PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
03 SEP 2020 6:28PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్ నుంచి కోలుకునే సంఖ్యరీత్యా భారత్ మరో రికార్డు; గత 24 గంటల్లో 68,584 మందికి వ్యాధి నయం; 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 శాతంకన్నా అధికం.
- ప్రస్తుత (8,15,538) కేసులు మొత్తం నమోదైన కేసులలో 21.16 శాతానికి పరిమితం.
- గత 24 గంటల్లో 11.7 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు; ఇప్పటిదాకా మొత్తం 4.5 కోట్లకుపైగా నమూనాల పరీక్ష.
- కోవిడ్ మరణాల ప్రపంచ సగటు (3.3 శాతం)కన్నా భారత్‌లో నిత్యం పతనమవుతూ ఇవాళ 1.75 శాతానికి పరిమితం.
కోవిడ్‌నుంచి కోలుకునేవారిలో భారత్ మరో రికార్డు; 24గంటల్లో 68,584మందికి వ్యాధి నయం; 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 70శాతంకన్నా అధికం
భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు గత 24 గంటల్లో 68,584 మందికి వ్యాధి నయం కావడంతో మరో కొత్త రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 30 లక్షలకు (29,70,492) చేరువైంది. ఆ మేరకు కోలుకునేవారి సగటు 77 శాతం (77.09) దాటింది. ఆ మేరకు చురుకైన (8,15,538) కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య 21.5 లక్షలు ఇవాళ అధికంగా ఉంది. దీంతో మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుతం చికిత్స చేయాల్సిన కేసులు కేవలం 21.16 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే ప్రపంచంలో మరణాల సగటు 3.3 శాతం కాగా, భారత్‌లో ఇవాళ ఇది కేవలం 1.75 శాతమే.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1651020
దేశంలో గత 24 గంటల్లో 11.7 లక్షల కోవిడ్ పరీక్షలతో సరికొత్త రికార్డు; నేటిదాకా మొత్తం 4.5 కోట్లకుపైగా నమూనాల పరీక్ష
దేశంలో రోజువారీ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటిన నేపథ్యంలో ఇవాళ అనూహ్యంగా అంతకుమించి గత 24 గంటల్లో 11.7 లక్షల (11,72,179)కు చేరింది. ఈ ఘనత సాధించడంతో ఇప్పటిదాకా మొత్తం పరీక్షించిన నమూనాల సంఖ్య 4.5 కోట్లు (4,55,09,380) దాటింది. దేశంలో కోవిడ్ పరీక్షలు వేగంగా పెరుగుతుండటాన్ని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి రోజుకు కేవలం 10 పరీక్షలు నిర్వహించే స్థాయినుంచి నేడు 11 లక్షలు దాటేస్థాయికి చేరింది. ప్రయోగశాలల సంఖ్య వేగంగా విస్తరించడమే ఇందుకు కారణం కాగా, దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 1022, ప్రైవేటు రంగంలో 601 వంతున మొత్తం 1623 అందుబాటులోఉన్నాయి. అంతేకాకుండా కోబాస్ 6800/8800 యంత్రాలతోపాటు అత్యంత ఆధునిక యంత్రాలను 5 చోట్ల ఏర్పాటు చేశారు. వీటికి కనిష్ఠ మానవ ప్రమేయంతో రోజుకు 1000కిపైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650948
యూఎస్‌ఐఎస్‌పీఎఫ్-3వ వార్షిక నేతృత్వ సదస్సులో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగం; ‘స్వయం సమృద్ధ భారతం’లోకి అమెరికా కంపెనీలకు పిలుపు
యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ (USISPF)-3వ వార్షిక నేతృత్వ సదస్సులో నిన్న కేంద్ర పెట్రోలియం- సహజవాయువు-ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి అనూహ్య దుష్ప్రభావం, ఫలితంగా ఇంధన గిరాకీ పడిపోవడంపై ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడంతో ఇంధన వినియోగం త్వరగానే కోవిడ్ పూర్వ స్థాయికి చేరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం గురించి మాట్లాడుతూ- ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం కోవిడ్ సవాళ్లను అవకాశంగా మలచుకున్నదని శ్రీ ప్రధాన్ గుర్తచేశారు. ఈ మేరకు దేశీయ తయారీ- వినియోగాలను ప్రపంచ సరఫరా శృంఖలంతో అనుసంధానించి, స్వయం సమృద్ధం కావాలని భారత్ పిలుపునిచ్చిందన్నారు. తద్వారా 21వ శతాబ్దంలో భారత్‌ను ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నదని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650770
సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైలు సర్వీసుల పునరుద్ధరణ
దేశంలో మెట్రో రైలు సేవలకు సంబంధించి ప్రామాణిక విధాన ప్రక్రియలను కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి నిన్న విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విధాన ప్రక్రియలకు దేశీయాంగ శాఖ కూడా ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీని ప్రకారం ఒక లైనుకుమించి మార్గాలుగల మెట్రో రైలు సర్వీసులు 2020 సెప్టెంబర్ 7వ తేదీనుంచి దశలవారీగా మొదలవుతాయి. తదనుగుణంగా 2020 సెప్టెంబర్ 12 నాటికి అన్ని మార్గాల్లోనూ మెట్రో రైళ్లు నడవడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు సంబంధించి అన్ని జాగ్రత్తలనూ తీసుకునేలా ప్రామాణిక విధాన ప్రక్రియలలో నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650826
గ్రామీణ పారిశుధ్యం-పరిశుభ్రత సేవా ప్రదాతలకు ముందు జాగ్రత్తలపై సలహాపత్రం జారీ
కోవిడ్-19 మహమ్మారి సమయంలో సురక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ‘తాగునీరు-పారిశుధ్య విభాగం’ (DDWS) అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 2020 ఏప్రిల్ 13న సలహాపత్రం జారీచేసింది. దిగ్బంధం సడలింపుతో దేశంలో సామాజిక-ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వర్షాకాలం తర్వాతి పనులు మొదలవడంతో నీటి సరఫరా మౌలిక వసతుల పనులను భారీస్థాయిలో వేగవంతంగా పూర్తిచేసి, గ్రామీణ నివాసాలన్నిటికీ మంచినీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నడుమ వ్యాధి వ్యాప్తి నివారణ దిశగా గ్రామీణ నీటిసరఫరా-పారిశుధ్య సేవాప్రదాతలు ముందు జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. ఆ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ అనుబంధ సలహా సూచనలను జారీచేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650940
అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీ కింద 50 అగ్రదేశాల జాబితాలోకి భారత్
ప్రపంచ మేధోహక్కుల సంస్థ (WIPO) ప్రకటించిన “అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ-2020”లో భారత్ 4 స్థానాలు దూసుకెళ్లి 48వ ర్యాంకుకు చేరడంద్వారా 50 అగ్రదేశాల జాబితాలో స్థానం సంపాదించింది. కోవిడ్-19 సంక్షోభం నడుమ దేశంలోని చురుకైన పరిశోధన-అభివృద్ధి వ్యవస్థకు తగిన గుర్తింపు లభించే విధంగా వెలువడిన ఈ వార్త భారత్‌లో కొత్త ఉత్సాహం నింపింది. కాగా, భారత్ 2015లో ఈ సూచీ ర్యాంకుల ప్రకారం 81వ స్థానంలో ఉండగా 2019నాటికి 52వ స్థానానికి చేరింది. ఆ మేరకు ఐదేళ్లలో స్థిరంగా మెరుగుపడుతూ దక్షిణ, మధ్యాసియా ప్రాంత దేశాల స్థాయిలో అత్యధిక ఆవిష్కరణల ఘనత సాధించిన దేశంగా భారత్‌ను నిరుడు ‘వైపో’ గుర్తించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650904
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే, రానున్న 14రోజుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని సామాజిక భద్రతా మిషన్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అషీల్ చెప్పారు. దిగ్బంధం విముక్తి-4 కింద లభించిన సడలింపుల వినియోగంలో ప్రజలు చాలా సంయమనం పాటించాలని ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ తెలిపారు. కాగా, కోళికోడ్ జిల్లాలో 40 ప్రాంతాలను నియంత్రణ మండళ్లుగా, మరో 5 ప్రాంతాలను ఆందోళనకర నియంత్రణ మండళ్లుగా కలెక్టర్ ప్రకటించారు. కేరళలో నిన్న 1,547 కొత్త కేసులు నమోదవగా 2,129 మంది కోలుకున్నారు. ప్రస్తుతం, వివిధ జిల్లాల్లో 21,923 మంది చికిత్స పొందుతుండగా 1.93 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు 305గా ఉన్నాయి.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో 431 కొత్త కేసుల నమోదుతోపాటు 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,581కి మృతుల సంఖ్య 260కి పెరిగాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 5042 కాగా, ఇప్పటిదాకా 10,279 మంది కోలుకున్నారు. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే, మక్కల్ నీదిమయ్యం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎ.ఎస్.సుబ్రమణియన్ (77) కోవిడ్-19తో గురువారం మరణించారు. ఇక తమిళనాడులో జేఈఈ-మెయిన్-2020ని కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహించారు.
- కర్ణాటక: రాష్ట్ర మంత్రిమండలి “కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్కింగ్ పాలసీ 2020-25’కు ఆమోదం తెలిపింది. తద్వారా 60లక్షల ఉద్యోగాలు, సేవల సృష్టిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇళ్ల నుంచే పనిని ప్రోత్సహించేందుకుగాను 5జి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కెజి, యుకెజి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి జె.సి.మధుస్వామి తెలిపారు. బెంగళూరు నగరంలోని వివిధ ఆసుపత్రులలో కోవిడ్ మరణాలపై తనిఖీ చేపట్టేందుకు బీబీఎంపీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. నగరంలో మెట్రో రైల్ కార్యకలాపాలు సెప్టెంబర్ 7 న ‘పర్పుల్ లైన్’లో మాత్రమే ప్రారంభమవుతాయని, రెండు రోజుల తర్వాత ‘గ్రీన్ లైన్’లో మొదలవుతాయని అధికారులు ప్రకటించారు. కాగా, రూ.1,800 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అత్యధునిక అంబులెన్స్ సేవల సమీకరణ ప్రణాళిక పురోగతిని రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షించనుంది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో బుధవారం మరో ఐదుగురు ఉద్యోగులకు కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర శాసనసభ, సచివాలయంలో కేసుల సంఖ్య 119కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం వేలాది కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. ఇక మొత్తం పరీక్షలలో నిర్ధారిత కేసుల శాతం రీత్యా జాతీయ స్థాయిలో మహారాష్ట్ర (19.19) అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 11.85 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2817 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2611 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 452 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు: 1,33,406; క్రియాశీల కేసులు: 32,537; మరణాలు: 856; డిశ్చార్జి: 1,00,013గా ఉన్నాయి. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ ఉపజాతి వ్యాప్తి అధికంగా ఉన్నట్లు వచ్చిన వార్తలలో వాస్తవం లేదని సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ ఆర్.కె.మిశ్రా స్పష్టం చేశారు. “కరోనావైరస్ ఎ2ఎ ఉపజాతి ప్రధానమైనది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే”నని ఆయన తేల్చారు. అయితే, ‘ఎ3ఐ’తో పోలిస్తే ఇది ‘ప్రమాదకరమైనది, వేగంగా వ్యాపించేది’ కాదని, చాలా బలహీనమైదని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘ఎ2ఎ’ జాతి రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తున్నందున పరిస్థితి మెరుగవుతున్నట్లు అర్థం చేసుకోవాలని ఇందులో ‘కొత్తగా ఏమీ లేద’ని మిశ్రా విశదీకరించారు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 148 కొత్త కేసులు నమోదవగా, 96 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో 1,278 క్రియాశీల కేసులున్నాయి.
- అసోం: రాష్ట్రంలో నిన్న 47,744 నమూనాలను పరీక్షించగా 3,555 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. నిర్ధారిత కేసుల సగటు 7.44 శాతంగా ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశంలో నిన్న 1,834 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 88,726కు చేరింది. ప్రస్తుతం చికిత్స పొందే రోగుల సంఖ్య 26,227గా ఉందని అసోం ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
- మణిపూర్: రాష్ట్రంలో 125 కొత్త కేసులు నమోదవగా 70 శాతం కోలుకునే సగటుతో 157 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం 1,871 క్రియాశీల కేసులున్నాయి.
- మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 83 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,186 క్రియాశీల కేసులుండగా వీరిలో బీఎస్‌ఎఫ్/సాయుధ దళాల సిబ్బంది 298మంది, ఇతరులు 888 మంది ఉన్నారు. కాగా, ఇప్పటిదాకా మేఘాలయలో 1,318 మంది కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 20 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,040కి చేరగా, వీటిలో 389 క్రియాశీల కేసులున్నాయి. ఇక మిజోరంలో ఇప్పటిదాకా 651 మంది కోలుకున్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకునే అత్యధిక రోగుల సగటు 80 శాతానికి చేరిన నేపథ్యంలో నాగాలాండ్ పదోసారి రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 4,017 నిర్ధారిత కేసులకుగాను 3,212 మంది కోలుకున్నారు. కాగా, సెప్టెంబర్ 4 నుంచి దిమాపూర్ న్యూ మార్కెట్, హాంకాంగ్ మార్కెట్లను నియంత్రిత పద్ధతిలో పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వీటి పరిధిలోని దుకాణాలను సరి-బేసి విధానంలో ప్రత్యామ్నాయ రోజులలో తెరుస్తారు.
- సిక్కిం: రాష్ట్రంలో బుధవారం 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1,704కు చేరగా, వీటిలో ప్రస్తుతం 431 క్రియాశీల కేసులున్నాయి. కాగా, వ్యాధినుంచి కోలుకున్న 32 మందిని ఏకాంత చికిత్స కేంద్రాలనుంచి డిశ్చార్జి చేశారు.
FACT CHECK
*****
(Release ID: 1651135)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam