ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“బాధ్యతాయుతమైన అల్పాహారం” అనే అంశంపై మాతృత్వ, నవజాత శిశువులు, శిశు ఆరోగ్య సంరక్షణ (పిఎంఎన్ సిహెచ్) భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ సమయంలో మాతృత్వ ఆరోగ్యంలో సాధించిన ప్రయోజనాలు పరిరక్షించుకోవాలని వక్కాణింపు, “గరిష్ఠ ప్రభావం మహిళలు, బాలలు, యుక్తవయస్కులపై పడింది, దీనిపై సత్వర కార్యాచరణ అవసరం” అని పిలుపు

సేఫ్ మదర్ హుడ్ అష్యూరెన్స్ (సుమన్) ద్వారా పూర్తి స్పందనతో కూడిన బాధ్యతాయుతమైన ఆరోగ్య వ్యవస్థ ఏర్పడుతుంది : డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 29 SEP 2020 9:55PM by PIB Hyderabad

“బాధ్యతాయుతమైన అల్పాహారం” అనే అంశంపై ఏర్పడిన మాతృత్వ, నవజాత శిశు, శిశు ఆరోగ్య సంరక్షణ (పిఎంఎన్ సిహెచ్) భాగస్వామ్య కార్యక్రమంలో  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. వైట్ః రిబ్బన్ అలయన్స్ (డబ్ల్యుఆర్ఏ), ప్రతీ ఒక్క మహిళ-ప్రతీ ఒక్క శిశువు (ఇడబ్ల్యుఇసి) సంస్థలు ఈ సమావేశాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో పునరుత్పాదక, మాతృత్వ, శిశు ఆరోగ్య సంరక్షణ విభాగంలో సాధించిన లాభాలను పరిరక్షించుకోవడం అనే థీమ్ తో ఈ ఏడాది ఈ సమావేశం జరిగింది.

కోవిడ్ సమయంలో “మహిళలు, బాలలు, యుక్తవయస్కుల్లో అత్యధిక ప్రభావం కనిపించింది, దీనిపై మనం గట్టిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది” అని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. జాతీయ స్థాయిలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మహిళలు, బాలలు, యుక్తవయస్కులకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కల్పించే ప్రయత్నాలు కొనసాగించాలని రాష్ర్టాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ అంశంపై రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో వ్యక్తిగతంగా నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాను అని ఆయన చెప్పారు. “కోవిడ్ మహమ్మారి కారణంగా ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది. ఈ సమయంలో మహిళలు, బాలలు, యుక్తవయస్కుల ఆరోగ్యంపై గట్టిగా దృష్టి సారించాలనే అంశంపై మేం నిరంతరం చర్చిస్తూనే ఉన్నాం” అని తెలిపారు. దేశంలో కోవిడ్ విస్తరణ ఎలా ఉన్నా, ఉచిత కోవిడ్ పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో అందుకు సంబంధించిన చికిత్సలు విస్తరించినప్పటికీ పునరుత్పత్తి, మాతృత్వ, నవజాత శిశువులు, యుక్తవయస్కుల అరోగ్య సేవలు (ఆర్ఎంఎన్ సిఏహెచ్), క్షయ, కీమో థెరపీ, డయాలసిస్, వయో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ నిరాకరణకు గురి కాకూడదన్నది ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. అలాగే 50 కోట్ల మంది బలహీన వర్గాలకు అందిస్తున్న ఆయుష్మాన్ భారత్  -పిఎంజెఎవై బీమా ప్యాకేజి పరిధిలోకి కోవిడ్ ను తీసుకురావడం జరిగిందంటూ దీని వల్ల బాధిత ప్రజల చేతి నుంచి ఆరోగ్య సంరక్షణకు అయ్యే వ్యయాల భారం తగ్గిందని మంత్రి సంతృప్తి ప్రకటించారు.

మాతృత్వ సంరక్షణ సమయంలో మహిళల ఎంపిక గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తావిస్తూ మాతృత్వ సంరక్షణ అనేది తల్లుల ఆరోగ్య సంరక్షణ సేవలకు అతీతమైనదని, గర్భిణీకి, అమె శిశువుకు సేవలందించడమే కాకుండా ఆత్మగౌరవం, గోప్యత, విశ్వాసం, ఎంపిక, గౌరవం అన్నింటినీ ఇనుమడింపచేసే అంశమని అన్నారు. “అది కేవలం సేవలందించే వ్యవస్థ, క్లయింట్ సంబంధం కాదు, మనిషి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం” అని ఆయన వివరించారు. “అధిక శాతం మంది మహిళలు ఆస్పత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పును ప్రోత్సహించడం నుంచి పూర్తిగా ఉచిత సేవలందించడం వరకు అన్నింటిలోనూ విశ్వాసం పెంపొందించ‌డం;  లక్ష్య, మంత్రసాని సేవల విస్తరణ కార్యక్రమాల ద్వారా గర్భధారణ, శిశుజననం సమయంలో నాణ్యమైన సేవలందించడంలో ఎంతో పురోగతి సాధించాం” అని వివరించారు.

అన్ని సేవలను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడం లక్ష్యంగా గత ఏడాది “సురక్షిత మాతృత్వ హామీ (సుమన్) కార్యక్రమం” తాను స్వయంగా ప్రారంభించానని చెప్పారు. “గర్భిణీలు, నవజాత శిశువులకు సేవలు నిరాకరించడాన్ని ఏ మాత్రం క్షమించని విధానం అనుసరిస్తున్నాం. అలాగే క్లయింట్ స్పందన తెలుసుకుని వారి ఫిర్యాదులేవైనా ఉంటే పరిష్కరించడం, మరింత మెరుగైన బాధ్యతాయుత వైఖరి, పారదర్శకత పెంచే వ్యవస్థను పటిష్ఠం చేశాం. ప్రసవం సమయంలో సరికొత్త అనుభూతిని కలిగించడం నుంచి బాలింతలు, నవజాత శిశు మరణాలను నివారించడం వరకు అన్ని అవసరాలకు సత్వరం స్పందించే, బాధ్యతాయుతమైన ఆరోగ్య వ్యవస్థను ఆవిష్కరించడం మా లక్ష్యం” అని చెప్పారు.

సురక్షిత మాతృత్వ సూత్రాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. “తమ నిర్ణయాలు తామే తీసుకునే విధంగా మహిళలకు సాధికారత కల్పించాలి. ఇందుకోసం ప్రసూతి సంరక్షణ, శిశుజననం సమయంలో మహిళలు పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా బహుళ మార్గాల్లో కృషి చేస్తున్నాం. మాతృత్వ విధానాలు, ప్రసూతి సమయంలో ఎవరి సహాయం తీసుకోవాలని నిర్ణించుకునే స్వేచ్ఛ, సరైన వ్యవస్థను ఎంపిక చేసుకోవడం, ప్రసవానంతర గర్భనిరోధంపై వారిని చైతన్యవంతులను చేస్తున్నాం” అని చెప్పారు. “భారతదేశం బాలింత మరణాల విషయంలో ఆందోళనకు తావు లేని స్థితికి చేరాం, కాని సమగ్ర ప్రసూతి సంరక్షణ సేవలు సకాలంలో అందకపోవడం వల్లనే అధిక శాతం బాలింత మరణాలు చోటు చేసుకుంటున్నట్టు విశ్లేషణల్లో తేలింది” అన్నారు. నాణ్యమైన ప్రజారోగ్య సదుపాయాలు, క్రమం తప్పని సిజేరియన్ ఆడిట్లు, నిర్దేశిత చర్యల ద్వారా ప్రసవం చేసే గదిలో నియమనిబంధనలకు కట్టుబడేలా చేయడం వంటి చర్యలు మంచి ఫలితాలనందిస్తాయని తాను విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమస్యను భారత్ సమర్థవంతంగా పరిష్కరించగలదన్న నమ్మకం తనకున్నట్టు తెలిపారు. నైపుణ్యం గల ప్రసూతిత సేవలు సార్వత్రికంగా అందుబాటులో ఉంచడం మరో కీలక అడుగని ఆయన అన్నారు. ఇందులో భాగంగా “నర్సులు తగినంత సంఖ్యలో ఉండేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు. దేశవ్యాప్తంగా మంత్రసాని సేవలను విస్తరించేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్టు ఆయన తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ “కోవిడ్ పోరాట యోధులకు అత్యవసరమైన ప్రయాణ వసతులు, వ్యక్తిగత సంరక్షణ పరికరాలు అందించడంతో పాటు కోవిడ్, ఆరోగ్య సంరక్షణ సేవల్లో నిమగ్నమైన వారికి జీవిత బీమా సదుపాయం కల్పించాం. కరోనా యోధుల విజయాలను వేడుకగా చేసుకునేందుకు స్ఫూర్తివంతమైన ప్రచారం చేపట్టాం. ఈ వ్యాధితో అనుసంధానమై ఉన్న భయాందోళనలు, వివక్షను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. ఇది ఏ ఒక్క శాఖ చేసిన ప్రయత్నం కాదు, చిట్టచివరి వ్యక్తికి కూడా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచడం కోసం యావత్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం” అన్నారు.

పిఎంఎన్ సిహెచ్ కార్యాచరణ పట్ల భారత్ కట్టుబాటును ప్రకటిస్తూ ఆ కార్యాచరణను రూపొందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటని చెప్పారు. “మహిళలు, బాలలు, వయోజనుల ఆరోగ్యం, సంరక్షణకు భారతదేశం కట్టుబడి ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ పిఎంఎన్ సిహెచ్ ను ప్రభుత్వ స్థాయి నుంచి సమాజ స్థాయికి విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ దీని నుంచి సంపూర్ణమైన లబ్ధి పొందడానికి సమాజం యావత్తు తన వంతు మద్దతు అందిస్తూ కృషి చేయాలి, వనరులు సమీకరించాలి అన్నారు. మనం “అందరికీ ఆరోగ్యం భరోసా ఇద్దాం, ఏ ఒక్కరినీ ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు” అని స్పష్టం చేశారు.   

***



(Release ID: 1660247) Visitor Counter : 201


Read this release in: English , Urdu , Hindi , Manipuri