నీతి ఆయోగ్
అంతర్జాతీయ ఆవిష్కరణల సూచికలోని మొదటి 50 దేశాలలో స్థానం సంపాదించిన - భారత్
Posted On:
02 SEP 2020 9:46PM by PIB Hyderabad
ప్రపంచ మేధో సంపత్తి సంస్థ రూపొందించిన, అంతర్జాతీయ ఆవిష్కరణల సూచిక - 2020 ర్యాంకింగ్సు లో భారతదేశం 4 స్థానాలు మెరుగుపడి, 48వ స్థానంలో నిలిచింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, భారతదేశానికి ఇది ఒక ఉత్తేజకరమైన వార్తగా, బలమైన ఆర్. & డి. పర్యావరణ వ్యవస్థకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశం 2015 సంవత్సరంలో 81వ స్థానంలో ఉండగా, 2019 సంవత్సరంలో 52వ స్థానానికి మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినూత్న అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండటం ఒక గొప్ప విజయం. ఇది గత 5 సంవత్సరాలుగా ఆవిష్కరణ ర్యాంకింగులో భారతదేశం, స్థిరమైన అభివృద్ధిని చూపించడంతో, 2019 లో మధ్య మరియు దక్షిణ ఆసియా ప్రాంతంలో ఆవిష్కరణలు సాధించిన ప్రముఖ దేశాలలో ఒకటిగా డబ్ల్యు.ఐ.పి.ఓ., భారతదేశాన్ని అంగీకరించింది.
అపారమైన జ్ఞాన మూలధనం కారణంగా, శక్తివంతమైన అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశోధనా సంస్థలు చేసిన అద్భుతమైన పనితనం కారణంగా, అంతర్జాతీయ ఆవిష్కరణల సూచికలో స్థిరమైన మెరుగుదల సాధ్యమయ్యింది. జాతీయ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను సుసంపన్నం చేయడంలో శాస్త్రీయ మంత్రిత్వ శాఖలైన, శాస్త్ర, సాంకేతిక విభాగం, బయోటెక్నాలజీ విభాగం, అంతరిక్ష విభాగం కీలక పాత్ర పోషించాయి.
ఈ దిశగా జాతీయ ప్రయత్నాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు, ఈ.వీ.లు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన వివిధ రంగాలలో విధానపరమైన ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా, నీతీ ఆయోగ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. గత ఏడాది నీతీ ఆయోగ్ విడుదల చేసిన భారత ఆవిష్కరణల సూచీ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆవిష్కరణల వికేంద్రీకరణ దిశలో ప్రధాన దశగా విస్తృతంగా అంగీకరించబడింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ తో సహా, అంతర్జాతీయ ర్యాంకింగ్సు లో భారతదేశం యొక్క స్థానాన్ని పర్యవేక్షించడంలో, మరియు అంచనా వేయడంలో స్థిరమైన ఉత్సాహాన్ని నీతీ ఆయోగ్ అందించింది.
అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ లో స్థానాన్ని మెరుగుపరచుకోడానికి భారతదేశం అధిక లక్ష్యాలతో పాటు రెట్టింపు కృషి చేయాలి. భారతదేశం తన స్థాయికి మించి, శాస్త్రీయ జోక్యాలను అభివృద్ధి చేయడంలో ప్రపంచ సూపర్ శక్తులతో పోటీపడితేనే గౌరవనీయులైన ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ పిలుపుని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో మొదటి 25 దేశాలలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని, భారతదేశం ఒక నమూనా మార్పును తీసుకువచ్చే సమయం ఇదే.
*****
(Release ID: 1650904)
Visitor Counter : 299