గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2020 సెప్టెంబర్ 7 నుంచి తరగతుల వారీగా మెట్రో సర్వీసుల నిర్వహణ
ప్రామాణిక నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి
మెట్రో ప్రయాణీకులకు మరియు సిబ్బందికి మాస్కులు
వ్యాధి లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతిస్తారు
హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ (హెచ్ వి ఏ సి) వ్యవస్థను ఉపయోగిస్తారు
Posted On:
02 SEP 2020 6:56PM by PIB Hyderabad
బుధవారం మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్ ఓ పి) కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తున్న మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి వెల్లడించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వు సంఖ్య 40-3/2020 - డి ఎం - ఐ (ఎ) తేదీ 29-8-2020 ప్రకారం మెట్రో సర్వీసులు 2020 సెప్టెంబర్, 7వ తేదీ
నుంచి ప్రారంభమవుతాయి. శ్రేణీకృత రీతిలో మొదలవుతాయి. ఇందుకోసం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ ప్రామాణిక నిర్వహణ పద్ధతులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వాటితో ఏకీభవించింది.
మార్గదర్శకాలకు సంబంధించిన విస్తృత లక్షణాలు ఇవి:
ఎ. మెట్రో రైళ్ల రాకపోకలు దశల వారీగా మొదలవుతాయి. ఒకటి కన్నా ఎక్కువ కారిడార్లు ఉన్న మెట్రోలు సెప్టెంబర్ ఏడవ తేదీనుంచి దశల వారీగా ప్రారంభించి 12వ తేదీ నాటికి అన్ని కారిడార్లను తెరుస్తారు. మొదట్లో సర్వీసుల మధ్య ఎడం ఎక్కువ ఉంటుంది. క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచి సెప్టెంబర్ 12వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో నడుపుతారు. మెట్రో స్టేషన్లలో మరియు రైళ్లలో ప్రయాణీకులు గుమికూడి రద్దీ పెరగకుండా రైళ్ల మధ్య సమయాన్ని నియంత్రిస్తారు.
బి. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న స్టేషన్లు / ప్రవేశ /నిష్క్రమణ గేట్లను మూసివేస్తారు.
సి. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించడానికి వీలుగా స్టేషన్లలో మరియు రైళ్ల లోపల తగిన గుర్తులు వేస్తారు.
డి. ప్రయాణీకులు మరియు సిబ్బంది తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలి. మాస్కు లేకుండా మెట్రో స్టేషనుకు చేరుకున్న ప్రయాణీకులకు మాస్కులు సరఫరా చేయడానికి మెట్రో రైలు కార్పొరేషన్ తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ఈ. స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద స్టేషనుకు వచ్చిన వారి ఉష్ణోగ్రతను పరీక్షించి వ్యాధి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్ష / వైద్య చికిత్స కోసం దగ్గరలో ఉన్న కోవిడ్ సంరక్షణ కేంద్రానికి / ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా సలహా ఇస్తారు. ఆరోగ్య సేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహిస్తారు.
ఎఫ్. స్టేషన్ల ప్రవేశ ద్వారాల వద్ద ప్రయాణీకుల కోసం శానిటైజర్లు ఏర్పాటు చేస్తారు. మనుష్య సంచారం ఉండే అన్ని చోట్ల అంటే ,రైలు, పని చేసే ప్రాంతం, లిఫ్ట్, ఎస్కలేటర్లు, మెట్ల వద్ద ఉండే ఇనుప కమ్మీలు, ఏ ఎఫ్ సి గేటు, టాయిలెట్లు మొదలైన వాటిని నియమిత సమయంలో శానిటైజ్ చేయవలసి ఉంటుంది.
జి. నగదు రహిత / ఆన్ లైన్ లావాదేవీలు, స్మార్ట్ కార్డు వినియోగం ప్రోత్సహిస్తారు. టోకెన్లు, కాగితం స్లిప్పులు / టికెట్లను శానిటైజ్ చేసిన తరువాత వాడతారు.
హెచ్. స్టేషన్లలో రద్దీ లేకుండా ప్రయాణీకులు సులభంగా మెట్రోలో ఎక్కి /దిగడానికి వీలుగా భౌతిక దూరం పాటిస్తారు. భౌతిక దూరం అమలు జరిగేలా చూసేందుకు కొన్ని స్టేషన్లను వదిలి సర్వీసులు నడుపుతారు.
ఐ. తక్కువ లగేజీతో ప్రయాణించవలసిందిగా ప్రయాణీకులకు సలహా ఇస్తారు. అదే సమయంలో త్వరగా స్కానింగ్ జరిపేందుకు వీలుగా లోహ వస్తువులను తీసుకు రావద్దని చెప్తారు.
జె. కేంద్ర ప్రజాపనుల శాఖ తదితర సంస్థల మార్గదర్శకాల ప్రకారం రైలు లోపల వీలయినంత ఎక్కువ తాజా గాలి తిరిగే విధంగా హెచ్ వి ఎ సి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఉపయోగిస్తారు.
కె. ప్రయాణీకులకు, సిబ్బందికి అన్ని రకాల సమాచారం అందించి వారిని జాగృతం చేయడమే కాక వర్తమానం అందజేయడానికి అన్ని రకాల మీడియా , పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్, వెబ్సైట్ లు మొదలగు వాటిని ఉపయోగిస్తారు.
ఐ. మెట్రో స్టేషన్ల బయట జన సమూహాన్ని నియంత్రించడానికి, ఏదైనా ఊహించని పరిణామం సంభవిస్తే ఎదుర్కోవడానికి మెట్రో రైలు అధికారులు స్థానిక అధికారులు మరియు రాష్ట్ర పోలీసులతో అనుసంధాయకత కలిగి సమన్వయంతో వ్యవహరిస్తారు.
పై మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీ, నోయిడా, చెన్నై, కొచ్చి , బెంగళూరు, ముంబై లైన్ -1, జైపూర్, హైదరాబాద్, మహా మెట్రో (నాగపూర్), కోల్కతా, గుజరాత్ మరియు యు పి మెట్రో (లక్నో) అధికారులు ఎస్ ఓ పి లను తయారు చేశారు. మెట్రో సర్వీసులను ఇప్పుడే, 2020 సెప్టెంబరులో ప్రారంభించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ముంబై లైన్ -1 , మహా మెట్రో కార్యకలాపాలు 2020 అక్టోబరులో గాని లేక రాష్ట్రప్రభుత్వం నిర్ణయం మేరకు గాని ప్రారంభమవుతాయి.
***
(Release ID: 1650826)
Visitor Counter : 274