PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
26 AUG 2020 6:20PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులకన్నా కోలుకున్న కేసులు 3.5 రెట్లు అధికం.
- గత 24 గంటల్లో 63,173 మంది కోలుకోగా ఇప్పటిదాకా 24,67,758 మందికి వ్యాధి నయం; కోలుకునేవారి సగటు 76.3 శాతానికి పెరుగుదల.
- నమోదైన కేసులలో మరణాల సగటు 1.84 శాతానికి పతనం.
- దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,23,992 పరీక్షలు, ఇప్పటివరకకూ మొత్తం 3,76,51,512 నమూనాల పరీక్ష.
- ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో సీజీహెచ్ఎస్ కింద ఈ-సంజీవనిద్వారా దూర-వైద్య సంప్రదింపులు మొదలు.
- రాజస్థాన్‌లో రెండు కొత్త వైద్య కళాశాలలు, మూడు సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లను జాతికి అంకితం చేసిన డాక్టర్ హర్షవర్ధన్.
భారత్‌లో కోలుకునేవారి సంఖ్య పెరుగుదలతో చికిత్స పొందే కేసులకన్నా వ్యాధి నయమైన కేసులు 3.5 శాతం అధికంగా నమోదు
కోవిడ్-19 కోలుకునేవారి సంఖ్య ఇవాళ ప్రస్తుత కేసులకన్నా 3.5 రెట్లు అధికంగా నమోదైంది. దేశంలో చాలాకాలం నుంచి ఒకేరోజు 60,000 మందికిపైగా కోలుకుంటున్న నేపథ్యంలో గత 24 గంటల్లో 63,173 మందికి వ్యాధి నయమైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 24,67,758కి చేరింది. దీంతో కోలుకునే-ప్రస్తుత కేసుల మధ్య అంతరం వేగంగా పెరుగుతోంది. ఆ మేరకు ప్రస్తుత (7,07,267) కేసులతో పోలిస్తే కోలుకున్న కేసులు 17,60,489 మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో కోలుకునేవారి సగటు ఇవాళ 76 శాతం (76.30) దాటింది. వ్యాధిగ్రస్థులు అత్యధికంగా కోలుకుంటున్నందున దేశం మొత్తంమీద నమోదైన కేసులలో ప్రస్తుత కేసులు గణనీయంగా తగ్గి కేవలం 21.87 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే మరణాలు స్థిరంగా తగ్గుతూ అత్యల్పంగా 1.84 శాతానికి పతనమయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648704
నిత్యం సగటున 8 లక్షలకుపైగా పరీక్షలతో కోవిడ్-19 నమూనాల పరీక్ష స్థాయి పెంచుతున్న భారత్; ప్రతి 10 లక్షల జనాభాకూ సగటు 27,000కు చేరిక
కరోనా మహమ్మారిపై పోరులో భారత అనుసరిస్తున్న సకాల, ముమ్మర పరీక్షల నిర్వహణ వ్యూహం కోవిడ్-19 కేసులను తరుణదశలోనే కనుగొనడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల పట్టుదల, నిరంతర దీక్ష, తదేక శ్రద్ధ, సమన్వయంతో కూడిన చర్యలు రోజువారీ పరీక్షల వారపు సగటు సంఖ్యల్లో ప్రతిఫలిస్తున్నాయి. తదనుగుణంగా గత 24 గంటల్లో 8,23,992 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య ఇవాళ 3,76,51,512కు చేరింది. భారత్‌లో పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్ వేగంగా విస్తరించడంతోపాటు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేయడంవల్ల ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 27,284కు పెరగడమేగాక స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 992, ప్రైవేట్ రంగంలో 548 వంతున మొత్తం 1540 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648747
ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో సీజీహెచ్ఎస్ కింద ఈ-సంజీవనిద్వారా దూర-వైద్య సంప్రదింపులు మొదలు
సీజీహెచ్ఎస్ (CGHS) లబ్ధిదారులు ఆరోగ్య కేంద్రాలకు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా వాస్తవిక సాదృశ విధానంలో వైద్య నిపుణులతో ఆరోగ్య సంబంధిత సంప్రదింపుల కోసం 25.08.2020 నుంచి దూర-వైద్య సంప్రదింపు సేవలను సీజీహెచ్‌ఎస్ ప్రారంభించింది. ఈ మేరకు మొదట ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోని లబ్ధిదారులకు ఈ-సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్ని పనిదినాల్లో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని ఈ-సంజీవని వేదికను వినియోగిస్తుంది. ఈ దిశగా లబ్ధిదారులకు సదుపాయం కల్పిస్తూ వారి గుర్తింపు వివరాలను ఈ వేదికకు జోడించారు. ప్రత్యేక ఓపీడీ సేవల కోసం లబ్ధిదారులు తమ మొబైల్ నంబరు సాయంతో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648712
రాజస్థాన్‌లో రెండు కొత్త వైద్య కళాశాలలు, మూడు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను జాతికి అంకితం చేసిన డాక్టర్ హర్షవర్ధన్.
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లోత్‌తో కలసి రాష్ట్రంలో రెండు కొత్త వైద్య కళాశాలలతోపాటు మూడు సూపర్ స్పెషాలిటీ వైద్య భవనాలను డిజిటల్ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా భిల్వారా, భరత్‌పూర్‌లలోని జిల్లా ఆస్పత్రులను ‘రాజమాత విజయరాజె సింధియా (RVRS) వైద్య కళాశాల’, ‘భరత్‌పూర్ వైద్య కళాశాల’గా ఉన్నతీకరించారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల, కోట; సర్దార్ పటేల్ వైద్య కళాశాల, బీకానేర్; రవీంద్రనాథ్ ఠాగూర్ వైద్య కళాశాల, ఉదయపూర్‌లలో కొత్త సూపర్ స్పెషాలిటీ వైద్య భవనాలను సమకూర్చారు. వీటన్నిటికోసం రూ.828 కోట్లు వెచ్చించగా, ఇందులో ఒక్కొక్క వైద్య కళాశాలకు రూ.150 కోట్లమేర ఖర్చుచేశారు. దీంతో ప్రతి కళాశాలలో 150 మంది వైద్య విద్యనభ్యసించే అవకాశం కలుగుతుది. ఇక భరత్‌పూర్ వైద్య కళాశాలలో 34 ఐసీయూసహా మొత్తం 525 పడకలు, ఆర్‌విఆర్‌ఎస్ వైద్యకళాశాలలో 12 ఐసీయూసహా మొత్తం 458 పడకలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648782
చమురు-గ్యాస్ రంగంలో ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి రూ.5.88 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 8,363 ప్రాజెక్టులు ప్రారంభం; తద్వారా 33.8 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పనకు అవకాశం
చమురు-గ్యాస్ రంగంలో రూ.5.88 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 20.04.2020 నుంచి క్రమంగా 8,363 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటన్నిటిలోనూ కోవిడ్ మహమ్మారి సంబంధిత ప్రామాణిక విధాన ప్రక్రియలను పూర్తిగా పాటిస్తున్నారు. వీటిలో చమురు-గ్యాస్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, సంయుక్త/అనుబంధ సంస్థలతోపాటు చమురుశుద్ధి, జీవశుద్ధి ప్రాజెక్టులు, ఈ అండ్ పీ ప్రాజెక్టులు, మార్కెటింగ్ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పైప్‌లైన్లు, సీజీడీ ప్రాజెక్టులు, డ్రిల్లింగ్/సర్వే కార్యకలాపాలు వంటివి ఉన్నాయి. కాగా, చమురు-గ్యాస్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు/జేవీల పరిధిలో కొనసాగుతున్న 25 ప్రధాన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,67,248 కోట్లు కాగా, ఇప్పటిదాకా రూ. 7861 కోట్ల మూలధన వ్యయం నమోదైంది. దీంతో 76,56,825 పనిదినాల మేర ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఇక పెట్రోలియం-సహజ వాయువు-ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రాజెక్టులపై నిరంతరం పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో తాజాగా 24.08.2020న సమీక్ష నిర్వహించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648544
‘పేదల సంక్షేమం-ఉపాధి కార్యక్రమం’ కింద 9వ వారం నాటికి రూ.18,862 కోట్ల వ్యయం; సుమారు 24 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పన
కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో స్వగ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణులకు జీవనోపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ‘పేదల సంక్షేమం-ఉపాధి కార్యక్రమం’ (GKRA) ప్రారంభించబడింది. ఇందులో భాగంగా 9వ వారంనాటికి రూ.18,862 కోట్ల వ్యయం కాగా, సుమారు 24 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించబడింది. ఈ పనుల కింద ఇప్పటిదాకా 85,786 జల సంరక్షణ నిర్మాణాలు, 2,63,846 గ్రామీణ గృహాలు, 19,397 పశువుల కొట్టాలు, 12,798 వ్యవసాయ ఊటగుంటలు, 4,260 సామాజిక పారిశుధ్య సముదాయాలను నిర్మించారు. అలాగే జిల్లా ఖనిజవనరుల నిధుల ద్వారా 6342 పనులను చేపట్టారు. ఇక ఈ కార్యక్రమం కింద 1002 పంచాయతీలకు ఇంటర్నెట్ అనుసంధానం కల్పించారు. దీంతోపాటు ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణలో భాగంగా 13,022 పనులను చేపట్టారు. వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల ద్వారా 31,658 మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648732
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో తీవ్రమవుతున్న కోవిడ్ సంక్షోభంపై పోరు ఉధృతం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా 428 వైద్యాధికారి ఉద్యోగాలను అత్యవసర ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఇప్పటికే భర్తీచేసిన 107 పోస్టులకు నియామక అనంతర ఆమోదముద్ర వేసింది.
- హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 5.9 లక్షలమంది మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం కింద నెలకు రూ.500 వంతున వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 8.74 లక్షలమంది అర్హతగల రైతులకు నెలకు రూ.2000 వంతున మూడు నెలల ముందస్తు సామాజిక భద్రత పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జమచేసిందని చెప్పారు. అలాగే మార్చి నుంచి జూన్ వరకు ఆశా కార్యకర్తల ఖాతాల్లో అదనంగా రూ.1000వంతున జమ చేసినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వారి నిరుపమాన సేవలను దృష్టిలో ఉంచుకుని జూలై, ఆగస్టు నెలలకు తలా రూ.2000 వంతున ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు గుర్తుచేశారు.
- మహారాష్ట్ర: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించిన కరోనావైరస్ టీకా రెండోదశ మోతాదు మందు మానవులపై వైద్యపరంగా ప్రయోగించడం కోసం పుణెలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాలకు అందింది. ఈ మేరకు ఇవాళ్టినుంచే ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం 1,65,921 క్రియాశీల కేసులుండగా, మంగళవారం 12,300 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోలుకున్నవారు 5,14,790 మంది కాగా, రాష్ట్రంలో మొత్తం 37,24,911 పరీక్షలు నిర్వహించారు.
- గుజరాత్: రాష్ట్రంలో మంగళవారం 1,096 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 88,942కు పెరిగింది. మరోవైపు 20 మరణాలు కూడా సంభవించాయి. కొత్త కేసులలో అత్యధికంగా సూరత్‌లో 250 నమోదవగా, అహ్మదాబాద్ 157 కేసులతో తర్వాతి స్థానంల ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 72,577 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం 14,751 లో చురుకైన కేసులున్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మంగళవారం ఒకేరోజు అత్యధికంగా 1,145 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 23,199కి చేరింది. మరోవైపు 12 మంది మరణించడంతో మృతుల సంఖ్య 218కి చేరింది. కాగా, రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నందన్, బిలాస్‌పూర్ జిల్లాల్లో కోలుకున్న రోగుల పర్యవేక్షణకు ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్.సింగ్‌దేవ్ ప్రతిస్పందనాత్మక గళవ్యవస్థ (IVRS)ను ప్రారంభించారు.
- గోవా: గోవాలో క్లిష్ట పరిస్థితిలోగల రోగులకోసం ఏర్పాటు చేసిన కోవిడ్-19 చికిత్స సదుపాయాల సమీక్షకు ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) వైద్యుల బృందం మంగళవారం గోవా వైద్య కళాశాల-ఆస్పత్రిని సందర్శించింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాదనాయక్ కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం ఎయిమ్స్ బృందం గోవా చేరింది. ఈ సందర్భంగా క్లిష్ట స్థితిలోగల రోగులకు చికిత్స చేయడానికి తగినట్లు ఏర్పాటుచేసిన మూడు వార్డులను పరిశీలించింది. కాగా, గోవాలో ప్రస్తుతం 3,149 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.
- కేరళ: రాష్ట్రంలో ఐదు కోవిడ్ మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 249గా నమోదైంది. రాజధానిలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని కఠిన నిబంధనల అమలునడుమ ఇవాళ ఉదయం తిరిగి తెరిచారు. ఈ మేరకు రోజుకు గరిష్ఠంగా 665 మంది భక్తులను మాత్రమే నిర్దేశిత సమయంలో 35 మంది వంతున లోపలికి అనుమతిస్తారు. కేరళలో నిన్న రికార్డు స్థాయిలో ఒకేరోజు 2,375 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 40,000 స్థాయిని దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,83,794 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రుల్లో నిర్వహించే కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఫలితాలను 24 నుంచి 36 గంటల్లోగా సంక్షిప్త సందేశంద్వారా తెలియజేస్తారు. ఈ వ్యవస్థ సౌలభ్యం దిశగా సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కార్యక్రమం పూర్తిస్థాయిలో జరుగుతున్నదని ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ తెలిపారు. కాగా, కోయంబత్తూరులో రానున్న 15 రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇక కోవిడ్ కారణంగా ఈ ఏడాది రద్దుచేసిన వార్షిక పరీక్షల ఫలితాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ మార్కులు ప్రకటించే పద్ధతిని సవాలు చేస్తూ పదో తరగతి విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2 లక్షలకుపైగా నమోదైంది. దీంతో కోలుకునే సగటు 70 శాతానికి పెరిగింది. మరోవైపు ఐసీయూలో చికిత్స పొందే కేసులు 1 శాతానికన్నా దిగువకు వచ్చాయి. అలాగే మరణాల సగటు 1.69 శాతానికి పతనమైంది. సామాజిక దూరం నిబంధన సడలింపు ద్వారా కేఎస్‌ఆర్టీసీ తమ బస్సుల్లో అన్ని సీట్ల భర్తీకోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. కాగా, సోమవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు కోవిడ్ సోకినట్లు తేలడంతో ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రోజుకు 5,000 వంతున కేసుల నమోదుకు రెండు రోజుల విరామం లభించాక మళ్లీ మంగళవారం ఒకేరోజున ఏకంగా 8,161 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,826కు పెరిగింది. వీటిలో 2,294 బెంగళూరు నగరంలో నమోదైన కేసులు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంటలు రేగడంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, సిబ్బంది అప్రమత్తమై ఆస్ప్రతిలోగల 24మంది కోవిడ్ రోగులను భద్రంగా మరొక వార్డుకు తరలించారు. కోవిడ్-19 వ్యాప్తి పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదని, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నివారణ చర్యలను గ్రామాల్లోనూ కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నొక్కిచెప్పారు. కాగా, రోగులనుంచి అధిక రుసుము వసూలు చేసినందుకు విజయవాడలోని ఐదు ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దుచేయడంతోపాటు రోగుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించింది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 3018 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 1060 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 475 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కేసులు: 1,11,688; క్రియాశీల కేసులు: 25,685; మరణాలు: 780; డిశ్చార్జి: 85,223గా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి క్రమంగా నియంత్రణలోకి రానున్న సంకేతాలు కనిపిస్తుండగా జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి తగ్గగలదని భావిస్తున్నట్లు సీనియర్ ఆరోగ్యాధికారులు తెలిపారు. కాగా, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, దిగ్బంధం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం... ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితులను తట్టుకుంటూ పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 25 నుంచి నెలలోగా రూ.5,950 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత నాలుగు గంటలలో 100 కొత్త కేసులు నమోదవగా, కోలుకునేవారి సగటు మెరుగుపడుతూ ప్రస్తుతం 73.50 శాతానికి పెరిగింది. కోవిడ్ ఆస్పత్రులనుంచి ఇప్పటిదాకా మొత్తం 2,508 మంది ఇళ్లకు వెళ్లారు.
- అసోం: రాష్ట్రంలో నిన్న 1,734 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కృషికి ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ కృతజ్ఞతలు తెలిపారు. అసోంలో మొత్తం 74,814 మంది కోలుకోగా, ప్రస్తుతం 19,515 మంది చికిత్స పొందుతున్నారు.
- మణిపూర్: రాష్ట్రంలో దిగ్బంధ విముక్తి-3 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా అన్నిరకాల సభలు-సమావేశాలపై నిషేధాన్ని కొనసాగించింది. అలాగే వీటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం పెంచింది.
- మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 42 మంది కోలుకోగా, ప్రస్తుతం క్రియాశీల కేసులు సంఖ్య 1,179గా ఉంది. వీరిలో బీఎస్ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది 442 మంది కాగా, ఇతరులు 737మంది ఉన్నారు. ఇక ఇప్పటిదాకా 831 మంది కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో ఇవాళ నలుగురు కోవిడ్ -19 రోగులు కోలుకోగా, మిజోరంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం 967 కేసులకుగాను 499 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 57,799 నమూనాలను ఆర్టీ-పీసీఆర్ విధానంలో, ట్రూనాట్ యంత్రాలద్వారా సేకరించి పరీక్షకోసం పంపారు. ప్రస్తుతం నాగాలాండ్‌లోని ప్రభుత్వ నిర్బంధవైద్య కేంద్రంలో సుమారు 1,113 మంది పర్యవేక్షణలో ఉన్నారు. కోహిమా జిల్లాలోని మరో 8 ప్రదేశాల్లో కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో వాటిని దిగ్బంధం చేయాలని పాలన యంత్రాంగం ఆదేశించింది. మరోవైపు హుయన్సాంగ్ జిల్లాలో మరో 9 ప్రదేశాలను మూసివేశారు.
FACT CHECK
*******
(Release ID: 1648856)
Visitor Counter : 237