వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత-అమెరికా వాణిజ్యాన్ని ఉన్నత శిఖరాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన - శ్రీ పియూష్ గోయల్; అంతర్జాతీయంగా విలువలను పెంపొందించుకోవడంలో రెండు దేశాలూ, స్థితిస్థాపక విశ్వసనీయ భాగస్వాములు కాగలవని పేర్కొన్నారు.

అమెరికాతో ప్రారంభ పరిమిత వాణిజ్య ప్యాకేజీపై సంతకం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది : కేంద్ర మంత్రి.

Posted On: 01 SEP 2020 7:49PM by PIB Hyderabad

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి తమ భారతీయ సహచరులతో కలిసి పనిచేయాలని, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, అమెరికా వ్యాపార, పరిశ్రమల రంగాలను ఆహ్వానించారు.  ఆయన ఈ రోజు, అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యు.ఎస్.ఐ.ఎస్.పి.ఎఫ్) ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ రెండు ప్రజాస్వామ్యాలు, ప్రభుత్వం, వ్యాపారం మరియు ప్రజల స్థాయిలలో ఒకరితో ఒకరు మంచి నిబద్ధతను పంచుకుంటాయని చెప్పారు.  రెండు దేశాలు స్వేచ్ఛా మరియు సరసమైన వాణిజ్యాన్ని విశ్వసిస్తాయి. భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.  వాణిజ్యాన్ని మించి, ఈ పరస్పర అనుసంధాన ప్రపంచంలో, రెండు దేశాలూ, అంతర్జాతీయంగా విలువలను పెంపొందించుకోవడంలో, స్థితిస్థాపక విశ్వసనీయ భాగస్వాములు కాగలవని ఆయన పేర్కొన్నారు  

పరిశ్రమ మరియు పెట్టుబడులను సులభతరం చేయడం కోసం దేశంలో చేపట్టిన చర్యల గురించి శ్రీ గోయల్ యు.ఎస్.ఐ.ఎస్.పి.ఎఫ్. సభ్యులకు వివరించారు.  జి.ఐ.ఎస్. ఆధారిత భూమి బ్యాంక్ ను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించబడిందనీ, ఆరు రాష్ట్రాలు ఇందులో ఉన్నాయనీ, ఇది భూమి మరియు ప్రదేశాన్ని గుర్తించడంలో పెట్టుబడిదారులకు సహాయపడుతుందనీ, ఆయన తెలియజేశారు.  అనుమతుల కోసం ఏక గవాక్ష వ్యవస్థ గురించి మంత్రి ప్రస్తావించారు.  కేంద్ర, రాష్ట్ర మరియు మునిసిపల్ స్థాయిలో వివిధ అనుమతులు మంజూరు చేసే అధికారులు మరియు ఏజెన్సీల సహకారంతో ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడుతోంది.  భారత- అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై ఆయన మాట్లాడుతూ, ప్రారంభ పరిమిత వాణిజ్య ప్యాకేజీపై సంతకం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందనీ, ఇక ముందుకు సాగడం అనేది అమెరికా చేతిలోనే ఉందని పేర్కొన్నారు. 

శ్రీ గోయల్ మాట్లాడుతూ ముందుకు వెళ్లే రహదారిలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ,  అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నారు.  కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయనీ, అయితే, వాటిని వేగంగా పునరుద్ధరించడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయనీ, ఆయన పేర్కొన్నారు.  భారతీయ రైల్వేల సరుకు రవాణా గురించి ఆయన మాట్లాడుతూ, 2019 ఆగష్టు తో పోల్చుకుంటే,  2020 ఆగష్టు లో ఇది, 4 శాతం అధికంగా ఉందని ఆయన తెలియజేశారు.  అదేవిధంగా, 2019 జూలై 19 తో పోలిస్తే, 2020 జూలై నెలలో ఎగుమతులు 88 శాతానికి చేరుకున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితి మరింత వేగం పుంజుకుంది. ఖరారవుతున్న ఆగష్టు గణాంకాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి.  చమురు, రత్నాలు, ఆభరణాల రంగాల నుండి నమోదైన సమాచారాన్ని మొత్తం ఎగుమతుల నుండి మినహాయించినట్లయితే, ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది.

కోవిడ్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి భారతదేశం తీసుకున్న ముందస్తు మరియు బలమైన చర్యలు దేశాన్ని మంచి స్థితిలో ఉంచుతున్నాయని మంత్రి చెప్పారు, ఎందుకంటే మరణాల రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. రికవరీ రేటు 75 శాతం కంటే ఎక్కువగా ఉంది.  పెద్ద జనాభా ఉన్నప్పటికీ, భారతదేశ ప్రజలు సమయం తో సర్దుబాటు చేయగల గొప్ప సామర్థ్యాన్ని చూపించారని మంత్రి పేర్కొన్నారు.  ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి లాక్ డౌన్ కాలాన్ని దేశం ఉపయోగించుకుందనీ, అదేవిధంగా ఉద్దీపన / ఉపశమన ప్యాకేజీ ప్రజలకు మహమ్మారిపై పోరాడటానికి సహాయపడిందని, ఆయన అన్నారు.  ప్రధానమంత్రి పాత్ర, నాయకత్వాన్ని,  కేంద్ర మంత్రి ప్రశంసిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ, తన ప్రణాళికా రచనలో ఎప్పుడూ రెండు అడుగులు ముందుంటారని వ్యాఖ్యానించారు.  భారతదేశం ఎప్పుడూ విజయపథంలో కొనసాగుతుందనీ, పోగొట్టుకున్న సమయాన్ని తిరిగి సమకూర్చుకుంటుందనీ,  వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే ప్రయత్నాన్ని తిరిగి కొనసాగిస్తుందనీ,  భారతదేశంలోని 1.3 బిలియన్ ప్రజలకు సమృద్ధిని తెస్తుందనీ,  ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

*****



(Release ID: 1650572) Visitor Counter : 193