ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
08 AUG 2020 6:01PM by PIB Hyderabad
స్నేహితులారా,
ఈ రోజు చారిత్రాత్మకమైనది. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమరంలో ఈ రోజు అంటే ఆగస్టు 8 కీలక పాత్ర పోషించింది. 1942లో ఇదే రోజున గాంధీజీ సారధ్యంలో స్వాతంత్ర్యం కోసం ఒక ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా నినాదం చేశారు. అలాంటి చారిత్రాత్మకమైన రోజున రాజ్ ఘాట్ సమీపంలో రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సముచితంగా వుంది. బాపూజీ ఆచరించిన స్వచ్ఛాగ్రహానికి 130 కోట్ల మంది భారతీయులు అందిస్తున్న నివాళి ఈ కేంద్రం.
స్నేహితులారా,
పూజ్య బాపూజీ పరిశుభ్రతలో స్వరాజ్ ప్రతిరూపాన్ని చూశారు. స్వరాజ్ కలను సాకారం చేసుకోవడానికి పారిశుద్ధ్యమనేది కూడా ఒక మార్గమని ఆయన భావించారు. బాపు ఆకాంక్షించిన పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి అంకితమైన ఆధునిక స్మారక చిహ్నం రాజ్ ఘాట్ తో అనుబంధం కలిగి వుండడం నాకు ఎంతగానో సంతోషమిస్తోంది.
స్నేహితులారా,
స్వచ్ఛాగ్రహం లేదా పరిశుభ్రతకు సంబంధించిన గాంధీజీ ఆలోచనల్ని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం కలిగి వుంది. అంతే కాదు అదే ఆలోచనకు అంకితమైన భారతీయుల దృఢమైన సంకల్పాన్ని ఒకే ప్రదేశంలో చూడవచ్చు. కాసేపటి క్రితం ఈ కేంద్రం లోపల నేను వున్నప్పుడు, కోట్లాది మంది భారతీయుల కృషిని చూస్తున్నప్పుడు వారికి సలాం చేసినట్టుగా నేను భావించాను. ఆరు సంవత్సరాల క్రితం ఎర్రకోట వేదికగా మొదలైన ప్రయాణం తాలూకా జ్ఞాపకాలు ఒక్కసారిగా నా కనుల ముందు మెరిశాయి.
దేశంలోని కోట్లాది మంది స్నేహితులు ప్రతి హద్దును పగలగొట్టారు. ప్రతి అవరోధాన్ని దాటేశారు. అందరూ కలిసి స్వచ్ఛ భారత్ అభియాన్ ను స్వంతం చేసుకున్నారు. అందరి స్ఫూర్తి ఈ కేంద్రం రూపంలో చూడవచ్చు. సత్యాగ్రహం స్ఫూర్తితో మొదలైన స్వచ్ఛాగ్రహ ప్రయాణాన్ని ఆధునిక సాంకేతికత ద్వారా ఈ కేంద్రంలో ప్రతిష్టించడం జరిగింది. ఇక్కడకు వచ్చిన పిల్లల్ని ఇక్కడ వున్న స్వచ్ఛతా రోబో బాగా ఆకర్షించిన విషయాన్ని నేను గమనించాను. ఈ రోబో పిల్లలతో ఒక స్నేహితునిలా మాట్లాడుతోంది. ఇప్పుడు దేశంలోని, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అదే బంధాన్ని పొందుతాడు. ఆ పనిని పారిశుద్ధ్య సాధనకు సంబంధించిన ఆదర్శాలతో చేస్తాడు. నూతన స్ఫూర్తిని నింపుతూ భారతదేశానికి సరికొత్త రూపాన్ని తీసుకువస్తాడు.
స్నేహితులారా,
నేటి ప్రపంచానికి గాంధీజీని మించిన గొప్ప స్ఫూర్తి మరొకటి వుండదు. గాంధీజీ విలువలను, తాత్వికతను అనుసరించడానికిగాను మొత్తం ప్రపంచమంతా ముందుకొస్తోంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం. అవి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగాయి. పలు దేశాలనుంచి వచ్చిన గాయకులు గాంధీజీకి ఇష్టమైన పాట వైష్ణవ జన తో తెనే కహియేను పాడారు. ఈ గాయకులందరూ భారతీయ భాషలోని ఈ పాటను ఎంతో అందంగా, మధురంగా ఆలపించి ఒక రికార్డును సృషించారు. గాంధీజీ బోధనల్ని, ఆశయాల్ని ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో స్మరించుకోవడం జరిగింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొత్తం ప్రపంచాన్ని ఏకం చేసిన శక్తిగా గాంధీజీ కనిపించారు.
స్నేహితులారా,
గాంధీజీకి వున్న ప్రజాదరణ, ఆయన్ను ఆదర్శంగా తీసుకునే తత్వం అనేది స్థల కాలాలకు అతీతమైనది. దీనికిగల కారణాల్లో ఒకటి... సులువైన పద్ధతులద్వారా కనీ వినీ ఎరగని మార్పులను తీసుకురాగలిగే గాంధీజీ సామర్థ్యం. ఎంతో శక్తివంతమైన పాలకులతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికిగాను పరిశుభ్రత అనేది కూడా ఒక మార్గమని ఈ ప్రపంచంలో ఎవరైనా ఆలోచించగలరా? ఈ విధానంలో గాంధీజీ ఆలోచించడమే కాదు ఈ ఆలోచనను స్వాతంత్ర్య స్ఫూర్తితో కలిపారు. దాన్ని ఒక ఉద్యమంలాగా చేశారు.
స్నేహితులారా,
ధైర్యవంతులు, పరిశుభ్రతను పాటించి గౌరవించేవారు మాత్రమే స్వరాజ్యాన్ని సాధించగలరని గాంధీజీ అనేవారు. పరిశుభ్రతకు, స్వరాజ్యానికి మధ్యన సంబంధముందనే విషయాన్ని గాంధీజీ నమ్మారు. దేశంలో ప్రబలే అపరిశుభ్ర వాతావరణం మొదటగా హాని కలిగించేది పేదలకే అని ఆయన నమ్మారు. అపరిశుభ్రమైన వాతావరణం అనేది పేదల శక్తిని నిర్వీర్యం చేస్తుంది, భౌతికంగా, మానసికంగా వారిని బలహీనులను చేస్తుంది. దేశంలో అపరిశుభ్ర వాతావరణం వున్నంతకాలం భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోలేరని గాంధీజీకి తెలుసు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలగనంతకాలం, వారు స్వాతంత్ర్యంకోసం ఎలా పోరాటం చేయగలరు? అందుకే ఆయన దక్షిణాఫ్రికానుంచి చంపారన్, సబర్మతి ఆశ్రమం వరకూ పారిశుద్ధ్య సాధన అనేదాన్ని...స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన అంశంగా చేశారు.
స్నేహితులారా,
గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తిద్వారా దేశవ్యాప్తంగా వున్న లక్షలాది మంది స్వచ్ఛా గ్రాహీలు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ను తమ జీవితంలో ఒక ఉద్యమంలా చేసుకున్నారు. ఈ కారణంగానే 60 నెలల్లో దాదాపుగా 60 కోట్ల మంది భారతీయులు మరుగుదొడ్లు నిర్మించుకొని ఆత్మవిశ్వాసాన్ని పొందారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా నా సోదరీమణులు తగిన గౌరవ మర్యాదల్ని, భద్రతను పొందుతున్నారు. కోట్లాది మంది భారతీయ ఆడబిడ్డలు ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోగలుగుతున్నారు. లక్షలాది మంది చిన్నారులు వ్యాధులను నిరోధించగలుగుతున్నారు. అన్నిటికీ మించి దేశవ్యాప్తంగా వున్న కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు, గిరిజనులు తాము సమానత్వం కలిగిన సమాజంలో జీవిస్తున్నామనే విశ్వాసం పొందారు.
స్నేహితులారా,
దేశంలోని ప్రతి పౌరునిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది స్వచ్ఛ భారత్ అభియాన్. దీనియొక్క ఉన్నతమైన ఫలితాలను దేశంలోని పేద ప్రజల జీవితాల్లో చూడవచ్చు. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మన సామాజిక స్పృహలో శాశ్వతమైన మార్పును తెచ్చింది. ఒక సమాజంగా చూసినప్పుడు మన ప్రవర్తనలో మార్పు తెచ్చింది. మనం మన చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడాన్ని మానేయాలి, కుండీల్లోనే చెత్తను పారేయాలి..ఇలాంటి సూచనల్నిచాలా సులువుగా, చాలా వేగంగా సామాన్య భారతీయులకు చేరవేయగలిగాము. ఎక్కడైనా మురికిని చూసిన తర్వాత కూడా అందులోనే సౌఖ్యంగా వుండగలిగే స్వభావాన్నించి ప్రజలు బైటపడుతున్నారు. ఇంట్లో గానీ, రోడ్ల మీదగానీ ఎవరైనా చెత్తను పారేస్తే వారికి చీవాట్లు పడుతున్నాయి. ఈ పనిని సరైన పద్ధతిలో ఎవరు చేస్తున్నారు? మన పిల్లలు, టీనేజీ కుర్రాళ్లు, యువత.
స్నేహితులారా,
కరోనా వైరస్ తో పోరాటంలో భాగంగా దేశంలోని చిన్నారుల్లో వ్యక్తిగతమైన, సామాజికమైన పారిశుద్ధ్యంపై పెరిగిన స్పృహ ద్వారా మనం భవిష్యత్తులో చాలా ప్రయోజనాన్ని పొందబోతున్నాం. 2014కు ముందు కరోనాలాంటి మహమ్మారి వచ్చి వుంటే ఏం జరిగి వుండేదో ఒకసారి ఆలోచించండి. మరుగుదొడ్లు లేని ఆ సమయంలో కరోనా మహమ్మారి వైరస్ విస్తరణను ఆపగలిగేవాళ్లమా? దేశంలోని 60 శాతం జనాభా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్న ఆ రోజుల్లో లాక్ డౌన్ ఏర్పాట్లు సాధ్యమయ్యేవేనా? కరోనాపై పోరాటానికి స్వచ్ఛాగ్రహ ఉద్యమం భారీ మద్దతును ఇచ్చింది.
స్నేహితులారా,
పరిశుభ్రతా ఉద్యమం అనేది ఒక ప్రయాణంలాంటిది. ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన సమస్య తొలగిపోయిన తర్వాత ఇప్పుడు బాధ్యత మరింత పెరిగింది. బహిరంగ మలవిసర్జన లేకుండా చేసిన తర్వాత ఇప్పుడు మన ముందున్న మరో లక్ష్యం వ్యర్థాల నిర్వహణను మెరుగ్గా చేయడం. నగరాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు అన్ని చోట్లా ఈ పని చేయాలి. వ్యర్థాలనుంచి సంపదను సృష్టించే పనిని వేగవంతం చేయాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంకంటే సరైన రోజు మరొకటి వుంటుందా?
స్నేహితులారా,
ఈ దేశాన్ని బలహీనం చేస్తున్న దుష్టశక్తులను దేశాన్నించి తరిమి కొట్టడంకంటే గొప్ప పని ఏముంటుంది? ఈ ఆలోచనతో గత ఆరు సంవత్సరాలుగా దేశంలో సమగ్రమైన క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగుతోంది. పేదరికమా క్విట్ ఇండియా. బహిరంగ మల విసర్జనకు దారి తీసే పరిస్థితులూ... క్విట్ ఇండియా. నీటికోసం దూర ప్రాంతాలకు నడక..క్విట్ ఇండియా. ఒకసారి మాత్రమేఉపయోగించే ప్లాస్టిక్ ...క్విట్ ఇండియా. వివక్ష చూపే దుష్ట ధోరణి... క్విట్ ఇండియా. అవినీతి...క్విట్ ఇండియా. ఉగ్రవాదం, హింస- క్విట్ ఇండియా.
స్నేహితులారా,
స్వరాజ్య స్ఫూర్తితో ఈ క్విట్ ఇండియా నిర్ణయాలను తీసుకోవడం జరుగుతోంది. చెత్తను రోడ్లమీద పారేసే అలవాటును వదిలేయాలనే నిర్ణయాన్ని అదే స్ఫూర్తితో మరో సారి తీసుకుందాం. రండి కదలిరండి ఈ రోజునుంచి ఆగస్టు 15వరకూ అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు వరకూ ఒక వారం రోజులపాటు దేశవ్యాప్తంగా దీనిపై ఉద్యమం కొనసాగిద్దాం. స్వరాజ్యం మీద గౌరవంతో ఈ వారాన్ని మురికి, చెత్త క్విట్ ఇండియా వారంగా నిర్వహించుకుందాం. ప్రతి జిల్లాలోని సంబంధిత అధికారులందరికీ నా విజ్ఞప్తి...మీరు వారంపాటు ఈ ఉద్యమాన్ని చేపట్టి మీ జిల్లాలోని గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించండి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి నివసిస్తున్నవారు వున్న ప్రాంతాల్లో మొదటగా ఈ పనికి ప్రాధాన్యత ఇవ్వండి. అదే విధంగా చెత్తనుంచి, ఆవు పేడనుంచి కంపోస్టు ఎరువు తయారు చేయడం, మురుగు నీటిని శుద్ధి చేయడం, ఒకసారి ఉపయోగించగలిగే ప్లాస్టిక్ ను నిషేధించడం, ఇలా ఈ మార్గంలో మనం కలిసికట్టుగా ముందడుగు వేయాలి.
స్నేహితులారా,
గంగానది పరిశుభ్రతా కార్యక్రమంనుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలను పొందుతున్నట్టే అదే విధంగా దేశంలోని ఇతర నదులను కూడా కాలుష్య పదార్థాలనుంచి విముక్తి కలిగేలా చేయాలి. యమునా నది మనకు దగ్గరలోనే వుంది. యమునా నదిని మురికినీటి బారిన పడకుండా చూడడానికిగాను మొదలుపెట్టిన ఉద్యమాన్ని వేగవంతం చేయాలి. ఇందుకోసం యుమునా నది చుట్టుపక్కల గల గ్రామాల్లో నివసిస్తున్నవారు, యమున చుట్టూ గల ప్రతి నగరం చాలా ముఖ్యం. ఈ ఉద్యమం చేస్తున్నప్పుడు భౌతిక దూరం చాలా ముఖ్యం. మాస్కు ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని మరిచిపోవద్దు. కరోనా వైరస్ మన నోటినుంచి, ముక్కునుంచి విస్తరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కు ధరించాలనే నియమం, భౌతిక దూరం పాటించడం, రోడ్లపైన ఉమ్మకుండా వుండడం తప్పనిసరి. మనల్ని మనం భద్రంగా కాపాడుకుంటూనే ఈ భారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి. ఈ నమ్మకంతో ....రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మరోసారి మీకు అభినందనలు.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ...
****
(Release ID: 1648407)
Visitor Counter : 268
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam