PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 13 OCT 2020 6:16PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కేసులు-మరణాలు స్వల్పంగా; పరీక్షలు అధికంగాగల దేశాల జాబితాలో కొన‌సాగుతున్న భార‌త్.
  • గత 24 గంటల్లో 10,73,014 రోగ నిర్ధారణ పరీక్షలు; ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 8.89 కోట్లు.
  • గత 24 గంటల్లో 55,342 కొత్త కేసులు; ఐదు వారాలుగా తాజా కేసుల నమోదులో నిరంతర తగ్గుదల.
  • కోలుకునేవారి జాతీయ సగటు 86.78 శాతానికి చేరిక.
  • కోవిడ్‌-19పై డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షతన మంత్రుల బృందం 21వ సమావేశం.
  • ఆరోగ్యశాఖ పరిధిలోని ‘ఈ-సంజీవని’ద్వారా దేశంలో 5 లక్షల దూరవాణి-వైద్య సంప్రదింపులు.

Image

ప్ర‌పంచంలో కేసులు-మరణాలు స్వల్పంగా‌; పరీక్షలు అధికంగాగల దేశాల్లో భార‌త్‌; క్రియాశీల కేసుల నిరంత‌ర త‌గ్గుద‌ల‌; 24 గంటల్లో కేవలం 55,342 కొత్త కేసులు

ప్ర‌పంచంలో ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు కోవిడ్‌ కేసులు, మరణాలు అత్యల్పంగాగల దేశాల జాబితాలో భారత్‌ తన స్థానాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. అంత‌ర్జాతీయంగా ప్రతి 10 లక్షల జ‌నాభాకు 4,794 భారత్‌లో 5,199గా ఉంది. బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఇంతక‌న్నా అధికంగా ఉంది. అలాగే ప్రపంచంలో ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభా‌కు  మ‌ర‌ణాల స‌గ‌టు 138 కాగా, భార‌త్‌లో కేవ‌లం 79 మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల విష‌యంలో అగ్రస్థానంలోగల దేశాల సరసన భార‌త్ కొనసాగుతోంది. ఈ మేర‌కు గ‌త 24 గంటల్లో 10,73,014 న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా, ఇప్పటిదాకా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల సంఖ్య 8,89,45,107 కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 55,342 కాగా, ఐదు వారాల్లో సగటున రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి సంబంధించి వారంవారీ సగటును ప‌రిశీలిస్తే- సెప్టెంబర్ 2వ వారంలో రోజుకు 92,830 వంతున నమోద‌వ‌గా అక్టోబర్ 2వ వారంనాటికి 70,114 కేసుల స్థాయికి తగ్గింది. మరోవైపు చికిత్స పొందే కేసులు కూడా క్ర‌మంగా త‌గ్గుతూ ఇప్ప‌టిదాకా నమోదైన మొత్తం కేసులలో 11.69 శాతంగా మాత్రమే ఉన్నాయి. త‌ద‌నుగుణంగా ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో ఉన్న‌వారి సంఖ్య 8,38,729 కాగా, వరుసగా ఐదో రోజున‌ 9 లక్షలకు మించ‌క‌పోవ‌డం విశేషం. కొత్త కేసులలో 76 శాతం 10 రాష్ట్రాలవారే కాగా- మహారాష్ట్ర, క‌ర్ణాట‌క‌ల‌లో ‌అత్య‌ధికంగా 7,000 కేసుల వంతున న‌మోద‌య్యాయి. దేశంలో గ‌త 24గంటల్లో 77,760 మంది కోలుకోగా- ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 62,27,295కు చేరింది. దీంతో కోలుకునేవారి జాతీయ స‌గ‌టు మెరుగుపడుతూ ప్రస్తుతం 86.78 శాతానికి పెరిగింది. తాజాగా కోలుకున్న కేసుల‌లోనూ 78 శాతం 10 రాష్ట్రాలవారే కావటం విశేషం. ఆ మేర‌కు 15,000కుపైగా కోలుకున్న కేసుల‌తో మహారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉండ‌గా, 12,000 కేసులతో కర్ణాట‌క త‌ర్వాతి స్థానంలో ఉంది. ఇక కోవిడ్-19 మృతుల సంఖ్య గత 10 రోజులుగా 1000లోపు ఉన్న నేప‌థ్యంలో గత 24 గంటలలో 706 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇందులోనూ దాదాపు 79 శాతం 10 రాష్ట్రాలవారు కాగా, 23 శాతం (165)తో మహారాష్ట్ర ప్ర‌థ‌మ ‌స్థానంలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663970

కోవిడ్-19పై డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం 21వ సమావేశం; పండుగలతోపాటు శీతాకాలంలో కోవిడ్ అనుగుణ ప్రవర్తన సముచితమని సూచ‌న‌

కోవిడ్-19పై ఇవాళ మంత్రుల బృందం 21వ అత్యున్నతస్థాయి దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కోవిడ్పై సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా నెలల తరబడి సేవలందిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజారోగ్య వ్యవస్థ అద్భుత స్పందన కారణంగానే సత్ఫలితాలు సాధ్యమైనట్లు మంత్రివర్గ సహచరులకు ఆయన తెలియజేశారు. దేశంలో ఇప్పటిదాకా 62.27,295మందికి వ్యాధి నయం కాగా, కోలుకునే సగటు 86.78 శాతానికి చేరిందని గుర్తుచేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా కోలుకున్నవారి శాతం నమోదైన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. లాగే మరణాల సగటు అత్యంత స్వల్పంగా 1.53 శాతం స్థాయిలో ఉందని, కేసులు రెట్టింపయ్యే వ్యవధి లోగడ 3  రోజులు కాగా, నేడు 74.9 రోజులకు పెరిగిందని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1927 ప్రయోగశాలలు ఉన్నందున నిత్యం 15 లక్షల నమూనాలను పరీక్షించగల సామర్థ్యం సంతరించుకున్నట్లు చెప్పారు. తదనుగుణంగా గత 24గంటల్లో దాదాపు 11 లక్షల నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. రాబోయే పండుగ సీజన్‌తోపాటు శీతాకాలంలో కోవిడ్‌ అనుగుణ ప్రవర్తనశైలిని పాటించడం సముచితమని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వ్యాధి ప్రబలే అవకాశాలు అధికం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664009

ఆరోగ్యశాఖ పరిధిలోని ‘ఈ-సంజీవని’ద్వారా దేశంలో 5 లక్షల దూరవాణి-వైద్య సంప్రదింపులు; ప్రస్తుతం ఓపీడీద్వారా రోజుకు 216 ఆన్‌లైన్‌ ఓపీడీల నిర్వహణ

కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని దూరవాణి వైద్య సంప్రదింపుల వ్యవస్థ ‘ఈ-సంజీవని’కి రోగులు, వైద్యులలో విశేష ప్రాచుర్యం లభిస్తోంది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తర్వాత అతి తక్కువ కాలంలోనే 5 లక్షల దూరవాణి సంప్రదింపు సేవలను పూర్తిచేసింది. ఇందులో చివరి లక్ష  కేవలం 17 రోజుల రికార్డు సమయంలో పూర్తయినవి కావడం గమనార్హం. తద్వారా డిజిట్‌ విధానంలో తొలి నమూనాగా ఆవిర్భవించిన ఈ వ్యవస్థ భారత ఆరోగ్య సంరక్షణ సేవాప్రదానానికి సమాంతరం వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. కాగా, ఈ-సంజీవని కింద ప్రస్తుతం 26 రాష్ట్రాలు దూరవాణి వైద్య సంప్రదింపులలో “డాక్టర్‌ నుంచి డాక్టర్‌; డాక్టర్‌ నుంచి  రోగి”- రెండు పద్ధతులరూ వాడుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఈ-ఇ సంజీవని’ ఓపీడీ విధానాన్ని 2019 నవంబర్‌లో ప్రారంభించగా, అత్యధిక సంప్రదింపులు నమోదైన 10 రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (169977), ఉత్తర ప్రదేశ్ (134992), హిమాచల్ ప్రదేశ్ (39326), కేరళ (39300), ఆంధ్రప్రదేశ్ (31365), ఉత్తరాఖండ్ (16442) మధ్యప్రదేశ్ (14965), గుజరాత్ (10839), కర్ణాటక (9498), మహారాష్ట్ర (7895) ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1663873

ఆయుష్ వ్యవస్థలకోసం చెన్నైలో ప్రాంతీయ ముడిఔషధ భాండాగారం ప్రారంభం

ఆయుష్‌ వ్యవస్థల కోసం ప్రాంతీయ ముడి ఔషధ భాండాగారాన్ని (RRDR) చెన్నైలోని జాతీయ సిద్ధవైద్య ఇన్‌స్టిట్యూట్‌ (దక్షిణ పీఠభూమి ప్రాంతం) ప్రాంగణంలో కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్‌ ఇవాళ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కోటేచా అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకం జాతీయ ఆయుష్ కార్యక్రమంలో ఈ ప్రాంతీయ ముడి ఔషధ భాండాగారాలు కీలక భాగం. ఈ నేపథ్యంలో జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ/ప్రాంతీయ ముడి ఔషధ భాండాగారాల ఏర్పాటును చేపట్టింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664142

జాతీయ షూటింగ్ శిక్షణ శిబిరాన్ని సురక్షిత ‘బయో బబుల్‌’లో నిర్వహించేందుకు సంయుక్తంగా బాధ్యతలు చేపట్టిన ‘సాయ్‌, ఎన్‌ఆర్‌ఏఐ’

ఒలింపిక్స్‌లో పాల్గొనే కీలక షూటర్ల కోసం జాతీయ షూటింగ్ శిక్షణ శిబిరాన్ని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహించనున్నారు. ఈ అంశంపై గతవారం ప్రకటించిన మేరకు రెండు నెలల (అక్టోబర్ 15-డిసెంబర్ 17)పాటు ఈ శిబిరం కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్రీడాకారులు సురక్షిత రీతిలో శిక్షణ పొందడానికి వీలుగా బయో-బబుల్‌ నిర్వహణ ద్వారా కరోనావైరస్ వ్యాప్తి నివారణసహా ప్రామాణిక నిర్వహణ ప్రక్రియల బాధ్యతను భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌), నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సంయుక్తంగా స్వీకరించాయి. ఈ మేరకు వేదిక సమీపానగల ఒక హోటల్‌లో ‘ఎన్‌ఆర్‌ఏఐ’  వసతి-భోజన ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ప్రస్తుత నిబంధనల ప్రకారం ‘సాయ్‌’ సహాయం అందించనుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664003

ఆర్టీఐ పరిష్కార సగటు నిరుటితో పోలిస్తే కోవిడ్‌ కాలంలో అధికం: డాక్టర్ జితేంద్ర సింగ్

దేశవ్యాప్తంగా గడచిన ఆరు నెలల్లో సమాచార హక్కు కేసులు నిరుటితో పోలిస్తే అత్యధికంగా పరిష్కారమైనట్లు ప్రధానమంత్రి కార్యాలయ, ఈశాన్యప్రాంత అభివృద్ధిశాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ చెప్పారు. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబరు 12న అమలులోకి రాగా, నేటితో 15 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధిత గణాంకాలను ప్రకటించారు. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్చి- సెప్టెంబర్ మధ్య 76.49 శాతం కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కేసుల పరిష్కార సగటు 93.98 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. తదనుగుణంగా నిరుడు ఇదే వ్యవధిలో నమోదైన 11716 కేసులకుగాను 8962 పరిష్కరించగా, ఈ సంవత్సరం మొత్తం 8528కిగాను 8015 కేసులు పరిష్కరించినట్లు వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664041

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్‌: రాష్ట్రంలో కొన్ని షరతులకు లోబడి 15.10.2020 తర్వాత పాఠశాలలు, కోచింగ్ సంస్థలను దశలవారీగా పునఃప్రారంభానికి అనుమతించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆన్‌లైన్‌/దూరవిద్య విధానంలో బోధన మాత్రం ఐచ్ఛికంగా కొనసాగనుండగా, ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అలాగే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలు/ కోచింగ్‌ సంస్థలకు హాజరు కావచ్చునని పేర్కొంది.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధంతోపాటు స్వీయ రక్షణ, కుటుంబ భద్రత దిశగా ఇళ్ల నుంచి బయటకువెళ్లే సమయంలో మాస్కును తప్పక వాడాలని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “మాస్క్ అప్ క్యాంపెయిన్లో భాగస్వాములు కావాలని కోరారు. మాస్క్‌ ధారణ, గదులలో ధారాళంగా గాలి ప్రవావం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడంవంటి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
  • కేరళ: రాష్ట్రంలోని కోళికోడ్‌ జిల్లాలో కోవిడ్‌ నియంత్రిణ చర్యల పేరిట దుకాణాలను మూసివేయించడంపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వారు గురువారం బంద్‌కు పిలుపునివ్వగా, వాణిజ్య సంస్థలతో జిల్లా కలెక్టర్ చర్చల అనంతరం ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. నియంత్రణ మండళ్లను ఏకపక్షంగా, అశాస్త్రీయంగా ప్రకటిస్తున్నారంటూ ఈ సందర్భంగా వారు ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో పర్యాటకులను అనుమతించిన నేపథ్యంలో కోవిడ్-19 కారణంగా నిలిపివేసిన జలమార్గ శాఖ ఏసీ- హైస్పీడ్ బోట్‌ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేరళలో నిన్న 5,930 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 94,388మంది చికిత్స పొందుతున్నారు. మరో 2.81 లక్షల మంది పరిశీలనలో ఉండగా మరణాల సంఖ్య 1025గా ఉంది.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఆంక్షల సడలింపుతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ కోసం బీచ్ రోడ్లో వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక తమిళనాడుకు రూ.41వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానుండగా; సెప్టెంబర్దాకా 42 ఒప్పందాల ద్వారా రాష్ట్రం రూ.31,464కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. రాష్ట్రంలో సోమవారం 4,879 కొత్త కేసుల నమోదుతో 83 రోజుల్లో తొలిసారి 5,000కన్నా దిగువకు రావడం విశేషం. దీంతో మొత్తం కేసులు 6,61,264కు చేరగా, 62 తాజా మరణాలతో మృతుల సంఖ్య 10,314కు పెరిగింది. మరోవైపు క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గి 43,747కు దిగివచ్చింది.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ విస్తృత వ్యాప్తి దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికల సంఘాన్ని కోరింది. తుమకూరు జిల్లాలోని కోవిడ్‌ ప్రత్యేక ఆస్ప్రతికి సొంత ద్రవ ఆక్సిజన్‌ ప్లాంట్‌ సమకూరింది. దీనిద్వారా ఐసీయూలోని రోగులకు ప్రాణవాయు సరఫరా చేస్తారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై కొత్త ఆరోగ్య మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్తోపాటు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బి.శ్రీరాములు ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కరోనావైరస్ వల్ల మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు కోవిడ్-19తో చికిత్స పొందుతున్న జర్నలిస్టుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశారు. కాగా, తాజా కీలక పరిణామంలో భాగంగా అక్టోబర్ 16 నుండి 24వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు యాత్రికులను పరిమితంగా అనుమతించాలన్న నిర్ణయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానం ఉపసంహరించింది. ఈ మేరకు ఉత్సవాలను ఏకాంతంగానే పూర్తిచేయనున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో నిన్న 3224 కొత్త కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,56,056కు చేరింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1708 కొత్త కేసులు, 5 మరణాలు నమోదవగా 2009 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 277 జీహెచ్ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,14,792; క్రియాశీల కేసులు: 24,208; మరణాలు: 1233; డిశ్చార్జి: 1,89,351గా ఉన్నాయి. కాగా, తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడేతర ఆరోగ్య సేవల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సిబ్బంది కొరత ఏర్పడవచ్చునని ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. కాగా- అధికశాతం ఆస్పత్రులలో జనరల్ మెడిసిన్, అనస్థీషియా, పల్మోనాలజీ వైద్య విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగా కనిపిస్తోంది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1,457 మంది కోలుకున్నారని అసోంలో ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నేటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,66,036కు చేరగా, ప్రస్తుతం 28,439 మంది చికిత్స పొందుతున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 18 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 2,202కు చేరాయి ప్రస్తుతం  క్రియాశీల కేసుల సంఖ్య 156గా ఉంది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 221 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 7,240కి చేరింది. వీటిలో ప్రస్తుతం చురుకైన కేసులు 1,493 కాగా, ఇప్పటివరకూ 5,754 మంది కోలుకున్నారు.
  • సిక్కిం: సిక్కింలో నేడు 7 కొత్త కేసులతోపాటు ఒక మరణం సంభవించడంతో మృతుల సంఖ్య 57కు చేరింది.

FACT CHECK

 

******

 

 

 

 


(Release ID: 1664155) Visitor Counter : 261