PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 30 SEP 2020 6:03PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో నమోదైన మొత్తం కేసులలో 15.11 శాతానికి తగ్గిన చురుకైన కేసులు
  • చురుకైన కేసులలో పది తీవ్ర ప్రభావిత రాష్ట్రాల వాటా 76 శాతం.
  • గత 24 గంటల్లో 86,248 మందికి వ్యాధి నయంకాగా, కోలుకునే సగటు 83.33 శాతానికి చేరిక.
  • ఆయుష్‌ వైద్యవిధానాల్లో “పరిశోధన సంస్కృతి”ని ఉత్తేజితం చేసిన కోవిడ్‌-19 సంక్షోభం.
  • కోవిడ్‌-19 రోగులు, చికిత్సలో ముందువరుస యోధులపై వెలివేత భావన, విచక్షణలను ఖండించిన ఉప రాష్ట్రపతి.
  • కోవిడ్ స్థితిగ‌తుల‌తో నిమిత్తం లేకుండా పున‌రుత్ప‌త్తి-ప్ర‌సూతి-న‌వ‌జాత, బాల‌ల‌, కౌమార ఆరోగ్యంస‌హా  క్షయ, కీమోథెరపీ, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ త‌దిత‌ర ముఖ్యమైన సేవలపై నిరాక‌ర‌ణ‌కు వీల్లేద‌న్న ప్రభుత్వ విధానాన్ని నొక్కిచెప్పిన ఆరోగ్యశాఖ మంత్రి.

భారత్‌లో స్థిరంగా కొనసాగుతున్న చురుకైన కేసుల తగ్గుదల; ప్రస్తుతం మొత్తం కేసులలో 15.11 శాతానికి దిగివచ్చిన సగటు; ఈ కేసులలోనూ 10 తీవ్ర పభావిత రాష్ట్రాల వాటా 76 శాతం

దేశంలో చురుకైన కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. ఈ మేరకు ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ఆస్పత్రుల్లో ఉన్న కేసుల సగటు 15.11 శాతానికి పడిపోగా, ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 9,40.441కి పరిమితమైంది. అంటే ఆగస్టు 1నాటికి చికిత్స పొందుతున్నవారి శాతం 33.32 కాగా, సెప్టెంబర్ 30నాటికి అంటే ఇవాళ 15.11 శాతానికి పతనమైంది. రోజువారీ వ్యాధి నయమవుతున్నవారి సంఖ్య పెరుగుతున్న ఫలితం కోలుకునే సగటు నేడు 83.33 శాతానికి శాతానికి పెరిగింది. ఆ మేరకు గత 24 గంటల్లో 86,428 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడినవారి సంఖ్య 52,87,825కు దూసుకెళ్లింది. తదనుగుణంగా చికిత్స పొందేవారికన్నా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 42,47,384 మేర అధికంగా నమోదైంది. మొత్తంమీద సెప్టెంబర్ 22 నుంచి దేశంలో చికిత్స పొందేవారి సంఖ్య 10 లక్షలకు తక్కువగానే కొనసాగుతోంది. ఇక చికిత్సలోగల కేసులలో 10 తీవ్ర ప్రభావిత రాష్ట్రాల వాటా 76 శాతానికిపైగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, అసోం, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో గరిష్ఠంగా 2,60,000 చురుకైన కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మరోవైపు దేశంలోని 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 5,000కన్నా తక్కువగా ఉండటం విశేషం. అలాగే ఇప్పటిదాకా కోలుకున్నవారిలో 78 శాతం 10 రాష్ట్రాలకు చెందినవారే. ఇందులో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 10 లక్షలమందికిపైగా వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ 6 లక్షల మందితో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక దేశంలో గత 24 గంటల్లో 80,472 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో 76 శాతం  10 రాష్ట్రాలకు చెందినవే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 15,000కుపైగా కేసులున్నాయి. కర్ణాటక 10,000 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,179 కోవిడ్ మరణాలు నమోదవగా వీటిలో దాదాపు 85 శాతం 10 రాష్ట్రాలు... మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కొత్తగా నమోదైన మరణాలలో 36 శాతానికిపైగా (430) మహారాష్ట్ర నుంచే కావటం కూడా గమనార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660273

డాక్టర్ హర్షవర్ధన్‌ ప్రసూతి, నవజాత మరియు శిశు ఆరోగ్యం కోసం భాగస్వామ్యం (పిఎంఎన్సిహెచ్) ‘జవాబుదారీతనం అల్పాహారం’

‘ప్రసూతి-నవజాత-బాలల ఆరోగ్యంలో ‘అల్పాహారానికి జవాబుదారీ’ భాగస్వామ్యంపై నిన్న నిర్వహించిన సదస్సులో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌  దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ‘వైట్ రిబ్బన్ అలయన్స్ (డబ్ల్యుఆర్ఎ), ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ చైల్డ్ (ఇడబ్ల్యుఇసి)’ సహకరించాయి. ఈ ఏడాది కూడా “కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో పునరుత్పత్తి-ప్రసూతి-నవజాత శిశు ఆరోగ్య రంగం”లో శ్రమించి సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు ఇతివృత్తంగా సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ- “మహిళలు, పిల్లలు, కౌమార దశలోనివారు కోవిడ్‌ మహమ్మారి గరిష్ఠ ప్రభావానికి లోనైన నేపథ్యంలో ఇది ఇది అత్యవసర చర్యలు తీసుకోవలసిన తరుణం” అన్నారు. ఆ మేరకు కోవిడ్ స్థితిగతులతో నిమిత్తం లేకుండా పునరుత్పత్తి-ప్రసూతి-నవజాత, బాలల, కౌమార ఆరోగ్యంసహా క్షయ, కీమోథెరపీ, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ తదితర ముఖ్యమైన సేవల నిరాకరణకు వీల్లేదన్న ప్రభుత్వ విధానాన్ని నొక్కిచెబుతూ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీచేసినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660247

కోవిడ్-19 సంక్షోభంతో ఆయుష్ వైద్యవిధానాల్లో “పరిశోధన సంస్కృతి”కి ఉత్తేజం

కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఆరోగ్య-ప్రోత్సాహక, వ్యాధి నివారణ పరిష్కారాల దిశగా ఆయుష్ వైద్యవిధాన వ్యవస్థలో దృష్టి కేంద్రీకృతమైంది. కానీ, వాస్తవాల ఆధారిత అధ్యయనాలు చేపట్టడంపై ఆయుష్ విభాగాలలో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ధోరణులు వెలుగులోకి రాలేదు. కాగా, 2020 మార్చి 1 నుంచి జూన్ 25 వరకూ ఆయుర్వేద విధానంతో కూడిన కోవిడ్‌-19 సంబంధిత నమోదిత ప్రయోగాలకు సంబంధించి ‘క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’ (సిటిఆర్ఐ)ను ఒక అధ్యయనం సమగ్రంగా శోధించింది. దీంతో ఈ రెండు తేదీల మధ్య ఆయుర్వేదంలో నమోదైన కొత్త ప్రయోగాల సంఖ్య 58గా తేలింది. అలాగే సీటీఆర్‌ఐలో నమోదైన మొత్తం 203 ప్రయోగపరీక్షల్లో 61.5 శాతం ఆయుష్ విభాగాలకు చెందినవని 2020 ఆగస్టు నాటి వార్తా కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660300

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం దినచర్య, రుతుచర్యలు పాటించాలి: ఉప రాష్ట్రపతి; కరోనా బాధితులు, ముందు వరుస యోధులపై వివక్ష తగదని ఉద్బోధ

ఆరోగ్యకరమైన శరీరంతోపాటు ఆరోగ్యకరమైన మానసిక స్థితికిగల ప్రాముఖ్యాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలికోసం ‘దినచర్య- రోజువారీ పద్ధతులు, రుతుచర్య-సీజన్లవారీ కార్యకలాపాల’ను పాటించాలని సూచించారు. “కోవిడ్‌ అనంతర ఆరోగ్య సంరక్షణ ప్రపంచం- సరికొత్త ప్రారంభం” ఇతివృత్తంగా నిన్న నిర్వహించిన 14వ ‘ఫిక్కీ హీల్’ సదస్సును దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- శారీరకంగా-మానసికంగా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ మహమ్మారి మనకు నేర్పిందని ఆయన గుర్తుచేశారు. అనారోగ్యాలను దూరంగా ఉంచాలంటే సమతుల ఆహారంతోపాటు శరీర దారుఢ్యం కూడా అవసరమని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఆహారం విషయంలోనూ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని, కాలానుగుణంగా, వాతావరణ పరిస్థితులకు తగినట్లు మన పూర్వికులు సూచించిన పౌష్టికాహార సేవనంపై దృష్టి సారించాలని సూచించారు. దేశంలో పలుచోట్ల కరోనా బాధితులు, వారికి వైద్యసేవలందించే ముందువరుసలోని కరోనా యోధులపై వివక్ష ప్రదర్శిస్తున్న సంఘటలను ఉపరాష్ట్రపతి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి బాధ్యతారహిత చర్యలు ఆమోదయోగ్యం కాదని, వీటికి ఆదిలోనే చరమగీతం పాడాలని సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660160

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వార్షిక వ్యాపార పరిమాణం, సమర్థత, లాభదాయకతల మెరుగుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది: శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌

దేశంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల నడుమ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (సీపీఎస్ఈ)లు కీలక పాత్ర పోషించాయని కేంద్ర భారీ పరిశ్రమలు-ప్రభుత్వరంగ సంస్థలశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌ కొనియాడారు. “బిల్డింగ్ సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ రిసర్జెంట్, రెసిలెంట్ ఇండియా” పేరిట సదస్సును ఆయన ఇవాళ తమశాఖ సహాయమంత్రి శ్రీ అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- “ప్రభుత్వరంగ సంస్థలు దేశానికి గర్వకారణం.. ఈ సంస్థల వార్షిక వ్యాపార పరిమాణం, సమర్థత, లాభదాయకతలను మెరుగుపరచడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది” అన్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో విద్యుత్ సరఫరా 99 శాతంగా ఉందని, దాదాపు 24,000 వంటగ్యాస్‌ పంపిణీ దారులు, 71,000 చిల్లర పంపిణీదారులు, 6,500 ఎస్‌కెవో డీలర్లు ప్రజలకు సేవలందించడం కోసం 24 గంటలూ కృషిచేశారని శ్రీ జావడేకర్ చెప్పారు. అలాగే వివిధ రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థలు అందించిన సేవలను ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660368

మహమ్మారి కష్టాలను అధిగమించడానికి దృఢ సంకల్పం, సామూహిక శక్తి, వివిధ ప్రక్రియల రీ-ఇంజనీరింగ్ అవసరాన్ని నొక్కి చెప్పిన శ్రీ పీయూష్ గోయల్

దేశంలో వ్యవసాయ సంస్కరణలు మన రైతాంగం చరిత్రలో కొత్త మలుపని కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అభివర్ణించారు. “న్యూ వరల్డ్ ఆర్డర్- స్వయం సమృద్ధ భారతం” అంశంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహమ్మారివల్ల ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడంలో దృఢ సంకల్పం, సామూహిక శక్తి, వివిధ ప్రక్రియల రీ-ఇంజనీరింగ్‌ల ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా భారత రైల్వే శాఖ కృషిని వివరిస్తూ- నిరుటి సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది 29 రోజుల్లో సరకు రవాణా 15 శాతం అదనంగా నమోందైదని ఉదాహరించారు. అలాగే కోవిడ్-19 తొలినాళ్లలో దేశంలో మాస్కులు, పీపీఈ కిట్లు, పరీక్ష కిట్లు, వెంటిలేటర్ల తయారీ దాదాపు శూన్యమని శ్రీ గోయల్ అన్నారు. అయితే, భారత పారిశ్రామిక రంగం ఈ సమయంలో దృఢ సంకల్పం ప్రదర్శిస్తూ స్వయం సమృద్ధి సాధించడమేగాక మన దేశాన్ని ఈ వస్తువులు ఎగుమతిచేసే స్థాయికి చేర్చారని గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660454

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: మహారాష్ట్రలో దిగ్బంధం నేటితో ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో రెస్టారెంట్లు-బార్లను తిరిగి తెరిచే దిశగా ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను (ఎస్ఓపి) రూపొందించింది. అలాగే రాబోయే నవరాత్రి వేడుకల నిర్వహణపైనా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది, ఈసారి పండుగను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు సామూహిక భాగస్వామ్యంతో కూడిన దాండియా రాస్‌, గర్బావంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆరోగ్య-రక్తదాన శిబిరాల వంటివి నిర్వహించాలని సూచించింది. కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం 2.6 లక్షలమంది కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,381 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య మంగళవారం 1,36,004కు పెరిగింది. తాజాగా మరో 11మంది కోవిడ్‌కు బలికావడంతో గుజరాత్‌లో మృతుల సంఖ్య 3,442కు చేరింది. గత 24 గంటల్లో 1,383 మంది కోలుకోగా, ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,15,859కి చేరింది. రాష్ట్రంలో కోలుకునే సగటు 85.19 శాతం కాగా, ప్రస్తుతం 16,703 మంది చికిత్స పొందుతున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా మాస్కు ధారణ, సామాజిక దూరం పాటించడం వంటి పద్ధతులు అవలంబించేలా ప్రజలను ప్రోత్సహించడానికి అక్టోబర్ 2న సామూహిక అవగాహన ఉద్యమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కేసుల సంఖ్య అధికంగా ఉన్న జైపూర్, జోధ్‌పూర్‌సహా 11 జిల్లా కేంద్రాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. రాజస్థాన్‌లో మొత్తం కేసులు 1.33 లక్షలకుపైగా ఉండగా, 20,376 చురుకైన కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని అన్ని నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు తమ రిసెప్షన్ కౌంటర్లలో కోవిడ్‌-19 చికిత్స రేట్లను ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు 21,317 క్రియాశీల కేసులున్నాయి.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1,702 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు. మహమ్మారి నివారణ దిశగా జాగ్రత్తలను కఠినంగా పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. అసోంలో ఇప్పటిదాకా 1,43,999 మంది కోలుకోగా, ప్రస్తుతం 32,539 మంది చికిత్స పొందుతున్నారు.
  • మణిపూర్; రాష్ట్రంలో 29 కొత్త కేసులు నమోదవగా, తాజాగా మరో వ్యక్తి మరణించడంతో మణిపూర్‌లో మృతుల సంఖ్య 65కు చేరింది.
  • మేఘాలయ: రాష్ట్రంలోని మొత్తం 1,476 కేసులకుగాను బీఎస్‌ఎఫ్‌-సాయుధ దళాల సిబ్బంది 99మంది, ఇతరులు 1,377 మంది ఉండగా, ఇప్పటిదాకా 3,940 కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 28 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1,986కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 410గా ఉన్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 83 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 6,040కి చేరాయి. నాగాలాండ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,037 కాగా, ఇప్పటిదాకా 4942 మంది కోలుకున్నారు.
  • సిక్కిం: రాష్ట్రంలో 41 కొత్త కేసులు నమోదవగా, 71 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 667 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలోని అనాథ శరణాలయాలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల ఆశ్రయాల్లో ఉంటున్నవారికి 3 నెలలపాటు ఉచితంగా వస్తుసామగ్రి అందించాలని ఇవాళ్టి మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేరళలో పరీక్షల సంఖ్య పెంచకపోయినా, నిబంధనలు కఠినంగా అమలు చేయకపోయినా కోవిడ్ మరణాల శాతం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదల జాతీయ సగటుకన్నా రెండు రెట్లు అధికంగా ఉంది. మరోవైపు కోవిడ్‌ మహమ్మారికి 5 నెలల శిశువుసహా ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య  721కి చేరింది. కేరళలో ప్రస్తుతం 61,791 మంది చికిత్స పొందుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 2.36 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో అక్టోబర్ 31వరకు దిగ్బంధం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆంక్షలను మరింత సడలించనున్నప్పటికీ అప్పటిదాకా పాఠశాలలు మూసివేయబడతాయి. తిరుచ్చిలో నిర్ధారిత కోవిడ్-19 కేసులు 5 శాతంకన్నా దిగువకు పతనమైంది. కాగా, సెప్టెంబర్ ఆరంభంలో దిగ్బంధం నిబంధనలు సడలించిన సందర్భంగా కేసులు పెరిగే ముప్పుందని అధికారులు అంచనా వేశారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో మంగళవారం 10,453 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,92,911కు చేరింది. కర్ణాటకలో కోవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణ కమిటీలు ఉదాసీనంగా వ్యవహరించాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కోవిడ్ రోగులకు ఆక్సిజన్ లభ్యతపై నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని సిరా స్థానంసహా చాలాకాలం నుంచీ పెండింగ్‌లోగల రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలను నవంబరు 3న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
  • ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు కొత్త సీటింగ్ ఏర్పాట్లతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది; ఇందులో భాగంగా ఒక సీటులో ఒకరు మాత్రమే ప్రయాణించేలా చూడాలని స్పష్టం చేసింది. ఇక కరోనావైరస్ బారినపడి మరణించిన సిబ్బంది కుటుంబాలకు రూ.5 లక్షల వంతున ఆర్థిక సహాయం అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో 4500 మంది ఉద్యోగులు వైరస్ బారినపడగా వారిలో 72మంది మరణించారు. విశాఖ జిల్లాలో గత 24 గంటల వ్యవధిలో 381 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 50,395కు పెరిగాయి. మరోవైపు ఇప్పటిదాకా 45,894 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2103 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా, 2243మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 298 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,91,386; క్రియాశీల కేసులు: 29,326; మరణాలు: 1127; డిశ్చార్జి: 1,60,933గా ఉన్నాయి. కఠినమైన కోవిడ్-19 మార్గదర్శకాల నడుమ దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఈ ఉప- ఎన్నికలలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు నింపడానికి, ధరావతు చెల్లించడానికేగాక ఓటరు ధ్రువీకరణను కూడా ఆన్‌లైన్‌లో పొందడానికి ఎన్నికల కమిషన్‌ వెసులుబాటు కల్పించింది.

FACT CHECK

***



(Release ID: 1660456) Visitor Counter : 153