ప్రధాన మంత్రి కార్యాలయం
750 మెగా వాట్ సామర్థ్యం కలిగిన రీవా సోలర్ పావర్ ప్రాజెక్టు ను దేశ ప్రజల కు అంకితం చేసిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
10 JUL 2020 12:22PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు,
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రజాదరణగల నేత శ్రీ శివరాజ్ సింహ్ గారు,
నా మంత్రివర్గ సహచరులు శ్రీ ఆర్. కె. సింహ్ గారు, శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ గారు, శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ గారు, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ గారు, మధ్య ప్రదేశ్ మంత్రిమండలి లోని సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు,
రీవా తో పాటు మధ్య ప్రదేశ్ లోని నా సోదరులు మరియు మధ్య ప్రదేశ్ లోని నా సోదరీమణులారా,
ఈ రోజున రీవా నిజంగానే చరిత్ర ను సృష్టించింది. రీవా అంటే మనకు నర్మద నది, శ్వేత వ్యాఘ్రాలు గుర్తు కు వస్తాయి. అయితే ఇక నుండి రీవా అనగానే ఆసియాలోకెల్లా అతి పెద్ద సోలర్ పావర్ ప్రాజెక్టు కు నిలయమైనటువంటి ప్రాంతం గా ఇది గుర్తింపు ను పొందనున్నది. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన ఏరియల్ వీడియో ను చూస్తే వేలాది సౌర ఫలకాలు పొలాల్లో పంట మొక్కల వలె కనుపిస్తున్నాయి. అంతే కాదు, నీలి రంగు లోని సముద్రాన్ని చూసినట్టుగా కూడాను అనిపిస్తుంది. ఈ విజయాన్ని సాధించినందుకు గాను ప్రత్యేకంగా రీవా ప్రజల కు, ఆ తరువాత మధ్య ప్రదేశ్ ప్రజల కు నా అభినందనల ను తెలియజేస్తున్నాను.
రీవాలో నెలకొల్పిన ఈ సౌర విద్యుత్తు పరియోజన కారణం గా ఈ దశాబ్దం లోనే ఈ యావత్తు ప్రాంతం ఒక ప్రధానమైన విద్యుత్తు కేంద్రం గా అవతరిస్తుంది. ఈ పరియోజన ద్వారా మధ్య ప్రదేశ్ ప్రజల కు మరియు పరిశ్రమల కు విద్యుత్తు లభిస్తుంది. అంతే కాదు, దిల్లీ లో మెట్రో రైల్ కూడా ను దీని ద్వారా లబ్ధి ని పొందుతుంది. రీవా తో పాటు ఇటువంటి పరియోజనల ను శాజాపుర్, నీమచ్, ఛతర్ పుర్ ల లో నెలకొల్పుతున్నాము. ఓంకారేశ్వర్ రిజర్వాయర్ లో తేలియాడే సౌర విద్యుత్తు ప్లాంటు ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికల ను రూపొందిస్తున్నాము. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి కాగానే మధ్య ప్రదేశ్ రాష్ట్రాని కి విద్యుత్తు అతి తక్కువ ధర లో లభిస్తుంది; అదీ పర్యావరణహితకరమైనటువంటి విద్యుత్తు. ఫలితం గా మధ్య ప్రదేశ్ లోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు మరియు ఆదివాసీలు అధిక లబ్ధి ని పొందుతారు.
మిత్రులారా, సూర్యారాధన కు మన సంస్కృతి లో, సంప్రదాయాల లో మరియు మన నిత్య జీవితం లో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. పునాతు మాఁ తత్స వితుర్ వరేణ్యమ్.. ఈ మాటల కు- సూర్య దేవుడు మనలను స్వచ్ఛీకరించును గాక- అని భావం. అదే శుద్ధ భావన ను ప్రస్తుతం రీవా లో ప్రతి చోటులోనూ అనుభూతి చెందవచ్చును. ఈ రోజు న యావత్తు దేశం సూర్య దేవుని శక్తి ని అనుభూతి చెందుతున్నది. ఆయన యొక్క ఆశీర్వాదాల వల్ల మనం ప్రపంచం లో సౌర విద్యుత్తు పరం గా ఐదు అగ్రగామి దేశాల సరసన నిలువగలిగాము.
మిత్రులారా,
ఒక్క ఈ రోజు అనే కాదు ఈ 21 వ శతాబ్దం లోనే శక్తి తాలూకు ఒక ప్రధానమైనటువంటి వనరు గా సౌర శక్తి నిలువబోతున్నది. దీనికి కారణం, సౌర శక్తి అనేది ఖాయమైన, శుద్ధమైనదీ, ఇంకా భద్రమైనది కూడాను. ఖాయమైంది ఎుందుకంటే శక్తి యొక్క, ఇంకా విద్యుత్తు యొక్క ఇతర వనరులు వ్యయమయిపోతాయి, కానీ సూర్యుడు మాత్రం ఎప్పటికీ ప్రపంచం అంతటా ప్రకాశిస్తూ ఉంటారు. నిర్మలమైంది ఎందుకంటే, ఇది పర్యావరణాన్ని కలుషితం చేసేందుకు బదులు పర్యావరణాన్ని రక్షించగలుగుతుంది. భద్రమైంది ఎందుకంటే ఇది స్వయంసమృద్ధి కి ఒక గొప్ప సంకేతం, అలాగే ఒక ప్రేరణ కూడాను. ఇది మన యొక్క శక్తి అవసరాల ను తీర్చుతుంది. అభివృద్ధి పథం లో నూతన శిఖరాలను అందుకోవడానికి భారతదేశం ప్రస్థానం చేస్తున్నది. మన ఆశ లు మరియు మన ఆకాంక్ష లు పెరుగుతున్నాయి. అదే కాలం లో మన శక్తి మరియు విద్యుత్తు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో విద్యుత్తు రంగం లో స్వయంసమృద్ధి అనేది ఒక స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశం ఆవిష్కరణ లో చాలా ముఖ్యమైనటువంటిది అవుతుంది. ఈ విషయం లో సౌర శక్తి ఒక చాలా మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను పోషించబోతున్నది; మరి మనం భారతదేశం యొక్క ఈ బలాన్ని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తున్నాము.
మిత్రులారా,
స్వయంసమృద్ధి, అభివృద్ధి అనే అంశాల ను గురించి మాట్లాడేటప్పుడు ఆర్ధిక రంగం అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తం గా, చాలా ఏళ్లు గా విధాన నిర్ణేతలు ఒక సంశయం లో ఉన్నారు. ఆర్ధిక రంగాని కి ప్రాధాన్యం ఇవ్వాలా, పర్యావరణాని కి ప్రాధాన్యం ఇవ్వాలా అనేది ఈ సంశయం. ఈ నేపథ్యం లో చూసినప్పుడు, కొన్ని సార్లు పర్యావరణాని కి అనుగుణం గా నిర్ణయాల ను తీసుకొంటున్నాము. మరికొన్ని సార్లు ఆర్ధిక రంగాని కి అనుగుణం గా నిర్ణయాలను తీసుకొంటున్నాము. అయితే ఈ రెండు పరస్పరం శత్రువు లు కాదని, మిత్రులు అని భారతదేశం ప్రపంచానికి చెబుతోంది. దేశం లో చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కావొచ్చు లేదా ప్రతి కుటుంబానికి ఎల్ పి జి లేదా పిఎన్ జి వంటి స్వచ్ఛమైన ఇంధనం అందించే ఉద్యమం కావొచ్చు, లేదా దేశవ్యాప్తం గా సిఎన్ జి ఆధారిత వాహన వ్యవస్థల ను నిర్మించడం గానీ లేదా విద్యుత్తు ఆధారిత రవాణా కోసం చర్య లు తీసుకోవడం కావొచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ దేశం లోని సాధారణ ప్రజల జీవితాల ను మెరుగుపరచడానికి, పర్యావరణ హితమైన జీవితాల ను అందించడానికి చేపట్టినవే. భారతదేశాని కి ఆర్ధిక రంగం కావొచ్చు, పర్యావరణ రంగం కావొచ్చు .. ఈ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు. ఇవి రెండూ ఒకదానికి మరొకటి సహకరించుకునేవే.
మిత్రులారా,
ఇప్పుడు దేశవ్యాప్తం గా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు, కార్యక్రమాల కు సంబంధించి పర్యావరణ సంరక్షణ కు, నాణ్యమైన జీవనాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. మా దృష్టి లో పర్యావరణం అనేది కొన్ని పరియోజనల కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది మన జీవన విధానం. పున: వినియోగ శక్తి కి సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టుల ను ప్రారంభించే కాలం లో జీవితం లోని ప్రతి అంశం లో స్వచ్ఛమైన శక్తి ని అందించాలనే సంకల్పం ఉండేటట్టు జాగ్రత్తల ను తీసుకొంటున్నాము. ఈ పున: వినియోగ శక్తి వనరుల ప్రయోజనాలు దేశం లోని అన్ని ప్రాంతాల కు చేరాలని, సమాజం లోని ప్రతి వర్గం, దేశం లోని ప్రతి పౌరుడు/పౌరురాలు లబ్ధి ని పొందేలా మనం చర్యలు తీసుకొంటున్నాము. దీనికి సంబంధించి న ఒక ఉదాహరణ ను చెబుతాను.
మిత్రులారా,
గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తం గా 36 కోట్ల ఎల్ఇడి బల్బుల ను పంపిణీ చేయడం జరిగింది. దేశవ్యాప్తం గా 1 కోటి కి పైగా ఎల్ఇడి వీధి దీపాల ను ఏర్పాటు చేయడమైంది. ఇది చిన్న పని గానే కనిపించవచ్చు. ఎందుకంటే ఒక సారి సదుపాయం లభిస్తే సాధారణం గా మనం దాని ప్రభావాన్ని గురించి పెద్ద గా మాట్లాడుకోము. మనకు ఆ సదుపాయం లేని సమయం లోనే ఇటువంటి చర్చ కు ఆస్కారం ఏర్పుడుతుంటుంది.
మిత్రులారా,
ఈ చిన్నదైన ఎల్ఇడి బల్బు లేని సమయం లో దాని అవసరాన్ని గురించి మనం ఆలోచించాము. అయితే ఆ సమయం లో దాని ధర అధికంగా ఉండేది. అమ్మకాలు పెద్దగా లేవు కాబట్టి వాటి తయారీ కూడా అంతంతమాత్రమే. అయితే ఈ ఆరేళ్ల లో వచ్చిన మార్పు ఏమిటి? ఎల్ఇడి బల్బు ల ధర లు దాదాపు పదింతలు పడిపోయాయి. అంతే కాదు మార్కెట్లోకి అనేక ఎల్ఇడి బల్బు తయారీ కంపెనీలు ప్రవేశించాయి. 100 నుండి 200 వాట్ బల్బు ల ద్వారా సాధించే వెలుగు ను ఇప్పుడు కేవలం 9-10 వాట్ బల్బు ల ద్వారా పొందుతున్నాము. ఇళ్లలో, వీధులలో ఎల్ఇడి బల్బుల ను ఏర్పాటు చేసినందువల్ల
దేశ వ్యాప్తం గా ప్రతి సంవత్సరం లో సుమారు 600 బిలియన్ యూనిట్ ల విద్యుత్తు ఆదా అవుతోంది. అంతే కాదు మనం మెరుగైన వెలుగు ను పొందగలుగుతున్నాము. దేశ ప్రజలు ప్రతి ఏడాది విద్యుత్తు బిల్లు ల రూపం లో దాదాపు 24 వేల కోట్ల రూపాయల ను ఆదా చేస్తున్నారు. అంటే ఎల్ఇడి బల్బుల కారణం గా విద్యుత్తు బిల్లు తగ్గిపోయింది. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను. ఎల్ఇడి బల్బు ల వాడకం వల్ల 4.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణం లో కలవకుండా ఆగిపోయింది. అంటే వీటి కారణం గా కాలుష్యం తగ్గిపోయిందన్నమాట.
మిత్రులారా,
విద్యుత్తు అనేది అందరికీ అందుబాటులోకి రావాలనే సంకల్పానికి అనుగుణం గా మేము కృషి చేస్తున్నాము. మనకు కావలసినంత విద్యుత్తు ఉంది. అంతే కాదు మన పర్యావరణం, గాలి, నీరు స్వచ్ఛం గా ఉంటాయి. ఈ ఆలోచన... సౌర శక్తి కి సంబంధించిన విధానం, వ్యూహం లో కూడా ప్రతిఫలించింది. ఒక సారి ఊహించండి.. 2014 వ సంవత్సరం లో మన దేశం లో సౌర విద్యుత్తు ధర యూనిట్ ఒక్కింటికి 7- 8 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం, ఇదే ధర ఒక్కొక్క యూనిట్ కు రూ. 2.25- రూ.2.50 కి తగ్గిపోయింది. దీనివల్ల నవ పారిశ్రామికులు కూడా భారీ గా లబ్ధి ని పొందుతున్నారు. తద్ద్వారా వారు దేశ ప్రజల కోసం ఉపాధి అవకాశాల ను పెంచుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తం గా ప్రజలు.. మన దేశం లో తక్కువ ధర కు లభిస్తున్న సౌర విద్యుత్తు ను గురించి మాట్లాడుకుంటున్నారు. మన దేశం లో సౌర విద్యుత్తు కోసం చేసిన పని గురించి రానున్న రోజుల లో మరింత విస్తృతం గా మాట్లాడుకుంటారు. ఇటువంటి ముఖ్యమైన పనుల కారణం గా స్వచ్ఛమైన శక్తి వనరుల విషయం లో భారతదేశం ఆకర్షణీయమైన విపణి గా అవతరించింది. ఇప్పుడు ప్రపంచం లో ఎక్కడైనా పున: వినియోగ శక్తి వనరుల వినియోగం వైపు మరలడానికి ఎటువంటి కృషి జరిగినా సరే, అక్కడి వారు భారతదేశాన్ని మార్గదర్శక దేశం గా తీసుకొని అడుగులు వేస్తున్నారు.
మిత్రులారా,
ప్రపంచం భారతదేశం పైన పెట్టుకొన్న ఆశల కు అనుగుణం గానే ఈ విషయం లో ప్రపంచాన్ని అనుసంధానం చేయడానికి గాను మన దేశం కృషి చేస్తోంది. ఈ ఆలోచన కు అనుగుణంగానే అంతర్జాతీయ సౌర వేదిక (ఐఎస్ఎ) ను నెలకొల్పడం జరిగింది. ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే నినాదం వెనక ఉన్న స్ఫూర్తి ఇదే. సౌర విద్యుత్తు ఉత్పత్తి , వినియోగం నాణ్యం గా ఉండేటట్టు చూడడం కోసం మొత్తం ప్రపంచాన్ని ఒకే తాటి పైకి తెస్తున్నాము. తద్వారా విద్యుత్తు విషయం లో ప్రపంచం తన ముందు ఉన్న సంక్షోభాన్ని సమర్థవంతం గా ఎదుర్కోగలుగుతుంది. ఈ విషయం లో చిన్న దేశాల, పేద దేశాల అవసరాల ను కూడా తీర్చగలుగుతాము.
మిత్రులారా,
ఒక రకం గా చెప్పాలంటే సౌర విద్యుత్తు అనేది దాని వినియోగదారులనే ఉత్పత్తిదారులు గా మార్చింది. వారికి పవర్ బటన్ మీద పూర్తి గా నియంత్రణ ను తీసుకొని వచ్చింది. ఇతర విద్యుత్తు ల విషయాన్ని పరిశీలిస్తే, వాటి లో పౌరుల భాగస్వామ్యం ఏమాత్రం ఉండదు. అయితే సౌర విద్యుత్తు ను తీసుకుంటే పౌరుల భాగస్వామ్యం విపరీతం గా పెరిగింది. ఇంటి మిద్దె ల మీదా, కార్యాలయాలు, కార్ఖానా ల మీదా ఎక్కడ స్థలముంటే అక్కడ ప్రజలు తమకు కావలసిన విద్యుత్తు ను ఉత్పత్తి చేసుకోగలరు. ఇందుకోసం వారికి ప్రభుత్వం భారీ స్థాయి లో ప్రోత్సాహకాల ను ఇస్తూ వెన్ను తడుతోంది. విద్యుత్తు ఉత్పత్తి లో స్వయంసమృద్ధి ని సాధించడానికి మొదలైన ఉద్యమం లో మన రైతులు కూడా భాగస్వాములై విద్యుచ్ఛక్తి ని ఉత్పత్తి చేయవచ్చు.
మిత్రులారా,
మన రైతులు ఇప్పుడు చాలా సామర్థ్యాన్ని కలిగివున్నారు. వారు నైపుణ్యం గా పని చేస్తూ ఒకటి కాదు రెండు రకాల ప్లాంటుల తో దేశాని కి సేవ చేస్తున్నారు. మొదటి రకం ప్లాంట్ ( మొక్కలు) ద్వారా మనకు ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే మన రైతులు మరో రకం గా ప్లాంటుల ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి సౌర శక్తి ప్లాంటులు. తద్వారా వారి ఇళ్లకు విద్యుత్తు చేరుతోంది. మొదటి ప్లాంటు ద్వారా వారు సంప్రదాయ వ్యవసాయం చేస్తారు. ఇందుకోసం సారవంతమైన నేలల్లో ఈ పని చేస్తున్నారు. ఇక రెండో రకం ప్లాంటు కోసం వారు సారవంతం కాని నేలల ను ఉపయోగిస్తున్నారు. అంటే అక్కడ వ్యవసాయం చేయడం కష్టం. అంటే పంటల ను పండించలేని భూముల ను కూడా ఇప్పుడు ఉపయోగించుకోగలుగుతున్నాము. ఈ పని కూడా రైతుల ఆదాయాన్ని పెంచుతోంది.
పంటలు పండించడానికి వీలుగా లేని తమకున్న మిగులు భూమి లో రైతులు సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పడానికిగాను వారికి ప్రభుత్వం కుసుమ్ పథకం ద్వారా సాయం చేస్తోంది. ఈ ప్లాంటు ల ద్వారా వచ్చే విద్యుత్తు ను రైతులు వారి అవసరాలకు ఉపయోగించుకోగా మిగిలింది విక్రయించుకోవచ్చు. సౌర శక్తి ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందగలిగే ఈ భారీ ఉద్యమం లో మధ్య ప్రదేశ్ రైతు మిత్రులు కూడా భాగమవుతారని నాకు నమ్మకంగా వుంది. తద్ద్వారా వారు విద్యుత్తు ఎగుమతి లో భారతదేశం యొక్క కృషి ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాను. ఈ నమ్మకం నాకు అధికం గా ఎందుకు ఉంది అంటే మధ్య ప్రదేశ్ రైతు లు ఏదైనా తలుచుకుంటే చాలు దానిని సఫలీకృతం చేసే శక్తి కలిగిన వారు. మీరు చేస్తున్న పనే మీ గురించి మాట్లాడుతోంది. గోధుమల ఉత్పత్తి లో అందరి కంటే అధికంగా రికార్డు స్థాయి లో ఉత్పత్తి ని సాధించడం ప్రశంసనీయం. మీరు రికార్డు బద్దలు కొట్టి గోధుమ పంట ను ఉత్పత్తి చేస్తే..ఈ కరోనా మహమ్మారి కష్టకాలం లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ పంట ను రికార్డు స్థాయి లో సేకరించి రైతుల ను ఆదుకోవడం మరింత ప్రశంసనీయం. కాబట్టి విద్యుత్తు ఉత్పత్తి విషయంలో కూడా మన మధ్య ప్రదేశ్ రైతుల సామర్థ్యం పై నాకు పూర్తి స్థాయి లో నమ్మకం ఉంది. కుసుమ్ పథకం లో భాగం గా మధ్య ప్రదేశ్ రైతులు కూడా ఏదో ఒక రోజు న రికార్డు స్థాయి లో విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తారని భావిస్తున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా,
సౌర ఫలకాలు, బ్యాటరీ మరియు స్టోరేజీ సదుపాయాలు.. ఇవన్నీ నాణ్యం గా, మెరుగ్గా ఉంటేనే మన దేశం లో సౌర శక్తి యొక్క విద్యుత్తు సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకోగలుగుతాము. ఈ విషయం లో పనులు చాలా వేగం గా సాగుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగం గా వీటిని చేపట్టాము. సౌర ఫలకాలతో పాటు ఇతర పరికరాల కోసం విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ని తొలగించడానికి కృషి చేస్తున్నాము. దేశం లోని సోలర్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని చాలా వేగం గా పెంచాలని లక్ష్యం గా పెట్టుకొన్నాము. కాబట్టి దేశీయం గా తయారీ ని ప్రోత్సహించడానికి గాను పలు ముఖ్యమైన నిర్ణయాల ను తీసుకోవడం జరుగుతోంది. కుసుమ్ పథకం లో భాగం గా ఏర్పాటు చేసిన పంపుల లో ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్ తప్పనిసరి గా వాడాలని అలాగే ఇళ్ల డాబాల మీద ఏర్పాటు చేసిన సౌర ఫలకాల లోను వాటిని తప్పనిసరి గా వాడాలనే నిబంధన ను విధించాము. దీనికి తోడు దేశం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థ లు దేశం లోనే తయారైన సోలర్ సెల్స్ లేదా మాడ్యూల్స్ ను వాడాలనే నిబంధన ను కూడా పెట్టాము. అంతే కాదు పావర్ ప్లాంటులను ఏర్పాటు చేస్తున్న కంపెనీ... సోలర్ పివి తయారీ ని చేపట్టేలా ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ రంగాని కి సంబంధించిన యువత ను, పారిశ్రామికవేత్తల ను, స్టార్ట్- అప్స్ ను, ఎమ్ఎస్ఎమ్ఇల ను ఈ రోజు న నేను కోరుతున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా, స్వయంసమృద్ధి అనేది మనపైన మనకు విశ్వాసం ఉంటేనే సాధ్యమవుతుంది. దేశం లోని ప్రతి పౌరుని కి అన్ని వ్యవస్థ ల నుండి, మొత్తం దేశాన్నుండి మద్దతు లభిస్తేనే వారి లో వారి పై విశ్వాసం కలుగుతుంది. కరోనా సంక్షోభం కారణం గా ఏర్పడిన పరిస్థితుల నడుమ భారతదేశం ప్రస్తుతం ఇదే పని ని చేస్తున్నది. ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వం ప్రస్తుతం వనరులు మరియు ప్రభుత్వ
సమాజం లో అన్ని వర్గాల వారికి అవసరమయ్యే వనరుల ను అందిస్తోంది. వారిలో మనో ధైర్యాన్ని నింపుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు చేరుకోలేని వర్గాలను కూడా నేడు ప్రభుత్వం చేరుకుంటోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్నే తీసుకుందాం. లాక్ డౌన్ అనంతరం తీసుకున్న మొదటి నిర్ణయం ఏదంటే దేశం లోని 80 కోట్ల మంది పేద ప్రజల కు ఉచిత ఆహారధాన్యాల ను అందించడం అనేదే. వారికి కొంత డబ్బు ను కూడా అందించడమైంది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత రుతుపవనాలు వచ్చాయి. పండుగ ల కాలం కూడా మొదలవుతున్నది. ఈ పండుగ లు దీపావళి, ఛట్ పూజ ల వరకు ఉంటాయి. అన్ని వర్గాల కు, మతాల కు సంబంధించిన పలు పండుగ లు వస్తున్న కాలం ఇది.
అటువంటి పరిస్థితి లో పేదలు ఈ విధమైనటువంటి సాయాన్ని అందుకోవలసివున్నది. ఈ కారణం గా, ఈ పథకాన్ని కొనసాగించడమైంది. ప్రస్తుతం పేద కుటుంబాలు ఉచిత రేశను ను నవంబర్ వరకు పొందుతాయి. దీనికి తోడు, ప్రభుత్వం లక్షలాది ప్రైవేటు రంగ ఉద్యోగుల కు వారి ఇపిఎఫ్ అకౌంట్ ల కు పూర్తి గా కంట్రిబ్యూట్ చేస్తున్నది. అదే విధం గా, పిఎమ్- స్వనిధి పథకం ద్వారా వ్యవస్థ అందుబాటు లో లేని వారిని కలుపుకోవడం జరిగింది. ప్రస్తుతం, ఈ పథకం ద్వారా, లక్షలాది వీధి వ్యాపారులు, హాకర్ లు 10,000 రూపాయల వరకు తక్కువ వడ్డీ రుణాల ను అందుకోవడం మొదలుపెట్టారు. ఈ చిరు వ్యాపారులు మనకు చాలా ముఖ్యం. కానీ వారి శ్రేయస్సు కోసం గతం లో పెద్దగా ఆలోచించింది లేదు. కానీ ఇప్పుడు ఒక వైపు ఎమ్ఎస్ఎమ్ఇ లు, గ్రామీణ పరిశ్రమలు, భారీ పరిశ్రమల కోసం ఆలోచిస్తూనే మరో వైపు చిరు వ్యాపారుల సంక్షేమం పైన ప్రభుత్వం భారీ గా దృష్టి సారించింది.
మిత్రులారా,
ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ను అధిగమించాలంటే ప్రభుత్వానికైనా, సమాజానికైనా దయార్ద్ర హృదయం మరియు పర్యవేక్షణ అనేవి చాలా ముఖ్యమైన స్ఫూర్తిదాయక వనరులు. ఈ రోజు న మీరు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి గానీ, దేశానికి గానీ సాయం చేయడానికి మీ ఇళ్ల నుండి బయటకు వస్తుంటే నిత్యం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మార్గదర్శకాల ప్రకారం రెండు గజాల దూరాన్ని పాటించండి. ముఖాని కి మాస్కు ను ధరించండి. చేతుల ను సబ్బు తో 20 సెకన్ల పాటు శుభ్రపరుచుకోండి. ఈ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మరోమారు మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి ఇవే అభినందనలు.
జాగ్రత్త గా ఉండండి, భద్రం గా ఉండండి, ఆరోగ్యం గా ఉండండి
అనేకానేక ధన్యవాదములు.
***
(Release ID: 1642173)
Visitor Counter : 272
Read this release in:
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Tamil