ప్రధాన మంత్రి కార్యాలయం

ఫార్మా పరిశ్రమకు చెందిన నాయకులతో సంభాషించిన - ప్రధానమంత్రి

Posted On: 19 APR 2021 8:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఔషధ పరిశ్రమలకు చెందిన నాయకుల తో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు.  మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం లో ఫార్మా రంగం పోషించిన కీలక పాత్రను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఫార్మా పరిశ్రమ చేస్తున్న కృషి ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.

ఫార్మా పరిశ్రమ ప్రయత్నాల వల్ల నే, ఈరోజు భారతదేశం " ప్రపంచ ఔషధశాల" గా గుర్తింపు పొందిందని, ప్రధానమంత్రి శ్రీ మోదీ అభివర్ణించారు.  మహమ్మారి సమయంలో ప్రపంచంలోని 150 కి పైగా దేశాలకు అవసరమైన మందులను, భారతదేశం అందుబాటులో ఉంచిందని, ఆయన పేర్కొన్నారు.  అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ఫార్మా పరిశ్రమ, గత ఏడాది ఎగుమతుల్లో 18 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది దాని సామర్థ్యాన్ని చూపుతుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.

వైరస్ యొక్క రెండవ దశతో పాటు ఈ దశలో పెరుగుతున్న కేసుల సంఖ్య గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, అవసరమైన అనేక ఔషధాల ఉత్పత్తిని పెంచడానికి ఫార్మా పరిశ్రమ చేసిన కృషిని ప్రశంసించారు.  రెమ్‌డెసివిర్ (Remdesivir) వంటి ఇంజెక్షన్ల ధరను తగ్గించినందుకు ఆయన వారిని మెచ్చుకున్నారు.  మందులు మరియు అవసరమైన వైద్య పరికరాల సరఫరా సజావుగా సాగాలని, ఎటువంటి ఇబ్బందులు లేని సరఫరా వ్యవస్థ కొనసాగాలనీ, ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఫార్మా పరిశ్రమ వర్గాలను కోరారు.   లాజిస్టిక్స్, రవాణా వంటి సౌకర్యాల కోసం, ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

కోవిడ్‌తో పాటు భవిష్యత్తులో సంభవించే బెదిరింపులపై మరింత పరిశోధనలు చేయాలని ఆయన పరిశ్రమ వర్గాలను కోరారు.  వైరస్ ను ఎదుర్కోవడంలో ముందడుగు వేయడానికి, ఇది, మనకు, ఎంతగానో సహాయపడుతుందని ఆయన అన్నారు.

ఫార్మా పరిశ్రమ సహకారం కోరుతూ, కొత్త ఔషధాలు మరియు నియంత్రణ ప్రక్రియల కోసం ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందని, ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఈ సందర్భంగా, హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, ఫార్మా పరిశ్రమ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి తమకు అందుకున్న సహాయ సహకారాలను, ప్రశంసించారు.  తయారీ మరియు రవాణా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, ఔషధాల లభ్యతను నిర్ధారించడం కోసం గత ఏడాది వారు చేసిన ప్రయత్నాలను, వారు ప్రధానమంత్రి కి వివరించారు.  తయారీ, రవాణా, లాజిస్టిక్స్ తో పాటు ఇతర అనుబంధ సేవల కోసం ఫార్మా  హబ్‌ లలో కార్యకలాపాలను గరిష్ట స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  కొన్ని ఔషధాల కోవిడ్ చికిత్స ప్రోటోకాల్‌ కు అపూర్వమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, దేశంలో మొత్తం ఔషధ డిమాండ్‌ ను తీర్చడానికి తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని వారు ఈ సందర్భంగా ఒకరికొకరు తెలియజేసుకున్నారు.

ఈ సమావేశంలో - కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్ష వర్ధన్; కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే;  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ;  కేంద్ర సహాయ మంత్రి (సి & ఎఫ్) శ్రీ మాన్ సుఖ్ మాండవీయ;  ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, నీతీ ఆయోగ్ సభ్యుడు (హెచ్) డాక్టర్ వి.కే.పాల్;   క్యాబినేట్ కార్యదర్శి; కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి;  కేంద్ర ఫార్మాస్యూటికల్ కార్యదర్సి;  ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తో సహా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు కూడా  కూడా పాల్గొన్నారు. 

 

*****


(Release ID: 1712784) Visitor Counter : 217