ప్రధాన మంత్రి కార్యాలయం

అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బుజ్జగింపు అనే మూడు దుష్టశక్తులపై మనం శక్తివంచన లేకుండా పోరాడాలి: ప్రధానమంత్రి

Posted On: 15 AUG 2023 12:33PM by PIB Hyderabad

   దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా- “మన కలలు నెరవేరాలన్నా... సంకల్పాలు సాధించాలన్నా మనం ప్రధానంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జగింపు అనే దుష్టశక్తులపై శక్తివంచన లేకుండా పోరాడక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.

   మన దేశంలో సమస్యలన్నింటికీ అవినీతే మూలకారణమని ప్రధాని అన్నారు. కాబట్టి  “అవినీతి నుంచి విముక్తి, ప్రతి ప్రాంతంలో-ప్రతి రంగంలో అవినీతిపై పోరాటం మన తక్షణ కర్తవ్యం. దేశప్రజలారా... నా ప్రియ కుటుంబ సభ్యులారా! ఇదే మోదీ నిబద్ధత; అవినీతిపై  పోరాటం కొనసాగించేందుకు నేను వ్యక్తిగతంగా సంకల్పం పూనాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనువంశిక రాజకీయాలు దేశాన్ని ధ్వంసం చేయడం రెండో అంశమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “ఈ వంశపారంపర్య వ్యవస్థ దేశాన్ని గుప్పిట బిగించి ప్రజల హక్కులను హరించింది” అని ఆయన దుయ్యబట్టారు. కాగా, బుజ్జగింపు రాజకీయం మూడో అంశమని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. “ఇది దేశ ప్రాథమిక ఆలోచన దృక్పథానికి, మన సమరస జాతీయ స్వభావానికి మచ్చతెచ్చింది. ఇందుకు కారకులైన వ్యక్తులు ప్రతి వ్యవస్థనూ ధ్వంసం చేశారు. అందుకే ఈ మూడు దుష్టశక్తులపైనా మనం శక్తివంచన లేకుండా పోరాడాలి. ఇక అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు ప్రగతికి ప్రధాన సవాళ్లు. ఇవి దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను అణగదొక్కుతాయి” అని వివరించారు.

   ఈ దుష్టశక్తులు దేశంతోపాటు కొందరి సామర్థ్యాలను దోచుకుంటున్నాయని ఆయన విమర్శించారు. “ఇవి మన ప్రజల ఆశలు-ఆకాంక్షలను ప్రశ్నార్థకం చేసే అంశాలు. దేశంలో్ని పేదలైనా, దళితులైనా, వెనుకబడిన వారైనా, అణగారిన వర్గాలవారైనా, ఆదివాసీ సోదరసోదరీమణులైనా, మన తల్లులైనా, సోదరీమణులైనా... వారి హక్కుల కోసం సమష్టి కృషితో మనం ఈ మూడు దుష్టశక్తులను వదిలించుకోవాలి” అన్నారు. అలాగే అవినీతి చీడను నిరసిస్తూ- “అవినీతిపై ఏవగింపు కలిగే వాతారణాన్ని మనం సృష్టించాలి. ప్రజా జీవితంలో ఇంతకన్నా భయానక కాలుష్యం మరేదీ ఉండదు” అని స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు వివిధ పథకాల నుంచి 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏ విధంగా తొలగించిందీ ఆయన వివరించారు. పరారీలోగల ఆర్థిక నేరగాళ్లు దోచుకున్న సొమ్ముకన్నా 20 రెట్ల అదనపు విలువగల వారి ఆస్తులను జప్తు చేసినట్లు వివరించారు.

   ఆశ్రిత పక్షపాతం, అనువంశిక రాజకీయాల గురించి మాట్లాడుతూ- అనువంశిక రాజకీయ పార్టీలు, కుటుంబాలు తమకోసం, తమవారి కోసం దేశాన్ని దోచుకున్న ఫలితంగా ప్రతిభ క్షీణించిందని దుయ్యబట్టారు. కాబట్టి “ఈ జాడ్యాన్ని మన ప్రజాస్వామ్యం పూర్తిగా వదిలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది” అని ప్రధాని పిలుపునిచ్చారు.

   అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ‘బుజ్జగింపు రాజకీయం ఎంతగానో దెబ్బతీసింది. “ఈ రకమైన దృక్పథం, బుజ్జగింపు రాజకీయాలు, దాని ఆధారంగా నడిచే ప్రభుత్వ పథకాలు సామాజిక న్యాయాన్ని పూర్తిగా అంతం చేశాయి. అందుకే, అవినీతితోపాటు ఈ జాడ్యాన్ని కూడా దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మనం గుర్తించాం. మనం జాతిని ప్రగతిని ఆకాంక్షిస్తుంటే, 2047 నాటికి వికసిత భారతం కల నెరవేరాలంటే- దేశంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ దిశగా గట్టి నిబద్ధతతో ముందడుగు వేయాలి” అని శ్రీ మోదీ అన్నారు.

 

*****



(Release ID: 1948993) Visitor Counter : 95