ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023; భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 మన దేశ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఘట్టాలు : పిఎం


ప్రజాసేవ, సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాలతో ఒక కొత్త శకం ఆరంభం అయింది : పిఎం

Posted On: 21 DEC 2023 9:00PM by PIB Hyderabad

భారతీయ  నాగరిక్   సురక్షా సంహిత, 2023;  భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 బిల్లులను పార్లమెంటు ఆమోదించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడుతూ భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టమన్నారు. ఈ బిల్లులు సమాజంలో పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు రక్షణను పెంచడంతో పాటు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, అదే తరహాలోని ఇతర నేరాలను అణచివేస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ న్యాయ సంస్కరణలు భారతదేశ న్యాయవ్యవస్థ స్వరూపాన్ని పునర్నిర్వచించడంలో పాటు ప్రస్తుత అమృత కాలానికి సరిపోయేవిగా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లులపై హోంమంత్రి శ్రీ అమిత్  షా ప్రసంగం వీడియోను కూడా ఆయన షేర్  చేశారు.

ఈ మేరకు ఎక్స్  లో పోస్ట్  చేసిన సందేశం ఇలా ఉంది.

‘‘భారతీయ  నాగరిక్   సురక్షా సంహిత, 2023;  భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 బిల్లుల ఆమోదం భారతచరిత్రలో చిరస్మరణీయ ఘట్టం. వలసపాలన కాలం నాటి చట్టాలకు ఇది చరమగీతం. ప్రజా సేవ, సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన కొత్త చట్టాలు నవశకారంభానికి చిహ్నం.

సంస్కరణల పట్ల భారతదేశం కట్టుబాటుకు ఈ చట్టాలు ఒక సాక్ష్యంగా నిలుస్తాయి. టెక్నాలజీ, ఫోరెన్సిక్  శాస్ర్తాలకు ప్రాధాన్యం ఇస్తూ న్యాయ, పోలీసు, దర్యాప్తు విభాగాలను ఆధునిక శకంలోకి నడుపుతాయి. సమాజంలో పేదలు,  నిరాదరణకు గురవుతున్న వర్గాలకు రక్షణను పెంచాయి.

అదే సమయంలో మన సమాజం పురోగతి బాటలో సాగిస్తున్న శాంతియుత ప్రయాణానికి భంగం కలిగించే  వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, అదే తరహాలోని ఇతర నేరాలకు చెందిన మూలాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి సహాయపడతాయి. ఈ చట్టాల ద్వారా కాలం చెల్లిపోయిన దేశద్రోహం వంటి సెక్షన్లకు మనం వీడ్కోలు పలికినట్టయింది.

ప్రస్తుత అమృత కాలానికి సరిపోయే విధంగా న్యాయవ్యవస్థను తీర్చి దిద్దడంలో ఈ న్యాయ సంస్కరణలు మరింత సహాయకారి అవుతాయి. హోం మంత్రి శ్రీ అమిత్  షాజీ ఈ ప్రసంగాలు బిల్లుల్లోని ప్రధాన లక్షణాలను మరింతగా వివరిస్తాయి.’’(Release ID: 1989565) Visitor Counter : 214