ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన కోవిడ్-19 మీద మంత్రులబృందం 21వ సమావేశం
“కోవిడ్ మీద భారత ప్రజారోగ్య స్పందన దృఢమైనది”
వచ్చే పండుగల, శీతాకాల సమయాల్లో కోవిడ్ కు తగినట్టు వ్యవహరించాలి
Posted On:
13 OCT 2020 2:33PM by PIB Hyderabad
కోవిడ్-19 మీద ఈరోజు జరిగిన 21వ అత్యున్నత స్థాయి మంత్రుల బృందం వీడియో కాన్ఫరెన్స్ కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. ఆయనతోబాటు ఈ సమావేశంలో విదేశ వ్యవహారాల శాఖామంత్రి డాక్టర్ జైశంకర్, పౌర విమానయాన శాఖామంత్రి శ్రీ హర్ దీప్ ఎస్.పూరి, షిప్పింగ్ సహాయమంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) రసాయనాల శాఖామంత్రి శ్రీ మాన్ సుఖ్ లాల్ మండవ్యా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్ అశ్విన్ కుమార్ చౌబే, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు వినోద్ కె పాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, నెలలతరబడి కోవిడ్ మీద పోరులో సేవలందిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజారోగ్య స్పందన అద్భుతంగా ఉందన్న విషయాన్ని ఆయన తన మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు. అందువల్లనే తగిన ఫలితాలు సాధించగలిగామన్నారు. మొత్తం 62.27,295 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైట పడటంతో 86.78% తో ప్రపంచంలోనే అత్యధికంగా కోలుకున్నవారి శాతం నమోదైన దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు.
అదే విధంగా మరణాలలో అతి తక్కువ స్థాయిలో 1.53% నమోదు చేసుకోగలిగామన్నారు. మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్న స్థాయి నుంచి ఇప్పుడు 74.9 రోజులకు పెరిగిందని చెప్పారు. ప్రస్తుతమున్న 1927 లాబ్ ల వలన పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగటాన్ని గుర్తు చేశారు. వీటివలన రోజుకు 15 లక్షల పరీక్షలు జరపగలిగే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. గడిచిన 24 గంటల్లో దాదాపు 11 లక్షల కోవిడ్ పరీక్షలు జరిగినట్టు కూడా చెప్పారు.
మంత్రుల బృందానికి అధ్యక్షునిగా ఉన్న డాక్టర్ హర్ష వర్ధన్ ప్రజలు ఈ రాబోయే పండుగ సీజన్ లోను, ఆ తరువాత వస్తున్న శీతాకాలంలోను కోవిడ్ కు తగినట్టుగా జాగ్రత్తలతో వ్యవహరించాలని మరోమారు గుర్తు చేశారు. ఈ సమయాల్లో వ్యాధి ప్రబలే అవకాశం మెండుగా ఉందన్న సంగతి అందరూఈ గ్రహించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా పండుగ వేడుకలతోబాటే కోవిడ్ కి తగిన వ్యవహారశైలిని అలవరచుకోవాలన్న కోరికతో ప్రధానమంత్రి జన్ ఆందోళన్ కు పిలుపునివ్వటాన్ని మంత్రి ప్రస్తావించారు.
ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె సింగ్ మాట్లాడుతూ, కరోనా సంక్షోభం మీద పైచేయి సాధించటానికి ప్రభుత్వం అనుసరించిన విధానాలమీద సవివరమైన నివేదిక అందజేశారు. మొత్తం పాజిటివ్ కేసులు, వాటి పెరుగుదల, ప్రపంచ సంఖ్యలో భారత్ వాటా పోలిక, భారత ప్రభుత్వ చర్యల ద్వారా తగ్గింపు గురించి చెప్పారు. భారతదేశంలో మొత్తం కోలుకున్నవారి శాతం 86.36% ఉండటం గురించి ప్రస్తావిస్తూ, దాద్రా నాగర్ హవేలి, డయ్యూ డామన్ లలో కోలుకున్నవారి శాతం అత్యధికంగా 96.25% ఉందన్నారు. ఆ తరువాత అండమాన్ నికోబార్ దీవులు 93.98% తో రెండో స్థానంలో ఉండగా బీహార్ 93.89% తో మూడో స్థానంలో ఉందని, కేరళలో అతి తక్కువగా 66.31% కోలుకున్నారని చెప్పారు. ఇటీవల అకస్మాత్తుగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగటం వల్లనే కేరళలో ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు.
ఈ సీజన్ లో సహజంగా పెరిగే ఇన్ ఫ్లూయెంజా, ఇన్ఫెక్షన్ వ్యాప్తితో వచ్చే వ్యాధులు ఉన్నప్పటికీ, కోవిద్ కారణంగా వాటిని వెల్లడించటం దేశవ్యాప్తంగా బాగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ తో బాటే సీజనల్ గా వచ్చే ఇలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తత పెంచటానికి, పరీక్షలకు, నిఘా కార్యక్రమాలకు వీలుగా ఎప్పటికప్పుడు సలహాలు తెలియజేయగలిగినట్టు మంత్రుల బృందానికి తెలియజేశారు.
రాబోయే శీతాకాలం, పండుగల సీజన్ సందర్భంగా ఎదురయ్యే కొత్త సవాళ్లను ఎదుర్కోవలసిన అవసరం మీద డాక్టర్ హర్ష వర్ధన్ వెలిబుచ్చిన ఆందోళనను ప్రస్తావిస్తూ, వచ్చే కొద్ది వారాలపాటు క్రమంగా వాటిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. ప్రజలలో ఈ విషయం పట్ల అవగాహన పెంచటానికి కృషి జరగాలన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు భారత్ లోను, ప్రపంచ వ్యాప్తంగాను కోవిడ్ వాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రక్రియ గురించి డాక్టర్ వినోద్ కె పాల్ సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా ఎవరెవరికి ప్రాధాన్యతా క్రమంలో వాక్సిన్ ఇవ్వాలో కూడా వివరంగా తెలియజేశారు. కోవిడ్ మృతులలో వయోవర్గాలు, లింగభేదం పరంగా ఎంతెంత శాతం ఉన్నారో గణాంకాలను తెలియజేశారు. వీరిలో ఎవరెవరికి దీర్ఘకాల రోగాలున్నాయో కూడా లెక్కతేల్చారు.
వాక్సిన్ నిల్వల తాజా పరిస్థితి ఆనవాలు గుర్తించగల ఈవిన్ నెట్ వర్క్, నిల్వ కేంద్రంలో ఉష్ణోగ్రత, ఆరోగ్య కేంద్రాల జియో టాగింగ్ , డాష్ బోర్డ్ అందుబాటు ద్వారా కోవిడ్ వాక్సిన సరఫరాను క్రమబద్ధం చేయగలిగే అవకాశం గురించి చెప్పారు. ఆరోగ్య సిబ్బంది జాబితాల రూపకల్పన కూడా అక్టోబర్ ఆఖరుకు, లేదా నవంబర్ తొలినాళ్లలో పూర్తవుతుందన్నారు. అదే సమయంలో ముందుండి పనిచేసేవారిని గుర్తించటం, డిజిటల్ వేదికల లెక్కింపు, వాక్సినేతర సరఫరాల రవాణా వంటివి వివరణాత్మకమైన అమలు ప్రణాళికలో భాగంగా ఉంటాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ పరీక్షల సంఖ్య దూకుడుగా పెంచటం వల్లనే పాజిటివ్ కేసుల సంఖ్యను 5% లోపు ఉండేట్టు చూదగలిగామన్నారు. దేశవ్యాప్త మరణాల శాతాన్ని 1% లోపు ఉంచగలిగా మన్నారు. కోవిడ్ సమయంలో అనుసరించాల్సిన నియమాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించి అవగాహన పెంచటం వల్ల కూడా ఈ లక్ష్యాలు సాధించగలిగామన్నారు. కీలకమైన కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ఒక్కసారిగా కేసులు పెరగటాన్ని గుర్తు చేశారు.
పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా, జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్, ఫార్మా శాఖ కార్యదర్శి కుమారి అపర్ణ, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ కుమార్, విదేశ వర్తక విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ అమిత్ యాదవ్. పలువురు సీనియర్ ప్రభుత్వాధికారులు వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1664009)
Visitor Counter : 222
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam