సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

చరిత్రాత్మక ‘ప్రపంచ వారసత్వ సంఘం’ (డబ్ల్యుహెచ్ సి) నలభై ఆరో సమావేశాన్ని నిర్వహించిన భారతదేశం


వారసత్వ సంరక్షణకు నడుం బిగించిన భారతదేశం: ప్రపంచ వారసత్వ సంరక్షణ కోసం
యునెస్కో కు ఒక మిలియన్ డాలర్ ల గ్రాంటు


యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ స్థలం గా మొయిదమ్ లకు గుర్తింపు; మొయిదమ్
లు భారతదేశం లో ఈ తరహాకు చెందిన 43వ స్థలం



‘‘విరాసత్ పర్ గర్వ్’’: గత పదేళ్ళలో 13 ప్రపంచ వారసత్వ స్థలాలకు
విజయవంతంగా లభించిన ఆధికారిక గుర్తింపు

Posted On: 31 JUL 2024 3:58PM by PIB Hyderabad

వారసత్వ సంరక్షణకు భారతదేశం నిబద్ధతతో ఉందని కేంద్ర సంస్కృతి, పర్యటన శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రముఖంగా పేర్కొంటూ, ప్రపంచ వారసత్వ సంరక్షణ విలువల ప్రాముఖ్యాన్ని భారతదేశం చాలా కాలంగా సమర్థిస్తూ వచ్చిందన్నారు. ‘‘మా నిబద్ధత సరిహద్దులకు అతీతంగా విస్తరించింది. అది మేం మా ఇరుగు పొరుగు దేశాలతో కలసి చేపడుతున్న సంరక్షణ చర్యలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో ప్రతిబింబిస్తోంద’’ని ఆయన అన్నారు. ప్రపంచ వారసత్వ సంఘం (డబ్ల్యుహెచ్‌సి) 46వ సమావేశం విజయవంతంగా ముగిసిన సందర్భంగా కేంద్ర మంత్రి న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటు చేసిన ఒక పత్రికా ప్రతినిధుల సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు.

 

ప్రపంచ వారసత్వ సంఘం (డబ్ల్యుహెచ్‌సి) 46వ సమావేశాలకు 2024 జులై 21 నుంచి 31 వరకు భారతదేశం మొట్టమొదటిసారిగా సగర్వంగా ఆతిథ్యాన్ని ఇచ్చింది. న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో నిర్వహించిన ఈ ప్రముఖ కార్యక్రమం 1977లో ఆరంభమైన వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ తో భారతదేశం కొనసాగిస్తున్న దీర్ఘకాలిక అనుబంధంలో ఒక మైలురాయిని సూచిస్తున్నది. ప్రపంచ వారసత్వ సంఘంలో భారతదేశం చురుకుగా పాలుపంచుకొంటూ ఉండటం, నాలుగు పదవీకాలాలను సంబాళించడం అంతర్జాతీయ సహకారానికి, సామర్థ్య నిర్మాణానికి భారతదేశం ఎంతగా అంకితమైందో నొక్కిచెబుతున్నాయి.

 

ప్రపంచ వారసత్వ సంఘం (డబ్ల్యుహెచ్‌సి) 46వ సమావేశాలలో ప్రారంభిక సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశిష్ట అతిథుల సమక్షంలో 2024 జులై 21న ప్రారంభించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ (‘అభివృద్ధితోపాటే వారసత్వం కూడా’) దృష్టికోణానికి అనుగుణంగా ఈ ప్రారంభిక సదస్సులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటరుకు ఒక మిలియన్ డాలర్ ల గ్రాంటును ప్రకటించారు. ఈ తోడ్పాటు సామర్థ్య నిర్మాణానికి, సాంకేతిక సహాయానికి, పరిరక్షణ ప్రయత్నాలకు మద్ధతుగా ఉంటుంది;, మరీ ముఖ్యంగా, వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాలకు ప్రయోజనాలను సమకూర్చుతుంది.

 

కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి తన ప్రసంగంలో ‘‘గత 10 సంవత్సరాలలో భారతదేశం ఆధునిక అభివృద్ధిలో నూతన పార్శ్వాలను స్పర్శించింది, అదే సమయంలో విరాసత్ పర్ గర్వ్ప్రతిజ్ఞను కూడా స్వీకరించిందన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్యలో రామాలయం, ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో ఒక ఆధునిక కేంపస్ నిర్మాణం వంటి దేశవ్యాప్తంగా చేపడుతూ ఉన్న అనేక వారసత్వ సంరక్షణ పథకాలను గురించి ప్రస్తావించారు. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం చేసిన ప్రయత్నాల ఫలితంగా గత దశాబ్దంలో 13 ప్రపంచ వారసత్వ సంపత్తులు విజయవంతంగా ఆధికారిక గుర్తింపునకు దోహదపడి, ఎక్కువ ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్న ప్రపంచ దేశాలలో ఆరో దేశం స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు.

 

సమావేశం ఫలితాలను గురించి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసార మాధ్యమాలకు వెల్లడిస్తూ, 24 కొత్త ప్రపంచ వారసత్వ స్థలాలను ఆధికారికంగా గుర్తించిన ఘట్టానికి సాక్షిగా డబ్ల్యుహెచ్‌సి 46వ సమావేశం నిలచింది.  ఈ కొత్త ప్రపంచ వారసత్వ స్థలాల్లో 19 సాంస్కృతిక సంపత్తులు, 4 ప్రాకృతిక సంపత్తులు, ఒక మిశ్రిత సంపత్తి భాగమయ్యాయని ఆయన అన్నారు. అసోమ్ లోని మొయిదమ్ లు భారతదేశంలో 43వ ప్రపంచ వారసత్వ స్థలంగా ఆధికారిక గుర్తింపును తెచ్చుకొన్నాయి. అసోమ్ లో మొట్టమొదటి సాంస్కృతిక స్థలం అనే ముఖ్య గుర్తింపు దక్కిన స్థలం ఇదే అని ఆయన అన్నారు. చరాయిదేవ్ జిల్లాలో ఉన్న ఈ మొయిదమ్ లు అహోమ్ రాజవంశానికి చెందిన పవిత్ర సమాధుల మట్టిదిబ్బలు. ఆరు శతాబ్దాల సాంస్కృతిక చరిత్ర, వాస్తు కళాభివృద్ధి ఘనత వీటితో ముడిపడి ఉంది.

 

మొయిదమ్ లను గురించిన మరింత సమాచారం:

 

  1. Charaideo Moidams: India’s 43rd UNESCO World Heritage Site
  2. Moidams – The Mound-Burial System of Ahom Dynasty Inscribed in the UNESCO World Heritage List as India’s 43rd Entry

 

కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి ద్వైపాక్షిక సమావేశాలను గురించి వివరిస్తూ, భారతదేశానికి - యుఎస్ఎ కు మధ్య ఒక సాంస్కృతిక ఒప్పందం పై సంతకాలు అయ్యాయన్నారు. సాంస్కృతిక సంపత్తికి సంబంధించిన చట్ట విరుద్ధ వ్యాపార కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటం జరపాలన్న నిబద్ధతను ఈ ఒప్పందం బలపరుస్తుందని ఆయన అన్నారు. దీనికి అదనంగా, దృగ్గోచర వారసత్వం అంశంపై పరిశోధన జరపడానికి, సామర్థ్య నిర్మాణానికి ఒక ఒప్పందాన్ని ఐసిసిఆర్ఒఎమ్ తో భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ఎఎస్ఐ) కుదుర్చుకుంది. డబ్ల్యుహెచ్‌సి 46వ సమావేశంలో యంగ్ హెరిటేజ్ ప్రొఫెషనల్స్ ఫోరమ్ తో పాటు సైట్ మేనేజర్స్ ఫోరమ్ కార్యక్రమాలు కూడా చోటుచేసుకొన్నాయి. తత్ఫలితంగా, వారసత్వ సంరక్షణలో ప్రపంచ ప్రావీణ్యం వృద్ధి చెందే ఆస్కారం ఏర్పడింది. మరో 33 సంబంధిత కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో భాగంగా నిర్వహించారు.

 

బయటి దేశాల నుంచి తిరిగి స్వదేశానికి చేరుకొన్న 25 చారిత్రిక కళాకృతులతో డబ్ల్యు‌హెచ్‌సి 46వ సమావేశం కాలంలో ఒక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన సంగతిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనితో భారతదేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతగా అంకితమైందో స్పష్టం అయిందని ఆయన అన్నారు.

ప్రపంచ వారసత్వ సంరక్షణకు భారతదేశం అందిస్తూ వస్తున్న తోడ్పాటులను గురించి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, కంబోడియా లోని అంకోర్ వట్, వియత్ నామ్ లోని చామ్ దేవాలయాలు, మయన్మార్ లోని బాగాన్ లో గల స్తూపాలకు సంబంధించిన వారసత్వాన్ని సంరక్షించే దిశ లో భారతదేశం చేసిన కృషిని వెల్లడించారు. కొత్తగా ఆధికారిక గుర్తింపు లభించిన మొయిదమ్ లతో కలుపుకొని 43 ప్రపంచ వారసత్వ ప్రధాన స్థలాల ప్రశంసయోగ్య సూచీ తో ప్రపంచంలో వారసత్వ సంరక్షణ లో ఒక ప్రముఖ స్థానాన భారతదేశం నిలుస్తోందని ఆయన అన్నారు. 56 సంపత్తులతో కూడిన విస్తారమైన తాత్కాలిక సూచీ భారతదేశ సాంస్కృతిక స్వరూపానికి ఉన్న సమగ్ర ప్రాతినిధ్యానికి పూచీపడుతోందని కూడా ఆయన అన్నారు.

 

సంస్కృతికి ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యాన్ని వర్థిల్లజేయడానికి భారతదేశం అందిస్తున్న టువంటి ఉజ్వలమైన తోడ్పాటును కేంద్ర మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. 2030 అనంతర కాలంలో అభివృద్ధి సంబంధ ఫ్రేమ్ వర్క్ లో సంస్కృతి కి ఒక విశిష్ట లక్ష్యమంటూ ఉందని భారతదేశం జి-20 కి అధ్యక్షత వహించిన కాలంలో ఆమోదించిన న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ 2023 (ఎన్‌డిఎల్‌డి) అంగీకరించి, ప్రపంచ అభివృద్ధి వ్యూహంలో ఒక ప్రత్యేకమైన మలుపును సూచించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.  ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన సముదాయాలకు సాధికారితను కల్పిస్తూ, బలహీన వారసత్వాన్ని కాపాడుతూ సంస్కృతికి ఉన్న పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీస్తుందన్నారు. కాశీ కల్చర్ పాథ్ వే తోపాటు ప్రపంచంలో సంస్కృతికి ఉన్న లక్ష్యాన్ని ఎన్నటికీ విడనాడరాదని ఉద్ఘోషించే ప్రప్రథమ, ఏకైక దస్తావేజుపత్రం గా ఉన్న ఎన్‌డిఎల్‌డి 2023 పటిష్టమైన నమూనాలు అని, ఈ రెండూ ప్రపంచ సంస్కృతి రంగాన్ని ముందుకు నడుపుతాయని మంత్రి స్పష్టం చేశారు.

ప్రపంచ వారసత్వ సంఘం సమావేశాల పరంపరలో భాగమైన ఈ 46వ సదస్సు సంరక్షణ, అంతర్జాతీయ సహాయం అనే అంశాలపై విస్తృత చర్చలతో పాటు వివిధ దేశాలు, సంఘాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలతో ముగిసింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమం భారతదేశం యొక్క సంపన్న వారసత్వాన్ని కళ్ళకు కడుతూ, రాబోయే కాలంలో ప్రపంచ వారసత్వ సంరక్షణ యత్నాలకు రంగాన్ని సిద్ధం చేసింది.

ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర సంస్కృతి- పర్యటన శాఖ మంత్రి:

https://youtu.be/9_UNcklMLqU

 

మరింత సమాచారం:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2039340

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2038168

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2037604

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2037495

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2039130

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2034693

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2034457

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2033506

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2031567

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2031268

 

**


 



(Release ID: 2039963) Visitor Counter : 50