ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని న్యూ భావ్‌పూర్-న్యూ ఖుర్జా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 29 DEC 2020 2:03PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ జీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర రైల్వేమంత్రి శ్రీ పీయూష్ గోయల్ జీ, పార్లమెంటులో నా సహచరులు, యూపీ ప్రభుత్వ మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, సోదర, సోదరీమణులారా... ఈరోజు..  భారతీయ రైల్వేకు 21వ శతాబ్దంలో కొత్త గుర్తింపు ఇవ్వబోతోంది. భారతదేశంతోపాటు భారతదేశ రైల్వేల సామర్థ్యాన్ని మరింతగా పెంచే రోజు ఇది. స్వాతంత్ర్యానంతరం అన్నింటికంటే పెద్దదైన, ఆధునిక మౌలిక వసతులు క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడాన్ని మనం గమనిస్తున్నాం.
మిత్రులారా,
ఇవాళ ఖుర్జా-భావు మధ్య ఫ్రైట్ కారిడార్ మార్గంలో తొలి గూడ్స్ రైలు బండి పరుగులు తీస్తున్న సమయంలో.. ఇందులో నవభారత, ఆత్మనిర్భర భారత నినాదం ముద్ర మరింత స్పష్టంగా కనబడుతోంది. ప్రయాగ్ రాజ్ లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా నవభారతంలోని సరికొత్త సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది ప్రపంచంలోని ఆధునిక కంట్రోల్ సెంటర్లలో ఒకటి. ఇందులో వినియోగిస్తున్న మేనేజ్‌మెంట్, డేటాకు సంబంధించిన సాంకేతికత అంతా భారతదేశంలో రూపొందించినది కావడం మనందరికీ గర్వకారణం. భారతీయులే దీన్ని రూపొందించారు.
సోదర, సోదరీమణులారా,
మౌలికవసతులే దేశ సామర్థ్యాన్ని అంచనా వేయడానికైనా మూలంగా పరిగణిస్తాం. మౌలికవసతులు, అనుసంధానత మన శరీరంలోని నరాల వంటివి. నరాలు ఎంత బలంగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా, సామర్థ్యంతో ఉన్నట్లుగానే మౌలికవసతులు, అనుసంధానతలు కూడా అంత కీలకమైనవి. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం వేగంగా ముందుకెళ్తున్న ఈ సమయంలో చక్కటి అనుసంధానత దేశ ప్రాథమికతగా మారింది. ఈ ఆలోచనతోనే గత ఆరేళ్లుగా.. భారతదేశంలో ఆధునిక అనుసంధానతపై పూర్తి దృష్టి కేంద్రీకరించాం. అది హైవేలు అయినా.. రైల్వేలు అయినా.. వాయుమార్గమైనా.. జలమార్గమైనా.. ఐవేలు అయినా.. ఇవి ఆర్థిక ప్రగతికి ఎంతో బలాన్నిస్తాయి. ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని ఓ కీలకమైన భాగాన్ని ఇవాళ జాతికి అంకితం చేయడంకూడా ఈ దిశగా ఓ పెద్ద ముందడుగు వేసినట్లే.
మిత్రులారా,
ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను సామాన్యమైన భాషలో చెప్పాలంటే.. ఇది గూడ్స్ రైళ్లకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్, ప్రత్యేకమన వ్యవస్థ. దేశానికి దీని అవసరమేముంది? మన పొలాలైనా.. మన వ్యాపారాలైనా, మన మార్కెట్లు అయినా.. వస్తువులు, సరుకులపైనా ఆధారపడి ఉంటాయి. ఎక్కడో పండిన పంటను దేవంలోని వేర్వేరు ప్రాంతాలకు చేర్చాల్సి ఉంటుంది. ఎగుమతులు చేసేందుకు ఓడరేవుల వరకు చేర్చాల్సి ఉంటుంది. వ్యాపారాలకోసం కొన్ని వస్తువులు సముద్రమార్గంలో వస్తాయి. వ్యాపారస్తుల వస్తువలును మార్కెట్ వరకు చేర్చాల్సి ఉంటుంది. లేదా వాటిని ఎగుమతి చేసేందుకు మళ్లీ ఓడరేవులకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం అతి ముఖ్యమైన మార్గం రైలు మార్గమే. జనాభా పెరుగుతున్న కొద్దీ... ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది. దీనికి తగ్గట్లుగా నెట్ వర్క్ పైనా ఒత్తిడి పెరుగుతోంది. అసలు సమస్య ఏంటంటే.. మన దగ్గర ప్రయాణీకులు వెళ్లే రైళ్లు.. గూడ్స్ రైళ్లు ఒకే ట్రాక్ పై వెళ్తాయి. దీని ద్వారా గూడ్స్ రైళ్ల వేగం తగ్గుతోంది. ఈ కారణంగా గూడ్స్ రైళ్లకు మార్గం సుగమం చేసేందుకు ప్రయాణికుల రైళ్లను స్టేషన్లలో కాసేపు ఆపుకోవాల్సి వస్తోంది. దీని వల్ల ఆ రైళ్లు కూడా సమయానికి చేరుకోలేకపోతున్నాయి. గూడ్స్ రైళ్లను అక్కడక్కడ ఆపుతూ వెళ్తుంటే.. రవాణా ఖర్చు కూడా పెరుగుతోంది. నేరుగా దీని ప్రభావం.. మన పంటలు, ఖనిజాల ఉత్పత్తి, వ్యాపార ఉత్పత్తుల ధరపై కనిపిస్తుంది. ధర పెరుగుతున్న  కారణంగా అవి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని పోటీని తట్టుకోలేకపోతున్నాయి.
సోదర, సోదరీమణులారా,
ఈ పరిస్థితిని  మార్చేందుకే ఫ్రైట్ కారిడార్ పథకాన్ని ప్రారంభించాం. ప్రారంభంలో రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను రూపొందించాలన్న ఆలోచన ఉండేది. తూర్పు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్.. పంజాబ్ లోని వ్యాపార నగరం లుథియానాను.. పశ్చిమబెంగాల్ లోని దాన్‌కునీతో అనుసంధానం చేస్తోంది. వేల కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో బొగ్గుగనులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, వ్యాపార నగరాలు ఉన్నాయి. వీటికోసం ఫీడర్ మార్గాలను కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్.. మహారాష్ట్రలోని జెఎన్‌పీటీని.. ఉత్తరప్రదేశ్‌లోని దాదరీతో అనుసంధానం చేస్తోంది. దాదాపు 1500 కిలోమీటర్ల ఈ కారిడార్ గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా, పిపాపావ్, దహేజ్, హజీరా వంటి పోర్టులకు ఫీడర్ మార్గంగా కూడా ఉపయుక్తం అవుతుంది. ఈ రెండు ఫ్రైట్ కారిడార్ ల ఆధారంగా.. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితోపాటు దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతంతో.. తూర్పు ప్రాంతాన్నిపశ్చిమంతో అనుసంధానించే ప్రత్యేక రైలు కారిడార్ల పనులు కార్యక్రమాలువేగంగా జరుగుతున్నాయి.
సోదర, సోదరీమణులారా,
గూడ్స్ రైళ్ల కోసం నిర్మిస్తున్న ఈ ప్రత్యేక కారిడార్ల కారణంగా ప్రయాణికుల రైళ్ల సమయాల్లో ఆలస్యం ఉండదు. దీంతోపాటు గూడ్సు రైళ్ల వేగం కూడా మూడురెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు.. గతంలోకంటే రెండురెట్లు అధిక బరువును రైళ్లు తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఎందుకంటే.. వీటిపైన డబుల్ డెక్కర్.. అంటే ఓ బోగీపై మరో బోగీని నిర్మించి.. గూడ్స్ రైళ్లను నడిపిస్తారు. గూడ్స్ రైళ్లు సమయానికి లక్షిత ప్రాంతానికి చేరుకుంటే.. మన లాజిస్టిక్స్ నెట్ వర్క్ ఖర్చు తగ్గుతుంది. దాని  కారణంగా.. మన వస్తువులు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. దాని వల్ల మనకే లాభం జరుగుతుంది. ఇది దేశంలోని వ్యాపారానికి ఎంతో లబ్ధి చేకూర్చుతుంది. వ్యాపారానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెట్టుబడులకోసం భారత్ మరింత ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలుస్తుంది. దీని ద్వారా దేశంలో ఉపాధికల్పన, స్వయం ఉపాధికోసం సరికొత్త అవకాశాలు సిద్ధంగా ఉంటాయి
మిత్రులారా,
ఈ ఫ్రైట్ కారిడార్లు ఆత్మనిర్భర భారత్‌కు ఓ మంచి వేదికగా మారతాయి. పరిశ్రమలైనా, వ్యాపార లావాదేవీలైనా, రైతులైనా.. వినియోగదారులైనా.. ప్రతి ఒక్కరికీ దీనివల్ల లాభం చేకూరుతుంది. లుథియానా, వారణాసిల్లోని బట్టల వ్యాపారులైనా.. ఫిరోజ్ పూర్ రైతులైనా.. అలీగఢ్ తాళాల తయారీదారులకు, లేదా.. రాజస్తాన్‌లోని సంగమ్‌సర్ కళాకారులకు, మలిహాబాద్ మామిడిపళ్ల ఉత్పత్తిదారులకు.. కాన్పూర్, ఆగ్రాల్లోని లెదర్ వ్యాపారాలకు, భదోహీ లోని కార్పెట్ పరిశ్రమకు, ఫరీదాబాద్‌లోని కార్ల పరిశ్రమకు, ఇలా ప్రతి వ్యాపారానికీ.. ఉన్నవాటికి లాభంతోపాటు కొత్తవాటికి అవకాశాలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా పరిశ్రమల విషయంలో వెనుకబడిన తూర్పు భారతానికి ఈ ఫ్రైట్ కారిడార్ సరికొత్త వెలుగును ప్రసరింపజేస్తుంది. ఈ కారిడార్‌లోని దాదాపు 60శాతం భాగం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అందుకే ఇక్కడి ప్రతి చిన్న-పెద్ద వ్యాపారాలకు, పరిశ్రమలకు ఈ లాభంలో భాగస్వామ్యం ఉంటుంది. కొన్నేళ్లుగా యూపీలో దేశ, విదేశీ పెట్టుబడులపై పెరుగుతున్న ఆకర్షణ మరింత పెరుగుతుంది.
సోదర, సోదరీమణులారా,
ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లాభం.. కిసాన్ రైలు కూడా దక్కుతుంది. నిన్ననే దేశంలో వందవ కిసాన్ రైలు ప్రారంభమైంది. కిసాన్ రైలు దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను దేశమంతా ఉన్న మార్కెట్లకు సురక్షితంగా, తక్కువ ధరకే చేర్చేందుకు ఉపయుక్తమవుతోంది. ఈ కొత్త ఫ్రైట్ కారిడార్ ల కారణంగా కిసాన్ రైళ్లు కూడా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఉత్తరప్రదేశ్ లోనూ కిసాన్ రైళ్లు చాలా స్టేషన్లతో అనుసంధానమై ఉన్నాయి. ఆ స్టేషన్ల సంఖ్యను నిరంతరం పెంచుతూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లలో గిడ్డంగులు, శీతల గిడ్డంగుల సదుపాయాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నాం. యూపీలోని 45 గిడ్డంగుల్లో ఆధునిక సేవలను అదుబాటులోకి తీసుకొచ్చాం. వీటితోపాటు రాష్ట్రంలో 8 కొత్త గూడ్స్ షెడ్స్ నిర్మాణం కూడా పూర్తయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఘాజీపూర్ ల్లో భారీ పెరిషబుల్ కార్గో సెంటర్ లు ఇంతకుముందునుంచే రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పళ్లు, కూరగాయలు వంటి తొందరగా పాడయ్యే వస్తువులను రైతులు భద్రపరుచుకోవచ్చు.
మిత్రులారా,
ఈ రకమైన మౌలికవసతుల కారణంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే.. వీటి నిర్మాణంలో ఎందుకింత ఆలస్యం జరిగిందనేదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు 2014కు ముందున్న ప్రభుత్వాల పనిసంస్కృతికి ఓ ప్రత్యక్ష నిదర్శనం. 2006లో ఈ ప్రాజెక్టును కేటాయించారు. ఆ తర్వాత కేవలం కాగితాలు, ఫైళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. రాష్ట్రాలతో ఈ విషయంలో కేంద్రం చర్చలు జరపాల్సిన అవసరముంది. ఎంత వేగంగా చర్చలు జరగాల్సిన అవసరముందో.. అది జరగనేలేదు. దాని ఫలితంగా ఎక్కడిపని అక్కడే ఆగిపోయింది. 2014 వరకు ఒక్క కిలోమీటర్ ట్రాక్ కూడా వేయకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇందుకోసం విడుదలైన నిధులు కూడా సరైన విధంగా ఖర్చుచేయలేకపోయారు.
మిత్రులారా,
2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాం. అంతా కొత్తగా ప్రారంభించాలని అధికారులు ఆదేశాలిచ్చాం. దీని వల్ల బడ్జెట్ 11 రెట్లు అంటే.. 45వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రగతి సమావేశాల్లో నేనే స్వయంగా ఈ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షించాను. ఈ ప్రాజెక్టుల భాగస్వామ్యపక్షాలందరితో మాట్లాడాను. సమీక్షించాను. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతర చర్చలు జరిపాం. వారిని ప్రోత్సహించాం. దీంతోపాటుగా కొత్త సాంకేతికతను తీసుకొచ్చాం. దీని ఫలితంగానే.. 1100 కిలోమీటర్ల మేర పని.. వచ్చే కొద్ది నెలల్లోనే పూర్తికానుంది. ఎనిమిదేళ్లలో ఒక్క కిలోమీటర్ పనికూడా జరగని చోట.. ఆరేడు ఏళ్లలో 1100 కిలోమీటర్ల పని జరగడంపై మీరే ఆలోచించండి.
సోదర, సోదరీమణులారా,
మౌలికవసతుల కల్పనలో రాజకీయ ఉదాసీనత ఒక్క ఫ్రైట్ కారిడార్‌పై మాత్రమే కాకుండా.. మొత్తం రైల్వే వ్యవస్థనే తీవ్రంగా నష్టపరిచింది. మొదట రైళ్ల సంఖ్యను పెంచడంపై దృష్టి ఉండేది.. ఎందుకంటే ఎన్నికల్లో దాని ద్వారా లబ్ధి పొందాలని చూసేవారు. కానీ.. ఈ రైళ్లు నడిచే పట్టాలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండేదికాదు. రైల్వే నెట్ వర్క్‌ను ఆధునీకరించే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. మన రైళ్ల వేగం కూడా చాలా తక్కువగా ఉండేది. మొత్తం నెట్ వర్క్ ప్రమాదభరితమైన మానవరహిత గేట్లతో నిండి ఉండేది.
మిత్రులారా,
మేం 2014 తర్వాత ఈ పనితీరును, ఈ ఆలోచనను మార్చాం. రైల్వేలకోసం ప్రత్యేక బడ్జెట్ వ్యవస్థను రద్దుచేశాం. ప్రకటనలు గుప్పించి మరిచిపోయే రాజకీయాలను పక్కనపెట్టాం. రైల్వే పట్టాలపై పెట్టుబడి పెట్టాం. రైల్వే నెట్ వర్క్‌కు వేల సంఖ్యలో ఉన్న మానవరహిత గేట్లనుంచి విముక్తి కల్పించాం. రైల్వే ట్రాక్ లను రైళ్లు వేగంగా వేళ్లేందుకు వీలుగా మార్పులు చేశాం. రైల్వే నెట్ వర్క్ ను పెంచడం, విద్యుదీకరణ రెండింటిపైనా దృష్టిపెట్టాం. ఇప్పుడు వందేభారత్ వంటి సెమీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. భారతీయ రైల్వే వ్యవస్థ గతంకంటే ఎక్కువ సురక్షితంగా మారింది కూడా.
మిత్రులారాచ
గత కొద్ది సంవత్సరాలుగా రైల్వేల్లోని ప్రతి అంశంలో సంస్కరణలు తీసుకొచ్చాం. రైల్వేల స్వచ్ఛత, పరిశుభ్రమైన భోజనం, తాగునీరు.. ఇతర సదుపాయాలను పెంచాం. ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఇదే విధంగా.. రైల్వేతో అనుసంధానమైన తయారీ రంగం.. భారతదేశంలో ఆత్మనిర్భరత సరికొత్త ఎత్తులకు చేరుకుంది. ఇప్పుడు భారతదేశం తనతోపాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు రైళ్లను తయారుచేస్తోంది. యూపీ గురించి మాట్లాడుకుంటే.. వారణాసిలోని లోకోమోటివ్ వర్క్స్, భారత్ లో ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారుచేసే అతిపెద్ద కేంద్రంగా సిద్ధమవుతోంది. గతంలో డెంటింగ్-పెయింటింగ్‌‌కే పరిమితమైన రాయ్‌బరేలీ లోని ఆధునిక కోచ్ ఫ్యాక్టరీలో మార్పులు తీసుకొచ్చి.. గత ఆరేళ్లుగా 5వేలకు పైగా రైల్వే కోచ్‌లను రూపొందించాం. ఇక్కడ తయారవుతున్న కోచ్‌‌లను ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
సోదర, సోదరీమణులారా,
దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడమనేది రాజకీయాలకు అతీతంగా జరగాలని మన గత అనుభవాలు బోధిస్తున్నాయి. దేశంలోని మౌలికవసతులు ఏ రాజకీయపార్టీ సిద్ధాంతానికి కాకుండా.. దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి. ఇది ఐదేళ్ల రాజకీయం కాదు. రానున్న తరాలకు లబ్ధి చేకూర్చే మిషన్. రాజకీయపార్టీలకు పోటీపడాలని ఉంటే.. అది వసతుల నాణ్యతను పెంచడంలో ఉండాలి. వేగంగా అందుబాటులోకి తీసుకురావడంలో పోటీ ఉండాలి. ఈ సందర్భంగా ఓ మానసిక పరిస్థితి గురించి చెప్పడం అవసరమని భావిస్తున్నాను. ప్రతిసారీ ఆందోళను, ప్రదర్శనల సందర్భంగా.. దేశ ఆస్తిని, మౌలికవసతులను నష్టపరచడమే తమ లక్ష్యంగా కొందరు పనిచేస్తారు. అది ఓ పార్టీదో, ఓ నేతదో, ఓ ప్రభుత్వానిదో కాదు.. అది భారతదేశానిది అనే విషయాన్ని మరవొద్దు. ఇందులో ప్రతి పేదవాడి, ప్రతి రైతు, మధ్యతరగతితోపాటు సమాజంలోని అన్ని వర్గాల స్వేదఫలం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ.. మన జాతీయవాద బాధ్యతను కూడా నిర్వర్తించడాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.
మిత్రులారా,
దేశం ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. పనికొచ్చే రైల్వే వ్యవస్థనే నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ రైల్వేల అవసరాన్ని మనం చూశాం. ఇబ్బందుల్లో ఉన్నకార్మికులను వారి స్వగ్రామాలకు చేర్చడంలో.. మందులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంలో.. మొబైల్ కరోనా ఆసుపత్రులుగా.. రైల్వేల అవసరాన్ని.. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వారి సేవాగుణాన్ని దేశం ఎప్పటికీ విస్మరించదు. అంతేకాదు.. స్వగ్రామాలకు వచ్చిన కార్మికులకోసం లక్షకు పైగా పనిదినాల ఉపాధిని కూడా రైల్వేలు కల్పించాయి. సేవ, సహృద్భావం, దేశ సమృద్ధి కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం, ఈ మిషన్ నిరంతరం ఇలాగే కొనసాగుతుంటుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
మరోసారి యూపీతోపాటు ఈ ఫ్రైట్ కారిడార్ సౌకర్యాన్ని పొందుతున్న రాష్ట్రాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైల్వేల్లోని ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ఫ్రైట్ కారిడార్‌కు సంబంధించిన మిగిలిన పనిని కూడా వేగంగా పూర్తిచేయాలని కోరుతున్నాను. 2014 తర్వాత ఏ వేగంతో అయితే పని జరిగిందో.. అంతకన్నా వేగంగా భవిష్యత్తులో పనులు జరగాలి. దేశ ప్రజల ఆకాంక్షలను రైల్వేలోని మన సోదరులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విశ్వాసంతోనే మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదములు!

***

 



(Release ID: 1684547) Visitor Counter : 111