PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 19 JUL 2020 6:16PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 23,672; ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం 3 లక్షలకుపైగా నమోదు.
  • ప్రతి పది లక్షల జనాభాకు 10,000కు చేరువగా రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య.
  • భారతదేశంలో కోవిడ్‌ మరణాల సగటు తొలిసారి 2.5 శాతంకన్నా దిగువన నమోదు; 29 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటుకన్నా తక్కువ.
  • కోవిడ్‌-19కు ప్రతిస్పందనగా జి20 కార్యాచరణ ప్రణాళికపై భారత ఆర్థికశాఖ మంత్రి ప్రస్తావన; మహమ్మారి నుంచి బయటపడే వ్యూహాల ప్రభావాల పరిష్కారంలో అంతర్జాతీయ సమన్వయం ఆవశక్యతపై ఉద్ఘాటన.
  • కోవిడ్‌-19పై పోరాటంలో ప్రజలతో పత్రికా-ప్రసార మాధ్యమాల భాగస్వామ్యంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 23,672; ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం 3 లక్షలకుపైగా నమోదు; 10 లక్షల జనాభాకు 10వేలకు చేరువగా పరీక్షల సంఖ్య

దేశ‌వ్యాప్తంగా కోవిడ్-19 నుంచి కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతుండగా గత 24 గంటల్లో 23,672 మందికి వ్యాధి నయమైంది. దీంతో చికిత్స పొందేవారి సంఖ్యతో పోలిస్తే కోలుకునేవారి సంఖ్య 3,04,043 అధికంగా నమోదైంది. ఇక ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 6,77,422గా ఉంది. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు 62.86 శాతంగా నమోదైంది. మరోవైపు ఆస్పత్రులలో చికిత్స పొందే తీవ్ర పీడిత రోగులుసహా వైద్య పర్యవేక్షణలో ఏకాంత గృహవాసం సూచించబడిన 3,73,379 మందికి పూర్తి శ్రద్ధతో వైద్యసేవలు అందుతున్నాయి. ఇక గడచిన 24 గంటల్లో 3,58,127 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకూ పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,37,91,869కి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య ఇప్పుడు 9994.1కి పెరిగింది. పరీక్షల నిర్వహణ కోసం ప్రయోగశాలల సంఖ్య నిరంతరం పెరుగుతుండగా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 889, ప్రైవేటు రంగంలో 373 వంతున మొత్తం 1,262 అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639800

భారతదేశంలో కోవిడ్‌ మరణాల సగటు తొలిసారి 2.5 శాతంకన్నా దిగువన నమోదు; 29 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటుకన్నా తక్కువ

కోవిడ్‌-19వ‌ల్ల‌ ఆస్ప‌త్రికి చేరిన కేసుల సమర్థ వైద్య‌ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర/‌కేంద్రపాలిత‌‌ ప్రభుత్వాల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ కార‌ణంగా ప్రపంచస్థాయిలో పోలిస్తే భారతదేశంలో మరణాలు అత్యంత తక్కువగా నమోదవుతున్నాయి. ఆ మేరకు మరణాల సగటు గణనీయంగా తగ్గుతూ ప్రస్తుతం 2.49 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మ‌ర‌ణాలు జాతీయ స‌గ‌టుక‌న్నా త‌క్కువ‌ నమోదవగా, 5 రాష్ట్రాల్లో సున్నాగానూ, 14 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో 1 శాతంక‌న్నా త‌క్కువ‌గానూ న‌మోదైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639769

జి20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల మూడో సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌

జి20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు 2020 ఏప్రిల్ 15న సమావేశమైన సందర్భంగా కోవిడ్-19పై ప్రతిస్పందన దిశగా కూటమి ఆమోదిత కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రస్తావించారు. మహమ్మారిపై జి-20 కూటమి పోరు దిశగా ఆరోగ్య, ఆర్థిక ప్రతిస్పందనలతోపాటు బలమైన-సుస్థిర అంతర్జాతీయ ఆర్థిక సమన్వయం తదితర కీలకాంశాల్లో బాధ్యతల జాబితాను ఈ ప్రణాళిక నిర్దేశించింది. ఈ నేపథ్యంలో సదరు కార్యాచరణ ప్రణాళిక సముచితంగా, సమర్థంగా అమలయ్యేలా చూడటం అవశ్యమని శ్రీమతి సీతారామన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో తన దృక్పథాన్ని ఆమె వివరించారు. ఆ మేరకు మహమ్మారి సవాళ్ల నుంచి బయటపడే వ్యూహాలవల్ల ఏర్పడిన ప్రతికూల ప్రభావాలకు ఉపశమనంలో అంతర్జాతీయ సమన్వయం అవసరాన్ని విశదీకరించారు. కోవిడ్-19కు ప్రతిస్పందనగా ఆర్థిక వ్యవస్థలు తమ సరఫరా-గిరాకీలవైపు చర్యల సమతౌల్యం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రణాళిక ప్రతిబింబించాలని ఆమె నొక్కి చెప్పారు. ఈ క్రమంలో భారత్‌ తీసుకుంటున్న సమతుల చర్యల అనుభవాలను ఇతర దేశాల ఆర్థిక మంత్రులతో పంచుకున్నారు. అధిక ద్రవ్యలభ్యతకు ఉద్దేశించిన రుణపథకాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ, ఉపాధి హామీ పథకాల అమలు తదితరాల గురించి శ్రీమతి సీతారామన్ వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639771

కోవిడ్-19పై పోరాటంలో ప్రజలతో పత్రికా-ప్రసార మాధ్యమాల భాగస్వామ్యంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలకు అవసరమైన సమాచారం, విశ్లేషణలు, ఆలోచనలను సముచిత రీతిలో చేరవేస్తూ కరోనాపై పోరులో వారిలో ఆందోళనను తొలగించడంద్వారా సాధికారత కల్పించడంలో పత్రికా, ప్రసార మాధ్యమాలు ప్రశంసనీయంగా కృషి చేశాయని ఉప రాష్ట్రపతి, రాజ్యసభాపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజల్లో విస్తృత అవగాహన దిశగా మహమ్మారి కథనాలను అందించడంలో అంకితభావంతో చేసిన కృషికిగాను క్షేత్రస్థాయిలోని మాధ్యమాల ప్రతినిధులను ముందువరుస యోధులుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇవాళ “మాధ్యమాలు: కరోనా సమయంలో మన భాగస్వాములు” శీర్షికన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వారి సేవలను ప్రశంసించారు. వైరస్ బెడద ప్రారంభమైనప్పటినుంచి కొన్ని నెలలుగా మీడియా పోషిస్తున్న పాత్ర గురించి శ్రీ నాయుడు సుదీర్ఘంగా విశ్లేషించారు. “మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు సమాచారమివ్వడం, అవగాహన కల్పించడం తద్వారా సాధికారులను చేయడంలో మాధ్యమాల యాజమాన్యాలు, సిబ్బంది తమ ప్రధాన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించినందుకు, సంక్షోభ సమయంలో విశ్వసనీయ భాగస్వాములుగా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారినందుకు వారికి అభినందనలు” అని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639771

పీపీఈ కిట్ల నాణ్య‌త ప‌రీక్ష‌-ధ్రువీక‌ర‌ణ అధికారం దఖలుపరుస్తూ ‘సిపెట్‌’కు ఎన్ఏబీఎల్ గుర్తింపు

కేంద్ర ర‌సాయ‌నాలు-ఎరువుల మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని ర‌సాయ‌నాలు-పెట్రో ర‌సాయ‌న‌ల విభాగం కింద‌గ‌ల‌ అత్యున్న‌త సంస్థ “సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)”కి  పీపీఈ కిట్ నాణ్య‌త ప‌రీక్ష‌, ధ్రువీక‌ర‌ణ అధికారం ద‌ఖ‌లుప‌రుస్తూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపునిచ్చింది. పీపీఈ కిట్‌- చేతి తొడుగులు, శరీరమంతా కప్పి ఉంచే కవరాల్‌, ముఖ కవచం, కళ్లకు అద్దాలు, మూడు పొరల వైద్య మాస్క్‌ తదితరాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ మేరకు సదరు ప్రమాణాలను నిర్ధారించే అధికారం సిపెట్‌కు దక్కడం స్వయం సమృద్ధ భారతం దిశగా మరొక ముందడుగుగా భావించవచ్చు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639852

కార్యాలయాల్లో కోవిడ్ రక్షణ వ్యవస్థ (కాప్స్)ను ప్రారంభించిన దుర్గాపూర్ సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ

ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో పరిస్థితులలో మార్పుల దిశగా ఆవిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యవస్థనే మలుపు తిప్పగల శక్తిగలవిగా ఉంటున్నాయి.  దుర్గాపూర్‌లోని సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ ‘కాప్స్’ (COPS) పేరిట కార్యాల‌యాల్లో వినియోగించ‌గ‌ల ఒక  ‘కోవిడ్ రక్షణ వ్య‌వ‌స్థ‌’ను రూపొందించింది. ఇందులో సౌర‌శ‌క్తి ఆధారిత సంబంధ‌‌ర‌హిత మేధోమాస్క్‌, స్వ‌యంచ‌లిత స‌ర‌ఫ‌రా యూనిట్‌-క‌మ్‌-థ‌ర్మ‌ల్ స్కాన‌ర్ (ఇంటెలిమాస్ట్‌), స్ప‌ర్శ‌ర‌హిత ఫాసెట్ (టౌఫ్‌), 360 డిగ్రీల కోణంలో తిరిగే కార్ ఫ్ల‌ష‌ర్ అంత‌ర్గ‌త భాగంగా ఉంటాయి. ఇది ప్ర‌స్తుతం సాంకేతిక‌త బ‌దిలీ, ఉత్పాద‌న ఆర్డ‌ర్ల స్వీక‌ర‌ణ‌కు సిద్ధంగా ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639806

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యాబోధనకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ మేరకు యానిమేషన్ వీడియోల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్ర గవర్నర్ ఇవాళ రాజ్‌భవన్‌ నుంచి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జిల్లా పరిపాలన, పరిశ్రమల సంఘం ప్రతినిధులతోపాటు ఉనా జిల్లాలోని ప్రధాన పారిశ్రామిక సంస్థల అధిపతులతో సంభాషించారు. జిల్లాలో కోవిడ్‌-19 పరిస్థితిపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. అలాగే పారిశ్రామిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాకబు చేశారు. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సమష్టి కృషి అవసరమని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం అమలుచేసే పథకాల ప్రయోజనాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరేలా శ్రద్ధ వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.
  • కేరళ: తిరువనంతపురం వైద్యకళాశాలలో ఏడుగురు వైద్యులుసహా 18మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో 150 మందికిపైగా సిబ్బందిని నిర్బంధవైద్య పరిశీలనకు వెళ్లాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో మరో వ్యక్తి మరణించడంతో కోవిడ్-19 మృతుల సంఖ్య 41కి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. రాష్ట్రంలో నిన్న 593 కొత్త కేసుల నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,416 కాగా, వివిధ జిల్లాల్లో 1.73 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్‌ కేసుల సంక్రమణ 14.2 శాతం అధికంగా ఉండటంపై ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత 24 గంటల్లో 768 మంది నమూనాలను పరీక్షించగా అందులో 109 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం దిగ్బంధంవల్ల పాల సరఫరా, ఆరోగ్య సేవలు మినహా అన్ని కార్యకలాపాలూ ఆగిపోయాయి. అత్యున్నత భద్రత కలిగిన శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో ఇద్దరు ఉద్యోగులకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. కోవిడ్-19 రోగుల నుంచి అధిక వసూళ్లు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి విజయబాస్కర్ హెచ్చరించారు. రాష్ట్రంలో సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో నిన్న 4807 కొత్త కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,65,714; యాక్టివ్‌ కేసులు: 49,452; మరణాలు: 2403; చెన్నైలో యాక్టివ్ కేసులు: 14,997గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో శనివారం 4,537 కొత్త కేసులు, 93 మరణాలు నమోదైనట్లు అధికారులు తేల్చిచెబుతున్నా రాష్ట్ర మీడియా బులెటిన్‌లో 1,000కి పైగా కేసులు కనిపించకపోవడం గమనార్హం. ఇక వారం వ్యవధిలో బెళగావి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకి రోగ నిర్ధారణ అయింది. అయితే, సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు. కాగా, మరణాలు సున్నాస్థాయికి చేరిన మైసూరులో మళ్లీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కర్ణాటకలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 59,652 యాక్టివ్ కేసులు: 36,631; మరణాలు: 1240; డిశ్చార్జి అయినవి: 21,775గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: తిరుమల-తిరుపతి దేవస్థానంలో మరో ముగ్గురు ఉద్యోగులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక తిరుచానూరు ఆలయంలో పనిచేసే సిబ్బంది కరోనావైరస్ బారినపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆలయంవద్ద భక్తులను అధికారులు దర్శనానికి అనుమతించడం లేదు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం దిశగా ఈ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించారు. మరోవైపు తమను కూడా కరోనా యోధుల విభాగంలో చేర్చి రూ.50 లక్షల బీమా సదుపాయంతోపాటు నెలకు రూ.10,000 వంతున ఆరు నెలలపాటు ఆర్థిక సహాయం అందించాలని విలేకరులు ప్రభుత్వాన్ని కోరారు. ఇక రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 3963 కొత్త కేసులు, 52 మరణాలు నమోదవగా, 1411 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 44,609; యాక్టివ్‌ కేసులు: 22,260; మరణాలు: 586గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని కోవిడ్‌-19 రోగులకు వైద్య నిర్వహణకు భంగం రాకుండా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలతోపాటు తెలంగాణలోని అన్ని మందులు దుకాణాల్లో ప్రాణరక్షక ఔషధాలకు కొరత రాకుండా స్థానిక ఔషధ తయారీదారులు, పంపిణీదారులతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. ఇక రాష్ట్రంలో నిన్న 1284 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా ఇప్పటివరకూ 1902 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 667 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ప్రస్తుతం మొత్తం కేసులు: 43,780; యాక్టివ్‌ కేసులు: 12,765; మరణాలు: 409; డిశ్చార్జి: 30,607గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 8,348 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,00,937కు చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా సమాచార నివేదిక పేర్కొంది. అలాగే ముంబైలో కేసుల సంఖ్య కూడా లక్ష స్థాయిని దాటినట్లు వెల్లడించింది. కాగా, ముంబైలో కోవిడ్ వ్యాప్తి తగ్గుతున్నదనడానికి  రుజువుగా సోమవారం నుంచి శివారులోని 16 పౌర ఆసుపత్రులలో తొమ్మిదింటిని రుతుపవన సంబంధిత వ్యాధులకు చికిత్స కోసం తిరిగి “కోవిడేతర” కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
  • గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్-19 రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది కొరత తీర్చడం కోసం వైద్య విద్యార్థులను సహాయకులుగా నియమిస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. వీరు వ్యాధి నిరోధక సంరక్షణ, వైద్య రక్షణ, సదుపాయాలు, ఆరోగ్య-వైద్య సమాచార నిర్వహణ-విశ్లేషణ ప్రభుత్వ 1100, 104 హెల్ప్‌లైన్‌ సేవల పర్యవేక్షణ, టెలి-కౌన్సెలింగ్ తదితర వైద్య-అర్థవైద్య సిబ్బంది విధులను నిర్వర్తిస్తారు. కాగా, గుజరాత్‌లో ప్రస్తుతం 13,500 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఆదివారం 193 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,693కు చేరగా ఇప్పటివరకూ 21,266 మంది కోలుకున్నారు. మరో 556 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో గత 24గంటల వ్యవధిలో 129 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 6,035కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో అత్యంత తీవ్ర ప్రభావిత జిల్లా ఇదే కావడం గమనార్హం.
  • గోవా: గోవాలో శనివారం 180 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,484కు చేరింది. కాగా, వ్యాధి నయమైన 92 మందిని ఈ ఉదయం డిశ్చార్జ్ చేసిన నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,038కి చేరింది. ప్రస్తుతం 1,425 మంది చికిత్స పొందుతున్నారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 3 వరకు రాజధాని ప్రాంతం ఇటానగర్లో దిగ్బంధాన్ని పొడిగించింది. ఇక పారామిలిటరీ దళాలతోపాటు నిత్యావసరాల సరఫరా కార్యకలాపాల్లోగల ట్రక్కుల చోదకులుసహా రాష్ట్రంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్ష చేయించుకోవడాన్ని తప్పనిసరి చేసింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం 38 వేలకుపైగా నమూనాలను సేకరించారు. ఇక అత్యవసర కార్యకలాపాల నిమిత్తం రాష్ట్రంలో ప్రవేశించి, 10 రోజులకన్నా ఎక్కువ కాలం బస చేసేవారు అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమలులోగల ప్రామాణిక విధాన ప్రక్రియలను తప్పక పాటించాల్సి ఉంటుంది.
  • అసోం: రాష్ట్రంలో వరద పరిస్థితితోపాటు బాగ్జన్‌ చమురుబావులో్ల అగ్నిప్రమాదం సంఘటన గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారని అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ ఇవాళ తీన్‌సుకియా పౌర ఆసుపత్రిని సందర్శించి కోవిడ్-19 ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే నియంత్రణ చర్యల సమీక్ష దిశగా జిల్లా పాలన-ఆరోగ్యాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
  • మణిపూర్: రాష్ట్రంలోని జిరిబామ్‌లో కేసుల జాడతీయడం కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో నిఘా కార్యక్రమం చేపట్టింది.
  • మేఘాలయ: రాష్ట్రంలో మరో 2 కోవిడ్‌ మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎ.ఎల్.హెక్ ప్రకటించారు. వీరిలో ఒకరు బీఎస్‌ఎఫ్‌ జవాను కాగా, మరొకరు కోల్‌కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. వీరు జూలై 5న సొంత రాష్ట్రం మేఘాలయకు తిరిగి వచ్చారు.
  • మిజోరం: రాష్ట్రంలో ప్రస్తుతం 1900 మందికిపైగా నిర్బంధంవైద్య పరిశీలనలో ఉన్నారు. వీరిలో 1319 మంది ప్రభుత్వ కేంద్రాల్లో ఉండగా, మిగిలినవారు చెల్లింపు లేదా గృహ నిర్బంధంలో ఉన్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ 10 కొత్త కేసులు నమోదవగా- వీటిలో కొహిమా 6, మోకోక్చుంగ్‌ 2, దిమాపూర్, లాంగ్లెంగ్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. దీంతో నాగాలాండ్‌లో మొత్తం కేసులు 988కి చేరగా, ఇప్పటిదాకా 432మంది కోలుకోవడంతో 556 మంది చికిత్స పొందుతున్నారు.

******



(Release ID: 1639853) Visitor Counter : 265