భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

మొదటి నెలలో పారదర్శకంగా, కఠినంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) అమలు. తీసుకున్న చర్యలపై వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం చట్టబద్ధమైన, న్యాయ ప్రక్రియ కు అనుగుణంగా ఎంసిసి అమలు జరుగుతోంది.. ఎన్నికల సంఘం నిఘాను మరింత కట్టుదిట్టం చేసి, అక్రమార్కులపై చర్యలు.. ఎన్నికల సంఘం హెచ్చరిక


ఎంసిసి అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్న క్షేత్ర స్థాయి అధికారులు స్వేచ్ఛగా ప్రచారం జరిగేలా చూస్తున్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం

Posted On: 16 APR 2024 2:25PM by PIB Hyderabad

ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు చర్యలు అమలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు జరుగుతున్న తీరు, తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని నిర్ణయించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం దీనికోసం అమలు చేస్తున్న చర్యలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని మొట్టమొదటిసారిగా నిర్ణయించింది. అపోహలు, అపార్ధాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం మొదటి నెలలో అమలు చేసిన చర్యల వివరాలను వెల్లడించింది. ఇంతవరకు ప్రవర్తనా నియమావళి అమలు జరిగిన తీరు, ఇకపై అమలు జరిగే తీరు కింది విధంగా ఉంది. 

1. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి  వచ్చి నెల రోజులు పూర్తయింది. నెలరోజుల కాలంలో నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సాగిస్తున్న ప్రచారం సమస్యలు లేకుండా సాగుతోంది. 

2. అయితే, కొన్ని కొంతమంది అభ్యర్థులు, నాయకులు కొన్ని సందర్భాలలో హద్దు మీరు ప్రవర్తిస్తున్నారని ఎన్నికల సంఘం గుర్తించింది.  గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై నిఘా ఎక్కువ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 

3. మహిళల గౌరవ మర్యాదలు రక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా మహిళలను కించపరిచే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ నాయకులూ, ప్రచారకర్తలు మహిళలను కించపరచకుండా, గౌరవమర్యాదలు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయకుండా చూసే బాధ్యతను  ఆయా పార్టీల ముఖ్యులు/ అధ్యక్షులపై ఉంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని  గతంలో ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ రాజీవ్ కుమార్ ఇచ్చిన వాగ్ధానాన్ని అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మేలు చేయడానికి సంఘం చర్యలు అమలు చేస్తోంది. 

4 కొంతమంది నాయకులకు సంబంధించి వివిధ కేసుల్లో న్యాయస్థానాలు కొన్ని  ఆదేశాలు జారీ చేశాయి. ఈ నాయకులకు సంబంధించిన అంశాలు పరిశీలనకు వచ్చినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. ప్రచారం నిర్వహించడానికి రాజకీయ పార్టీలు,అభ్యర్థులు కలిగి ఉన్న హక్కులను రక్షించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అయితే, చట్టపరమైన, న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఎటువంటి చర్యలను ఎన్నికల సంఘం అమలు చేయదు. 

5. బాధ్యత, చట్ట నిబంధనలు, సంస్థాగత అవగాహన, సమానత్వం, పారదర్శక విధానంతో  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి  ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఈ అంశంలో సంబంధిత వ్యక్తుల స్థితి, రాజకీయ అనుబంధం ని ఎన్నికల సంఘం ఎట్టి పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోదు. 

6. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 2024 మార్చి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన రోజు నుంచి అమలు లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి ఎన్నికల సంఘం చర్యలు అమలు చేస్తోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగే ప్రసంగాల వల్ల  ఎవరికి ఎటువంటి హాని లేకుండా జరగాలి అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

7. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత నెల రోజుల వ్యవధిలో 7 రాజకీయ పార్టీలకు చెందిన 16 ప్రతినిధి బృందాలు ఎన్నికల సంఘానికి నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేశాయి. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీల బృందాలు సమావేశం అయ్యాయి. 

8. అన్ని రాజకీయ పార్టీలను సమ దృష్టితో ఎన్నికల సంఘం చూసింది. తక్కువ సమయంలో ప్రతినిధి బృందాలను కలిసిన ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదులు స్వీకరించి , సమస్యలు తెలుసుకున్నారు. 

9. ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్ , శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ రాజీవ్ కుమార్, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలిస్తున్నారు. 

రాజీ లేకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ఎన్నికల ప్రకటనకు ముందు అన్ని డిఎం లు/కలెక్టర్లు/డీఈవో లు, ఎస్పీ లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసి అవగాహన కల్పించింది.  శ్రీ రాజీవ్ కుమార్ ఢిల్లీలోని ICI శిక్షణా సంస్థ, IIIDEMలో 10 బ్యాచ్‌లలో 800 మంది డిఎం లు/డీఈవో లు లకు వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఈ పనిలో అవగాహన పొందారు. 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడానికి నెల రోజుల కాలంలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు:-

1. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి  కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు వివిధ రాష్ట్రాల్లో సుమారు 200 ఫిర్యాదులు అందాయి.  ఇందులో 169 ఫిర్యాదులకు సంబంధించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 

2. ఫిర్యాదుల వివరాలు 

బీజేపీ  నుంచి  మొత్తం ఫిర్యాదులు 51 అందగా  38 ఫిర్యాదుల్లో చర్యలు అమలు జరిగాయి. ఐఎన్సి నుంచి అందిన 59 ఫిర్యాదుల్లో 51 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి.  ఇతర పార్టీల నుంచి అందిన  90 ఫిర్యాదుల్లో  80 ఫిర్యాదులపై చర్యలు అమలు జరిగాయి. 

3. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తూ   హోం / సాధారణ పరిపాలన శాఖల   బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఎటువంటి ఫిర్యాదు లేకుండానే ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది.  ముఖ్యమంత్రి కార్యాలయం  ప్రభావం  డిఎం లు/కలెక్టర్లు/డీఈవో లు, ఎస్పీలపై లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది. 

4. గత ఎన్నికల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడంపై నిషేదానికి గురైన  పశ్చిమ బెంగాల్ డీజీపీని సుమోటోగా తొలగించారు.

5. గుజరాత్, పంజాబ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ అనే నాలుగు రాష్ట్రాలలో జిల్లా మేజిస్ట్రేట్ (DM) మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) వంటి ముఖ్యమైన  స్థానాల్లో పని చేస్తున్న  నాన్-కేడర్ అధికారులను సుమోటోగా ఎన్నికల సంఘం  బదిలీ చేసింది. 

6. ఎన్నికైన రాజకీయ ప్రతినిధులతో  బంధుత్వం లేదా కుటుంబ అనుబంధం కారణంగా పంజాబ్, హర్యానా మరియు అస్సాంలో అధికారులను సుమోటోగా ఎన్నికల సంఘం బదిలీ చేసింది. 

7. కాంగ్రెస్, ఆప్ పార్టీల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రకటన తర్వాత వాట్సాప్‌లో భారత ప్రభుత్వ వికసిత  భారత్ సందేశాన్ని ప్రసారం నిలిపివేయాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

8.  కాంగ్రెస్, ఆప్ పార్టీల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం/పబ్లిక్ ప్రాంగణాల దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  

9. డీఎంకే నుంచి అందిన ఫిర్యాదు మేరకు రామేశ్వరం పేలుడుపై బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

10. కాంగ్రెస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు డిఎంఆర్సీ  రైళ్లు, పెట్రోల్ పంప్,జాతీయ రహదారులు  మొదలైన వాటి నుండి హోర్డింగ్‌లు, ఫోటోలు సందేశాలను ఎన్నికల సంఘం సూచనల మేరకు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సెక్రటరీకి ఆదేశాలు జారీ అయ్యాయి. 

11. కాంగ్రెస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖరన్ తన అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకటనలో లోపాలు ఉన్నాయా అన్న అంశాన్ని పరిశీలించాలని సీబీడీటీ కి  ఆదేశాలు జారీ అయ్యాయి. 

12. ఏఐటీఎంసీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు  శ్రీమతి మమతా బెనర్జీ పట్ల అభ్యంతరకరమైన మరియు అగౌరవంగా వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి నాయకుడు శ్రీ దిలీప్ ఘోష్‌కి నోటీసులు జారీ అయ్యాయి. 

13. బీజేపీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు శ్రీమతి కంగనా రనౌత్, శ్రీమతి హేమా మాలిని పై  అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందినశ్రీమతి సుప్రియా ష్రినేట్ ,శ్రీ  సూర్జేవా లకు నోటీసులు..

14. శ్రీ నరేంద్ర మోడీని ఉద్దేశించి డీఎంకే నాయకుడు  శ్రీ అనిత ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు. 

15. ఢిల్లీ మున్సిపల్ కమీషన్ ప్రాంతంలోని హోర్డింగ్‌లు,బిల్‌బోర్డ్‌లలో ప్రచురణకర్త పేర్లను పేర్కొనకుండా వెలసిన  ప్రకటనలపై ఆప్ పార్టీ నుంచి అందిన   ఫిర్యాదుపై చట్ట నిబంధనలు అమలు చేయడానికి చర్యలు అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.   హోర్డింగ్‌లను  ప్రస్తుత చట్టంలోని 'కరపత్రం మరియు పోస్టర్' పరిధిలో   చేర్చడం ద్వారా విస్తృత వ్యాప్తిని గుర్తించిన ఎన్నికల సంఘం  హోర్డింగ్‌లతో సహా ముద్రించిన ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పై ప్రింటర్ మరియు పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. . ప్రచార కార్యక్రమంలో  జవాబుదారీతనం,  పారదర్శకత అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల అంగం ఈ చర్య తీసుకుంది. 

16. కాంగ్రెస్ పార్టీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు వివిధ కళాశాలల నుంచి  స్టార్ క్యాంపెయినర్ల కటౌట్‌లను తొలగించాలని ఢిల్లీలోని మున్సిపల్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశాలు జారీ చేసింది. 

17. ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేసిన సి విజిల్, కమిషన్ పోర్టల్‌లో మొత్తం 2,68,080 ఫిర్యాదులు నమోదయ్యాయి.వీటిలో 2,67,762 కేసులు పరిష్కారం అయ్యాయి. 92% ఫిర్యాదులు సగటున 100 నిమిషాల కంటే తక్కువ సమయంలో పరిష్కరించబడ్డాయి. సివిజిల్  సమర్థత కారణంగా, అక్రమ హోర్డింగ్‌లు, ఆస్తుల ధ్వంసం, అనుమతించదగిన సమయానికి మించి ప్రచారం చేయడం, అనుమతించిన వాటికి మించి వాహనాలు మోహరించడం వంటివి గణనీయంగా తగ్గాయి.

నేపథ్యం: 

చట్టపరమైన అనుమతి లేని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఒక నియంత్రణ వ్యవస్థగా అమలు జరుగుతుంది. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఎవరికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు  లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించి అమలు చేస్తోంది. నియమావళి ఉల్లంఘనలను సత్వరం, నిర్ణయాత్మకంగా పరిష్కరించడం ద్వార  భారత ఎన్నికల సంఘం పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనం తో  ప్రజాస్వామ్య ఆదర్శాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.

 

***

 


(Release ID: 2018165) Visitor Counter : 424