక్రమాలను చేపట్టడంలో శ్రీలంక సత్తాను మరింతగా పెంచుకోవడంలో ఆ దేశానికి సాయపడడం.
vi. శ్రీలంక రక్షణ దళాలకు శిక్షణను ఇవ్వడం, ఆ దళాల సామర్థ్య పెంపుదల కార్యక్రమాల సంఖ్యను పెంచడం, అవసరానికి తగినట్లు స్పందించే విధంగా నిర్దిష్ట శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం.
సాంస్కృతిక రంగంలో, పర్యటన రంగంలో అభివృద్ధికి తోడ్పాటు
26. రెండు దేశాలకు సంస్కృతిపరంగా చూసినప్పుడు పోలిక, భౌగోళిక సామీప్యమున్న సంగతిని నేతలిద్దరూ లెక్కలోకి తీసుకొని ఇరు దేశాల మధ్య సంస్కృతి, పర్యాటక రంగాల్లో సంబంధాలను ఇప్పటికన్నా ఎక్కువగా ప్రోత్సహించాల్సి ఉందని తీర్మానించుకొన్నారు. శ్రీలంకకు పర్యాటక రంగంలో ఎక్కువగా భారత్ వైపునుంచే పర్యాటకులు తరలి వెళ్తున్న సంగతిని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు నేతలు ఈ కింద ప్రస్తావించిన అంశాల్లో నిబద్ధతను వ్యక్తం చేశారు:
i. చెన్నై, జాఫ్నాల మధ్య విమాన సేవలను విజయవంతంగా పునరుద్ధరించిన అంశాన్ని గమనించి భారతదేశంలో, శ్రీలంకలో వివిధ గమ్యస్థానాలకు గగనతల సంధానాన్ని పెంచడం.
ii. శ్రీలంకలో విమానాశ్రయాల అభివృద్ధి అంశంపై చర్చలను కొనసాగించడం.
iii. శ్రీలంకలో పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉద్దేశించిన భారతీయ పెట్టుబడులను ప్రోత్సహించడం.
iv. ధార్మిక ప్రధాన పర్యటనలనూ, సంస్కృతి ప్రధాన పర్యటనలనూ ప్రోత్సహించడానికి ఒక సౌకర్య ప్రదాయక ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పాటు చేయడం.
v. ఇరు దేశాల మధ్య సంస్కృతి ప్రధానమైన, భాషాప్రధానమైన సంబంధాలు పురోగమించేటట్లు చూడడానికి విద్యబోధన సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం.
మత్స్య పరిశ్రమకు సంబంధించిన అంశాలు
27. రెండు దేశాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను, దీనిలో ఇమిడి ఉన్న జీవనోపాధిని లెక్కలోకి తీసుకొని ఈ సమస్యలను మానవీయకోణంలో పరిష్కరిస్తూ ఉండడాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలిద్దరూ అంగీకరించారు. ఈ విషయంలో ఎలాంటి దౌర్జన్యపూర్వక చర్యలకు గాని, లేదా హింసకు గాని తావు ఇవ్వకుండా చర్యలను చేపట్టాల్సి ఉందని వారు స్పష్టం చేశారు. కొలంబోలో ఇటీవలే మత్స్య పరిశ్రమ అంశంపై ఆరో సంయుక్త కార్యాచరణ బృందం సమావేశం ముగియడాన్ని వారు స్వాగతించారు. సంభాషణ మాధ్యమం ద్వారానూ, ఫలప్రదమైన రీతినసాగే కార్యక్రమ అమలు ద్వారానూ దీర్ఘకాలంపాటు అమలుకాగలిగే పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని సాధించవచ్చన్న విశ్వాన్ని నేతలు వ్యక్తం చేశారు. భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ప్రత్యేక సంబంధాలున్న కారణంగా అధికారులు ఈ అంశాలను పరిష్కరించడంలో వారి చొరవలను ఇకముందు కూడా కొనసాగించాలని నేతలు ఆదేశించారు.
28. శ్రీలంకలో పాయింట్ పెడ్రో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, కారైనగర్ బోట్‌యార్డు పునఃస్థాపన, చేపల, రొయ్యల పెంపకంలో సహకారం.. ఈ అంశాలు సహా, వాణిజ్య సరళిలో మత్స్య పరిశ్రమ అభివృద్దిచెందే దిశలో భారత్ సాయపడుతున్నందుకు అధ్యక్షుడు శ్రీ దిసనాయక ధన్యవాదాలు తెలిపారు.
ప్రాంతీయ సహకారం - బహుళపక్ష సహకారం
29. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు దేశాలకు ఉమ్మడి నౌకావాణిజ్య భద్రతపరమైన ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని నేతలిద్దరు గుర్తించి, ప్రాంతీయ నౌకా వాణిజ్య భద్రతను సంయుక్త పద్ధతిలో పటిష్టపరచుకోవాలని, దీనికోసం ద్వైపాక్షికంగాను, ప్రస్తుతం అమలుపరుస్తున్న ప్రాంతీయ ఫ్రేమ్‌వర్క్‌ల మాధ్యమం ద్వారాను ముందుకుపోవాలని అంగీకరించారు. ఈ విషయంలో కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ను కొలంబోలో నిర్వహించిన సందర్భంగా ఫౌండింగ్ డాక్యుమెంట్స్‌పై సంతకాలు జరగడాన్ని నేతలు స్వాగతించారు. ఈ కాన్‌క్లేవ్ లక్ష్యాలను ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో శ్రీలంకకు మద్దతిస్తానని భారత్ పునరుద్ఘాటించింది.
30. ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్)కు శ్రీలంక అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆ దేశానికి భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భద్రతకు, అభివృద్ధికి ఐఓఆర్ఏ సభ్య దేశాలన్నీ కలిసి ఒక గణనీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
31. బిమ్స్‌టెక్ (BIMSTEC) పరిధిలో ప్రాంతీయ సహకారాన్ని మరింత బలపరచుకోవడానికీ, పెంచుకోవడానికీ ఇద్దరు నేతలు వారి నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావించారు.
32. బ్రిక్స్‌లో సభ్య దేశంగా చేరడానికి శ్రీలంక పెట్టుకున్న దరఖాస్తును బలపరచాల్సిందిగా ప్రధాని శ్రీ మోదీని అధ్యక్షుడు శ్రీ దిసనాయక కోరారు.
33. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో 2028-2029కి గాను ఒక శాశ్వతేతర స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని శ్రీలంక సమర్ధించడాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వాగతించారు.
ముగింపు
34. ప్రస్తావించుకొన్న మేరకు పరస్పరం అంగీకారం కుదిరిన నిర్ణయాలను ప్రభావవంతమైన పద్ధతిలో అనుకున్న కాల వ్యవధుల లోపల అమలు చేసినట్లయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాఢతరం కావడంతోపాటు ఈ సంబంధాలలో ఇరుగు పొరుగు దేశాలతోపాటు మిత్రపూర్వక దేశాల మధ్య నెలకొనే సంబంధాలపరంగా ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పడం సాధ్యపడగలదని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా వారు అవగాహనలు కార్యరూపందాల్చే దిశలో తగిన చర్యలను మొదలుపెట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. అవసరమైన చోటల్లా మార్గదర్శనం చేయడానికీ అంగీకరించారు. రెండు దేశాలకు ప్రయోజనాలు అందించే, శ్రీలంకలో దీర్ఘకాలికాభివృద్ధి అవసరాలను తీర్చే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత్వానికి తోడ్పడే తరహా ద్వైపాక్షిక సంబంధాలను గుణాత్మక పద్ధతిలో పెంపొందించడానికి నాయకత్వ స్థాయిలో తరచుగా సంభాషణలు జరపడానికి సిద్ధమని కూడా వారు తెలిపారు. వీలైనంత త్వరలో శ్రీలంకలో ప్రధానమంత్రి శ్రీ మోదీ పర్యటించాలంటూ ఆయనను అధ్యక్షుడు శ్రీ దిసనాయక ఆహ్వానించారు.
(Release ID: 2085889)
Visitor Counter : 15
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam