PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 27 JUL 2020 6:51PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో మరణాల సగటు మెరుగుపడుతుండగా ఇవాళ్టికి 2.28 శాతంగా నమోదు.
  • కోవిడ్‌-19 వ్యాధి నయమైనవారి సంఖ్య 9 లక్షలకుపైగా నమోదు; వరుసగా నాలుగో రోజున 30,000 దాటిన కోలుకున్నవారి సంఖ్య.
  • ప్రస్తుత కేసుల (4,85,114)కన్నా కోలుకున్న కేసుల సంఖ్య 4,32,453 మేర అధికంగా నమోదు.
  • కోవిడ్‌ సమయంలో ఉనికిని ఘనంగా చాటుకున్న ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు.
  • బల్క్‌డ్రగ్స్‌, వైద్యపరికరాల దేశీయ తయారీ పార్కులకు ప్రోత్సాహం దిశగా నాలుగు పథకాలను ప్రారంభించిన శ్రీ డి.వి.సదానందగౌడ.
  • విద్యా సంవత్సర కార్యక్రమంలో కోవిడ్‌ సంబంధిత ఆటంకాలవల్ల అసహనానికి గురికావద్దని విద్యార్థులకు ఉప రాష్ట్రపతి పిలుపు.

దేశంలో మరణాల సగటు మెరుగుపడుతుండగా ఇవాళ్టికి 2.28 శాతంగా నమోదు; కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 9 లక్షలకుపైగానే; వరుసగా 4వ రోజు కోలుకున్నవారి సంఖ్య 30,000కుపైగా నమోదు

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాల శాతం స్థిరంగా తగ్గటంతోపాటు కోలుకున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ మేరకు మహమ్మారిపై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలు సమష్టిగా దృష్టి కేంద్రీకరించి అనేక చర్యలు తీసుకున్నాయి. తదనుగుణంగా కేసుల ముందస్తు గుర్తింపు, ఏకాంత చికిత్సకు తరలింపు, అధిక సంఖ్యలో పరీక్షల నిర్వహణ, ఆస్పత్రులకు చేరిన కేసుల సమర్థ వైద్య నిర్వహణ వంటివి ఇందుకు నిదర్శనం. సమగ్ర నియంత్రణ వ్యూహం, ముమ్మర పరీక్షలు, సంపూర్ణ ఆరోగ్య రక్షణ ప్రాతిపదికగల ప్రామాణిక వైద్య నిర్వహణ విధివిధానాలతో భారత్‌లో మరణాల శాతం గణనీయంగా పతనమైంది. ఆ మేరకు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్పంగా 2.28 శాతానికి దిగివచ్చింది. కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ఇవాళ వరుసగా నాలుగో రోజున 31,991గా నమోదైంది. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 9,17,567కు చేరింది. తద్వారా కోలుకునేవారి జాతీయ సగటు 64 శాతంగా నమోదైంది. మరణాల శాతం స్వల్పంగా ఉండటం, కోలుకునేవారి సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుత కేసులు, (4,85,114)కన్నా కోలుకున్న కేసుల మధ్య అంతరం 4,32,453 మేర అధికంగా నమోదైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641614

కోవిడ్‌ సమయంలో ఉనికిని ఘనంగా చాటుకున్న ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరులో భాగంగా భారత ప్రజారోగ్య వ్యవస్థలు మొక్కవోని సామర్థ్యాన్ని చాటుకున్నాయి. ప్రత్యేకించి దేశంలోని మారుమూల గ్రామాల్లోగల ఆయుష్మాన్‌ భారత్‌... ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు (AB-HWC) నిరంతరాయంగా పనిచేశాయి. తద్వారా కోవిడేతర అత్యవసర వైద్యసేవలను నిరాటంకంగా అందించాయి. అదే సమయంలో అత్యవసరమైన కోవిడ్‌-19 నిరోధం, కేసుల నిర్వహణ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాయి. దీంతోపాటు మహమ్మారి సమయంలో (2020 జనవరి నుంచి జూలైదాకా) అదనంగా 13,657 ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు నిర్వహించబడ్డాయి. తద్వారా తమ పరిధిలోని విస్తృత పౌరసమాజానికి ఆరోగ్య సంరక్షణ సేవలందించాయి. మొత్తంమీద 2020 జూలై 24నాటికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 43,022 ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు పనిచేశాయి. జూలై 18 నుంచి 24 మధ్య 44.26 లక్షలమంది ఆరోగ్య-శ్రేయో సేవల ప్రయోజనాలు పొందారు. ఇక ఈ కేంద్రాలు ప్రారంభమైన నాటి (2018 ఏప్రిల్‌ 14)నుంచీ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను సందర్శించిన ప్రజల సంఖ్య 1923.93 లక్షలకు చేరింది. ఇక దేశవ్యాప్తంగా గడచిన వారం 32,000 యోగాభ్యాస శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పటివరకూ మొత్తం 14.24 లక్షలకు చేరాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641512

బల్క్‌ డ్రగ్స్‌, వైద్యపరికరాల దేశీయ తయారీ పార్కులకు ప్రోత్సాహం దిశగా నాలుగు పథకాలను ప్రారంభించిన శ్రీ డి.వి.సదానందగౌడ

బల్క్‌ డ్రగ్స్‌, వైద్యపరికరాల దేశీయ తయారీకి ఉద్దేశించిన ప్రత్యేక పార్కులకు ప్రోత్సాహం దిశగా కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానందగౌడ తమ శాఖ పరిధిలోని ఔషధ విభాగం పరిధిలో ఇవాళ నాలుగు పథకాలను ప్రారంభించారు. భారతదేశం “ప్రపంచ ఔషధ నిలయం”గా తరచూ అభివర్ణించబడుతున్నదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కోవడ్‌-19 మహమ్మారి సమయంలో ఈ వాస్తవం మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు దేశంలో ఒకవైపు దిగ్బంధం అమలు చేస్తున్నప్పటికీ వివిధ దేశాల అవసరాల మేరకు ప్రాణరక్షక ఔషధాలను, వైద్య పరికరాలను ఎగుమతి చేసినట్లు గుర్తుచేశారు. ఈ వాస్తవం మాట ఎలా ఉన్నప్పటికీ, మన దేశం ఇప్పటికీ ప్రాథమిక ముడిపదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి రావడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకం మార్గదర్శకాల్లోని 41 ఉత్పత్తులకు సంబంధించి, 53 రకాల ముడిపదార్థాలను దేశంలోనే తయారుచేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం గరిష్ఠంగా 136 తయారీ సంస్థలను ఎంపికచేసి, వాటి దేశీయ విక్రయాలపై స్థిరమైన ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641517

బంగ్లాదేశ్‌కు 10 బ్రాడ్‌గేజి రైలింజన్లను అందజేసిన భారత రైల్వేశాఖ

ఈ అప్పగింత కార్యక్రమంలో భాగంగా 10 బ్రాడ్ గేజ్ రైలింజన్లను భారత విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా సంయుక్తంగా జెండా ఊపి బంగ్లాదేశ్‌కు సాగనంపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.జైశంకర్ మాట్లాడుతూ- రెండు దేశాల మధ్య పార్సెల్, కంటైనర్ రైళ్లు ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల రెండు దేశాల వ్యాపర రంగాలమధ్య కొత్త అవకాశాలకు బాటలుపడతాయి” అన్నారు. కాగా, 1965కు ముందునాటి అంగీకారం ప్రకారం... రెండు దేశాలమధ్య రైల్వే సంధానం పునరుద్ధరణకు భారత-బంగ్లాదేశ్ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని శ్రీ గోయల్ అన్నారు. తదనుగుణంగా ఆనాటికి నడుస్తున్న 7 సంధాన మార్గాల్లో 4 ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641503

విద్యా సంవత్సర కార్యక్రమంలో కోవిడ్‌ సంబంధిత ఆటంకాలవల్ల అసహనానికి గురికావద్దని విద్యార్థులకు ఉప రాష్ట్రపతి పిలుపు

వివిధ పత్రికా-ప్రసార, సామాజిక మాధ్యమాలను... అందునా ప్రస్తుత మాధ్యమాలను కలుషితం చేస్తున్న అవాస్తవ, వదంతులతో నిండిన సమాచారంతో విద్యార్థులు ప్రభావితం కాకుండా ఉండటం కోసం వారికి తగిన మార్గదర్శనం చేయాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్-2020లో భాగంగా దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన 200 మందికిపైగా యువకులనుద్దేశించి ప్రసంగించారు. సత్యాన్ని ధైర్యంగా అంగీకరించగలగడం, అవాస్తవాలను సవ్యంగా విశ్లేషించి తిరస్కరించడం అలవరచుకోవాలని వారికి సూచించారు. విద్యా సంవత్సర కార్యక్రమంలో కోవిడ్‌ మహమ్మరి సృష్టించిన ఆటంకాన్ని ప్రస్తావిస్తూ- ఇది చాలామంది విద్యార్థులలో ఆందోళనను, ఒత్తిడిని పెంచిందని పేర్కొన్నారు. అయితే, ఎవరి నియంత్రణలోనూ లేని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దీనిపై కలత చెందవద్దని హితవు పలికారు. "మీరంతా యువకులు... భావోద్వేగాలను నియంత్రించుకోగల బలమైన మనోధైర్యాన్ని, జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను తట్టుకోగల శక్తిసామర్థ్యాలను పెంపొందించుకోవాలి" అని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. శరీర దార్ఢ్యం, మానసిక సమతౌల్యం మెరుగుతోపాటు ఒత్తిడి-ఆందోళనలను అధిగమించే దిశగా క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయాలని సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641627

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 సంబంధిత సామగ్రి సరఫరాకు సంబంధించి సరఫరా గొలుసు సకాల  పర్యవేక్షణకోసం పంజాబ్ ప్రభుత్వం ‘ఎఫెక్టివ్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (eVIN)ను ఉపయోగిస్తోంది. అవసరమైన సామగ్రి కొరతను అధిగమించడం, సరఫరా-డిమాండ్ మధ్య సమతౌల్యం కొనసాగింపులో ఇది ప్రముఖపాత్ర పోషిస్తుంది.
  • హిమాచల్ ప్రదేశ్: అంతరాష్ట్ర సంచారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులలో పాక్షిక సవరణలు చేయబడ్డాయి. దీని ప్రకారం- రాష్ట్రంనుంచి ఇతర ప్రాంతాల్లో పోటీ/ఎంపిక పరీక్షలకు 72 గంటల్లోగా వెళ్లివచ్చే విద్యార్థులు/అభ్యర్థులతోపాటు వారివెంట ఉండే తల్లిదండ్రులకు నిర్బంధవైద్య పరిశీలన గడువునుంచి మినహాయింపు లభిస్తుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే  మంత్రిమండలిలో ఆరో మంత్రి- పర్యావరణశాఖను నిర్వహిస్తున్న సంజయ్‌ బాన్సోడ్‌ కోవిడ్‌ బారినపడ్డారు. ఇక బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నగరంలోని 10,000 మంది నివాసితులకు వర్తించేలా కోవిడ-19 రక్తరసి అధ్యయనం తొలిదశను పూర్తిచేసింది. ముంబై నివాసితులకు సంబంధించి జనాభాలో ప్రతిరోధకాల స్థాయిని అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. అటుపైన ఆగస్టులో మరో సర్వే నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.48 లక్షలు కాగా, దేశంలోనే ఏ జిల్లాలోనూ లేనంత అధికంగా పుణె జిల్లాలో 43,838 మంది యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక థానె 37,162, ముంబై 22,443 చొప్పున కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో ఆదివారం 1,110 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 55,822కు పెరిగింది. గడచిన 24 గంట్లో 753 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 40,365కు చేరింది. ఇక 21 మంది మరణంతో, రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,326కు చేరింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 448 కొత్త కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,878కి చేరగా, వీటిలో 10,124 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 26,123 మంది కోలుకోగా, మృతుల సంఖ్య 631గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 874 కొత్త కేసులతోపాటు 12 మరణాలు నమోదవగా 644 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో యాక్టివ్‌ కేసులు 7,857 కాగా, కొత్త కేసులలో భోపాల్ (205 కేసులు), ఇండోర్ (149 కేసులు) నగరాల్లో అత్యధికంగా నమోదయ్యాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో సవరించిన ప్రామాణిక విధాన ప్రక్రియల ప్రకారం... పెద్ద ప్రాజెక్టుల పనులు చేస్తున్న రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు గరిష్ఠంగా 50మంది కార్మికులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఇందుకోసం వారు ఆన్‌లైన్ ద్వారా అనుమతి పత్రం పొందాల్సి ఉంటుంది. అంతేగాక ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షకు రూ.500 చెల్లించాలి.
  • అసోం: జోర్హాట్ వైద్య కళాశాల ప్రాంగణంలో మరో వైరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ  (విఆర్‌డిఎల్) ఇవాళ్టినుంచి ప్రారంభమైంది. దీంతో అసోంలో ప్రస్తుతం 17 వీఆర్‌డీఎల్ ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ కోవిడ్‌ సామాజిక సంక్రమణ సంకేతాలు లేవని  మణిపూర్‌ కోవిడ్‌-19 ఉమ్మడి కంట్రోల్ రూమ్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, మణిపూర్‌లోని రిమ్స్ సిబ్బంది కోవిడ్-19 బారిన పడటంతో తక్షణం ఆస్పత్రిని మూసివేసి, ఈ నెల 29 వరకు రోగకారక నిర్మూలన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని కోహిమా జిల్లా మీమా గ్రామంలో కోవిడ్‌-19 పీడిత వ్యక్తి ఒకరు నివసిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆ సరిహద్దు ప్రాంతాలను మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
  • సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్‌-19 నిర్వహణ ప్రణాళికపై ఇవాళ సమ్మాన్‌ భవన్‌లో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్‌సింగ్‌ తమంగ్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి కార్యాచరణ బృందం సమావేశమై సమీక్షించింది.
  • కేరళ: రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ దిగ్బంధం ఆచరణ సాధ్యంకాదు కాబట్టిన ఆ దిశగా నిర్ణయం తీసుకోరాదని మంత్రిమండలి ప్రత్యేక సమావేశం ఇవాళ తీర్మానించింది. దీనికిబదులు వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు తనిఖీ, ఆంక్షలు కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇక ఆయా జిల్లాల్లో దుకాణాలను తెరవడంపై స్థానిక జిల్లా యంత్రాంగాలే నిర్ణయం తీసుకోవచ్చునని సూచించింది. కోళికోడ్‌లో ఒకే కుటుంబంలో మూడో వ్యక్తి ఇవాళ కోవిడ్‌ వ్యాధికి బలయ్యాడు. అలాగే ఎర్నాకుళం వైద్య కళాశాల ఆస్పత్రిలో మరో మరణం సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 61కి చేరింది. కోట్టయంలో ఒక కోవిడ్ మృతుని దహన సంస్కారాలను అడ్డుకున్న స్థానిక కౌన్సిలర్‌సహా 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో నిన్న 927 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 19,000స్థాయిని దాటాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 9,655 మంది చికిత్స పొందుతుండగా 1.56 లక్షలమంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక ఎమ్మెల్యేతోపాటు భద్రత సిబ్బందిలో ఒకరికి కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ కావడంతో శాసనసభ సముదాయం జూలై 27-28 తేదీలలో మూసివేయబడుతుందని ప్రకటించారు. ఇక తమిళనాడులోని మదురైలోగల ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో 29 మంది నర్సులు, వైద్యులకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. తమిళనాడులోని ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పొడిగించబడింది; ఈ మేరకు విద్యార్థులు తమ పేపర్లను ఆగస్టు 1, 10 తేదీల మధ్య అప్‌లోడ్ చేయవచ్చు. కాగా, కోవిడ్ కేసులలో చెన్నై వాటా తగ్గినప్పటికీ ఇతర జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో నిన్న 6986 కొత్త కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో చెన్నై నుంచి 1155 నమోదవగా ప్రస్తుతం మొత్తం కేసులు:2,13,723; యాక్టివ్‌ కేసులు: 53,703; మరణాలు: 3494; చెన్నైలో యాక్టివ్ కేసులు: 13,744గా ఉన్నాయి.
  • కర్ణాటక: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌-19 వివరాలను నివేదించడంపై స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం- కర్ణాటక నివేదికల నాణ్యత ఉత్తమంగా ఉన్నట్లు తేలింది. కాగా, రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆనంద్ సింగ్‌కు కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ఆదివారాలు కర్ఫ్యూ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కోరాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఐఐఎస్సీ బృందం రూపొందించిన తొలిబృందం సంచార ప్రయోగశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా,  వీటిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. కర్ణాటకలో ఆదివారం అత్యధికంగా 5,199 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 96,141కి పెరిగింది. ప్రస్తుతం 58,417 యాక్టివ్ కేసులుండగా ఆదివారం 2,088 మంది కోలుకోవడంతో డిశ్చార్జిల సంఖ్య 35,838కి పెరిగింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీచేసింది. ఆ మేరకు ఐసీఎంఆర్‌ ఆమోదిత ప్రయోగశాలలు మాత్రమే కరోనావైరస్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షకు రూ.750, వీఆర్‌డీఎల్ పరీక్షకు రూ.2,800 మించకుండా వసూలు చేయాలని ఆదేశించింది. ఇక సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సర ప్రవేశ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. కోవిడ్ మార్గదర్శకాల మేరకు ప్రవేశ ప్రక్రియ పూర్తికి తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 7627 కొత్త కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 96,298; యాక్టివ్‌ కేసులు: 48,956; మరణాలు: 1041; డిశ్చార్జి: 46,301గా ఉన్నాయి.
  • తెలంగాణ: కోవిడ్-19 సంక్షోభ పరిష్కారాన్వేషణ దిశగా హైదరాబాద్‌ నగరం తనదైన ముద్రవేస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ బారినపడినవారికి అత్యవసర చికిత్సలో వాడుతున్న ‘ఫావిపిరవిర్‌’ మందుకు జెనరిక్‌ రూపమైన “సిప్లెంజా”ను ప్రముఖ ఔషధ కంపెనీ సిప్లా తయారుచేస్తుండగా, దీన్ని త్వరలో హైదరాబాద్‌లో విడుదల చేసేదిశగా ఇక్కడి ‘ఆవ్రా లేబొరేటరీస్‌’ సంస్థ సన్నద్ధమవుతోంది. కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రులలో ఏకాంత చికిత్స సదుపాయాల కల్పించినందున వ్యాధిబారిన పడినవారు హైదరాబాద్ వెళ్లవద్దని జిల్లా యంత్రాంగాలు రోగులకు సూచిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఆదివారం 1473 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా, 774 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 506 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కాగా, నిన్నటిదాకా మొత్తం కేసులు: 55,532; యీక్టివ్‌ కేసులు: 12,955; మరణాలు 47గా ఉన్నాయి.

***



(Release ID: 1641663) Visitor Counter : 243