వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యవసాయ సంస్కరణలను మన రైతులకు వాటర్‌షెడ్ ఉద్యమంగా శ్రీ పియూష్ గోయల్ అభివర్ణించారు

మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి స్థితిస్థాపకత, సామూహిక శక్తి మరియు ప్రక్రియల
రీ ఇంజనీరింగ్ పై నొక్కి చెప్పారు

Posted On: 30 SEP 2020 5:02PM by PIB Hyderabad

వ్యవసాయ సంస్కరణలను మన రైతులకు వాటర్‌షెడ్ ఉద్యమంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అభివర్ణించారు. 'న్యూ వరల్డ్ ఆర్డర్ - ఆత్మనిర్భర్ భారత్' పై ఈ రోజు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, ఇది భారతదేశ వ్యవసాయం రంగంలోనే చరిత్రగతిని మారుస్తుందని అన్నారు. “ఇది మన రైతుల ఉత్పాదకత మరియు ఆదాయాన్ని పెంచుతుంది. వ్యవసాయ రంగాన్నిసమస్యల నుండి విముక్తి చేయడం ద్వారా, ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెంచి, కొత్త మార్గాలను తెరవడంతో రైతులకు సాధికారత ఇస్తుంది. మన రైతులకు సరైన కనీస మద్దతు ధర తో మండిలో విక్రయించే అవకాశం ఉంటుంది ”అని ఆయన అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడిన మంత్రి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడానికి, ప్రపంచ భాగస్వామ్యానికి భారతదేశం తలుపులను తెరుస్తుందని, అందువల్ల మెరుగైన సేవలను అందించగలమని చెప్పారు. దేశీయ పరిశ్రమను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తామని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, స్థానికతే ఆలవాలంగా అంతర్లీనమైన ప్రణాళికలు మంచి భవిష్యత్తు దిశగా సాగుతాయి. దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తయారయ్యే ఆర్థిక వ్యవస్థను భారతదేశం సృష్టిస్తుంది, తద్వారా మనం స్వావలంబన కలిగిన దేశంగా మారవచ్చు. ” అని కేంద్ర మంత్రి తెలిపారు. 

భారత ఆర్థిక వ్యవస్థను మార్చడానికి పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు కలిసి పనిచేయాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు, తద్వారా ఇది యువ, శక్తివంతమైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించి, భారతదేశానికి అర్హమైన సరైన స్థానాన్ని నిజంగా పొందుతుందని అన్నారు. "భారతదేశాన్ని విశ్వసనీయమైన మరియు నమ్మకమైన భాగస్వామిగా ప్రపంచం చూసే దేశంగా మారుద్దాం" అని ఆయన అన్నారు. 

భారతదేశ సామర్థ్యాన్ని మరింత  విస్తరించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తోందని మంత్రి అన్నారు. "ఏక గవాక్ష అనుమతుల వ్యవస్థ అనేది ఒక వాస్తవంగా మార్చడానికి కృషి చేస్తున్నాము. ఇది దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వ్యాపారాన్ని సులభతరం చేసే నిజమైన సింగిల్ విండో. ప్రభుత్వ వివిధ కార్యక్రమాల ఆసరాగా మనమంతా  కలిసి మహమ్మారిని అధిగమించి, 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అనే నినాదం విజయవంతం చేశామని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని - 'సబ్కా విశ్వస్' గా పొందగలిగాం ” అని శ్రీ గోయల్ అన్నారు. 

భారత రైల్వే ప్రయత్నాలను ఉటంకిస్తూ, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ నెలలోని 29 రోజుల్లో 15% ఎక్కువ సరుకు రవాణా జరిగిందని చెప్పారు. “మేము 29 సెప్టెంబర్ 2019 న తరలించిన దానికంటే నిన్నఒక్క రోజే, 33% ఎక్కువ సరుకును తరలించాము. సరుకు రవాణా రైళ్లు రెండు రెట్లు వేగంతో నడుస్తున్నాయి. సరుకు మరియు ప్రయాణీకుల రైలు కార్యకలాపాలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. మేము ఇప్పుడు మా మొత్తం సమయ పట్టికను తిరిగి వ్రాస్తున్నాము. సమిష్టిగా రైల్వే కుటుంబం గత సంవత్సరం కన్నా పనితీరును మించిపోయింది. కోవిడ్ -19 వచ్చిన మొదట్లో భారతదేశం ఎక్కువ మాస్కులు, పిపిఇ కిట్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లను తయారు చేయలేదు, కాని ఇప్పుడు మన పరిశ్రమ ఆ పరిస్థితిని అధిగమించింది. ఈ రోజు మనం స్వయం సమృద్ధి మాత్రమే కాదు, ఈ వస్తువులను ఎగుమతి కూడా చేస్తున్నాం... అని శ్రీ గోయల్ వివరించారు. 


******



(Release ID: 1660454) Visitor Counter : 157