PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 02 SEP 2020 6:26PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునే సగటు జాతీయ స్థాయికన్నా అధికం.
  • భారతదేశంలో వరుసగా ఆరో రోజు వ్యాధి నయమైనవారి సంఖ్య 60 వేలకుపైగా నమోదు.
  • ప్రస్తుత కేసులతో పోలిస్తే కోలుకున్న కేసుల సంఖ్య 21 లక్షలకు పైగా అధికం.
  • 24 గంటల్లో 62,026 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి జాతీయ సగటు 76.98 శాతానికి చేరిక.
  • కోవిడ్‌ మరణాల సగటు మరింత పతనమవుతూ 1.76 శాతానికి పరిమితం; ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల జాబితాలో భారత్‌.

దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునే సగటు జాతీయ స్థాయికన్నా అధికం; వరుసగా 6వ‌ రోజు వ్యాధి నయమైనవారు 60వేలపైగానే; ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య తేడా 21 లక్షలకుపైగా అధికం

భారత్‌లో నేటిదాకా కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29 లక్షలు (29,01,908) దాటింది. తొలి 10 లక్షల మంది కోలుకునేందుకు 22 రోజులు పడితే, తాజా 10 లక్షల మంది కేవలం 17 రోజుల్లోనే కోలుకున్నారు. నిత్యం కోలుకునేవారి సంఖ్య నానాటికీ భారీగా పెరగడమే కోవిడ్-19 కేసుల నిర్వహణలో భారత్‌ సామర్థ్యానికి నిదర్శనం. ఆ మేరకు 2020 మే నెలనుంచి కోలుకునేవారి రోగుల సంఖ్య 58 రెట్లు పెరిగింది. ఇలా రోజువారీ కోలుకునేవారి సంఖ్య పెరిగేకొద్దీ దేశంలో రోజూ 60 వేలమందికిపైగా వ్యాధినుంచి బయటపడుతున్నారు. తదనుగుణంగా వరుసగా 6వ రోజు గత 24 గంటల్లో 62,026 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కోలుకునేవారి సగటు 76.98 శాతానికి చేరడంతోపాటు నిరంతరం పురోగమిస్తోంది. ఈ విధంగా కోలుకున్న కేసుల సంఖ్య చురుకైన కేసులకన్నా 21 లక్షలు అధికంగా నమోదైంది. జూలై తొలివారంతో పోలిస్తే ఆగస్టు చివరి వారంనాటికి వారపువారీ కోలుకునేవారి సంఖ్య 4 రెట్లు అధికంగా ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650708

కోవిడ్‌ మరణాల సగటు మరింత పతనమవుతూ 1.76 శాతానికి పరిమితం; ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల జాబితాలో భారత్‌

ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే అత్యల్ప కోవిడ్‌ మరణశాతంగల దేశాల జాబితాలో భారత్‌ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మరణాల సగటు ప్రస్తుతం 3.3 శాతం కాగా, భారత్‌లో ఇది కేవలం 1.76 శాతం మాత్రమే. ఆ మేరకు ప్రతి 10 లక్షల జనాభాకు మరణాల సగటు 110 కాగా, భారతదేశంలో కేవలం 48గా మాత్రమే నమోదైంది. ఇక బ్రెజిల్‌లో 12 రెట్లు, బ్రిటన్‌లో 13 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల సంయుక్త, సమన్వయ కృషి ఫలితంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు బాగా వృద్ధిచెందాయి. తదనుగుణంగా ఇవాళ 1578 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులలో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయి. దీంతోపాటు ఐసీయూలలో సేవలందించే వైద్యులకు సహాయసహకారాల కోసం న్యూఢిల్లీలోని అత్యున్నత వైద్యవిజ్ఞాన సంస్థ ‘ఎయిమ్స్‌’ద్వారా దూరవాణి సంప్రదింపుల సదుపాయం చురుగ్గా పనిచేస్తోంది. ఈ సదుపాయంద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో టెలి/వీడియో సంప్రదింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూలై 8 నుంచి ప్రారంభమైన ఈ సదుపాయంద్వారా ఇప్పటిదాకా 17 దూరవాణి కార్యక్రమాలు నిర్వహించగా 204 వైద్య సంస్థలు పాలుపంచుకున్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650830

స్వయం సమృద్ధ భారతం పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2.8 కోట్ల మంది వలసదారులలో దాదాపు 95 శాతానికి ఉచిత ఆహార ధాన్యాల సరఫరా

కోవిడ్‌ మహమ్మారి సంక్షోభ పరిస్థితుల నడుమ దేశవ్యాప్తంగా వలసకార్మికులు ఎదుర్కొంటున్న దురవస్థలకు ఊరటనిస్తూ 2020 మే నెలలో కేంద్ర ప్రభుత్వం స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ (ANBP) కింద పలు ఆర్థిక ఉపశమన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా పేదల ఆహార-భద్రత అవసరాలను తీర్చడానికి ఆహార-ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 2020 మే 15న మొత్తం 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉదారంగా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 2020 ఆగస్టు 31వరకూ 2.65 లక్షల టన్నుల ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సాగినట్లు నివేదికలు అందాయి. వీటి ప్రకారం... మే నెలలో 2.35 కోట్లమందికి, జూన్‌ నెలలో 2.48 కోట్లమందికి, జూలైలో 31.43 లక్షల మందికి, ఆగస్టులో దాదాపు 16 లక్షల మందికి (వరుసగా మే, జూన్ నెలలకు సగటున సుమారు 2.65 కోట్ల మంది అర్హులకు) ఆహారధాన్యాలు అందాయి. సుమారు 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల అంచనాల మేరకు 80 శాతం లేదా అంతకుమించి ఆహార-ధాన్యాలను సద్వినియోగం చేశాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650442

సివిల్ సర్వీసుల సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం “మిషన్ కర్మయోగి”కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సివిల్ సర్వీసుల సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం “మిషన్ కర్మయోగి” (NPCSCB)కి ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం కింది వ్యవస్థాగత చట్రంలో భాగంగా ఉంటుంది.

  1. ప్రధానమంత్రి ప్రభుత్వ మానవ వనరుల మండలి;
  2. సామర్థ్య నిర్మాణ కమిషన్‌;
  3. డిజిటల్‌ ఆస్తులు, ఆన్‌లైన్‌ శిక్షణ కోసం సాంకేతిక వేదికలు కలిగి ఉండే ప్రత్యేక ప్రయోజన సంస్థ;
  4. మంత్రిమండలి కార్యదర్శి నేతృత్వంలో సమన్వయ విభాగం

ప్రభుత్వోద్యోగుల సామర్థ్యం పెంపునకు వీలుగా ఈ జాతీయ సంస్థను అత్యంత జాగ్ర‌త్తగా రూపొందించారు. ప్రభుత్వోద్యోగులు భారతీయ మూలాలను వీడ‌కుండానే..  ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల నుంచివిశ్వ‌వ్యాప్తంగాగ‌ల ఉత్త‌మ ప‌ద్ధ‌తుల నుంచి మెలకువలు నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి రూప‌మిచ్చారు. ఈ మేర‌కు ‘ప్ర‌భుత్వ స‌మీకృత ఆన్‌లైన్ శిక్ష‌ణ వేదిక‌- iGOT కర్మయోగి’ద్వారా దీన్ని అమలు చేస్తారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650663

భారత-అమెరికా వాణిజ్యం మరింత ఉన్నతం కావాలని శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపు; ప్రపంచ సరఫరా శృంఖలంలో రెండు దేశాలూ విశ్వసనీయ భాగస్వాములని వ్యాఖ్య

భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు భారత వాణిజ్య-పారిశ్రామిక రంగాలతో సంయుక్తంగా కృషి చేయాలని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నిన్న అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక సమావేశంలో డిజిటల్‌ మాధ్యమంద్వారా ఆయన ప్రసంగించారు. రెండు దేశాలూ స్వేచ్ఛ-సరళలతతో కూడిన వాణిజ్యంపై విశ్వాసంగలవేనని, భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ వాణిజ్యాన్ని మించి- పరస్పర అనుసంధాన ప్రపంచంలో రెండు దేశాలూ అంతర్జాతీయంగా విలువలను పెంచుకోవడంలో ఒడుదొడుకులను సమర్థంగా అధిగమించడంలో మరింత విశ్వసనీయ భాగస్వాములు కాగలవని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650572

ముద్రణ కార్యకలాపాలకు సంబంధించి పొదుపు చర్యలపై సూచనలు

ప్రపంచమంతా నేడు డిజిటల్‌ ఉత్పాదక సామర్థ్యం పెంపుదిశగా పరుగుతీస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం కూడా ఈ ఉత్తమ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు/ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు వాటి ఇతర శాఖలలో రాబోయే కొత్త సంవత్సరానికి కేలండర్లు, డెస్క్‌టాప్‌ కేలండర్లు, డైరీలు తదితరాలను ముద్రించరాదని ఆదేశాలిచ్చింది. దీనికి బదులుగా ఇదంతా డిజిటల్‌ మార్గంలో సాగాలని నిర్దేశించింది.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650706

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని కోవడ్‌ లక్షణాలు స్పష్టంగా కనిపించే వ్యక్తుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ చూపాలని నగరపాలన యంత్రాంగాధిపతి వైద్యులను ఆదేశించారు. ఏకాంత గృహవాస పర్యవేక్షణలోగల వ్యక్తులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే లేదా వ్యాధి తీవ్రమైతే తక్షణం వారిని ఆస్ప్రతికి తరలించాలని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ నిత్యం ఫోన్ ద్వారా వారి స్థితిగతులను పరిశీలించాలని, అవసరమైతే ఆస్ప్రతికి తరలించేందుకు అంబులెన్స్ సదుపాయం 24 గంటలూ సిద్ధంగా ఉంచాలని సూచించారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఆలయాలను త్వరలో తెరవడంపై ప్రభుత్వం యోచిస్తున్నదని, ఈ దిశగా భక్తుల సౌకర్యాలకు సంబంధించి ప్రామాణిక విధాన ప్రక్రియలపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశించే విధానాన్ని సరళం చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే, ఇ-పాస్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారివల్ల రాష్ట్రంలో అభివృద్ధి ప్రభావితంకాకుండా జాగ్రత్త వహిస్తున్నామని పేర్కొన్నారు.
  • కేరళ: దిగ్బంధ విముక్తి-4 మార్గదర్శకాల అమలులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కేరళలో నిర్వహించిన అధ్యయనం మేరకు రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభం ఆందోళనకరంగా ఉంది. రోజువారీ కోవిడ్ కేసుల 4.3 శాతం మేర పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ అగ్రస్థానంలో ఉందని, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంలో ఉన్నదని పేర్కొంది. ఇక రోగనిర్ధారణ పరీక్షలు కేవలం 6.23 శాతం కావడంతో ఈ అంశంరీత్యా రాష్ట్రం చివరి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కాగా, కేరళలో మరో ఐదు కోవిడ్ మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య ఇవాళ 303కు చేరింది. కేరళలో నిన్న 1,140 తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 76,525కు చేరింది. ప్రస్తుతం 22,512 మంది చికిత్స పొందుతుండగా 1.96 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 24 గంటల్లో 397 కొత్త కేసుల నమోదుతో బుధవారం మొత్తం కేసుల సంఖ్య 15వేలు దాటింది. దీంతోపాటు 13 మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 7 నుండి తమిళనాడులో ప్యాసింజర్ రైళ్లు, అంతరజిల్లా బస్సులు తిరిగి నడుస్తాయి. కాగా, ఈ నెల 1 నుంచి ప్రభుత్వం జిల్లాల మధ్య మాత్రమే బస్సులు నడిచేందుకు అనుమతించింది. దీంతో రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణించడంలో ఇబ్బందులపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • కర్ణాటక: రాష్ట్ర రాజధాని బెంగళూరులో కోవిడ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మేరకు గత 15 రోజులలో మరణాల సగటు 0.9 శాతానికి దిగివచ్చింది. దీన్ని ఇదేవిధంగా 1 శాతంకన్నా తక్కువ స్థాయిలో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జూలైలో రోజుకు 4 వేలనుంచి 25,000 స్థాయికి పరీక్షల సంఖ్య పెరిగినా నిర్ధారిత కేసులు 23 శాతం నుంచి 10.2 శాతానికి పతనం కావడం విశేషం. కాగా, కర్ణాటకలో నిన్న రెండోసారి అత్యధికంగా 9000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం 1,350కిపైగా అంబులెన్స్‌లను నియమించింది. వీటిని కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులు/సంరక్షణ కేంద్రాలకు రోగులను తరలించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మండలాల్లోని కాల్ సెంటర్లు ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు/ ఆస్పత్రులతో సమన్వయం చేసుకుంటూ అంబులెన్స్‌లను కేటాయిస్తాయి. మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరించారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2892 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2240మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 477 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,30,589; క్రియాశీల కేసులు: 32,341; మరణాలు: 846; డిశ్చార్జి: 97,402గా ఉన్నాయి. కాగా, నవ్య కరోనావైరస్ బలమైన ఉప-జాతి ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యాపించిందని జాతీయ అగ్ర పరిశోధన సంస్థలలో ఒకటైన నగరంలోని ‘సెంటర్ ఫర్ సెల్యులార్-మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 100 కొత్త కేసులు నమోదవగా ఇప్పటిదాకా కోలుకున్న కేసుల సగటు 70.72 శాతంగా ఉంది.
  •  అసోం: రాష్ట్రంలో మంగళవారం 1434 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 24514 కాగా, ఇప్పటిదాకా 86892 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.
  • మణిపూర్: రాష్ట్రంలో 130 కొత్త కేసులు నమోదవగా, కోలుకునేవారి సగటు 69 శాతంకాగా, 120 మంది కోలుకున్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం 1903 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 73 మంది కరోనావైరస్ బారినుంచి బయటపడ్డారు. మేఘాలయలో ప్రస్తుతం 1193 యాక్టివ్‌ కేసులకుగాను 304 బీఎస్ఎఫ్, సాయుధ దళాలకు చెందినవే.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 8 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1020కి చేరాయి. వీటిలో ప్రస్తుతం 410 క్రియాశీల కేసులున్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని దిమాపూర్, కోహిమాలలో సరి-బేసి వాహన రాకపోకల పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, దిమాపూర్‌లోని న్యూ మార్కెట్, హాజీ పార్క్, హాంకాంగ్ మార్కెట్ వంటి ప్రధాన మార్కెట్లు ఈ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు డీసీ చెప్పారు.
  • సిక్కిం: సిక్కింలో ఇవాళ 41558 కోవిడ్‌ నమూనాలను పరీక్షించారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు మరో మూడు నెలలదాకా కోవిడ్-19 రోగుల కోసం 80 శాతం పడకలను అందుబాటులో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనివల్ల పడకల లభ్యతతోపాటు చికిత్స ధర కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. కాగా, మంగళవారం 15,765 కొత్త కేసుల నమోదుతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1.98 లక్షలుగా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్‌ ప్రత్యేక చికిత్సకు కేటాయించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రస్తుత కోవిడ్ ప్రత్యేక రక్షణ కేంద్రాలు, RUHS ఆస్పత్రులలో సౌకర్యాలను పెంచనున్నట్లు తెలిపింది. స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్న రోగుల కోసం RUHS ప్రాంగణంలో 100 పడకల కోవిడ్ రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 13,970 క్రియాశీల కేసులున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఒకేరోజు 1,514 మందికి కోవిడ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 33,017కు చేరింది. కాగా, మరో 10 మంది మరణంతో మృతుల సంఖ్య 287కు పెరిగింది. జిల్లాలవారీగా కొత్త కేసులలో రాయ్‌పూర్ 453, దుర్గ్ 226, రాజ్‌నందగావ్ 149తో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • గోవా: దేశీయ ప్రయాణికులంతా కోవిడ్‌ సోకలేదని తెలిపే ధ్రువీకరణను తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధనను గోవా విమానాశ్రయం తొలగించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన దిగ్బంధ విముక్తి-4 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. కాగా, రాష్ట్రంలో రెస్టారెంట్లు, బార్‌లు తెరిచారు. మరోవైపు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే, రోగలక్షణాలేవీ కనిపించకపోవడంతో ఆయన ప్రస్తుతం ఏకాంత గృహవాస పర్యవేక్షణలో ఉన్నారు.

FACT CHECK

 

******



(Release ID: 1650837) Visitor Counter : 176