ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో స్వామీ వివేకానంద విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 12 NOV 2020 9:05PM by PIB Hyderabad

ప్రారంభంలో యువకులందరికీ ఓ నినాదం ఇవ్వాలని కోరుతున్నాను. మీరందరూ నాతో చెప్పండి. నేను స్వామీ వివేకానంద అంటాను.. మీరంతా అమర్ రహే అమర్ రహే అని చెప్పండి

స్వామీ వివేకానంద అమర్ రహే అమర్ రహే.. స్వామీ వివేకానంద అమర్ రహే అమర్ రహే
కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, జేఎన్‌యూ ఉపకులపతి ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ జీ, ప్రో-వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్పీ సింహ్ జీ, నేటి ఈ సందర్భాన్ని సాకారం చేసిన జేఎన్ యూ పూర్వ విద్యార్థి డాక్టర్ మనోజ్ కుమార్ జీ, విగ్రహ రూపశిల్పి వ్రీ నరేశ్ కుమావత్ జీ, వివిధ ప్రాంతాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యాపక సిబ్బంది, భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా యువ విద్యార్థులారా.. జేఎన్ యూ పాలనా సిబ్బంది, అందరు అధ్యాపకులు, విద్యార్థులకు ఈ మహత్వపూర్ణ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
విగ్రహంపై విశ్వాసంలోని రహస్యమేంటంటే.. దీని ద్వారా దైవత్వ దృష్టి మనకు అలవరుతుంది అని స్వామీ వివేకానంద చెప్పేవారు. జేఎన్‌యూలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం అందరు విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ.. కొత్త శక్తినిన అందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విగ్రహం ద్వారా స్వామీ వివేకానందుడు ప్రతి యువకుడిలో చూడాలనుకున్న ధైర్య, సాహసాలను పొందాలి. స్వామీజీ దర్శనానికి ఆధారమైన దయ, జాలి, కరుణను కూడా ఈ విగ్రహం ద్వారా పొందాలి.
స్వామీజీ జీవితం యొక్క ఉన్నతమైన సందేశమైన.. దేశం పట్ల సమర్పణ భావాన్ని, ప్రేమను, దేశం పట్ల గౌరవభావాన్ని ఈ విగ్రహం నుంచి నేర్చుకోవాలి. ఈ విగ్రహం స్వామీజీ ఆలోచనైన ‘ఏకత్వ భావన’ను దేశానికి నేర్పించాలి. స్వామీజీ ఆకాంక్షించిన.. యువత ఆధారిత అభివృద్ధి దిశగా దేశం పయనించేందుకు ఈ విగ్రహం ప్రేరణ కావాలి.  ఈ విగ్రహం స్వామీజీ ఆశించిన సశక్త-సమృద్ధ భారత కలను సాకారం చేసేందుకు స్ఫూర్తినివ్వాలి.
మిత్రులారా,
ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు. దేని ఆధారంగానైతే ఓ సన్యాసి మొత్తం ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేశాడో ఆ ఉన్నతమైన ఆలోచనలకు ప్రతీక. వారి వద్ద వేదాంతాలకు సంబంధించిన లోతైన జ్ఞాననిధి ఉంది. వారికి ఓ స్పష్టమైన లక్ష్యముంది. ప్రపంచానికి భారతదేశం ఏం ఇవ్వగలదో స్వామీజీకి బాగా తెలుసు. విశ్వబంధుత్వమనే భారతీయ సందేశాన్ని తీసుకుని ప్రపంచంలోకి అడుగుపెట్టారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, మన ఆలోచనలను, పరంపరను గౌరవపూర్వమైన పద్ధతిలో ప్రపంచం ముందుంచారు.
నలువైపులా నిరాశ, నిస్పృహలు కమ్ముకున్న తరుణంలో.. మనం బానిసత్వ సంకెళ్లతో ఉన్న తరుణంలో.. స్వామీజీ అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంలో చెప్పారు. అది కూడా గత శతాబ్దం ఆరంభంలో. వారేం చెప్పారు. మిషిగన్ యూనివర్సిటీలో భారతదేశానికి చెందిన ఓ సన్యాసి ఉపన్యాసం కూడా ఇవ్వగలరు, సంపూర్ణ భారతదర్శనాన్ని కూడా అందించారు.
వర్సిటీలో వారు మాట్లాడుతూ.. ‘ఈ శతాబ్దం మీదే. కానీ 21వ శతాబ్దం మాత్రం కచ్చితంగా భారతదేశానిదే‘ అని అన్నారు. గత శతాబ్దంలో వారు చెప్పిన ఈ మాటలు వాస్తరూపం దాలుస్తున్నాయి. వారి వ్యాఖ్యలను నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మకు ఈ విగ్రహం ప్రతిరూపం. బానిసత్వంలో ఉన్న సమయంలో భారతదేశానికి, దేశ సామర్థ్యానికి, తన గుర్తింపునకు ఈ విగ్రహమే ఓ కాంతిపుంజంగా దేశాన్ని జాగృతం చేసింది. దేశంలో నవ చైతన్యానికి నాంది పలికింది.
మిత్రులారా,
నేడు దేశం ఆత్మనిర్భర భారత లక్ష్యంతో ముందుకెళ్తోంది. నేటి ఈ ఆత్మనిర్భర భారత ఆలోచన 130కోట్ల కంటే ఎక్కువమంది భారతీయుల సామూహిక చైతన్యం, మన ఆకాంక్షల్లో భాగం అయిపోయింది. మనం ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడినపుడల్లా.. ఇది భౌతిక, వస్తుపరమైన ఆత్మనిర్భరత వరకే పరిమితం కాలేదు. ఆత్మనిర్భరత అంటే.. అర్థంలోనూ, విస్తృతిలోనూ వ్యాపకంలోనూ అది ఆత్మనిర్భరతను ప్రతిబింబిస్తుంది. మానవ వనరులతోపాటు, మన ఆలోచనలు, సంస్కారంలోనూ ఆత్మనిర్భరత సాధించినప్పుడే.. అసలైన ఆత్మనిర్భర భారత నిర్మాణం సాధ్యమవుతుంది.
విదేశాల్లో ఓసారి ఎవరో  స్వామీజీతో మాట్లాడుతూ.. మీరు జెంటిల్ మెన్ గా కనిపించే దుస్తులు ఎందుకు ధరించరని ప్రశ్నించారు. దీనికి స్వామీజీ సమాధానమిస్తూ.. భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని, లోతైన విలువలను ప్రతిబింబించేలా సమాధానమిచ్చారు. వినయంగా ఆ మహానుభావునికి సమాధానమిస్తూ.. ‘మీ సంస్కృతి ప్రకారం.. మిమ్మల్ని ఓ దర్జీ.. జెంటిల్ మెన్ గా రూపొందిస్తారు. కానీ మా సంస్కృతి ప్రకారం మన నడవడికే మనం జెంటిల్ మెన్ అవునా కాదా నిర్ణయిస్తుంది. ఆత్మనిర్భర ఆలోచన, సంస్కారం కారణంగానే ఈ క్యాంపస్ నిర్మాణం అవుతుంది.. మీలాంటి యువశక్తి నిర్మాణం అవుతుంది.
మిత్రులారా,
మన దేశ యువత.. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు. మన యువత మన సంస్కృతి, మన సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అందుకే మన పురాతన సంప్రదాయాన్ని, గుర్తింపుపై గర్వించడం మాత్రమే కాదు.. 21వ శతాబ్దంలో దేశానికి సరికొత్త గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. గతంలో మనం ప్రపంచానికి ఏమేం ఇచ్చామో గుర్తుచేసుకుని వాటిని తిరిగి గుర్తుచేయడం ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ఆత్మవిశ్వాసం ఆధారంగానే మన భవిష్యత్తులో మరింత పనిచేయాల్సి ఉంటుంది. 21వ శతాబ్దంలో ప్రపంచానికి భారతదేశం ఏం ఇవ్వగలదని ఆలోచించి ఇందుకోసం వినూత్నంగా ఆలోచించడం మనందరి బాధ్యత.
మిత్రులారా,
మన యువ మిత్రులు దేశ విధానాలు, ప్రణాళికల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. దేశ ఆత్మనిర్భరత అంటే మనం వ్యక్తిగతంగా సంతోషంగా ఉండటమా? అని వారికి ఆలోచన రావొచ్చు. మీలోమీరు మీతో మీరు సంతోషంగా ఉండటమేనా? దీనికి జవాబు కూడా స్వామీ వివేకానందుడి ఆలోచలనుంచి లభిస్తుంది. సన్యాసులు తమ దేశాన్ని కాకుండా.. ఇతర దేశాలను తనవిగా భావించడం సరికాదు కదా అని ఒకాయన స్వామీజీని ప్రశ్నించారు. దీనికి స్వామీజీ సమాధానమిస్తూ.. ‘ఎవరైనా తన తల్లికి అండగా నిలబడలేడో.. అతడు ఇతరుల తల్లి గురించి ఎలా ఆలోచించగలడు’ అని అన్నారు. అందుకే మన ఆత్మనిర్భరత సమస్త మానవాళి సంక్షేమం కోసమే. దీన్ని మనం సాధించి చూపిద్దాం. భారతదేశ సామర్థ్యం పెరిగిన ప్రతిసారీ అది ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. అందుకే భారతదేశ ఆత్మనిర్భరతలో.. ‘ఆత్మవత్ సర్వభూతేషు’ అనే భావన దాగి ఉంది. మొత్తం ప్రపంచ మేలు ఉంది.
మిత్రులారాచ
నేడు ప్రతి రంగంలో తీసుకొస్తున్న మంచి సంస్కరణలన్నీ.. ఆత్మనిర్భరత భావనతో జరుగుతున్నాయి. దేశ ప్రజలు ఓట్లద్వారా ఈ సంస్కరణలకు మద్దతు కూడా ప్రకటించారు. మీరు.. జేఎన్‌యూలో భారతదేశ సామాజిక, రాజనీతి వ్యవస్థ గంభీరతను విశ్లేషిస్తారు. భారతదేశంలో సంస్కరణలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతాయనే విషయాన్ని మీకంటే గొప్పగా ఎవరికి తెలుస్తుంది? మన దేశంలో మంచి సంస్కరణలు.. చెత్త రాజకీయాలుగా పరిగణించలేదనేది వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు మంచి సంస్కరణలు, మంచి రాజకీయాలు ఎలా అయ్యాయి?
దీనిపై జేఎన్‌యూ మిత్రులు తప్పనిసరిగా పరిశోధించండి. కానీ అనుభవం ద్వారా మీ ముందు ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను. నేడు వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నామో.. ప్రతి ఒక్క సంస్కరణలోనూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం ఉంది. ఈ సంస్కరణలు నైతికతతోపాటు పవిత్ర నిష్టతో చేస్తున్నాం. నేటి ఈ సంస్కరణలను రూపొందించకముందే వాటికి ఓ సురక్ష కవచాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ కవచానికి అన్నింటికంటే ముఖ్యమైన ఆధారం విశ్వాసం, నమ్మకం. రైతు అనుకూల సంస్కరణల గురించిమాట్లాడితే.. మన దేశంలో రైతులు కేవలం రాజకీయ చర్చల విషయంగానే మిగిలిపోయేవారు. క్షేత్రస్థాయిలో రైతు సంక్షేమానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
గత 5-6 ఏళ్లలో మేం రైతుల కోసం ఓ సురక్షితమైన వ్యవస్థను అభివృద్ధి చేశాం. నీటిపారుదల మౌలిక వసతులు కావొచ్చు.. మార్కెట్ల ఆధునీకరణ కావొచ్చు, యూరియా అందుబాటులో ఉంచడం కావొచ్చు.. భూసార కార్డులు కావొచ్చు.. సరైన విత్తనాలు కావొచ్చు, పంట బీమా కావొచ్చు, ఒకటిన్నర రెట్ల మద్దతు ధర కావొచ్చు, ఆన్‌లైన్ మార్కెట్ వ్యవస్థ ఈ-నామ్ కావొచ్చు, పీఎం సమ్మాన్ నిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చడం కావొచ్చు. గత కొన్నేళ్లలో మద్దతుధరను కూడా పలుమార్లు పెంచడం జరిగింది. దీంతోపాటు రైతుల వద్దనుంచి రికార్డు స్థాయిలో కొనుగోళ్లు కూడా జరిగాయి. ఇలా రైతుల చుట్టూ సురక్ష కవచాన్ని ఏర్పాటుచేశాం. అప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి.. వ్యవసాయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాం.
మొదట రైతుల ఆకాంక్షలపై దృష్టిపెట్టాం.. ఇప్పుడు రైతుల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు రైతుల సంప్రదాయ వనరుల లభ్యత కూడా పెరిగింది. ఎప్పుడైతే అవకాశాలు పెరుగుతాయో.. అప్పుడు కొనుగోలులో పోటీ పెరుగుతుంది.. దాని ద్వారా నేరుగా రైతు లబ్ధి పొందేందుకు వీలవుతుంది. ఈ సంస్కరణల ద్వారా రైతు ఉత్పత్తి సంఘం (ఎఫ్‌పీవో)ల ద్వారా రైతు నుంచి ఎగుమతిచేసే మార్గం సుగమం అయింది.
మిత్రులారా,
రైతులతోపాటు పేదల విషయంలో తీసుకొచ్చిన సంస్కరణల విషయంలోనూ ఇదే వ్యూహంతో ముందుకెళ్లాం. సుదీర్ఘకాలంగా మనదేశంలో పేదరికాన్ని నినాదాలకే పరిమితం చేశారు. కానీ దేశంలోని పేదలను ప్రభుత్వ వ్యవస్థతో జోడించే పనులేవీ జరగలేదు. పేదలు అందరికంటే ఎక్కువగా విస్మరించబడ్డారు.. ఆర్థికంగా.. అందరికంటే ఎక్కువగా వెనుకబడ్డారు. ఇప్పుడు ఆ పేదలకు సొంత పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీరు, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యం, తక్కువ ధరకే మొబైల్ అనుసంధానత, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. మిగిలిన ప్రజలతో సమానంగా వారికి అన్ని అందుతున్నాయి. ఇది పేదల చుట్టూ ఏర్పరిచిన రక్షణ కవచం. అది వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడగడానికి అత్యంత అవసరం.
మిత్రులారా,
మరో సంస్కరణ.. అది దేశంలోని జేఎన్‌యూ వంటి క్యాంపస్ లను ప్రభావితం  చేస్తుంది. అదే సరికొత్త జాతీయ విద్యావిధానం. విశ్వాసం పెంచడం, నమ్మకం కల్గించడం, సత్ప్రవర్తన కలిగిన యువభారత నిర్మాణం జరగాలనే మూల విలువల ఆధారంగానే ఈ కొత్త జాతీయ విద్యావిధానాన్నిరూపొందించాం. స్వామీ వివేకానందుడి ఆలోచన కూడా ఇదే. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ఇవ్వడంతోపాటు వారిని అన్ని రకాలుగా ఆత్మనిర్భరంగా మార్చే విద్యావిధానం ఉండాలని వారు ఆకాంక్షించేవారు.
జీవితంలో రెండున్నర దశాబ్దాల తర్వాత యువ మిత్రులకు ఓ భరోసా వస్తుంది. అదే పాఠశాలలో ఉన్నప్పుడే ఎందుకు ఆ భరోసా రాకూడదు. పుస్తక జ్ఞానం, వివిధ కోర్సుల పరిమితులు, మార్క్ షీట్లు, డిగ్రీలు, డిప్లొమాల వరకు యువశక్తిని ఎందుకు బంధించి పెడుతున్నారు? నూతన జాతీయ విద్యావిధానం ఈ విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. సమగ్రత.. నూతన విధాన మూలసూత్రం. భాష కేవలం మాధ్యమం మాత్రమే.. జ్ఞానానికి కొలమానం కాదనేదే ఈ విధానం భావన. పేదలందరికీ.. దేశంలోని బాలికలకు వారి అవసరాలు, వారి సౌకర్యాన్ని బట్టి ఉన్నత విద్యను అందుకునే అధికారం ఉండాలి. దీన్ని మేం అమల్లోకి తెస్తున్నాం.
మిత్రులారా,
సంస్కరణలను రూపొందించడంతోనే మార్పు జరగదు. దాన్ని ఎలాగైతే మన జీవితంలో అమలు పరుస్తాం అనేదే చాలా కీలకం. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా మన విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. అయితే.. ఇందులో మనమంతా నైతికత, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో మన టీచర్లు, మేధావుల పాత్ర అత్యంత కీలకం. జేఎన్‌‌యూ క్యాంపస్ లోనూ ఓ ప్రజాదరణ కలిగిన ప్రాంతం. దానిపేరు సబర్మతి ఢాబా. అక్కడ ఎంతమందికి ఖాతాలున్నాయి. మీరు క్లాసులు తర్వాత ఈ ఢాబాలో కూర్చుని చాయ్ తాగుతూ, పరాఠాలు తింటూ.. చర్చలు కొనసాగిస్తారని నాకు తెలిసింది. కడుపు నిండుగా ఉన్నప్పుడు జరిగే చర్చలు మరింత ఆసక్తికరంగా సాగుతాయి. ఇన్నాళ్లూ ఈ ఢాబాలో మీ ఆలోచనలు, చర్చలు, వాద-సంవాదాలు జరిగేవి. ఇకపై వివేకానందుడి విగ్రహం నీడలోనూ మీ చర్చలు జరిగేందుకు ఓ చోట దొరికింది.
మిత్రులారా,
దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత చేటు కలిగించిన అంశమేదైనా ఉందంటే.. అది దేశహితం కంటే వ్యక్తిగత సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే. నా సిద్ధాంతం చెబుతున్న దాని ప్రకారం నా ప్రతి ఆలోచన దేశహితం దిశగానే ఉంటుంది. ఆ దిశగానే పనిచేస్తాను. ఇది సరైనది కాదు మిత్రులారా. ఇవాళ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సిద్ధాంతమే గొప్పదని భావిస్తారు. ఇది సహజమే. కానీ మన ఆలోచన ధోరణి కచ్చితంగా దేశహితాన్ని దృష్టిలో ఉంచుకునే జరగాలి. దేశానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయకూడదు.
మీరు దేశ చరిత్రను గమనిస్తే.. దేశం ముందు తీవ్రమైన సమస్యలు వచ్చిన ప్రతిసారి.. భిన్న సిద్ధాంతాలు, భిన్న ఆలోచన వ్యక్తులంతా దేశహితం ఏకమైన సందర్భాలెన్నో ఉన్నాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో అన్ని ఆలోచనలు, అన్ని సిద్ధాంతాల వారు కలిసి పనిచేశారు. వారంతా దేశం కోసం కలిసి పోరాడారు.
బాపూ నేతృత్వంలో ఏ వ్యక్తితీ తన వ్యక్తిగత సిద్ధాంతాన్ని వదులుకునే అవసరం రాలేదు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరికీ దేశమే మొదటి ప్రాధాన్యతగా ఉండేది. ఎమర్జెన్సీని గుర్తుచేసుకోండి. ఆ సమయంలో దేశమంతా ఏకతాటిపై నడిచింది. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం నాకు కలిగింది. ఆ పరిస్థితులకు నేను ప్రత్యక్ష సాక్షిని.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో కాంగ్రెస్ మాజీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆరెస్సెస్ స్వయం సేవకులు, జన్ సంఘ్ కార్యకర్తలు కూడా ఉన్నారు. సమాజ్ వాదీ వారూ ఉన్నారు. కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. జెఎన్‌యూతో అనుసంధానమైన వారంతా ఏకతాటిపైకి వచ్చి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇంత పోరాటం జరిగినా ఏ ఒక్కరూ తమ వ్యక్తిగత సిద్ధాంతాన్ని వదులుకునే అవసరం రాలేదు. అందరి ఏకైక ఉద్దేశం దేశహితమే. ఈ ఉద్దేశం అన్నింటికన్నా ఉన్నతస్థానంలో ఉంది. దేశ ఐకమత్యం, అఖండత అనే అంశాల ప్రశ్న తలెత్తినపుడు.. అక్కడ మన సిద్ధాంతాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం దేశానికి చాలా నష్టం చేస్తుంది.
స్వార్థం కోసం, అవకాశ వాదం కోసం మన సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం కూడా చాలా పెద్ద తప్పని నాకు తెలుసు. నేటి సమాచార యుగంలో ఇలాంటి అవకాశవాదం ఎప్పటికీ విజయం సాధించలేదు. కానీ ఇది కొంతమేర జరుగుతోంది. మనం అవకాశ వాదానికి దూరంగా.. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాల్సిన దిశగా పనిచేయాలి.
మిత్రులారా,
ఇక్కడ మీ హాస్టళ్ల పేర్లు కూడా గంగా, సబర్మతీ, గోదావరి, తపతి, కావేరీ, నర్మద, జీలం, సత్లేజ్ వంటి  నదులపేర్లతో ఉన్నాయి. ఈ నదుల్లాగే మీరు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. విభిన్న సిద్ధాంతాలతో వస్తారు. ఇక్కడ కలుస్తారు. మీ ఆలోచనలు పంచుకోవడం ద్వారా వచ్చే కొత్త ఆలోచనల ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఆ ప్రవాహాన్ని ఎప్పుడూ ఆపొద్దు. విభిన్నమైన ఆలోచనలు పుట్టి విలసిల్లే గొప్ప దేశం భారతదేశం. ఇలాంటి గొప్ప సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం మీవంటి యువలకు మరింత ఆవశ్యకం. ఈ సంప్రదాయం కారణంగానే మనదేశం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యంగా నిలిచింది.
మన దేశ యువత ఏ పరిస్థితినైనా యధాతథంగా అంగీకరించాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఎవరో చెప్పారని.. దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. మీరు తర్కించండి, చర్చించండి, వాదించండి..ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. మేధోమథనం జరగాలి. ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావాలి.
స్వామీ వివేకానంద జీ కూడా ఎప్పుడూ యధాతథ స్థితిని అంగీకరించేవారు కాదు. నేను ఓ ముఖ్యమైన అంశంపై మాట్లాడదామని అనుకుంటున్నాను. అదే ‘హాస్యం’. ఇది ఓ పెద్ద సానుకూల బలాన్నిస్తుంది. మీలోని హాస్యచతురతను ఎప్పటికప్పుడు బయటకు తీయండి. అప్పుడప్పుడు కొందరు యువకులను చూస్తాను. ప్రపంచ భారం మొత్తాన్ని వారే మోస్తున్నట్లుగా ఉంటారు. అందుకే మన క్యాంపస్ జీవితంలో, చదువులో, క్యాంపస్ రాజకీయాల్లో ఎప్పుడూ హాస్యాన్ని నింపుకోవాలి. అందుకే దీన్ని మనం కాపాడుకోవాలి. హాస్య చతురతను ఎప్పుడూ వదులుకోవద్దు.
యువ మిత్రులారా, మనగురించి మనం తెలుసుకునేందుకు విద్యార్థి దశ అత్యంత కీలకం. మనల్ని మనం తెలుసుకోవడం జీవితంలో అత్యంత ఆవశ్యకం. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జేఎన్‌యూ క్యాంపస్ లో ఏర్పాటుచేసిన స్వామీ వివేకానందుడి ఈ విగ్రహం.. జాతినిర్మాణం, దేశభక్తి, దేశ జాగృతం కోసం ఇక్కడకు వచ్చే ప్రతి యువకుడికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ ఆకాంక్షతో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అభినందనలు.
మీరందరూ విజయం సాధించండి. ఆరోగ్యంగా ఉండండి. రానున్న రోజుల్లో జరిగే పండుగలను ఘనంగా జరుపుకోండి. మీ కుటుంబసభ్యులతో కలిసి ఆహ్లాదంగా, ఉత్సాహంగా పండగ చేసుకోండి. ఈ ఆకాంక్షతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదములు!

 

***


(Release ID: 1672785) Visitor Counter : 243