ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 దేశాధినేతల న్యూఢిల్లీ ప్రకటన అమలు పురోగతిపై ప్రధానమంత్రి ముఖ్యకార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా సమీక్ష


ప్రధాన ఇతివృత్తాలపై విస్తృత ప్రచారం.. సమర్థ
అమలు లక్ష్యంగా 7 వెబినార్ల నిర్వహణకు నిర్ణయం;

దేశవ్యాప్తంగాగల మేధావులతో సదస్సు నిర్వహణకు నిర్ణయం;

జి-20 వర్చువల్ సదస్సు.. దక్షిణార్థ గోళ గళం సదస్సు 2.0 సన్నాహాలపై సమీక్ష

Posted On: 18 OCT 2023 7:27PM by PIB Hyderabad

  జి-20 దేశాధినేతల న్యూఢిల్లీ సంయుక్త ప్రకటన అమలులో పురోగతిని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా ఇవాళ తన అధ్యక్షతన సమీక్షంచారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, జి-20 షెర్పా, జి-20 ముఖ్య సమన్వయకర్తసహా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఎ), ఆర్థిక వ్యవహారాల శాఖ (డిఇఎ)లతోపాటు నీతి ఆయోగ్లోని సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలతోపాటు ఏడు వెబినార్లు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ దిశగా ఆయా మంత్రిత్వ శాఖలు ప్రధానపాత్ర పోషిస్తూ సంబంధిత  విభాగాల సమన్వయంతో నిర్వహణ బాధ్యత చేపట్టాలని తీర్మానించింది.

   ఈ మేరకు- “(1) బలమైన-సుస్థిర-సమతుల-సమ్మిళిత వృద్ధి (2) సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డిజి) పురోగతి వేగం పెంపు (3) సుస్థిర భవిష్యత్తు కోసం హరిత ప్రగతిపై ఒప్పందం, (4) 21వ శతాబ్దం కోసం బహుపాక్షిక సంస్థలు (5) సాంకేతిక పరివర్తన-డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు (6) మహిళా చోదక ప్రగతి (7) ఉగ్రవాదం-అక్రమ ద్రవ్య తరలింపు నిరోధంప్రధాన ఇతివృత్తాలుగా వెబినార్లు నిర్వహించబడతాయి. వీటితోపాటు న్యూఢిల్లీ సంయుక్త ప్రకటన సమర్థ అమలు దిశగా ప్రాంతీయ నిపుణుల అభిప్రాయ స్వీకరణ కోసం దేశంలోని వివిధ రంగాల మేధావులతో ఒక సదస్సు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

   సంయుక్త ప్రకటన అమలు ప్రగతిని క్రమం తప్పకుండా సమీక్షించేందుకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ముఖ్య  కార్యదర్శి ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు శిఖరాగ్ర సదస్సులో ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి ప్రతిపాదనకు అనుగుణంగా జి-20 వర్చువల్ సదస్సు నిర్వహణ సన్నాహాలను కూడా ఆయన సమీక్షించారు. ప్రధాన సదస్సు తర్వాత వర్చువల్ దస్సు నిర్వహణ ఇదే తొలిసారి కాబట్టి అన్ని సభ్య-ఆహ్వానిత దేశాలకూ త్వరగా సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని మిశ్రా నొక్కిచెప్పారు.

    సమావేశం సందర్భంగా- 2023 నవంబరులో నిర్వహించబోయే దక్షిణార్థ గోళ గళం శిఖరాగ్ర సదస్సు 2.0 సన్నాహాల గురించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ క్వాత్రా వివరించారు. కాగా, దేశాధినేతల సంయుక్త ప్రకటనను విజయవంతంగా అమలు చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రపంచ సహకారంపై ప్రభుత్వ నిబద్ధతను,  అంకితభావాన్ని సమావేశం ప్రముఖంగా ప్రస్తావించింది.

****



(Release ID: 1968996) Visitor Counter : 143