వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మాస్కో ‘వీటీబీ రష్యా కాలింగ్’ పెట్టుబడుల సదస్సులో ప్రధానమంత్రి మోదీ “ఇండియా ఫస్ట్” విధానం, “మేకిన్ ఇండియా” పథకాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్ లో ఉత్పత్తుల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసిన పుతిన్
చిన్న, మధ్య తరహా పరిశ్రమల పురోభివృద్ధికి భారత్-రష్యా సహకారం కీలకం
గ్లోబల్ సౌత్ ఆర్థిక వ్యవస్థలకు ‘బ్రిక్స్’ పెట్టుబడుల వేదిక దన్నుగా నిలవగలదన్న పుతిన్
Posted On:
05 DEC 2024 12:48PM by PIB Hyderabad
మాస్కోలో ఏర్పాటైన 15వ ‘వీటీబీ రష్యా కాలింగ్’ పెట్టుబడుల సదస్సులో ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి మోదీ “ఇండియా ఫస్ట్” విధానం, “మేకిన్ ఇండియా” పథకాలను ప్రశంసించారు. అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు భారత్ చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, ఈ విధానాలే భారత్ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.
ఉత్పత్తుల తయారీ వేగవంతం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన “మేకిన్ ఇండియా” పథకం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసిందన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం సాధించిన ఆర్థిక ప్రగతికి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు అద్దం పట్టాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి దిశగా “అనుకూల వాతావరణం” కల్పిస్తున్న భారత ప్రభుత్వాన్ని పుతిన్ ప్రశంసించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం అనేక ఆర్ధిక పురోభివృద్ధి పథకాలను చేపడుతోందంటూ “మేకిన్ ఇండియా” పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రష్యా ‘దిగుమతి ప్రత్యామ్నాయ పథకం’, భారత్ ‘మేకిన్ ఇండియా’ పథకాల మధ్య పోలికలున్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉత్పత్తుల తయారీకి రష్యా సిద్ధంగా ఉందని ప్రకటిస్తూ, పెట్టుబడులకు తగ్గ లాభాలు అందగలవన్న విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందన్నారు.
‘‘మేకిన్ ఇండియా- పేరిట ప్రధాని మోదీ ఇటువంటి పథకాన్నే అమలు చేస్తున్నారు. భారత్ లో ఉత్పత్తులను తయారు చేసేందుకు మేం సిద్ధం. ప్రధానమంత్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ‘ఇండియా ఫస్ట్’ విధానం వల్ల పరిశ్రమ అనుకూల వాతావరణం ఏర్పడింది. భారత్ లో పెట్టుబడులు లాభాలను అందిస్తాయని భావిస్తున్నాం” అని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. రష్యాకు చెందిన ‘రాస్నెఫ్ట్’ కంపెనీ భారతదేశంలో ఇటీవల 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు.
బ్రిక్స్ కూటమి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో... చిన్న, మధ్యతరహా పరిశ్రమల పురోభివృద్ధి లక్ష్యంగా రష్యా చేపట్టిన ‘దిగుమతుల ప్రత్యామ్నాయ పథకం’ గురించి శ్రీ పుతిన్ తెలియజేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సులభతర వాణిజ్యాన్ని కొనసాగించేందుకు బ్రిక్స్ సభ్య దేశాలూ, ఆసక్తిగల ఇతర దేశాల మధ్య శీఘ్రతర వివాద పరిష్కార వ్యవస్థ కీలకమన్నారు.
మార్కెట్ నుంచి వైదొలిగిన పశ్చిమ దేశాల బ్రాండెడ్ ఉత్పత్తుల స్థానంలో చోటు దక్కించుకుంటున్న రష్యా నూతన ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ... వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులు, ఐటీ, హై-టెక్, వ్యవసాయోత్పత్తులే కాక, స్థానిక రష్యా వస్తూత్పత్తి పరిశ్రమలు అనేక రంగాలలో సత్తా చాటుతున్నాయన్నారు.
“దిగుమతి ప్రత్యామ్నాయ పథకంలో ఇది మాకు ఎంతో ముఖ్యమైంది. తమంతట తామే మా మార్కెట్ల నుంచీ వైదొలిగిన పశ్చిమ దేశాల బ్రాండెడ్ ఉత్పత్తుల స్థానాన్ని కొత్తగా వస్తున్న రష్యా ఉత్పత్తులు భర్తీ చేస్తున్నాయి. వినియోగదారులు ఎక్కువగా వినియోగించే వస్తువుల ఉత్పత్తిలోనే కాక, ఐటీ, హై-టెక్ ఉత్పత్తుల తయారీలోనూ మా స్థానిక పరిశ్రమలు ముందున్నాయి ” అని పుతిన్ వెల్లడించారు.
బ్రిక్స్ దేశాలు మరింత సహకారంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించాలని, బ్రెజిల్ లో వచ్చే ఏడాది జరగబోయే శిఖరాగ్ర సదస్సులో సహకారానికి అనువైన కీలక రంగాలని సభ్య దేశాలు గుర్తించాలని పుతిన్ సూచించారు. బ్రిక్స్ తో రష్యా ఏర్పరుచుకుంటున్న పెట్టుబడుల వేదిక గురించి ప్రస్తావిస్తూ, ఈ సహకార వేదిక అన్ని దేశాలకీ లబ్ధి చేకూర్చగల సత్తా కలిగి ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల, తూర్పు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా, ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
“కీలకమైన రంగాల్లో సహకారానికి సంబంధించిన తాజా పరిస్థితిని అంచనా వేయమని నా బ్రిక్స్ మిత్రుల్ని కోరుతున్నాను. వచ్చే సంవత్సరం బ్రిక్స్ కు సారథ్యం వహించనున్న మా బ్రెజిల్ మిత్రులతోనూ ఈ అంశాన్ని చర్చిస్తాం” అని పుతిన్ వివరించారు.
మరిన్ని వివరాలు: http://en.kremlin.ru/events/president/news/75751
***
(Release ID: 2081092)
Visitor Counter : 63
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam